గద్వాలలో మేఘాలయ తరహా హత్య: పెళ్లయిన నెలకే శవమై తేలిన పెళ్లి కొడుకు, పోలీసుల అదుపులో పెళ్లి కూతురు..

యువకుడి హత్య

ఫొటో సోర్స్, Gadwalpolice

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పెళ్లయిన నెల రోజులకే గద్వాలకు చెందిన యువకుడు శవంగా కనిపించారు. తెలంగాణకు చెందిన యువకుడిని హత్య చేసి..కర్నూలు జిల్లాలో ఓ కాలువలో పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఆ యువకుడి పేరు గంటా తేజేశ్వర్.

మేఘాలయలో జరిగిన 'హనీమూన్ మర్డర్' తరహాలోనే తేజేశ్వర్ హత్య వెనుక, అతని భార్య ఐశ్వర్య ప్రమేయం ఉందని గుర్తించినట్టుగా గద్వాల జిల్లా పోలీసులు చెప్పారు .

‘‘కేసులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య సహా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం’’ అని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు బీబీసీకి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది..?

ఈ కేసుకు సంబంధించిన పోలీసులు అందించిన సమాచారం ప్రకారం...

గద్వాల రాజావీధినగర్‌కు చెందిన రిటైర్డు ఉద్యోగి గంటా జయరాం, శంకుతల చిన్న కుమారుడు గంటా తేజేశ్వర్. ప్రైవేటు సర్వేయర్ గా పనిచేస్తున్నారు.

జూన్ 17న ఇంట్లోంచి బయటకు వెళ్లిన తేజేశ్వర్, ఇంటికి తిరిగి రాకపోవడంతో జూన్ 18న గద్వాల పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు అందింది.

''భూ సర్వే చేయాలంటూ కొందరు వ్యక్తులు తేజేశ్వర్‌ను జూన్ 17న కారులో తీసుకెళ్లారు. అప్పటినుంచి అతను కనిపించడం లేదు'' అని తేజేశ్వర్ సోదరుడు జూన్ 18 గద్వాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై పోలీసులు మొదట 134/2025గా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. కుటుంబసభ్యులు ఇచ్చిన వివరాలు, అతన్ని తీసుకెళ్లిన కారు ఆధారంగా విచారణ మొదలుపెట్టారు.

తేజేశ్వర్‌ను తీసుకెళ్లిన కారు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా దాటాకా, తిరిగి కర్నూలు వైపు వెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డయింది.

దీంతో అక్కడి పోలీసులతో కలిసి గద్వాల పోలీసులు తేజేశ్వర్ కోసం గాలించారు. చివరికి కర్నూలు జిల్లాలోని ఓ కాలువలో తేజేశ్వర్ మృతదేహాన్ని జూన్ 21న పోలీసులు గుర్తించారు.

తేజేశ్వర్‌ను హత్య చేసి కాలువలో పడేశారని ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు.

''తేజేశ్వర్ మిస్సింగ్ కేసులో టెక్నాలజీని ఉపయోగించి, సీసీ కెమెరాలను పరిశీలించాం. ఈ దర్యాప్తులో కర్నూలు జిల్లా పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది'' అని ఎస్పీ తెలిపారు.

పెళ్లయిన నెలకే శవమైన యువకుడు

ఫొటో సోర్స్, Gadwalpolice

ఫొటో క్యాప్షన్, తేజేశ్వర్, ఐశ్వర్య వివాహం మే 18న జరిగింది

పోలీసుల అదుపులో తేజేశ్వర్ భార్య..

కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్య అలియాస్ సహస్రతో మే 18న గద్వాల జిల్లా బీచుపల్లి ఆంజనేయస్వామి గుడిలో తేజేశ్వర్‌కు వివాహం జరిగింది.

ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ప్రైవేటు బ్యాంకులో స్వీపర్ గా పనిచేస్తున్నారు.

'' ఫిబ్రవరి 13న తేజేశ్వర్, ఐశ్వర్య వివాహం జరగాల్సి ఉంది. వివాహానికి ముందు ఐశ్వర్య ఇంట్లోంచి వెళ్లిపోయారు. తర్వాత తిరిగి వచ్చారు. అందుకే అప్పట్లో పెళ్లి రద్దు అయ్యిందని బంధువులు చెప్పారు'' అని గద్వాల పట్టణ పోలీసులు తెలిపారు.

పెళ్లి కారణంగా తన తల్లి ఆర్థికంగా ఇబ్బంది పడుతోందని తెలిసి ఇంట్లోంచి వెళ్లిపోయానే తప్ప తేజేశ్వర్ అంటే ఇష్టం లేక కాదంటూ ఐశ్వర్య చెప్పిన మాటలను తేజేశ్వర్ నమ్మారని పోలీసుల విచారణలో అతని కుటుంబసభ్యులు చెప్పారు.

ఐశ్వర్య ఇష్టపడటంతో తేజేశ్వర్ ఒత్తిడి మేరకు కుటుంబసభ్యులు మే 18న ఇరువురికి పెళ్లి చేసినట్టు పోలీసులు గుర్తించారు.

''ఐశ్వర్య మరొకరితో అక్రమ సంబంధం కొనసాగించడం ద్వారా, వారితో కలిసి భర్తను హత్య చేయించినట్లు విచారణలో తేలింది’’ అని ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు.

అక్రమ సంబంధం ఉన్న వ్యక్తితో ఐశ్వర్య వందలసార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు.

దీంతో ఐశ్వర్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు గద్వాల పోలీసులు చెప్పారు.

ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.

''హత్యకు కారణమని అనుమానిస్తున్న మరికొందరిపైనా విచారణ కొనసాగుతోంది. పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తు ముగిశాక అన్ని వివరాలు చెబుతాం'' అని ఎస్పీ శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)