గద్వాల: 'మేఘాలయ హనీమూన్ మర్డర్‌లా కాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం'...అంటూ సాగిన తేజేశ్వర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఫొటో సోర్స్, Gadwalpolice
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసులో నిందితులు ఏదో పొరపాటు చేసి పోలీసులకు దొరికారు. మనం చేసే హత్యలో ఎలాంటి పొరపాటు జరగకుండా పక్కాగా చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు కనిపెట్టలేరు'' అని తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, తిరుమలరావు ప్రణాళిక వేసుకున్నారని మీడియాతో చెప్పారు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు.
తెలంగాణలోని గద్వాల పట్టణానికి చెందిన గంటా తేజేశ్వర్ అనే యువకుడి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు.
పెళ్లయి నెల రోజులు కూడా గడవకముందే తేజేశ్వర్ హత్య జరగడం, ఆయన భార్య ఐశ్వర్య ప్రమేయం ఉందన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టడంతో ఈ కేసు సంచలనంగా మారింది.
తిరుమలరావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆయనతో కలిసి ఐశ్వర్య .. తేజేశ్వర్ హత్యకు పాల్పడినట్లుగా ఎస్పీ టి.శ్రీనివాసరావు చెప్పారు.
మరోవైపు, తేజేశ్వర్ చనిపోయాక ఆయన, గతంలో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి.


ఫొటో సోర్స్, Gadwalpolice
ఏ రోజు .. ఏం జరిగిందంటే..
మే 18: గద్వాల పట్టణం రాజావీధినగర్‌కు చెందిన రిటైర్డు ఉద్యోగి గంటా జయరాం, శంకుతల చిన్న కుమారుడు గంటా తేజేశ్వర్‌కు కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్య అలియాస్ సహస్రతో మే 18న గద్వాల జిల్లా బీచుపల్లి ఆంజనేయస్వామి గుడిలో పెళ్లి జరిగింది.
తేజేశ్వర్ ప్రైవేటు సర్వేయర్ గా పనిచేస్తున్నారు.
జూన్ 15: ఐశ్వర్యకు పెళ్లి కాకముందు నుంచే కర్నూలు పట్టణంలోని కెన్ఫిన్ హౌసింగ్ సంస్థ మేనేజర్ తిరుమలరావుతో వివాహేతర సంబంధం ఉందని గద్వాల ఎస్పీ టి.శ్రీనివాసరావు చెప్పారు.
ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని కెన్ఫిన్ హౌసింగ్ సంస్థలో స్వీపర్ గా పనిచేస్తున్నారు. ఆమె భర్త గతంలోనే చనిపోయారు.
ఆర్థిక అవసరాలకు ఆదుకుంటున్న క్రమంలో సుజాత, ఆమె కుమార్తె ఐశ్వర్య, ఇద్దరితోనూ తిరుమలరావుకు వివాహేతర సంబంధం ఉందని చెప్పారు ఎస్పీ టి.శ్రీనివాసరావు.
''ఐశ్వర్యకు పెళ్లి కావడంతో వివాహేతర సంబంధం కొనసాగించడం కష్టమైందని భావించి తేజేశ్వర్‌ను హత్య చేశారు'' అని ఆయన చెప్పారు.
తేజేశ్వర్‌ను హత్య చేసేందుకు లోన్ ఏజెంటుగా పనిచేస్తున్న కుమ్మరి నగేశ్ అనే వ్యక్తితో తిరుమలరావు ఒప్పందం కుదుర్చుకున్నారని ఎస్పీ వివరించారు.
నగేశ్‌తోపాటు పరశురాముడు, చాకలి రాజు గద్వాల వచ్చి తేజేశ్వర్ కోసం రెక్కీ నిర్వహించి వెళ్లారని పోలీసులు గుర్తించారు.
''హత్య చేస్తే ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా. అవసరమైన లోన్లు క్లియర్ చేస్తా. లైఫ్ సెటిల్ చేస్తాను'' అని కుమ్మరి నగేశ్ తో తిరుమలరావు చెప్పారని, అందుకే ఆయన హత్య చేసేందుకు ఒప్పుకొన్నారని ఎస్పీ చెప్పారు.

ఫొటో సోర్స్, Gadwalpolice
'కారులోనే గొంతు కోశారు'
మే 19 – జూన్ 15
నిరుడు డిసెంబరులో ఐశ్వర్య, తేజేశ్వర్‌కు ఎంగేజ్‌మెంట్ అయ్యింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఐశ్వర్య, తేజేశ్వర్ వివాహం జరగాల్సి ఉంది. అయితే అప్పట్లో ఐశ్వర్య ఇంట్లోంచి వెళ్లిపోవడంతో పెళ్లి రద్దు అయ్యింది.
తర్వాత తిరిగి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్‌కు ఫోన్ చేసి.. ''నువ్వంటే ఇష్టం, అదనపు కట్నం అడిగినందుకే ఇంట్లోంచి వెళ్లిపోయాను'' అని చెప్పారని ఎస్పీ వివరించారు.
''ఐశ్వర్య మాటలు నమ్మి ఆమెను పెళ్లి చేసుకునేందుకు తేజేశ్వర్ ఒప్పుకొన్నాడు'' అని ఎస్పీ చెప్పారు.
మే 18వ తేదీన పెళ్లయ్యాక పలుమార్లు కర్నూలులో దించి రావాలని తేజేశ్వర్‌ను ఐశ్వర్య అడిగేదని పోలీసులు చెప్పారు.
ఒంటరిగా వస్తున్న క్రమంలో తేజేశ్వర్‌ను హత్య చేయాలనే ప్రణాళిక ఉందని, కానీ అది తిరుమలరావుకు సాధ్యపడలేదని ఎస్పీ చెప్పారు.
అందుకే సుపారీ గ్యాంగ్ తరహాలో బృందాన్ని ఏర్పాటు చేసుకుని హత్య చేసినట్లుగా చెప్పారు ఎస్పీ శ్రీనివాసరావు.
జూన్ 17: భూముల కొనుగోలు విషయంలో తేజేశ్వర్‌ను కలిసి నగేశ్, పరశురాముడు, రాజు స్నేహం పెంచుకున్నారని పోలీసులు గుర్తించారు. జూన్ 17న తేజేశ్వర్‌ను కారులో తీసుకుని నగేశ్, పరశురాముడు, రాజేశ్‌తో కలిసి కారులో వెళ్లినట్లుగా సీసీ కెమెరాలో రికార్డయ్యింది.
''మొదట ఇటిక్యాలలో భూములు చూసేందుకు వెళ్లారు. తర్వాత వస్తూ, ఎర్రవెల్లి- గద్వాల మధ్యలో తేజేశ్వర్‌ను హత్య చేశారు.
డ్రైవర్ పక్క సీట్లో కూర్చుని ఉన్న తేజేశ్వర్‌ను వెనుక ఉన్న పరశురాం, రాజు, పక్కనే ఉన్న నగేశ్ కలిసి ముందుగానే తెచ్చుకున్న వేటకొడవళ్లతో హత్య చేశారు'' అని ఎస్పీ టి.శ్రీనివాసరావు చెప్పారు.
హత్య ప్రణాళికను తిరుమలరావు ఎప్పటికప్పుడు వాట్సాప్ కాల్స్ ద్వారా పర్యవేక్షించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
''మొదట తేజేశ్వర్ మృతదేహాన్ని పంచలింగాల వద్ద ఉన్న తిరుమలరావుకు చెందిన భూముల్లో పూడ్చి పెట్టాలనుకున్నారు. తర్వాత తిరుమలరావు సూచనమేరకు కర్నూలు- నంద్యాల రోడ్డు వెంట పాణ్యం మండలంలోని గాలేరు నగరికాలువలో మృతదేహాన్ని పడేశారు. నగేశ్ సహా మిగిలిన వారి దుస్తులకు రక్తం అంటడంతో తిరుమలరావు వారికి కొత్త దుస్తులు కొని తెచ్చారు'' అని శ్రీనివాసరావు చెప్పారు.

ఫొటో సోర్స్, Gadwalpolice
‘హత్య చేసి.. శవాన్ని కాలువలో విసిరేశారు’
జూన్ 18: తేజేశ్వర్ ఇంటికి రాకపోవడంతో ఆయన సోదరుడు తేజ్ వర్దన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తేజేశ్వర్ బైకు గద్వాల ఐటీఐ కాలేజీ వద్ద గుర్తించామని పోలీసులు చెప్పారు.
అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయిన విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
''తేజేశ్వర్ కారులో వెళ్లిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి'' అని చెప్పారు ఎస్పీ.
అలాగే తేజేశ్వర్ భార్య ఐశ్వర్య ఫోన్ తనిఖీ చేసిన క్రమంలో తిరుమలరావుతో 2వేలసార్లకు పైగా మాట్లాడినట్లుగా ఉందని పోలీసులు చెప్పారు.
జూన్ 19: కుమ్మరి నగేశ్‌కు తిరుమలరావు రూ.50వేలు ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.
జూన్ 20: తిరుమలరావు తనకు పరిచయం ఉన్న వ్యక్తి సాయంతో కుమ్మరి నగేశ్ ఇంటికి రూ.2 లక్షలు పంపించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
జూన్ 21: కర్నూలు జిల్లాలోని గాలేరు-నగరి కాలువలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
అక్కడికి వెళ్లి తేజేశ్వర్ కుటుంబసభ్యులతో కలిసి పరిశీలించగా, శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా అది తేజేశ్వర్‌దేనని నిర్ధరణ అయ్యింది.
జూన్ 26: ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేసి మీడియాకు చూపించారు పోలీసులు. కేసులో ఎ1 నిందితుడు తిరుమలరావు, ఎ 3 నిందితుడు కుమ్మరి నగేశ్, ఎ4 చాకలి పరశురాముడు, ఎ5 చాకలి రాజును పుల్లూరు చెక్‌పోస్టు దగ్గర అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు.
వీరితోపాటు హత్యకు సహరించిన ఎ2 నిందితురాలు ఐశ్వర్య, ఎ6 మోహన్, ఎ7 తిరుపతయ్య (తిరుమలరావు తండ్రి), ఎ8 ఐశ్వర్య తల్లి సుజాతను అరెస్టు చేశామని వివరించారు.
వారి నుంచి కారు, వేట కొడవళ్లు, కత్తి, పది ఫోన్లు, రూ.1.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఫొటో సోర్స్, Gadwalpolice
ట్రాకర్‌తో తేజేశ్వర్ కదలికలపై నిఘా
తేజేశ్వర్‌ను చంపాలని నిర్ణయించుకున్నాక ఆయన కదలికలు తెలుసుకునేందుకు నగేశ్ ప్రయత్నించేవారని పోలీసులు చెప్పారు.
ఆయన కదలికలు తెలుసుకోవడం ఒక దశలో కష్టం కావడంతో తిరుమలరావు ఆన్‌లైన్‌లో జీపీఎస్ ట్రాకర్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని గద్వాల డీఎస్పీ మొగిలయ్య బీబీసీతో చెప్పారు.
''ఐశ్వర్య సాయంతో తేజేశ్వర్ తిరిగే బైకుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. ఫోన్‌లో యాప్ వేసుకుని అతను ఎక్కడికి వెళ్లినా తెలుసుకునేవారు. ఆ సమయంలో అతన్ని హతమార్చేందుకు చాలాసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు'' అని మొగిలయ్య చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'హత్య చేశాక లద్దాఖ్, అండమాన్ ట్రిప్‌కు ప్లాన్'
తిరుమల రావుకు 2019లోనే పెళ్లైందనీ, కానీ పిల్లలు కలగలేదని, తేజేశ్వర్‌ను చంపేసిన తర్వాత ఐశ్వర్యతో కలిసి లద్దాఖ్ గానీ, అండమాన్ గానీ వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారని ఎస్పీ చెప్పారు.
‘‘తన భార్యను చంపాలని తిరుమలరావు గతంలో పలుమార్లు ప్రయత్నించారు. కానీ, వివిధ కారణాలతో వెనక్కి తగ్గారు’’ అని చెప్పారు ఎస్పీ.
పెళ్లికి ముందు, తర్వాత కూడా ఐశ్వర్య రోజూ చాలాసార్లు తిరుమలరావుతో వీడియోకాల్స్ మాట్లాడినట్లుగా గుర్తించామని ఎస్పీ శ్రీనివాసరావు వివరించారు.
''ఎంగేజ్మెంట్ తర్వాతే తేజేశ్వర్ ను చంపాలని భావించారు. పెళ్లి చేసుకోవాలని బంధువులు చెబుతుడటంతో ఐశ్వర్య అటు తేజేశ్వర్‌తో మంచిగా ఉంటూ నమ్మించి, ఇటు తిరుమలరావుతో రిలేషన్ కొనసాగించింది'' అని ఎస్పీ చెప్పారు

ఫొటో సోర్స్, Getty Images
ఆ ముగ్గురిని ఎందుకు అరెస్టు చేశారంటే..
తేజేశ్వర్‌ను చంపేస్తారని ఐశ్వర్య తల్లి సుజాతకు ముందుగానే తెలుసని ఎస్పీ టి.శ్రీనివాసరావు చెప్పారు.
మోహన్ అనే వ్యక్తి తేజేశ్వర్ కదలికల గురించి ఎప్పటికప్పుడు తిరుమలరావుకు సమాచారం ఇచ్చేవారని వివరించారు.
తిరుమలరావు తండ్రి తిరుపతయ్య ఏపీఎస్పీ రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్.
హత్య తర్వాత తిరుమలరావును తప్పించేందుకు ప్రయత్నించారని, అందుకే ఆయన్ను కూడా అరెస్టు చేశామని గద్వాల ఎస్పీ టి.శ్రీనివాసరావు వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














