‘నువ్వో కామాంధుడివి’ అంటూ, 10మంది మహిళలపై అత్యాచారం చేసిన పీహెచ్‌డీ స్కాలర్‌పై కోర్టు ఆగ్రహం

నిందితుడు జౌ

ఫొటో సోర్స్, Met Police

ఫొటో క్యాప్షన్, మొత్తం 24 మంది బాధితులు ముందుకు వచ్చారు

‘కరుడుగట్టిన అత్యాచార నిందితుడి’ గా పోలీసులు పేర్కొంటున్న పీహెచ్‌డీ విద్యార్థికి యూకే న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఆయన కనీసం 24 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

జెన్హావో జౌ అనే ఈ విద్యార్ధి చైనా జాతీయుడు. ఆయన సెప్టెంబర్ 2019 నుంచి 2023 మధ్యకాలంలో లండన్‌లో ముగ్గురు, చైనాలో ఏడుగురు మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు.

పదిమంది బాధితులలో ముగ్గురిని గుర్తించినట్టు న్యాయవాదులు చెప్పారు. ఆయనింకా ఎక్కువమందినే టార్గెట్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

విచారణ ప్రారంభమైననాటి నుంచి 24 మంది మహిళలు ముందుకు వచ్చి తమ అనుభవాలను వెల్లడించారని మెట్రోపాలిటన్ పోలీసు డిటెక్టివ్‌లు చెప్పారు.

‘ఓ తెలివైన యువకుడిలా కనిపిస్తూ, ఆకర్షణీయమైన రూపంతో తానో కామాంధుడిననే విషయం తెలియకుండా వ్యవహరించాడని, జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి రోసినా కాటేజీ వ్యాఖ్యానించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నిందితుడి జౌ పడకగది

ఫొటో సోర్స్, Met Police

ఫొటో క్యాప్షన్, జౌ తన విలాసవంతమైన ఫ్లాట్ కోసం దాదాపు రూ. 4.68 లక్షల అద్దె చెల్లించేవాడు

‘నువ్వో కామాంధుడివి’

ఈ కేసు విచారణ ఇన్నర్‌ లండన్‌ ప్రాంతంలోని క్రౌన్‌ కోర్టులో జరిగింది. విచారణ సమయంలో జౌ ను ఉద్దేశించి ‘బయటి ప్రపంచానికి నువ్వో గౌరవప్రదమైన వ్యక్తిలా కనిపిస్తున్నావు. కానీ నువ్వో కామాంధుడివి' అన్నారు న్యాయమూర్తి కాటేజీ.

తన వాంఛలను తీర్చుకోవడానికి ఆయన పథకం ప్రకారం అత్యాచారాలు చేశారని, మహిళలపట్ల నిర్దయగా ప్రవర్తించి, వారిని ఆట బొమ్మలుగా చూసేవాడని న్యాయస్థానం గుర్తించింది.

జౌకు ‘మహిళలపై ఆధిపత్యం చూపిస్తూ లైంగిక కోరికలు తీర్చుకోవాలనే వాంఛ ఉందని జడ్జి కాటేజీ అన్నారు. శృంగారానికి అవతలివారి సమ్మతి ఉండాలనే ఆలోచన కూడా ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. ‘‘ప్రతిఘటించడం కూడా తప్పని మీరు బాధితులకు చెప్పారు'' అని నిందితుడితో న్యాయమూర్తి అన్నారు.

''కొన్నిసార్లు వారు నిన్ను అలా చేయవద్దని వేడుకుని ఉంటారు. నీ వాంఛలు తీర్చుకోవడానికి వారిపై ఆధిపత్యం చెలాయించడం నీకు కావాలి. అందుకే ఈ మహిళలను నిర్దయగా ఆట బొమ్మల మాదిరిగా చూశావు'' అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

అత్యాచారాలకు సంబంధించిన వీడియోలను కోర్టు చూసిందని, ఆ వీడియోలు చాలా బాధాకరమైనవని న్యాయమూర్తి కాటేజ్ అన్నారు.

ఆగ్నేయ లండన్‌లోని ఎలిఫెంట్ క్యాజిల్‌లో నివసిస్తున్న జౌ, 11 అత్యాచార కేసుల్లో దోషిగా తేలగా, అందులో రెండు నేరాలు ఒకే బాధితురాలికి సంబంధించినవి.

అశ్లీల చిత్రాలను తన దగ్గర పెట్టుకున్నందుకు 10, తప్పుడు జైలు శిక్ష, లైంగిక నేరానికి పాల్పడే ఉద్దేశంతో మాదకద్రవ్యాలు తనతో ఉంచుకున్నందుకు 3 అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి.

మహిళలకు సంబంధించిన వస్తువులను ఓ ట్రోఫీ బాక్సులో దాచుకోవడం సహా, ఆయన బాధితురాళ్లు స్పృహ కోల్పోయినప్పుడు చేసిన 9 అత్యాచారాలను చిత్రీకరించాడు.

''మేం ఇప్పటివరకు ఇంత కరుడుగట్టిన కామాంధుడిని చూడలేదు'' అని మెట్రోపాలిటన్ పోలీసుకు చెందిన ఇన్‌స్పెక్టర్ రిచర్డ్ మెకంజీ చెప్పారు.

‘‘నీ వంకర బుద్ధి సమాజానికి ప్రమాదకరం. నీ బుద్ధి మారనంతకాలం నువ్వు సమాజానికి ప్రమాదమే’’ అని జడ్జి వ్యాఖ్యానించారు.

నేరాలు

ఫొటో సోర్స్, Metropolitan Police

ఫొటో క్యాప్షన్, బాధితురాళ్లకు సంబంధించిన వస్తువులను నిందితుడు ఓ ట్రోఫీ బాక్సులో దాచుకున్నారు.

‘ఎన్నటికీ క్షమించను’

ఓ మహిళపై జౌ అత్యాచారం చేశారు. ఆమె చేత బలవంతంగా మద్యం ఎక్కువగా తాగించి, తన ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లకుండా ఒత్తిడి చేసి, అత్యాచారం చేశారు.

ఈ ఘటన తనను మానసికంగా తీవ్ర ప్రభావానికి గురి చేసిందని బాధితురాలు వాంగ్మూలంలో చెప్పారు.

''మనుషులపట్ల నాకు నమ్మకం పోయింది. మనుషులు ఇలాంటి దారుణాలు చేయగలరనే విషయం ఈ ఘటనకు ముందు నాకు తెలియదు'' అని ఆమె అన్నారు.

''నేను ఎవరినైనా కొత్తవారిని కలిసినప్పుడు, గతంలో అతను చేసిన పనే గుర్తుకువస్తోంది'' అని అన్నారామె.

ప్రస్తుతం చైనాలో నివసిస్తున్న మరో మహిళ కూడా 2021 అక్టోబరులో రస్సెల్ స్క్వేర్ సమీపంలోని తన స్టూడెంట్ ఫ్లాట్లో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు జూ అత్యాచారం చేశాడు.

"ఈ గాయం లోతును ఎప్పటికీ మాటల్లో చెప్పలేనని నాకు తెలుసు. కానీ ఒక విషయం మాత్రం నిజం. ఆ రాత్రి ఏం జరిగిందో అది నా మనసులో గూడుకట్టుకుపోయి ఉంటుంది. అతని ముఖం, ముఖ కవళికలు నన్ను ఎప్పటికీ వెంటాడుతుంటాయి. అతన్ని ఎప్పటికీ క్షమించను’’ అని అన్నారామె.

‘‘జౌ ఇకపై ఇతరులకు హాని చేయలేడు అనే నిజం అపారమైన బాధను అనుభవించిన మహిళలకు ఓ చిన్న ఓదార్పుగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను'' అని మెట్రోపాలిటన్ పోలీసుకు చెందిన కమాండర్ కెవిన్ సౌత్ వర్త్ అన్నారు.

‘‘మా దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. జౌ బాధితులు అని భావించేవారు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మా బృందంతో మాట్లాడండి" అని అన్నారాయన.

క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ కు చెందిన సైరా పైక్ మాట్లాడుతూ ‘‘జౌ అనేవాడు సీరియల్ రేపిస్ట్. మహిళలకు ప్రమాదకారి. అతనికి జీవిత ఖైదు విధించడం, అతను చేసిన నేరాలను, హేయమైన చర్యలను ప్రతిబింబిస్తుంది’’ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)