ఫోన్‌ దొంగతనం: జ్యోతిష్యుడి మాటలు విని, పదేళ్ల బాలికకు వాతలు, నెల్లూరు జిల్లాలో ఘటన

చిన్నారికి వాతలు, పోలీసులు, జువనైల్ యాక్ట్, వేమిరెడ్డి ప్రశాంతి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, తులసీ ప్రసాద్ర రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

గమనిక: ఈ కథనంలో కలచివేేసే అంశాలున్నాయి

ఫోన్ దొంగిలించిందనే అనుమానంతో నెల్లూరు జిల్లాలో పదేళ్ల చిన్నారికి వాతలు పెట్టిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.

ఇందుకూరు పేట మండలం కుడితిపాళెం గ్రామం కాకర్లదిబ్బలో ఓ బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. దీంతో బాలిక మేనత్త దగ్గర ఉంటోంది.

అయితే, తమ ఇంట్లో ఫోన్ దొంగతనం చేసిందని ఆరోపిస్తూ పక్కింటివారు బాలికను చిత్రహింసలు పెట్టారు.

కుడితిపాళెం గ్రామంలో అందరూ గిరిజనులే.

బాలికకు బంధువులే అయిన పొరుగింటి వారు, తమ ఇంట్లో ఫోన్ పోవడంతో జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లారని, మీ పక్కింట్లో ఉన్నవాళ్లు దానిని దొంగిలించారని జ్యోతిష్యుడు చెప్పడంతో చిన్నారిని అనుమానించి దాడి చేసి వాతలు పెట్టారని పోలీసులు చెబుతున్నారు.

బాలికకు వాతలు పెట్టిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో చిన్నారి మేనత్త కూడా ఉన్నారు. బాలికపై హింసకు కారకులైనవారిలో ఆమె కూడా ఒకరని పోలీసులు భావిస్తున్నారు.

పాపను చూసుకోడానికి ఎవరూ లేకపోవడంతో ప్రస్తుతానికి మేనత్తనే ఆస్పత్రిలో పాప వెంట ఉంచారు.

జూన్ 22న ఆదివారం స్థానికులు 112కు కాల్ చేసి చెప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారిని వైద్య చికిత్సకు తరలించారు.

చిన్నారికి వాతలు, పోలీసులు, జువనైల్ యాక్ట్, వేమిరెడ్డి ప్రశాంతి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్
ఫొటో క్యాప్షన్, చిన్నారికి నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అట్లకాడతో కాల్చి వాతలు

తల్లిదండ్రులు ఉపాధి కోసం వలస వెళ్లడంతో బాధిత చిన్నారి మేనత్త ఇంట్లో ఉంటోంది. ఊళ్లో కొంతమంది ఇళ్లలో ఆ బాలిక పని చేస్తోంది.

తమ మొబైల్ దొంగిలించిందని ఆరోపిస్తూ పక్కింటివారు బాలికను తీసుకెళ్లి అట్లకాడతో కాల్చారని ఆ బాలిక మేనత్త మన్నారి బీబీసీతో చెప్పారు.

‘‘మొబైల్ తీసిందని అమ్మాయిని వారం నుంచి కొడుతున్నారు. నేను తీయలేదు అని చెప్పింది. మొన్న ఆ రెండు ఇళ్ల వాళ్లు తాగొచ్చి మా మొబైల్ ఇస్తావా లేదా అని వాతలు పెట్టారు. మొబైల్ వాళ్ల ఇంట్లోనే దొరికింది'' అని ఆమె చెప్పారు. అయితే, బాలికపై హింసలో మేనత్తను కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.

''ఆ అమ్మాయి అమ్మానాన్న పనులకని వెళ్లారు. సంవత్సరం అయింది ఇంకా రాలేదు. పాపకు ఇలా జరిగిందని వాళ్లకు తెలియదు. మా ఊళ్లో పెద్దలు చూసి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు'' అని ఆమె బీబీసీతో చెప్పారు.

చిన్నారికి వాతలు, పోలీసులు, జువనైల్ యాక్ట్, వేమిరెడ్డి ప్రశాంతి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్
ఫొటో క్యాప్షన్, ఈ కేసులో పాప మేనత్తను కూడా అదుపులో తీసుకుంటామని పోలీస్ అధికారిణి శివప్రియ చెప్పారు.

నలుగురి అరెస్ట్ - పోలీసులు

ఈ ఘటనలో ఊళ్లో వారి ఫిర్యాదు మేరకు నలుగురిని అరెస్ట్ చేశామని కోవూరు సర్కిల్ సీఐగా విధులు నిర్వహిస్తున్న శివప్రియ బీబీసీకి చెప్పారు.

''బాలిక మైనర్ కావడంతో వారిపై 307 సెక్షన్ కేసు పెట్టాం. ఫోన్ దొంగిలించిందని ఆ అమ్మాయిని బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేశారు దానిపైన, జువైనల్ యాక్ట్ కింద కేసు పెట్టాము'' అని శివప్రియ చెప్పారు.

'' బాలిక పరిస్థితి ఇప్పుడు బాగుంది. ఇందులో మొత్తం ఐదుగురు నిందితులలో నలుగురిని అరెస్ట్ చేశాం. చిన్నారి మేనత్త పాప దగ్గర ఉంది. పాప కోలుకున్న తర్వాత ఆమెను కూడా అరెస్టు చేస్తాం’’ అని బీబీసీకి వివరించారు శివప్రియ.

చిన్నారికి వాతలు, పోలీసులు, జువనైల్ యాక్ట్, వేమిరెడ్డి ప్రశాంతి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్
ఫొటో క్యాప్షన్, పాపకు అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చెప్పారు.

అండగా ఉంటా- ఎమ్మెల్యే

ఈ ఘటనపై కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు.

''ఆ పాపకి చికిత్స జరిగి కోలుకునే వరకు అండగా ఉంటాం. వీపీఆర్ ఫౌండేషన్ తరపున అండగా నిలుస్తాం. పాప ఇప్పటివరకూ అసలు స్కూలుకెళ్లలేదని చెబుతున్నారు. ఆమె చదువుకుంటానంటే చదివిస్తాం'' అని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చెప్పారు.

చిన్నారికి వాతలు, పోలీసులు, జువనైల్ యాక్ట్, వేమిరెడ్డి ప్రశాంతి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్
ఫొటో క్యాప్షన్, పాప కోలుకున్న తర్వాత హోమ్‌కు తరలిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ చెప్పారు.

బాలికకు రాష్ట్ర మహిళా కమిషన్ పరామర్శ

నెల్లూరులో చికిత్స పొందుతున్న చిన్నారిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు.

సెల్ ఫోన్ దొంగిలించిందన్న అనుమానంతో పదేళ్ల చిన్నారికి వాతలు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేసారు.

‘‘ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంది. పాప తల్లిదండ్రులు ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు. వాళ్లను కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. పాప ఆరోగ్యం కుదుటపడ్డాక వాళ్లు వచ్చేవరకు హోమ్స్‌లో పెట్టి చూసుకుంటారు'' అని బీబీసీతో చెప్పారు శైలజ.

చిన్నారిపై దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని, పాప కోలుకున్న తర్వాత ఆమె మేనత్తను కూడా అరెస్ట్ చేస్తామని శైలజ చెప్పారు.

‘‘ ఘటనకు బాధ్యులైన వారిపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టారు. ఐదుగురిలో నలుగురిని అరెస్ట్ చేశారు. ఆ పాపకి ఎవరూ లేరు కాబట్టి ఆమె మేనత్తను తన దగ్గరే ఉంచారు. పాపకు బాగైన తర్వాత ఆమెను కూడా అరెస్ట్ చేస్తారు’’ అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)