వంట గ్యాస్ సిలిండర్ పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

గ్యాస్ లీకవ్వడంతో అగ్ని ప్రమాదం

ఫొటో సోర్స్, Twitter/Screengrab

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పైప్ నుంచి గ్యాస్ ఎగజిమ్మడంతో మహిళ భయంతో బయటకు పారిపోవడం, కాసేపయ్యాక మళ్లీ ఆమె ఇంట్లోకి తిరిగి రావడం, అదే క్షణంలోనే ఇంట్లో పేలుడు సంభవించి మంటలు ఎగసిపడిన ఒక వీడియో ఇటీవల వైరల్ అయింది.

ఈ ఘటనలో సిలిండర్ నుంచి గ్యాస్ లీకైన సమయంలో ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉండటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. అదృష్టవశాత్తు పెద్దగా ఆస్తి నష్టం జరుగలేదు. ప్రాణ నష్టం కూడా సంభవించలేదు.

ఈ ఘటనతో ఇంట్లో వంటగ్యాస్ భద్రత, గ్యాస్ లీకేజీ, ప్రమాద నివారణ అంశాలపై చర్చ మొదలైంది.

ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ లీకేజ్ వల్ల కలిగే ప్రమాదాల నివారణ, గ్యాస్ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గ్యాస్ లీక్

ఫొటో సోర్స్, Getty Images

కిచెన్‌ను 'సేఫ్ జోన్'గా ఎలా మార్చాలి?

ఇంట్లో గ్యాస్ సిలిండర్ల వాడకం, జాగ్రత్తల గురించి గ్యాస్ ఏజెన్సీలు తమ వినియోగదారులకు మార్గదర్శకాలు జారీ చేస్తాయి. హెచ్‌పీ, ఇండేన్ గ్యాస్ సంస్థలు జారీ చేసిన సూచనలను బీబీసీ పరిశీలించింది.

ఈ రెండు సంస్థలు జారీ చేసిన సూచనలు దాదాపు ఒకేలా ఉన్నాయి. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం...

సిలిండర్లను ఎప్పుడూ కచ్చితంగా నిలువుగా ఉంచాలి. వాటిని అడ్డంగా పడుకోబెట్టరాదు. ధారాళంగా గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. వేడికి, మంటకు దూరంగా ఉంచాలి.

గ్యాస్ స్టౌను సిలిండర్ కంటే ఎత్తుగా ఉండే ఫ్లాట్‌ఫామ్ మీద ఉంచాలి.

వంట చేస్తున్నప్పుడు మినహా, మిగతా సమయాల్లో సిలిండర్ రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయడం మంచిది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో, నిద్రించేముందు సిలిండర్‌ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి.

సిలిండర్‌ సామగ్రి అంటే పైప్, రెగ్యులేటర్ వంటి వాటిని సొంతంగా రిపేర్ చేయకూడదు.

సిలిండర్ నుంచి స్టౌ వరకు గ్యాస్‌ను సరఫరా చేసే పైప్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆ పైప్ పగిలినట్లుగా కనిపించినా, లేదా ఇంకేదైనా డ్యామేజీ ఉన్నా వెంటనే దాన్ని మార్చేయాలి. ఐఎస్‌ఐ ఆమోదం పొందిన పైప్‌లను మాత్రమే వినియోగించాలి.

రబ్బర్ ట్యూబ్‌లైతే ప్రతీ రెండేళ్లకు ఒకసారి కచ్చితంగా మార్చాలి.

వంటగదిలో పనిచేసేటప్పుడు కాటన్ దుస్తులు ధరించడం మంచిది. స్టౌ మీద ఉన్న వంటపాత్రలను చీరకొంగు, చున్నీలతో పట్టుకోరాదు.

వంట చేసేటప్పుడు అగ్ని నిరోధక (ఫైర్ రిటార్డెంట్) యాప్రాన్ వేసుకోవాలి.

వంట చేస్తున్నప్పుడు స్టౌ మండుతుందా? లేదా అనే అంశాన్ని గమనిస్తూ ఉండాలి. గాలి వల్ల లేదా ఆహారపదార్థాలు పొంగడం వల్ల మంట ఆరిపోయి బర్నర్ నుంచి గ్యాస్ లీకయ్యే అవకాశం ఉంది. ఇలా లీకైన గ్యాస్ మరో బర్నర్‌లోని మంట ద్వారా అంటుకొని అగ్ని ప్రమాదం జరగొచ్చు.

ప్లాస్టిక్ వస్తువులను, గ్యాస్ స్టౌ సమీపంలో ఉంచకూడదు.

వాడని సిలిండర్ నిండుగా ఉన్నా లేదా ఖాళీ అయినప్పటికీ దానికి మూత బిగించాలి.

గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు

ఫొటో సోర్స్, SDRF/Youtube

ఫొటో క్యాప్షన్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక మహిళకు గ్యాస్ సిలిండర్ ప్రమాాదాలను నివారించే మెలకువలు వివరిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ( ఫైల్ ఫోటో)

గ్యాస్ లీకై మంటలు చెలరేగితే...

గ్యాస్ లీకై పైప్ నుంచి గానీ, సిలిండర్ రెగ్యులేటర్ వద్ద నుంచి గానీ మంటలు చెలరేగినప్పుడు చేపట్టాల్సిన చర్యల గురించి ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తుంటాయి.

అందులో, ఫైర్ సేఫ్టీ బృందాలు సూచించిన ప్రకారం...

సిలిండర్ నుంచి మంటలు చెలరేగినప్పుడు భయపడకుండా వాటిని ఆపేందుకు ప్రయత్నించాలి.

కంగారు పడకుండా గోనెసంచిని లేదా మందపాటి వస్త్రాన్ని నీటిలో ముంచి మంటలు చెలరేగుతున్న సిలిండర్ చుట్టూ చుట్టడం వల్ల ఆక్సీజన్ అందక మంటలు ఆగిపోతాయి.

లేదంటే ఒక ప్లాస్టిక్ బకెట్‌ను సిలిండర్‌పైన బోర్లించి నొక్కి పెట్టడం వల్ల కూడా ఆక్సీజన్ అందక మంటలు అదుపులోకి వస్తాయి.

సిలిండర్ నుంచి గ్యాస్ లీకవుతున్న ప్రాంతానికి మంటలకు మధ్య కాస్త గ్యాప్ ఉంటుంది. భయపడకుండా ఈ గ్యాప్‌ను వేలితో మూయడం ద్వారా కూడా మంటలను అదుపులోకి తీసుకురావచ్చు.

గ్యాస్ లీక్

ఫొటో సోర్స్, Getty Images

సిలిండర్ డెలివరీ సమయంలో మీరేం చేయాలంటే...

గ్యాస్ ఏజెన్సీ డీలర్ల నుంచి సిలిండర్ తీసుకునే సమయంలో సిలిండర్ సీల్, బరువును చెక్ చేయాలి. సీల్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి.

అవి సరిగ్గా ఉన్నట్లుగా భావించిన తర్వాతే మీరు ఆ సిలిండర్‌ను తీసుకోవాలి.

అలాగే సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను బిగించాల్సిందిగా డెలివరీ పర్సన్‌ను కోరండి. అంతా సరిగ్గా ఉందో లేదో నిర్ధరించుకోండి. అదనపు సిలిండర్‌ అయినప్పటికీ డీలర్ చేత ఈ తనిఖీలు నిర్వహించాలి.

సిలిండర్ డెలివరీ ఇచ్చే వారి వద్ద బరువు తూచే యంత్రం కూడా ఉంటుంది. మీకు అనుమానంగా ఉంటే సిలిండర్ బరువు తూచి చెప్పాల్సిందిగా వారిని కోరండి.

గ్యాస్ సిలిండర్

ఫొటో సోర్స్, Getty Images

సిలిండర్‌ను తీసేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రెగ్యులేటర్ నుంచి సిలిండర్‌ను తీసేసేటప్పుడు వంటగదిలో మండుతున్న స్టౌలను ఆపేయాలి. రెగ్యులేటర్‌ను కూడా ఆఫ్ చేయాలి

రెగ్యులేటర్‌ను తొలగించిన వెంటనే సిలిండర్‌ వాల్వ్‌కు మూతను బిగించాలి. మూత సరిగ్గా బిగుసుకుందో లేదో పరిశీలించాలి. తర్వాతే ఆ సిలిండర్‌ను అక్కడినుంచి తొలగించాలి.

రెగ్యులేటర్‌ను బిగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

నిండు సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను బిగించేటప్పుడు, రెగ్యులేటర్ నాబ్ ఆఫ్ చేసి ఉండాలి.

రెండు చేతులతో రెగ్యులేటర్ గట్టిగా పట్టుకొని దానికి ఉన్న ప్లాస్టిక్ బుష్ అప్‌ను పైకి లాగాలి.

తర్వాత సరిగ్గా సిలిండర్ వాల్వ్‌పై రెగ్యులేటర్‌ను ఉంచి కిందకు నొక్కి ప్లాస్టిక్ బుష్ అప్‌ను కిందకు వదిలేయాలి.

ఈ ప్రక్రియను సరిగ్గా చేస్తే చిన్నగా టప్ అనే శబ్దం వినిపిస్తుంది. ఇలా వినిపిస్తే రెగ్యులేటర్ సరిగ్గా సిలిండర్‌కు బిగుసుకున్నట్లుగా పరిగణించాలి.

గ్యాస్ లీక్

గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనిపిస్తే?

ఇంట్లో నుంచి గ్యాస్ వాసన వస్తున్నట్లు అనిపించినా, లేక గ్యాస్ లీకైనట్లు మీరు గుర్తించినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ లీకవుతోందని భయపడకూడదు. వెంటనే రెగ్యులేటర్‌ను ఆపేయాలి.

ఒకవేళ మీకు కుదిరితే, వెంటనే రెగ్యులేటర్‌ను సిలిండర్ నుంచి తొలగించి, దాని వాల్వ్‌పై మూతను గట్టిగా బిగించాలి.

వంట గది పరిసరాల్లో అన్ని రకాల మంటలను ఆపేయాలి. ఉదాహరణకు ఇంట్లో అగర్‌బత్తి, దీపం లాంటివి వెలుగుతుంటే వాటిని కూడా ఆర్పేయాలి.

అగ్గిపుల్ల, లైటర్‌ వంటి వాటిని వెలిగించ కూడదు. ఇంట్లోని విద్యుత్ పరికరాల స్విచ్‌లను ఆన్/ఆఫ్ చేయకూడదు. స్విచ్ ఆన్ చేసినా లేదా ఆఫ్ చేసినా వాటిలోని స్పార్క్స్ వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

ఇంట్లోని తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి.

గ్యాస్ లీకవుతున్న ప్రాంతంలో మొబైల్ ఫోన్ వాడకూడదు.

వెంటనే అత్యవసర సేవల నంబర్ 1906కు ఫోన్ చేసి సమాచారాన్ని అందించాలి.

సిలిండర్

ఫొటో సోర్స్, Getty Images

సిలిండర్ల భద్రతా ప్రమాణాలను ఎవరు పర్యవేక్షిస్తారు?

సిలిండర్ల భద్రతా ప్రమాణాలు, వాటికి నిర్వహించే పరీక్షలు, సిలిండర్ పేలుడు ఘటనలకు సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీ గురించి 2023లో అప్పటి కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి రామేశ్వర్ తేలి డిసెంబర్ 7న లోక్‌సభలో రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఆయన ప్రస్తావించిన వివరాల ప్రకారం...

ఇండియన్ స్టాండర్డ్స్ (ఐఎస్): 3196 (పార్ట్-1) 2006 నియమాల ప్రకారం ఎల్పీజీ సిలిండర్లను తయారు చేస్తారు.

కొత్తగా తయారయ్యే ప్రతీ సిలిండర్‌ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పరీక్షిస్తుంది.

ఈ బీఐఎస్ సర్టిఫికెట్ ఆధారంగా, గ్యాస్ సిలిండర్ రూల్స్ (జీసీఆర్)-2016 ప్రకారం వీటిలో గ్యాస్ నింపడానికి చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్ (సీసీఓఈ) నాగ్‌పూర్, లేదా ఆయన ప్రతినిధి ఆమోదం తెలుపుతారు.

జీసీఆర్ నిబంధనల ప్రకారం, ప్రతీ సిలిండర్‌ను నిర్ణీత కాలవ్యవధి తర్వాత తప్పకుండా పరీక్షించాల్సి ఉంటుంది.

సిలిండర్ తయారైన తేదీ నుంచి పదేళ్లకు దీన్ని పునర్వియోగించాలా? వద్దా? అనేది నిర్ణయించడానికి పరీక్షిస్తారు.

ఆ తర్వాత ప్రతీ అయిదేళ్లకు ఒకసారి ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.

పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్‌ఓ) నిబంధనల ప్రకారం కాలానుగుణంగా సిలిండర్లను పరీక్షిస్తారు.

సిలిండర్‌కు ఎక్స్‌పైరీ తేదీ ఉంటుందా

ఫొటో సోర్స్, instagram/Hyderabad.hcsc

ఎల్పీజీ సిలిండర్లకూ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా?

ఎల్పీజీ సిలిండర్లకు ఎక్స్‌పైరీ తేదీ ఉండదని ఇండియన్ ఆయిల్ సంస్థ స్పష్టం చేసింది. అయితే, సిలిండర్లపై మనకు కనిపించే సంఖ్య, తదుపరి పరీక్ష గడువు తేదీకి సూచిక అని వెల్లడించింది.

ఎల్పీజీ ప్లాంట్ల యాజమాన్యాలు ఖాళీ సిలిండర్లలో గ్యాస్ నింపడానికి ముందు చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్, పీఈఎస్‌ఓ, భారత ప్రభుత్వం, బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా చట్టబద్ధమైన పరీక్షలు, పెయింటింగ్ (స్టాచ్యుటరీ టెస్టింగ్ అండ్ పెయింటింగ్) సహా వివిధ రకాల పరీక్షలు చేస్తాయి.

సిలిండర్లకు అన్ని రకాల పరీక్షలను అధీకృత కాంట్రాక్టర్లు మాత్రమే నిర్వహిస్తారు. ఈ పరీక్షల తర్వాత వాడకానికి అనుగుణంగా ఉన్నవాటిని వేరు చేసి, వాటిపై 'తదుపరి పరీక్ష తేదీని' నిలువుగా రాస్తారు.

ఉదాహరణకు సిలిండర్ మీద A.26 అని ఉంటే దాని తదుపరి పరీక్ష తేదీ 2026 మొదటి త్రైమాసికం అంటే జనవరి-మార్చి మధ్య ఉంటుందని అర్థం. ఒకవేళ B.26 అంటే 2026 రెండో త్రైమాసికం అంటే ఏప్రిల్-జూన్ మధ్య దాన్ని పరీక్షించాలన్న మాట. అలాగే C అంటే మూడో త్రైమాసికం, D అంటే నాలుగో త్రైమాసికాన్ని సూచిస్తాయి.

ప్లాంట్లలో ఖాళీ సిలిండర్లను నింపే ముందు, ఆ తర్వాత నిండిన సిలిండర్లను వినియోగదారులకు చేర్చేముందు తగు పరీక్షలన్నీ నిర్వహిస్తారు.

అందుకే ఇప్పటివరకు సిలిండర్ టెస్ట్ డేట్ ఎక్స్‌పైరీ, స్టాట్యుటరీ టెస్టింగ్ ఎక్స్‌పైరీ కారణంగా ప్రమాదాలేవీ జరగలేదని ఇండియన్ ఆయిల్ సంస్థ పేర్కొంది.

సిలిండర్ల భద్రత

ఫొటో సోర్స్, Getty Images

సిలిండర్ ప్రమాదం జరిగితే బీమా పొందొచ్చా?

సిలిండర్ ప్రమాదాలు జరిగినపుడు బాధితులకు అండగా ఉండేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) బీమాను తమ ఎల్పీజీ వినియోగదారులకు అందిస్తాయి.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 'పబ్లిక్ లయబిలిటీ పాలసీ ఫర్ ఆయిల్ ఇండస్ట్రీస్' విధానం కింద ఈ బీమాను అందిస్తున్నాయి.

ఎల్పీజీ వినియోగదారులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. గాయాల పాలైన వారికి ఆసుపత్రి ఖర్చులు ఈ బీమాలో అందుతాయి.

మరణించిన వారికి కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. అంటే సిలిండర్ పేలుడులో ప్రాణాలు పోయినా, గాయపడ్డా ఈ బీమా వర్తిస్తుందని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి 2023 డిసెంబర్ 7న లోక్‌సభలో చేసిన ప్రకటనలో వెల్లడించారు.

ప్రమాదంలో ప్రాణం పోతే రూ. 6 లక్షల పరిహారం ఆ కుటుంబానికి ఇస్తారు.

తీవ్రంగా గాయపడితే రూ. 2 లక్షలతో పాటు వైద్య ఖర్చుల కోసం అదనంగా రూ. 30 లక్షల వరకూ ఇస్తారు.

ఆస్తి నష్టానికి గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు ఇస్తారు.

బీమాకు సంబంధించిన పూర్తి సమాచారం, క్లెయిమ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవడం కోసం ఈ లింకును క్లిక్ చేయండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)