బీబీసీ ఇంపాక్ట్: 'కీర్తనకు ఫ్రెండ్స్ వచ్చారు', 6 నెలల్లో ఈ స్కూల్ రూపురేఖలు ఎలా మారాయంటే..

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''నేను చదువుకునే బడి గోడపై నా బొమ్మ వేసి నన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది'' అంటూ.. ముసిముసి నవ్వులతో చెప్పింది ఐదో తరగతి చదివే కీర్తన.
ఇప్పుడు ఆమె ప్రభుత్వ పాఠశాలకు బ్రాండ్ అంబాసిడర్.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల రూపురేఖలు మారిపోయాయి.
పాఠశాలలోకి అడుగుపెట్టగానే ఎదురుగా భవనం గోడపై కీర్తన బొమ్మ పెద్దగా కనిపిస్తోంది.

నిరుడు ఒకే విద్యార్థి.. ఒకే టీచర్
నిరుడు ఈ పాఠశాలలో కీర్తన ఒక్కతే చదువుకునేది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల మూత పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కీర్తనను అదే స్కూలుకు పంపించారు ఆమె తండ్రి అనిల్ శర్మ.
2024-25 విద్యా సంవత్సరంలో కీర్తనకు నాలుగో తరగతి పాఠాలు బోధించారు ఉపాధ్యాయురాలు బి.ఉమా పార్వతి.
ఒకే విద్యార్థి.. ఒకే టీచర్ ఉన్న ప్రభుత్వ పాఠశాలగా నారపనేనిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల గుర్తింపు తెచ్చుకుంది.

నిరుడు డిసెంబరులో బీబీసీ ఈ పాఠశాలను సందర్శించి కథనాన్ని అందించింది.
ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునేందుకు తండ్రీకూతుళ్లు చేస్తున్న ప్రయత్నాన్ని వివరించింది.
వారి స్ఫూర్తికి జిల్లా యంత్రాంగ సహకారం తోడై, పాఠశాల పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా 12 మంది విద్యార్థులను చేర్చుకున్నారు.

బీబీసీలో కథనం చూసి పాఠశాల అభివృద్ధి
బీబీసీలో వచ్చిన కథనం చూసి, పాఠశాలను బాగు చేసి విద్యార్థుల ప్రవేశాలు పెంచాలని సవాలుగా తీసుకున్నామని ఖమ్మం జిల్లా పూర్వ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బీబీసీతో చెప్పారు.
ఇటీవలే ఆయన ఖమ్మం జిల్లా కలెక్టర్ స్థానం నుంచి బదిలీ అయ్యారు.
అక్కడి నుంచి వెళ్తూ, పాఠశాల అభివృద్ధిపై బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
''గత 20, 30 ఏళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని సదుపాయాలు, ఉపాధ్యాయులపై నమ్మకం తగ్గుతూ వచ్చింది. ఎక్కువ మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్ల వైపు మొగ్గుచూపారు.
ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న ఆలోచన మార్చాలని సదుపాయాలు, ఉపాధ్యాయులు, బోధనలో నాణ్యత, ఇంగ్లిష్, ఐటీ పాఠాల బోధన వంటివి అందించాం. పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని అనుకున్నాం'' అని చెప్పారు ముజమ్మిల్ ఖాన్.

మారిన పాఠశాల రూపురేఖలు
గతేడాది డిసెంబరులో పాఠశాలకు వెళ్లినప్పుడు పాడుబడిన భవనాలు, పాఠశాల ఆవరణ అంతా ముళ్ల పొదలు, మరుగుదొడ్లు, కోతుల బెడద వంటి సమస్యలు కనిపించాయి.
కానీ, ముజమ్మిల్ ఖాన్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీజ తీసుకున్న చొరవతో ఆరు నెలల్లోనే పాఠశాల రూపురేఖలు మారిపోయాయి.
ఈ ఏడాది జూన్ 18వ తేదీన బీబీసీ మరోసారి ఆ పాఠశాలను సందర్శించింది.
ఇప్పుడు పాఠశాలలో ఎన్నో మార్పులు వచ్చాయి.
బడి ఆవరణలోకి కోతులు రాకుండా చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

ఆవరణలో ముళ్ల పొదలు, చెట్లు తొలగించి శుభ్రం చేయించారు.
భవనాలు, ప్రహరీకి రంగులు వేసి, పిల్లలను ఆకట్టుకునే విధంగా అందమైన బొమ్మలు వేయించడంతో పాటు చదువు విలువ చాటిచెప్పే సమాచారాన్ని రాయించారు.
టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇందుకు దాదాపు రూ.4.50 లక్షలు కేటాయించారు. భవనంపై కీర్తన చిత్రాన్ని పెద్దగా వేయించారు.
''పాఠశాల నిలబడానికి కారణం ఆ పాపనే. అందుకే కీర్తన బొమ్మ వేసి బ్రాండ్ అంబాసిడర్‌గా చెప్పాలనుకున్నాం'' అని ముజమ్మిల్ ఖాన్ బీబీసీతో చెప్పారు.
ఈ విషయంపై ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు కీర్తన తండ్రి అనిల్ శర్మ.
''మామూలుగా గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ల ఫోటోలు పాఠశాల గోడలపై వేస్తుంటారు. అలాంటిది ఇంత చిన్న వయసులో మా పాప చిత్రం తను చదువుతున్న బడిపై ఉండటం సంతోషంగా ఉంది. స్కూల్‌ను నిలబెట్టిందనే ఆనందం కూడా ఉంది'' అని చెప్పారు.

''నాతో ఆడుకోవడానికి 12 మంది ఉన్నారుగా..''
ఇప్పుడు నారపనేనిపల్లి పాఠశాలలో కీర్తన సహా 13 మంది చదువుకుంటున్నారు. గతంలో ఈ పాఠశాలలో పనిచేసి డిప్యూటేషన్‌పై పంపించిన మరో ఉపాధ్యాయుడ్ని తిరిగి ఇక్కడికే కేటాయించారు.
''కిందటేడాది నేనొక్కదాన్నే ఉండేదాన్ని. నేనొక్కదాన్నే ఆడుకునేదాన్ని. కానీ, ఇప్పుడు నాతోటి 13 మంది వచ్చారు. ఇప్పుడు వాళ్లతో మాట్లాడటం, హ్యాపీగా ఆడుకోవడం చేస్తున్నా.'' అని కీర్తన చెప్పింది.
గత విద్యా సంవత్సరంలో కీర్తనకు బోధించిన ఉమా పార్వతి తన ఆనందాన్ని బీబీసీతో పంచుకున్నారు.
''స్కూల్ అంతా కళకళలాడుతుంటే, శాంతినికేతన్‌లా అనిపిస్తోంది. విద్యార్థుల సంఖ్య ఇంకా కాస్త పెరగాలి. గ్రామస్తుల సహకారం ఉంటే అది కూడా సాధ్యపడుతుంది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
నారపనేనిపల్లి స్కూల్ నా ఆల్బమ్‌లో భాగం : కలెక్టర్
పాఠశాలను అభివృద్ధి చేయడం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని ముజమ్మిల్ ఖాన్ చెప్పారు.
''ఫ్యామిలీ ఫోటో ఆల్బమ్‌లో ఫొటోలు పెట్టుకుని ఎలా చూస్తామో.. మా అధికారిక విధుల్లో కూడా అలాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. కచ్చితంగా ఈ పాఠశాలను బాగు చేయడం అలాంటి ఒక తియ్యని జ్జాపకం'' అన్నారాయన.
నారపనేనిపల్లి పాఠశాల అనుభవంతో మరో వంద పాఠశాలలు బాగు చేయడానికి నాంది పలికినట్లు అవుతుందనేది ఆయన అభిప్రాయం.
ప్రస్తుతం పాఠశాల పరిస్థితి చూసి పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు కూడా ఆసక్తి కనబరిచారని కీర్తన తండ్రి అనిల్ శర్మ బీబీసీతో చెప్పారు.

మరి, మిగిలిన పాఠశాలల పరిస్థితి ఏమిటి?
ఖమ్మం జిల్లాలో 40కుపైగా ఒక్క విద్యార్థీ చేరని పాఠశాలలు 40 వరకు ఉన్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది.
ఆయా పాఠశాలలను విద్యాశాఖాధికారులు సందర్శించి స్కూళ్లలో పిల్లలు చేరకపోవడానికి కారణాలు గుర్తించారు.
''రవాణా సదుపాయం, మరుగుదొడ్లు లేకపోవడం, ఇంగ్లిష్ విద్య ఉందా.. లేదా.. అని తల్లిదండ్రుల్లో అనుమానం, ప్రహరీలు వంటి సమస్యలు గుర్తించి పరిష్కరించాలని నిర్ణయించాం'' అని ముజమ్మిల్ ఖాన్ చెప్పారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో నారపనేనిపల్లి పాఠశాలతోపాటు మరో ఎనిమిది పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించామని, అవన్నీ తిరిగి ప్రారంభమయ్యాయని చెప్పారు.
నారపనేనిపల్లి పాఠశాల ''పబ్లిక్ అటెన్షన్'' తీసుకున్నందున ఈ పాఠశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేశామని ఆయన వివరించారు.
పాఠశాలకు వచ్చే విద్యార్థుల కోసం రవాణా సదుపాయం కల్పించే ప్రయత్నాల్లో ఉన్నారు అధికారులు.
రవాణా సదుపాయం కోసం ఆటోను ఏర్పాటు చేసుకుని, దానికి బడిబాట ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టామని కలెక్టర్ చెప్పారు. దానికి కావాల్సిన బిల్లు కూడా ఇస్తామన్నారు.
''ఆటో సదుపాయం వస్తే, మరికొందరు పిల్లలు వస్తారని నమ్మకముంది'' అని ఉపాధ్యాయురాలు ఉమాపార్వతి చెప్పారు.

గ్రామంలో 27 మంది విద్యార్థులు
ప్రస్తుతం గ్రామంలో 27 మంది విద్యార్థులు ఉన్నట్లుగా విద్యాశాఖాధికారులు గుర్తించారు. ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులతో కూడా మాట్లాడి, విద్యార్థుల సంఖ్యను 20కు పెంచే ప్రయత్నాల్లో ఉన్నామని ఉమా పార్వతి వివరించారు.
''బడిబాట సమయంలో తల్లిదండ్రులతో ఎన్నోసార్లు మాట్లాడాం. పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలోనే బోధిస్తున్నాం. ఇక్కడ ఉన్న సౌకర్యాలు వివరించి విద్యార్థులను చేర్పించాలని కోరుతున్నాం'' అని చెప్పారామె.

'రవాణా సదుపాయం కల్పించాలి'
గ్రామంలో కోతుల బెడద కారణంగా విద్యార్థులను పాఠశాలకు పంపించేందుకు భయంగా ఉంటోందని గ్రామానికి చెందిన నాగరాణి బీబీసీతో చెప్పారు.
''గతంలో ప్రైవేటు స్కూల్‌కు పంపించినప్పుడు ఉదయం ఇంటి వద్దకే వచ్చి వ్యానులో తీసుకెళ్లేది. పిల్లలను ఒంటరిగా పంపించాలంటే కోతుల సమస్యతో ఇబ్బందిగా ఉంది. వెంటనే ఆటో సదుపాయం కల్పించాలి'' అని ఆమె కోరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














