'నేనొక అబ్బాయిని ప్రేమించాను' అనగానే తల్లిదండ్రుల నుంచి 'నో' అనే సమాధానం ఎందుకు వస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ కోసం
హిందూ పురాణాల్లో స్వయంవరం పేరుతో అమ్మాయే అబ్బాయిని ఎంపిక చేసుకున్న ఉదాహరణలు కోకొల్లలు.
కానీ ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారిని పరువు పేరుతో అంతమొందించే కేసులు మన చుట్టూ నిత్యం చూస్తూనే ఉన్నాం.
కొన్ని రోజుల క్రితం హెడ్ లైన్స్ లో ఓవైపు ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్, మరో వైపు హనీమూన్‌కు మేఘాలయ వెళ్లిన ఇందౌర్‌కు చెందిన రాజా రఘువంశీ శవంగా తేలడం.
ఈ రెండు సంఘటనలు వెన్నులో వణుకు పుట్టించేవే.
రాజా రఘువంశీ కేసును పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో 'భారత్ లో ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలను ఎందుకు ఆమోదించరు' అనే అంశం చర్చకు వచ్చింది.
భారత్‌లో పెళ్లిని జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టంగా చూస్తారు. చాలా వరకు పెళ్లిళ్లను పెద్దవాళ్లే నిర్ణయిస్తారు.
2018లో 1.6 లక్షల కుటుంబాలతో నిర్వహించిన ఒక సర్వేలో 93% మంది తమది పెద్దలు కుదిర్చిన వివాహమని చెప్పినట్లు బీబీసీలో 2021లో ప్రచురించిన ఒక కథనం పేర్కొంది. 3శాతం మంది మాత్రమే ప్రేమ వివాహం చేసుకోగా, 2శాతం ప్రేమ పెళ్లిని పెద్దల అంగీకారంతో చేసుకున్నట్లు చెప్పారు.
భారత్‌లో 2020 నుంచి పెద్దలు కుదిర్చిన వివాహాలు 24శాతం తగ్గాయని 'వెడ్డింగ్ వైర్ ఇండియా' 2023లో విడుదల చేసిన నివేదిక పేర్కొంది.
ఇది అమెరికాకు చెందిన 'ది నాట్ వరల్డ్ వైడ్'కు భారత్‌లో అనుబంధ సంస్థ.


ఫొటో సోర్స్, Getty Images
ప్రేమించు.. పెళ్లాడు
ప్రేమ వివాహాలకే జెన్ జీ ఓటు వేస్తున్నట్లు ఈ సర్వేలో తెలిసింది. 1990ల మధ్య నుంచి 2010 మధ్య కాలంలో జన్మించిన వారిని జెన్ జీ అని అంటారు.
ఈ సర్వేలో పాల్గొన్న 44శాతంమంది తమది పెద్దలు కుదిర్చిన వివాహం అని చెప్పారు. 2020లో పెద్దలు కుదిర్చిన వివాహాలు 68శాతం ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. సర్వేలో టయర్ -1 నగరాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.
నగరాల్లో ఎంతో కొంత మార్పు వచ్చిందని నివేదికలు చెబుతున్నప్పటికీ, పిల్లలు ఎవరినైనా ప్రేమిస్తే ఒప్పుకుని పెళ్లి చేయడానికి మెజారిటీ కుటుంబాల్లో ఇష్టపడటం లేదు.
'నేనొక అబ్బాయిని ప్రేమించాను' అని అమ్మాయి ఇంట్లో చెప్పగానే, 'చదువు ఆపేయి, ఎవరా అబ్బాయి? నిన్ను అమాయకురాలిని చేసి ట్రాప్ చేశాడు. ఏ కులం? వాడిని చేసుకుంటే జీవితాంతం అనుభవిస్తావు, నువ్వు ముందు ఉద్యోగాలు చేయడం ఆపు, ఇంట్లోనే ఉండు'… ఇలాంటి సమాధానాలు వినిపిస్తాయి.

ఫొటో సోర్స్, facebook.com/raisevoicefor
కులాంతర వివాహాలపై వ్యతిరేకత
సినిమాల్లో చాలా కథలు ప్రేమ, పెళ్లి చుట్టూనే తిరుగుతాయి.
1980లలో ప్రముఖ తెలుగు దర్శకుడు విశ్వనాథ్ నిర్మించిన సప్తపది సినిమా కులాంతర వివాహాలపై ఒక ఆలోచనను రేకెత్తించింది.
మరాఠీ చిత్రం సైరాట్ కూడా కులాంతర ప్రేమలో ఎదురయ్యే సమస్యలకు అద్దం పట్టింది.
ఈ మధ్యనే తీర్పు వెలువడిన అమృత ప్రణయ్ కేసులో జరిగింది ఏమిటి? తమ కూతురు వేరే సామాజిక వర్గానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న కారణంతో అతడిని హత్య చేయించారు ఆమె తండ్రి.
ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
ఇవన్నీ సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వివక్షకు నిదర్శనాలు.
ఈ కేసులో రెండో ముద్దాయికి నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది.

ఫొటో సోర్స్, Getty Images
తల్లిదండ్రుల వ్యతిరేకత
భారతీయ సమాజంలో పిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లు చెప్పగానే ఇంట్లో ఒప్పుకోరు.
అమ్మాయి విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది.
ఆ అమ్మాయికి బలవంతంగానైనా తమకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేయాలని ప్రయత్నాలు మొదలుపెడతారు.
ఇందుకు చాలా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కారణాలున్నాయని ప్రొఫెసర్ కె.రాణి రజిత మాధురి అంటున్నారు.
ఈమె డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో డీన్ గా పని చేస్తున్నారు.
విమెన్ డెవలప్ మెంట్ సెంటర్‌కు డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.
"భారత్ లో కులం, మతం చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. చిన్నప్పటి నుంచే పిల్లలు ఏ కులం వాళ్లతో స్నేహం చేయాలో చాలా కుటుంబాల్లో చెబుతూ ఉంటారు. దీంతో కులం, మతం వారి మనసులో బాగా నాటుకుపోతాయి. ఈ ధోరణి ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువగా ఉంటుంది" అని అన్నారు.
"తల్లిదండ్రులు పిల్లల సంతోషం కన్నా కూడా చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచిస్తారు. తమ పిల్లలకు తమ కులంలోనే పెళ్లి చేయాలని చూస్తారు. కొన్ని కాలేజీల్లో, ఆఫీసుల్లో కూడా కులాల వారీగా గ్రూపులు ఉంటాయి. 'వాళ్లు మన వాళ్లే' అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది" అని రాణి అన్నారు.
"ఆర్థిక, సామాజిక స్థితిగతులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒక్కోసారి ఉన్నత వర్గాల్లో సామాజిక, ఆర్థిక స్థాయికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారుగానీ, కులం, మతం పట్టించుకోరు. ఇందుకు కొంత మంది సినీ తారల కుటుంబాల్లో జరిగిన వివాహాలనే ఉదాహరణగా తీసుకోవచ్చు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నా పెళ్లి.. నా ఇష్టం అంటున్న నవతరం
కొంత మంది అమ్మాయిలు తమకు నచ్చిన వాళ్లతో జీవించడానికి తల్లిదండ్రులను ఎదిరించి లేదా చెప్పకుండా ఇంట్లోంచి పారిపోతారు.
ఇలా వెళ్లడం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ప్రేమించిన వ్యక్తి చేతిలో అమ్మాయిలు మోసపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ అమ్మాయి ఇలాగే, ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని 6 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ప్రస్తుతం ఆ అబ్బాయి చేతిలో హింస అనుభవిస్తున్నానంటూ ఆమె గుంటూరు పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు.
ఇప్పుడు వాళ్లకు మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.
హింసాత్మక సంబంధంలో ఉండాలా? లేదా పుట్టింటికి రావాలా? వస్తే తల్లిదండ్రులు ఆదరిస్తారో లేదోననే అనుమానంతో ఎటువంటి నిర్ణయం తీసుకోలేని సందిగ్ధంలో ఉంది.
ఇలాంటి సమస్యలు వస్తాయనే ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర, మతాంతర వివాహాలు వద్దంటామని ఆమె తల్లి నాతో అన్నారు.
"పెరిగిన వాతావరణం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా ప్రేమ వివాహాలకు 'నో' చెప్పడానికి ఒక కారణం" అని రజిత మాధురి అంటారు.
అమెరికాలో చదువుకుంటున్న ఓ 25 ఏళ్ల అమ్మాయి ఈ మధ్య నాకు ఇన్ స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి, తానొక అబ్బాయిని ప్రేమించానని చెప్పింది.
కానీ, పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవడం లేదని, తాము చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే చనిపోతాం, తర్వాత నీ ఇష్టం అంటున్నారని చెప్పింది.
"మన కుటుంబం పరువు తీస్తావా? మేము బతకం. లేదా జన్మలో నీ మొహం చూడం లాంటి మాటలతో భయపెడుతున్నారు" అని చెప్పింది.
అబ్బాయి కుటుంబాన్ని నాశనం చేస్తాం అనే బెదిరింపుల వరకు కొంతమంది వెళ్తారు. దీంతో అమ్మాయి నోరు మెదపదు.
ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తమ తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక తల వంచి పెళ్లి చేసుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
లవ్ మ్యారేజా.. అరేంజ్డ్ మ్యారేజా !
ఇలా బలవంతంగా పెళ్లి చేయడం వల్ల వాళ్ల జీవితం బాగుంటుందా అని కొంత మంది పెద్దవాళ్లను అడిగాను. వాళ్లంతా చెప్పిన సమాధానం ఒకటే.
"మా పిల్లల జీవితం ఎలా ఉంటే బాగుంటుందో మాకు తెలుసు. ఉద్యోగం, సామాజిక స్థాయి లేని వాళ్లతో మా అమ్మాయి పెళ్లి ఎలా చేయమంటారు? మా అమ్మాయి జీవితం పోతే బాధపడేది మేమే. నలుగురిలో మా పరువు ఏమవుతుంది? అవతలి వాళ్ల కులం వేరు, మా కులం వేరు" - ఇలాంటి సమాధానాలు వినిపించాయి.
మీకు అమ్మాయి ఉంటే.. వేరే కులంలో పెళ్లి చేసుకుంటే.. ఆ బాధ తెలుస్తుంది అంటూ సమాజాన్ని, పద్ధతులను ధిక్కరించిన మహిళగా నన్ను చూశారు.
హైదరాబాద్ కు చెందిన మరో వ్యక్తి మాట్లాడుతూ "కులాంతర వివాహాల్లో చాలా సమస్యలు వస్తాయి. ఇరు కుటుంబాల మధ్య అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు వేరేగా ఉంటాయి. ఆఖరికి తినే భోజనంతో సహా. దీంతో చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ఎవరో ఒకరు కచ్చితంగా సర్దుకుపోవాల్సిందే. తమ సంస్కృతిని తర్వాత తరాలకు వేరే కులం నుంచి వచ్చే అమ్మాయి నేర్పించలేదు అనే భయంతో ఉంటారు. వేరే కులం లేదా మతంలో అమ్మాయిని కోడలిగా చేసుకోవడానికి ఇదే ముఖ్యమైన అభ్యంతరం" అని అన్నారు.
కులాంతర వివాహాల వల్ల వారి సామాజిక వర్గాల్లో పరువు పోయినట్లుగా భావిస్తారు.
కులాంతర వివాహం వల్ల పరువు ఎందుకు, ఎలా పోతుంది అనే ప్రశ్నకు మాత్రం ఎవరూ స్పష్టమైన సమాధానం చెప్పలేక పోయారు.
తమ పిల్లలకు ప్రేమ పెళ్లిళ్లలో భద్రత కరువవుతుందేమో అనే భయంతో కూడా చాలా మంది పెద్దవాళ్లు ఒప్పుకోరు అంటారు రజిత.
సమస్యలు ఎదురైనప్పుడు తమ బంధువులు లేదా సమాజం మద్దతు దొరకదేమో అనే భయం కూడా ఉంటుందని ఆమె అన్నారు.
మమ్మల్ని కాదని పెళ్లి చేసుకుంటే, తిరిగి మా మొహం చూడకు, మా గడప తొక్కకు అంటూ కొంతమంది బెదిరిస్తారు.
ప్రేమ వివాహం చేసుకుని కొన్నేళ్లుగా పుట్టింటికి దూరమైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయి నాతో మాట్లాడారు.
"నా పిల్లలకు అమ్మమ్మ, తాత ప్రేమ దొరకడం లేదు. నేనేం తప్పు చేశాను? ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆనందంగానే ఉన్నాను. వాళ్లు ఇలా చేయడం తప్పు అంటూ మీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఒక వీడియో చేస్తారా?" అని అడిగారు.

ఫొటో సోర్స్, Getty Images
పెళ్లైతే అన్నీ సర్దుకుంటాయా?
ఇక్కడ మూడే మూడు అంశాలు ప్రాధాన్యం వహిస్తాయి. ఒకటి కులం, రెండు డబ్బు, మూడు పరువు.
భారత్‌లో చాలా వరకు ఒకే కులం వారి మధ్యలో పెళ్లిళ్లు జరుగుతాయి.
బెంగళూరులో ఒక కార్పొరేట్ సంస్థలో పని చేస్తున్న అబ్బాయికి నిశ్చితార్ధం జరిగింది. కానీ, అమ్మాయి అబ్బాయితో మాట్లాడేందుకు ఒప్పుకోవడం లేదు. ఎన్ని ప్రశ్నలడిగినా మౌనమే సమాధానం.
దీంతో అబ్బాయికి అనుమానం వచ్చి ‘నేనంటే ఇష్టమేనా’ అని అడిగినప్పుడు కూడా ఆ అమ్మాయి నుంచి మౌనమే ఎదురైంది.
కొన్ని రోజులకు ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, ఈ పెళ్లి కేవలం తల్లిదండ్రుల బలవంతంపై చేసుకుంటోందనే విషయం అర్థమైంది.
ఇదొక సంక్లిష్ట స్థితి.
పెళ్లైతే అన్నీ సర్దుకుపోతాయి, ఏదో వయసు మోజులో ఆకర్షణకు లోనై ఉంటారు, మేం చెప్పిన వాళ్లను పెళ్లి చేసుకో అంటూ చాలా మంది తల్లిదండ్రులు బలవంతం పెట్టే అవకాశం ఉంది.
పెళ్లయితే అన్నీ సర్దుకుపోతాయి అనే ఆలోచనలో వారు ఉంటారు.
ఇలా ఇష్టం లేకుండా జరిగే పెళ్లిళ్లలో సంతోషం శాతం ఎంతో ఆ వ్యక్తులకే తెలుస్తుంది.
ఇవి సర్దుకుపోయే ప్రయత్నాలవుతాయో లేదో కూడా తెలియదు.
ఇవి మనకు కనిపిస్తున్న కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటికి సమాధానం ఎక్కడ ఉంది?
సమాజంలోనా? మన మనసుల్లోనా? మన కుటుంబంలోనా? మనం ఆలోచించే విధానంలోనా? పితృస్వామ్య భావజాలం లోనా?
బహుశా ఇది ఎవరికి వారే ఆలోచించుకోవాలేమో!
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














