ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చెప్పలేని విషాదాలు, ఆ సమయంలో ఆస్పత్రిలో ఉన్న వారు బీబీసీతో ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, Pavan Jaiswal/BBC
అహ్మదాబాద్ మేఘనీనగర్‌లోని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు క్వార్టర్స్ ప్రాంగణంలో ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాద అనంతర పరిణామాలను ఇప్పటికీ బాధితులు అనుభవిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది రెసిడెంట్ వైద్యులు, పోస్టుగ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు.
ఈ ఘోర ప్రమాదంలో అతుల్యం 3, 4 హాస్టళ్లు, మెస్‌హాల్ సహా అనేక భవంతులు దెబ్బతిన్నాయి. నలుగురు డాక్టర్లు మరణించారు. అనేకమంది గాయపడ్డారు.
ఈ దుర్ఘటనతో కొందరు మానసికంగా కుంగిపోయారు. ఈ ప్రమాదంలో బాధితులు 2.7 కోట్ల రూపాయల ఆస్తి నష్టపోయారు.
హాస్టల్ సముదాయంలో నివసిస్తున్న డాక్టర్లను బీబీసీ సంప్రదించింది. పలు కారణాల వల్ల అనేకమంది డాక్టర్లు మాట్లాడటానికి నిరాకరించారు.
కానీ, పదిమంది వరకు డాక్టర్లు మాత్రం ఐడెంటిటీ బయటపెట్టకూడదనే షరతుతో మాట్లాడారు.
పునరావాసం, నష్టపరిహారం కోసం ఇబ్బందులు పడుతున్న వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మానసిక ఊరటతోపాటు వసతుల కల్పన కోసం ఎదురు చూస్తున్నారు. ఛిన్నాభిన్నమైన తమ జీవితాలను తాత్కాలిక నివాసాల నుంచి మళ్లీ మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
నష్టాన్ని అంచనా వేస్తున్నామని, బాధిత వైద్యులు, విద్యార్థులకు పునరావాసం కల్పించేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని పోలీసులు, ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.


ఫొటో సోర్స్, Pavan Jaiswal/BBC
ఆర్థిక నష్టాలు, మానసిక కుంగుబాటు
హాస్టల్ కాంప్లెక్స్‌పై విమానం కూలడం వైద్య విద్యార్థులను దిగ్భ్రమకు గురిచేయడమే కాదు, కొన్ని సమాధానం లేని ప్రశ్నలకూ దారితీసింది.
రాష్ట్రప్రభుత్వం చెప్పిన మేరకు ఇప్పటిదాకా ఈ ఘటనలో నలుగురు వైద్య విద్యార్థులు మరణించారు. జూన్ 12 మధ్యాహ్నం అతుల్యం హాస్టల్ భవనాలలోకి విమానం దూసుకొచ్చినప్పుడు వారంతా అక్కడ భోజనం చేయడానికి వచ్చారు. వీరిలో ఇద్దరు రాజస్థాన్ కు చెందినవారు కాగా, ఒకరు మధ్యప్రదేశ్, మరొకరు గుజరాత్ లోని భావ్‌నగర్‌కు చెందినవారు.
బీజే మెడికల్ కాలేజ్ (బీజేఎంసీ), గుజరాత్ క్యాన్సర్ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ (జీసీఆర్ఐ), యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసర్చ్ సెంటర్ (యూఎన్ఎంఐసీఆర్‌సీ) అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌కు చెందిన ఇతర సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల నివాస సముదాయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో అతుల్యం 1, 2, 3, 4 హాస్టల్ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వైద్యుల ప్రధాన మెస్ కూడా ఇక్కడే ఉంది.
‘మేమంతా నష్టపోయాం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని అతుల్యం 2 లోని రెసిడెంట్ డాక్టర్ చెప్పారు.
దుస్తులు, రిఫ్రిజిరేటర్, ఏసీ, ల్యాప్‌టాప్‌లు, ఐఫోన్లు పుస్తకాలు సహా ఒక్కొక్కరు లక్ష రూపాయల నుంచి రూ.1.5 లక్షల విలువైన వస్తువులను కోల్పోయారని ఆయన అంచనా వేశారు.
ఈ భవనాల్లో నివసిస్తున్నవారికి 2.70 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బీజే మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షి పారిఖ్ ఫిర్యాదు చేశారు.
ఇందులో కార్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర నష్టాలు ఉన్నాయి. పోయిన లేదా దెబ్బతిన్న వస్తువుల జాబితాను బాధిత వైద్యులు దర్యాప్తు అధికారులకు లిఖితపూర్వకంగా అందించారు.

ఫొటో సోర్స్, Pavan Jaiswal/BBC
అయితే చాలామంది డాక్టర్లు తమకు ప్రజల ప్రాణాలు, ఆరోగ్యమే ముఖ్యమని తెలిపారు. అదే సమయంలో హాస్టల్ విద్యార్థులకు జరిగిన నష్టాన్ని ఉపేక్షించలేమని, వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు.
అతుల్యంలోని నాలుగు భవనాల్లోని మొత్తం 23 ఫ్లాట్లలో వైద్యులు తమ కుటుంబాలతో నివసిస్తున్నారు. నష్టపోయినవాటిలో చాలావరకు గృహోపకరణాలు, వాహనాలు ఉన్నాయి.
ఈ ప్రమాదంలో పురుషోత్తం చౌహాన్ అనే వ్యక్తి కూడా ఒక బాధితుడు. ఆయన నడుపుతున్న లాండ్రీ వంటి సర్వీస్ షాపులు కూడా ధ్వంసమయ్యాయి.
‘అంతా కాలిపోయింది’ అని మరో విద్యార్థి చెప్పారు. ఆయన స్నేహితుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఆయన కారు పోయింది.
నష్టాలను ఎలా భర్తీ చేస్తారనే విషయమై ప్రభుత్వం నుంచి కానీ, ఎయిరిండియా అధికారుల నుంచి కానీ ఇంతవరకు ఎలాంటి చర్చా జరగలేదని ఆ విద్యార్థి చెప్పారు.
ఖాళీ ఫ్లాట్లలో దొంగతనం జరిగిందనే ఆరోపణలు కూడా ఈ గందరగోళాన్ని పెంచుతున్నాయి. తాము ఇళ్లకు తిరిగి వచ్చేసరికి బంగారం, నగదు సహా విలువైన వస్తువులు మాయమయ్యాయని పలువురు వైద్యులు పేర్కొన్నారు.
రూ. 2.70 కోట్లు నష్టం వాటిల్లినట్లు మేఘానీ నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇది దొంగతనమా కాదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఇళ్లలో దొంగతనం జరిగినట్లు తాము భావించడం లేదని, అయితే పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారని ఇన్‌స్పెక్టర్ డి.బి.బాసియా తెలిపారు.

ఫొటో సోర్స్, Pavan Jaiswal/BBC
తక్షణం ఖాళీ చేయమనడంతో గందరగోళం
విమాన ప్రమాదం జరిగిన వెంటనే దెబ్బతిన్న భవనాలను తక్షణం ఖాళీ చేయాలని వైద్య విద్యార్థులను ఆదేశించారు. హఠాత్తుగా ఖాళీ చేయాలనే ఉత్తర్వులు వారి గందరగోళాన్ని మరింత పెంచి ఇబ్బందులను సృష్టించాయి.
హాస్టల్ ను వెంటనే ఖాళీ చేయాలని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) నుంచి అత్యవసర ఆదేశాలు వచ్చాయని డాక్టర్ పారిఖ్ బీబీసీతో చెప్పారు. దీంతో ప్రమాదం జరిగిన మరుసటి రోజే తామందరం ఖాళీ చేయాల్సి వచ్చిందని తెలిపారు.
యూఎన్ ఎఐసీఆర్‌సీలో కార్డియో అనస్థీషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ పన్వర్ తన ఇంటిని అతుల్యం నుంచి మరో చోటుకు మార్చాల్సిన నిస్సహాయతను వివరిస్తూ చేసిన వీడియో వైరల్ అయింది.
తన కుమార్తె, తమ పనిమనిషి చికిత్స పొందుతున్నారని, వారిని తరలించడానికి మరికొంత సమయం అవసరమని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నాడు.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్దిసేపటికే మరో వీడియోను పోస్ట్ చేశారు. ఈ రెండో వీడియోలో తమకు వసతి కల్పించారని, అంతకుముందు చేసిన వీడియో ఒత్తిడిలో చేశానని చెప్పారు.
ఎటువంటి సాయం లేకుండా భారీ లగేజీతో మెట్లు దిగాల్సి వచ్చిందని చాలామంది విద్యార్థులు చెప్పారు.
‘ఇది అమానవీయం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వైద్యుడు చెప్పారు.
కొంతమందికి సాయం అందిందని, కొందరిని వదిలివేశారని బీబీసీ గుజరాతీ గుర్తించింది.
ఒకేసారి ఇద్దరిని మాత్రమే భవనంలోకి అనుమతించారని అహ్మదాబాద్‌లో చదువుతున్న వైద్య విద్యార్థి ఒకరు తెలిపారు.
"నేను నా వస్తువులను చాలావరకు అక్కడే వదిలివేయాల్సి వచ్చింది" అని ఆయన చెప్పారు. అయితే అందరి విషయంలో అలా జరగలేదు.
యూఎన్ ఎంఐసీఆర్‌సీలోని మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ అతుల్యం నుంచి తన ఇంటిని ఖాళీ చేయడానికి అధికారులు సాయపడ్డారని చెప్పారు.
"మేం మొదట్లో గందరగోళానికి గురయ్యాం. కానీ, వెంటనే వాహనం, ఇతర సహాయం అందడంతో మా లగేజీని తరలించాం" అని ఓ వైద్యుడు చెప్పారు.
వైద్యుల తరలింపునకు సంబంధించిన సమస్యలపై రాష్ట్ర ఆరోగ్య శాఖాధికారులు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బీబీసీ ప్రశ్నలు లేవనెత్తింది.
ఈ ప్రశ్నకు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి సమాధానమిస్తూ, "చాలా మందిని సివిల్ క్యాంపస్‌లో అందుబాటులో ఉన్న వివిధ హాస్టల్స్‌కు తరలించాం" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
శాశ్వత నివాసాల కోసం ఎదురుచూపు
ప్రతి ఒక్కరికీ కనీసం నాలుగైదు నెలల పాటు ప్రత్యామ్నాయ వసతి కల్పిస్తామని, ఆ తర్వాత అందరికీ శాశ్వత వసతి కల్పిస్తామని డాక్టర్ పారిఖ్ తెలిపారు.
పీజీ డాక్టర్స్ హాస్టల్ కు 33 మంది, యూఎన్ ఎంఐసీఆర్‌సీ స్టాఫ్ హాస్టల్ కు ఐదుగురు, గుజరాత్ క్యాన్సర్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ హాస్టల్ కు 52 మంది, లయన్స్ ఫౌండేషన్ కు 48 మంది, డెంటల్ స్టాఫ్ క్వార్టర్స్ కు 51 మంది, మిథిలా క్వార్టర్స్ కు 12 మంది వైద్యులను తరలించారు.
రోగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్మించిన గదులను ఇప్పుడు హాస్టళ్లుగా మార్చి విద్యార్థులు అక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నాలుగు నెలల తర్వాత కొత్త పీజీ హాస్టల్ ను సిద్ధం చేస్తామని, ఆ తర్వాత క్యాంపస్ వెలుపల నివసిస్తున్న వారితో సహా అందరినీ కొత్త భవనానికి తరలిస్తామని చెప్పారు.
తమకు అధికారులు కల్పించిన వసతిపై కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన వైద్యుడొకరికి గుజరాత్ క్యాన్సర్ సొసైటీ ఆవరణలో వసతి కల్పించారు.
‘‘ఈ ఏర్పాట్లుపై మేం సంతోషంగా ఉన్నాం’’ అని ఆయన చెప్పారు.
విమాన ప్రమాదం వల్ల కలిగిన గాయం నుంచి కోలుకోవడానికి వైద్యులకు చాలా సమయం పడుతుంది. వారు అనుభవించిన శారీరక నష్టం కంటే ఈ గాయం ఎక్కువ.
కొంతమంది విద్యార్థులు తమ తోటి విద్యార్థులు గాయపడటం లేదా చనిపోవడం చూశారు.
"నా సొంత ఊరుకు వచ్చాను. తిరిగి నేనెప్పుడు వస్తానో నాకు తెలియదు. ఈ ప్రమాద దృశ్యాలు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి’’ అని మైక్రోబయాలజీ విద్యార్థి ఒకరు గుర్తు చేసుకున్నారు.
డాక్టర్లపై ఉన్న భావోద్వేగ బరువును గుర్తించామని డాక్టర్ పారిఖ్ చెప్పారు. ‘‘కళాశాలలో విద్యార్థులకు అండగా ఉండటానికి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను త్వరలో ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు.
అతుల్యం 3లో నివాసం ఉంటున్న డాక్టర్ రాజేష్ (పేరు మార్చాం) ప్రాణాలు కాపాడుకోవడానికి మూడో అంతస్తు నుంచి దూకడంతో కాలు విరిగింది. ‘‘ఇది బాధాకరమైన పరిస్థితి, ఆ సమయంలో నా మనసులో ఏముందో వర్ణించడం కష్టం’’ అన్నారు.
ఏదేమైనా బాధిత వైద్యులు, విద్యార్థులు శారీరకంగా, మానసికంగా కోలుకోవడమనేది కష్టమైన ప్రయాణం. పీటీఎస్‌డీ, నిద్రలేమి తదితర మానసిక సమస్యలు విస్తృతమవుతున్నాయి.
ప్రాణాలతో బయటపడిన వారు తలదాచుకోవడం కంటే విలువైన దాని కోసం ఎదురుచూస్తున్నారు. సహానుభూతితోపాటు తిరిగి సాధారణ స్థితికి రావాలని వారు కోరుకుంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














