26/11 ముంబై దాడులు: కసబ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన 9 ఏళ్ల దేవిక ఎదుర్కొన్న కష్టాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images & Shardul Kadam
- రచయిత, దీపాలి జగ్‌తాప్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''మొదట్లో మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్పారు. చదువుకు కూడా సాయం చేస్తామన్నారు. మీకు ఏ అవసరమైనా మేం అందుబాటులో ఉంటామన్నారు. కానీ, ఎవరూ లేరు.''
26/11 ముంబయి ఉగ్రవాద దాడుల ప్రత్యక్ష సాక్షి, ఆ దాడిలో బుల్లెట్ గాయాలైన దేవికా రోటావన్ బీబీసీతో మాట్లాడారు.
ముంబయిలోని సీఎస్‌ఎంటీ (ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్) రైల్వే స్టేషన్‌లో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో దేవిక కాలికి గాయాలయ్యాయి. ఆ రోజు, ఆ స్టేషన్‌లో జరిగిన ఘటనలో 52 మంది మరణించగా, 108 మంది గాయపడ్డారు.
అప్పుడు అరెస్టయిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు వ్యతిరేకంగా దేవిక కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఈ ఘటనలో అతిచిన్న వయస్కురాలైన సాక్షిగా నిలిచారు.
ఆ సమయంలో దేవిక వయస్సు కేవలం 9 సంవత్సరాల 11 నెలలు.
అయితే, అజ్మల్ కసబ్‌కు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పడం, ప్రభుత్వం నుంచి ఇల్లు పొందడం వరకు దేవిక జీవితం అంత సులువుగా ఏమీ సాగలేదు. ఈ 15 ఏళ్లలో ఏం జరిగింది?


ఫొటో సోర్స్, BBC / Shardul Kadam
కాలిలో బుల్లెట్..
26/11 ముంబయి దాడుల్లో దేవిక కుడి కాలికి తూటా తగిలింది. అనంతరం, ఆమెకు ఆపరేషన్ చేశారు. కాలిపై బుల్లెట్ గుర్తు ఇప్పటికీ అలాగే ఉంది.
ఆ సమయంలో, 9 ఏళ్ల దేవిక ప్రత్యేక కోర్టులో అజ్మల్ కసబ్‌ను గుర్తించింది. సాక్ష్యం చెప్పింది. ఆమె ధైర్యసాహసాలకు అనేక వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి.
ఆరోజు ముంబయిలో జరిగిన దాడుల్లో మొత్తం 174 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడి జరిగిన సమయంలో దేవిక, ఆమె తండ్రి, సోదరుడు సీఎస్‌ఎంటీ రైల్వే స్టేషన్‌లో ఉన్నారు.
"ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజును నేనెప్పటికీ మర్చిపోలేను. అది నన్నింకా వెంటాడుతూనే ఉంది. నా కళ్లముందే చాలా మంది చనిపోయారు."
''మా నాన్న, మా అన్నయ్య నాతో ఉన్నారు. మేం పుణె వెళ్తున్నాం. అప్పుడు, అకస్మాత్తుగా బాంబు పేలింది. ఆ తర్వాత, కాల్పులు మొదలయ్యాయి. ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నాడు, అతన్ని నేను చూశా. ఆ ముఖాన్ని నేనెప్పటికీ మర్చిపోను'' అని దేవిక చెప్పారు.
ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు
ఇప్పుడు దేవికకు 25 ఏళ్లు. ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తన తండ్రి, సోదరుడితో కలిసి బాంద్రాలోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
బుల్లెట్ తగలడంతో దేవికకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.
ఆమె చదువుకు కూడా బ్రేక్ పడింది.
ఆర్థిక సాయం కోసం అప్పటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు దేవిక.
''ప్రభుత్వం సాయం చేస్తుందని ఆ సమయంలో చాలా ఆశించా. కానీ, చాలా ఆలస్యమైంది. ఏడాదిన్నర పాటు ఇబ్బంది పడ్డాం'' అన్నారు.
ప్రభుత్వం సుమారు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించిందని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Devika Rotawan
ఇంటి కోసం పోరాటం
ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం, ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో తనకు ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దేవిక 2020లో కోర్టులో పిటిషన్ వేశారు.
ముంబయి దాడుల తర్వాత, ఆ కేసులో సాక్ష్యం చెప్పిన తర్వాత.. చాలా మంది ఆమెకు సాయం చేస్తామంటూ ముందుకొచ్చారు. హామీలిచ్చారు. కానీ, నిజంగా సాయం కోరినప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి, కోర్టు సాయం కోరాల్సి వచ్చిందని దేవిక చెప్పారు.
న్యాయవాదుల సాయంతో 2020లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని.. న్యాయవాదులు, న్యాయమూర్తుల వల్లే ఇల్లు పొందగలిగానని దేవిక చెప్పారు.
''ఎట్టకేలకు, నాకు అంధేరీలో ఒక ఇల్లు మంజూరైంది. అది 300 చదరపు అడుగులు. దాని కోసం కూడా, నేను కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.''

ఫొటో సోర్స్, BBC/ Shardul Kadam
ఎన్నో అనుభవాలు..
ఆ దాడుల తర్వాత, ఈ 15 ఏళ్లలో దేవికకు ఎన్నో మంచి, చెడు అనుభవాలు ఎదురయ్యాయి. కసబ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం దగ్గరి నుంచి, ఇల్లు పొందడం వరకు.. ఈ ప్రయాణం ఆమెకు చాలా నేర్పింది. ఆమె అనేక సవాళ్లనూ ఎదుర్కొన్నారు.
దీని గురించి దేవిక మాట్లాడుతూ, ''నా చదువు ఆలస్యమైంది. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. అదిగో కసబ్ వెళుతున్నాడు .. అంటూ చాలామంది ఆటపట్టించేవారు. యువకులు, పెద్దవాళ్లు కూడా అలానే మాట్లాడేవారు.''
''అలాంటి వారితో ఒకట్రెండుసార్లు గొడవపడ్డాను కూడా. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నామనేది విషయం కాదు, నిరంతరం పోరాడుతూ ఉండాల్సిందే అనుకుంటూ ఉంటా. మూలన కూర్చోవడం వల్ల ఏదీ రాదు. మీరు మీ హక్కుల కోసం పోరాడాలి, ముందుకొచ్చి మాట్లాడాలి'' అని దేవిక అన్నారు.
దేవిక ప్రస్తుతం తన కుటుంబంతో బాంద్రాలో, అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆమె త్వరలోనే అంధేరీలోని తన కొత్త ఇంట్లోకి మారనున్నారు.

ఫొటో సోర్స్, BBC / Shardul Kadam
పోలీసు శాఖ ఏమంటోంది?
ఈ విషయంలో ముంబయి పోలీస్ కమిషనరేట్ బీబీసీకి ఇచ్చిన సమాచారం ప్రకారం,
దేవిక, ఆమె తండ్రి నట్వర్‌లాల్ రోటావన్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో రాజస్థాన్‌లోని పాలిలో మూడేళ్లుగా(2009కి ముందు) నివసిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం ముంబయిలోని బాంద్రాలో నివసిస్తున్నట్లు కూడా చెప్పారు. సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్‌లో ఆ రోజు జరిగిన ఘటనలో మొత్తం 52 మంది చనిపోయారు. 108 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 308 మంది సాక్షులు ఉన్నారు. వారిలో 177 మంది ప్రత్యక్ష సాక్షులు.
కొందరు సాక్షుల నుంచి కోర్టులో నేరుగా వాంగ్మూలం తీసుకున్నారు. మరికొంతమంది సాక్షుల వాంగ్మూలాలను అఫిడవిట్ల ద్వారా నమోదు చేశారు. దేవిక వాంగ్మూలం కారణంగానే కసబ్‌ను ఉరి తీశారని చెప్పడం తప్పు. నిజానికి, కోర్టులో మొత్తం 654 మంది సాక్షులను విచారించారు.
సాక్షుల వాంగ్మూలాలు, ప్రభుత్వం సమర్పించిన సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, ఇద్దరు జర్నలిస్టులు తీసిన కసబ్, అబూ ఇస్మాయుల్ ఫోటోలు, ఫోరెన్సిక్ నిపుణుల నివేదికలు, కోర్టులో కసబ్ నేరాంగీకారం, ట్రయల్ కోర్టులో ఒప్పుకోలు మొదలై వాటి ఆధారంగా కోర్టు మరణశిక్ష విధించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














