ఇండోనేషియా: అగ్నిపర్వత బిలం దగ్గర జారిపడిన యువతి, ఆమె కనిపిస్తున్నా ఎందుకు సాయం చేయలేకపోయారు?

ఇండోనేషియా

ఫొటో సోర్స్, Family handout

ఫొటో క్యాప్షన్, అగ్నిపర్వత బిలంలో పడిపోయిన జూలియానా మారిన్స్

ఇండోనేషియాలోని మౌంట్ రింజానీ అగ్నిపర్వత బిలం వద్ద పడిపోయిన బ్రెజిల్ పర్యటకురాలి కోసం ఇండోనేషియా సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

బ్రెజిల్ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 6.30 గంటలకు అదృశ్యమైన ఆ యువతిని జులియానా మారిన్స్‌‌గా గుర్తించారు. ఆ సమయంలో ఆమె పర్వతారోహణలో ఉన్నారు.

అగ్నిపర్వత బిలం అంచుల నుంచి ఆమె జారిపడిపోయారని బ్రెజిల్ అధికారులు చెప్పారు.

పొగమంచుతో కూడిన ప్రతికూల వాతావరణం కారణంగా, ఆమెను కాపాడే ప్రయత్నాలు సాగడం లేదని ఇండోనేషియా అధికారులు చెబుతున్నారు.

‘సాయం చేయండి’ అంటూ మారిన్ భయంతో వేసిన కేకలు శనివారం సహాయక బృందానికి వినిపించాయని మౌంట్ రింజని పార్క్ అధికారులు సోషల్‌మీడియాలో తెలిపారు.

ఆ సమయంలో ఆమె షాక్‌లో ఉన్నా, సురక్షితంగానే ఉన్నారని వారు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘ప్రాణాలతోనే ఉన్నారు’

పర్వతారోహకులు చిత్రించిన వీడియోలలోని కొన్ని భాగాలను ఆన్‌లైన్‌తోపాటు బ్రెజిల్ మీడియా ప్రచురిస్తోంది. శనివారంనాటికి ఆమె ప్రాణాలతో ఉన్నట్టుగా ఒక డ్రోన్ ఫుటేజీలో కనిపించింది.

బూడిదరంగులో ఉన్న నేలపై ఆమె కూర్చున్నట్టు, అటూఇటూ తిరుగుతున్నట్టు ఆ ఫుటేజీలలో ఉంది. ఆమె ఉన్నచోటు పర్వతారోహణ ప్రాంతానికి అత్యంత దిగువన ఉంది.

కానీ, మరుసటి రోజున సహాయక బృందాలు ఆ యువతి ఉన్నట్లుగా భావిస్తున్న300 మీటర్ల (984 అడుగులు)లోతు వరకు వెళ్లాయి. సహాయక బృందాలు ఆమె కోసం గట్టిగా కేకలు వేసినా ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో వారు ఆమెను కనిపెట్టలేకపోయారు.

ఆదివారం ఉదయానికి ఆమె ఆ ప్రదేశంలో లేరని డ్రోన్ ఫుటేజీ చూపుతున్నట్లు, దట్టమైన పొగమంచు సహాయక చర్యలకు ఆటంకం కలిగించిందని, థర్మల్ డ్రోన్ వాడకంపై ప్రభావం చూపిందని పార్క్ అధికారులు తెలిపారు.

సోమవారం రెస్క్యూ సిబ్బంది మరోసారి మారిన్స్ ఆచూకీ కనుగొనగలిగారని, ఆమె మరింత కిందకు పడిపోయినట్లు కనిపించారని, వాతావరణ పరిస్థితుల కారణంగా రక్షణ చర్యలు నిలిపివేయాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

రెస్క్యూ సిబ్బంది కేవలం 250 మీటర్ల లోతుకు చేరుకున్నారని, జూలియానాను చేరుకోవడానికి ఇంకా 350 మీటర్ల దూరం వెళ్లాల్సి ఉందని, కానీ వారు వెనుదిరిగారని కుటుంబ సభ్యులు తమ సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

పార్కు తెరిచే ఉందని, పర్యటకులు ఇప్పటికీ అదే మార్గంలో వెళుతున్నారని కుటుంబం పేర్కొంది

‘‘జూలియానాకు సహాయం అవసరం. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలియదు. మూడు రోజులుగా ఆమెకు నీరు, ఆహారం లేవు. చలిని తట్టుకునే దుస్తులు లేవు’’ అని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మౌంట్ రింజని

ఫొటో సోర్స్, Ulet Ifansasti/Getty Images

యథావిధిగా పర్వతారోహణ

ఆమె కోసం రెస్క్యూ ఆపరేషన్ తిరిగి ప్రారంభమైందని మంగళవారం మారిన్స్ కుటుంబం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

బ్రెజీలియన్ టీవీ నెట్‌వర్క్ గ్లోబో ఇంటర్వ్యూలలో మాట్లాడిన మారిన్స్ బృందంలోని ఇద్దరు సభ్యులు, ఈ పర్వతారోహణను చాలా కష్టమైనదిగా అభివర్ణించారు.

ప్రమాదం జరిగిన సమయంలో మారిన్స్ తమ గైడ్ తో కలిసి కిందికి దిగివస్తున్న బృందంలో చివరన ఉన్నారని మరొకరు చెప్పారు. ‘‘సూర్యోదయానికి ముందున్న చీకటిలో కాళ్లు జారిపోయేలా ఉన్న ఆ ప్రాంతంలో కేవలం ఓ లాంతరుతో ఉండాల్సి రావడం చాలా కష్టంగా ఉంది'' అని ఆయన చెప్పారు.

ఇండోనేషియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, సహాయక చర్యలను పర్యవేక్షించడానికి ఇద్దరు ఎంబసీ ఉద్యోగులను పంపామని బ్రెజిల్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

పర్వతారోహకులు హైకింగ్ చేసేటప్పుడు తమ భద్రతకు మొదటి ప్రాధాన్యమివ్వాలని అటవీ అధికారి సత్యవాన్ సోమవారం తెలిపారు.

2022లో రింజానీ పర్వత శిఖరంపై నుంచి పడిపోయి ఓ పోర్చుగీసు వ్యక్తి మృతి చెందాడు. ఈ ఏడాది మే నెలలో మలేషియాకు చెందిన ఓ పర్వతారోహకుడు అగ్నిపర్వతం ఎక్కే ప్రయత్నంలో కిందపడి మృతి చెందారు.

మౌంట్ రింజానీ ఇండోనేషియా రెండవ ఎత్తైన అగ్నిపర్వతం. దీని ఎత్తు 3,700 మీటర్ల కంటే ఎక్కువ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)