సిట్ టు స్టాండ్: ‘ఈ 30 సెకన్ల పరీక్ష మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తుంది’

సిట్ టూ స్టాండ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాస్మిన్ ఫాక్స్-స్కెల్లీ
    • హోదా, బీబీసీ న్యూస్

సిట్ టు స్టాండ్ పరీక్ష పూర్తి చేయడానికి 30 సెకన్లు చాలు. కానీ, దీనివల్ల కలిగే ఫలితాలు మీ ఆరోగ్యంపై లోతైన అవగాహనను కలిగిస్తాయి.

కుర్చీ నుంచి లేవడం చాలా తేలికైన పనిగా అనిపించవచ్చు. కానీ, ఇలా చేసే సామర్థ్యం ఆధారంగా మీ ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.

అందుకే కొందరు డాక్టర్లు సిట్ టు స్టాండ్ పరీక్ష (ఎస్‌టీఎస్)ను వాడుతున్నారు.

ఈ పరీక్షలో 30 సెకన్ల వ్యవధిలో ఎన్నిసార్లు మీరు కుర్చీలో కూర్చుని మళ్లీ పైకి లేవగలుగుతున్నారో లెక్కిస్తారు.

పెద్ద వారిలో ఆరోగ్య సమస్యలను పరిశీలించేటప్పుడు ఈ పరీక్ష చేస్తున్నారు.

అయితే, ఎవరికివారు ఇంట్లో కూడా ఈ పరీక్ష తేలిగ్గా చేసుకోవచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘ఇది నిజంగా చాలా ఉపయోగకరమైన పరీక్ష. ప్రజలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలుసుకునేందుకు ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది'' అని లండన్‌లో కింగ్స్ కాలేజీలో జిరియాట్రిక్ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌గా, గైస్ అండ్ సెయింట్ థామస్ ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్‌లో కన్సల్టెంట్ జిరియాట్రిసియన్‌గా పనిచేసే జగ్‌దీప్ దేశీ చెప్పారు.

''ఇది వారి సామర్థ్యాన్ని, బ్యాలన్స్, ఫ్లెక్సిబులిటీని తెలియజేస్తుంది. ప్రజలు స్పృహ తప్పిపడిపోవడం, కార్డియోవాస్కులర్ సమస్యలు వంటివి అర్థం చేసుకోవడానికి ఈ పరీక్ష సాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి'' అని తెలిపారు.

మనం చేయాల్సిందల్లా కుర్చీలో నిటారుగా కూర్చుని, చేతులకు ఎలాంటి రెస్ట్ ఇవ్వకుండా.. టైమర్ లేదా స్టాప్‌వాచ్ పెట్టుకుని ఇంట్లో ఈ పరీక్ష చేసుకోవాలి.

సిట్ టూ స్టాండ్ పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఈ పరీక్ష చేసేందుకు, మీరు కుర్చీ మధ్యలో కూర్చోవాలి. మీ రెండు చేతుల్ని క్రాస్ చేసుకుని, ఎదురుగా ఉన్న భుజాలపై మీ చేతులు పెట్టుకోవాలి. మీ కాలి మడమను నేలపై ఉంచి మీ వెన్నును నిటారుగా ఉంచాలి.

అప్పుడు స్టాప్‌వాచ్ లేదా టైమర్‌ పెట్టుకోవాలి. తిరిగి మళ్లీ కుర్చీలో కూర్చోవడానికి ముందు, పూర్తిగా లేవాలి. అలా సిట్ టూ స్టాండ్ చేయాలి.

30 సెకన్ల పాటు చేసిన తర్వాత, పూర్తిగా నిల్చోగలిగే స్థానంలోకి ఎన్నిసార్లు రాగలిగారనేది లెక్కపెట్టుకోవాలి. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రధానంగా ఈ పరీక్షను వాడేవారు. ప్రస్తుతం యువతకు కూడా ఈ పరీక్షను వాడుతున్నారు.

వివిధ వయసుల వారీ సగటు ఫలితాలను అమెరికా ప్రజారోగ్య సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వర్గీకరించింది.

సగటు కంటే తక్కువ స్కోర్లు ఉన్న వ్యక్తులకు సరైన ఆరోగ్య పరిస్థితులు లేక ప్రమాదంలో ఉన్న అవకాశాలను ఇది సూచిస్తుంది. ఉదాహరణకు.. 60 నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న మగవారు 30 సెకన్లలో ఇలా కనీసం 14 సార్లు కూర్చుని, నిల్చోవాలి. మహిళలకు ఈ సగటు 12గా ఉంది.

ఒకవేళ 85 నుంచి 89 మధ్య వయసు వారైతే సగటు స్కోరు ఎనిమిది. ఈ సగటు స్కోర్లు ఒక వ్యక్తి వైద్య చరిత్రను పరిగణనలోకి తీసుకోవు. ఉదాహరణకు.. ఇటీవలే మీరు సర్జరీ చేయించుకోవడం లేదా గాయాలు పాలైన సందర్భాలు వంటివేమీ పరిగణించరు.

సరైన ఆరోగ్య పరిస్థితులు లేని వారికి, యువతకు ఈ పరీక్ష ప్రయోజనకరంగా నిలుస్తుంది. వారి ఫిట్‌నెస్ కొలిచేందుకు ముఖ్యంగా వెన్ను కింద కండరాల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

స్విట్జర్లాండ్‌లో 7 వేల మంది పెద్ద వారు సిట్ టూ స్టాండ్ టెస్ట్‌ను చేయించుకున్నారని, ఫలితాలను పోల్చి చూసుకున్నారని పరిశోధకులు చెప్పారు.

20 నుంచి 24 ఏళ్ల వయసున్న వారి సగటు స్కోరు మగవారిలో నిమిషానికి 50, మహిళలలో నిమిషానికి 47గా ఉంది.

సిట్ టూ స్టాండ్ పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఈ పరీక్షను మీరెంత సమర్థవంతంగా నిర్వహించగలుగుతారో అది మీ ఆరోగ్యం గురించి వైద్య సంరక్షకులకు తెలియజేయనుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఉదాహరణకు.. సర్జరీ లేదా క్యాన్సర్ చిక్సిత తర్వాత ఆరోగ్యం ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు ఈ పరీక్షలో వచ్చిన తక్కువ స్కోరు ఉపయోగపడుతుండొచ్చు.

ఈ పరీక్షలో తక్కువ స్కోరు వచ్చిన వారికి గుండె, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేస్తుండకపోవచ్చని సూచిస్తుంది. హార్ట్ అటాక్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి ప్రమాదకర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా వారిలో ఎక్కువగా ఉంటుంది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, ఒకవేళ ఒక వ్యక్తి వారి ఏజ్ గ్రూప్ సగటు కంటే తక్కువ స్కోర్‌ను సాధిస్తే.. అలాంటి వారు స్పృహ కోల్పోయే అవకాశం ఎక్కువని తెలిసింది.

65 ఏళ్లు పైబడిన వారు ప్రతి ఏడాది 30 శాతం మంది స్పృహ కోల్పోతున్నారు. 80 ఏళ్లు పైబడిన వారు 50 శాతానికి పైగా పడిపోతున్నారు.

ఒకసారి స్పృహ కోల్పోయిన వారు, మళ్లీ పడిపోతామనే తరచూ భయపడుతున్నారు. దీంతో, వారు తక్కువగా బయటికి వెళ్లడం, కొన్నిసార్లు సోషల్ ఐసోలేషన్ అవ్వడం చేస్తున్నారు.

''స్పృహ కోల్పోయి పడిపోతామనే ఆందోళన మీకు ఉంటే, మీరు బయటికి వెళ్లరు. బయట వ్యక్తులను కలవరు. ఇతర పనులు చేసుకోలేరు. ఇదొక విష వలయంగా మారుతుంది.'' అని దేశీ చెప్పారు.

''స్పృహ కోల్పోయి పడిపోవడం అతిపెద్ద సమస్య. ఇలా పడిపోయినప్పుడు, స్వల్ప గాయాలతో పాటు బెణకడం, తుంటిలో ఫ్రాక్చర్లు కావడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.'' అని తెలిపారు.

అమెరికాలో, ప్రతి ఏడాది తుంటిలో ఫ్రాక్చర్లతో 3 లక్షల మందికి పైగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ''యూకేలో ప్రతి ఏడాది 70 వేల తుంటి ఫ్రాక్చర్లు జరుగుతున్నాయి. తుంటి ఫ్రాక్చర్ అయిన ఏడాది లోపలే 30 శాతం మంది ప్రజలు చనిపోతున్నారు'' అని దేశీ చెప్పారు.

2012లో చేపట్టిన ఒక స్టడీ సిట్ టూ స్టాండ్ పరీక్షలో ఉన్న మార్పులు.. 51 నుంచి 80 ఏళ్ల మధ్యనున్న వారిలో మరణాల రేటుకు కొలమానంగా పేర్కొంది. ఈ పరీక్షలో తక్కువ స్కోరు చేసిన వ్యక్తులు అత్యధిక మార్కులు సాధించిన వారి కంటే ఆరేళ్లు ముందుగానే చనిపోయే అవకాశం 5 నుంచి 6 రెట్లు ఎక్కువగా ఉందని వివరించింది.

సిట్ టూ స్టాండ్ వంటి పరీక్షలు ఒకరి ఆరోగ్యాన్ని సూచించేందుకు కీలకమైన ఇండికేటర్లు అయినప్పటికీ, ఎంత కాలం ఒక వ్యక్తి జీవించగలడో దీని ఆధారంగా తాము అంచనా వేయలేమని అన్నారు.

వృద్ధులు

ఫొటో సోర్స్, Getty Images

మీ పర్‌ఫార్మెన్స్‌ను ఎలా మెరుగుపర్చుకోవాలి

చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడూ కదులుతూ, వీలైనంత నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే మీ స్కోరును పెంచుకోగలుగుతారని దేశీ అన్నారు. ఒకవేళ మొబిలిటీ కష్టమైతే, కుర్చీలో కూర్చుని చేసే వ్యాయామాలతో ప్రారంభించాలి.

‘‘ఇది మీలోని బలాన్ని మరింత పెంచుతుంది. అక్కడ్నుంచి, మీరు మెల్లగా పైకి లేవాలి. ప్రతి గంటకు లేదా రెండు గంటలకు ఐదుసార్లు పైకి లేచి నిల్చోవాలి. ’’ అని సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)