రాక్‌సాల్ట్, మామూలు ఉప్పులో ఏది మంచిది, రాక్‌సాల్ట్ బీపీని తగ్గిస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శారద మియాపురం
- హోదా, బీబీసీ ప్రతినిధి
''తెల్ల ఉప్పు కంటే రాక్‌సాల్ట్‌లో తక్కువ మలినాలు ఉంటాయి.
సైంధవ లవణం తిన్నప్పటి నుంచి నా బీపీ నియంత్రణలో ఉంది.
తెల్ల ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు.
రాక్ సాల్ట్‌తో నా గొంతు నొప్పి తగ్గింది.
బీపీ,షుగర్ నియంత్రణకు రాక్ సాల్ట్ మంచిది
ఎసిడిటీని తగ్గిస్తుంది, అజీర్తి ఉండదు''
రాక్ సాల్ట్ గురించి హిమాచల్ ప్రదేశ్‌లోని శిమ్లా ప్రజల అభిప్రాయాలు ఇవి.
వీరంతా రాక్‌సాల్ట్‌ను వాడుతున్నారు.
శిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ కమ్యూనిటీ మెడిసిన్ సెంటర్, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో రాక్‌సాల్ట్‌పై ఈ అభిప్రాయాలు వెల్లడయ్యాయి.
అక్కడి కొండ ప్రాంతాల్లో నివసించే వారిలో 2.5 శాతం కుటుంబాలు అయోడిన్ ఉప్పు బదులుగా రాక్‌సాల్ట్‌ను వాడుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.
రాక్ సాల్ట్‌తో నిజంగానే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా?


ఫొటో సోర్స్, Getty Images
రాక్ సాల్ట్ వాడకం ట్రెండ్‌గా మారిందా?
మామూలు ఉప్పుతో పోలిస్తే రాక్ సాల్ట్ ఆరోగ్యానికి చాలా మంచిదంటూ ఇటీవలి కాలంలో ఈ ఉప్పును వినియోగించే వారి సంఖ్య పెరిగింది. ఫలితంగా రాక్ సాల్ట్ అమ్మకాలు పెరిగాయి.
రాక్ సాల్ట్ సహజ సిద్ధమైనదని, ఇందులో రసాయనాలు తక్కువ కలుపుతారనే ఆరోగ్య స్పృహతో ప్రజలు ఈ ఉప్పు వైపు మొగ్గు చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ప్రత్యేకంగాఈ ఉప్పును వాహనాల్లో తీసుకొచ్చి అమ్ముతుంటారు.
అయితే రాక్ సాల్ట్ బ్రాండ్లలో చాలావాటిలో ఆరోగ్యానికి అవసరమైన అయోడిన్ ఉండదని తమిళనాడు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ టీఎస్ సెల్వ వినాయగమ్ ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు.
తమిళనాడులో రాక్ సాల్ట్ విక్రయాలు పెరిగిన కారణంగా అయోడిన్ ఉప్పు ప్రయోజనాలు, వంటల్లో అయోడిన్ రహిత ఉప్పు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలంటూ జిల్లా ఆరోగ్య అధికారులను ఆదేశించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ కంట్రోల్ ప్రోగ్రామ్ సమన్వయ కమిటీ సమావేశంలో రాక్ సాల్ట్ విక్రయాలు పెరగడం ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు.
సంప్రదాయ అయోడిన్ ఉప్పుకు రాక్‌సాల్ట్ ఒక ఆరోగ్యకర ప్రత్యామ్నాయమనే అపోహతో ప్రజలు దీన్ని కొనుగోలు చేస్తున్నారంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
రాక్ సాల్ట్ అంటే?
రాక్‌సాల్ట్ అంటే శుద్ధి చేయని ఉప్పు. శుద్ధి చేయని కారణంగా మిగతా ఉప్పుతో పోలిస్తే ఇందులో ఎక్కువగా మలినాలు, ఖనిజ నిల్వలు అలాగే ఉంటాయని హైదరాబాద్‌కు చెందిన పోషకాహార నిపుణురాలు అంజలి దంగే బీబీసీతో చెప్పారు.
''రాక్ సాల్ట్‌లో సహజ మలినాలతో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. అందుకే ఈ ఉప్పు కణాల పరిమాణం పెద్దగా ఉంటుంది. రాక్‌సాల్ట్‌లో అయోడిన్ ఉండదు. మరోవైపు అయోడైజ్డ్ ఉప్పుని అనేక ప్రక్రియల్లో శుద్ధి చేస్తారు. ఈ ప్రక్రియలో థైరాయిడ్ గ్రంథి పనితీరుకు అవసరమైన అయోడిన్‌ను అందించే మూలకాలను ఉప్పుకు జతచేస్తారు. టేబుల్ సాల్ట్ అంటే రీఫైన్డ్ ఉప్పు. ఇందులో ప్రధానంగా సోడియం క్లోరైడ్ ఉంటుంది'' అని ఆమె చెప్పారు.
దీన్ని బట్టి సహజ రూపంలో ఉండే ఉప్పును రాతి ఉప్పుగా, అత్యధికంగా రీఫైన్డ్ చేసిన ఉప్పును టేబుల్ సాల్ట్ అని, అయోడిన్ మూలకాన్ని చేర్చి ప్రాసెస్ చేసిన దాన్ని అయొడైజ్డ్ ఉప్పుగా పిలుస్తారన్నమాట.
అందరూ రాక్ సాల్ట్ తినొచ్చా?
ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు, యువత అప్పుడప్పుడు రాక్ సాల్ట్ తీసుకోవచ్చని న్యూట్రిషియనిస్ట్ అంజలి అభిప్రాయపడ్డారు. అలాగే వ్యక్తుల పరిస్థితిని బట్టి అన్ని రకాల ఉప్పు తినొచ్చని ఆమె అన్నారు.
''థైరాయిడ్ సమస్య ఉన్నవారికి అయోడిన్ ముఖ్యం. అందుకే వారికి అయోడైజ్డ్ ఉప్పు సిఫార్సు చేస్తాం. బీపీ ఎక్కువగా ఉన్నవారిని కచ్చితంగా సోడియం తక్కువగా ఉండే 'లో సోడియం సాల్ట్స్' వాడమని చెబుతుంటాం. ఎందుకంటే ఇది బీపీని నియంత్రణలో ఉంచుతుంది. ’’ అని తెలిపారు.
‘‘అయోడైజ్డ్ ఉప్పు అన్ని రకాలుగా సురక్షితం. ఈ ఉప్పులో మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. కాకపోతే పరిమితంగా తీసుకోవాలి. హై బీపీ ఉన్నవారు ఉప్పు వీలైనంత తక్కువగా తినాలి. మీరు ఏ స్థాయిలో ఉప్పును తీసుకుంటారనే దానిపై దాని ప్రభావాలు ఆధారపడి ఉంటాయి. కూరల్లో ఎక్కువగా ఉప్పు తినేవాళ్లు మజ్జిగలో ఉప్పు వేసుకోకపోవడం మంచిది. మీ లైఫ్ స్టైల్, ఆరోగ్య పరిస్థితి, వయస్సుతోపాటు ఎంత వ్యాయామం చేస్తున్నారనేదాన్ని బట్టి ఉప్పును తీసుకోవాలి'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత ఉప్పు తింటున్నాం?
మనం సాధారణంగా రోజూ తీసుకునే ఉప్పు సోడియం, క్లోరైడ్ మిశ్రమాల కలయిక.
ఒక రోజులో 2 గ్రాముల కంటే తక్కువగా సోడియాన్ని తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సిఫార్సు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2019లో ఈ సగటు 4.2 గ్రాములుగా ఉందని చెప్పింది. అంటే డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సుల కంటే ఇది రెండింతలు.
ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన న్యూట్రీషన్ అండ్ ఫుడ్ సేఫ్టీ విభాగం ఈ జనవరిలో సోడియం తక్కువగా ఉండే ఉప్పు వాడకంపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
రక్తపోటు, గుండె సంబంధ వ్యాధుల ముప్పును తగ్గించుకోవడానికి మామూలు ఉప్పుకు బదులుగా తక్కువ సోడియం ఉండే ఉప్పు ప్రత్యామ్నాయాలను (లో సోడియం సాల్ట్ సబ్‌స్టిట్యూట్స్- ఎల్‌ఎస్‌ఎస్‌ఎస్) తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది.
సోడియం స్థానంలో పొటాషియాన్ని తీసుకోవాలని సూచిస్తూ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది.
గర్భిణులు, చిన్నారులు, కిడ్నీ సమస్య ఉన్నవారు పొటాషియాన్ని తీసుకోకూడదని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
సూపర్ మార్కెట్లలో ఏం అమ్ముతున్నారు?
మనం రోజూ తీసుకునే ఉప్పులో 100 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుందని నేషనల్ మెడిసిన్ లైబ్రరీ పేర్కొంది.
సోడియం క్లోరైడ్ మోతాదును తగ్గించి, దానికి ప్రత్యామ్నాయంగా పొటాషియం క్లోరైడ్‌ను వాడితే దాన్ని 'లో సోడియం సాల్ట్స్' అని పిలుస్తారు.
చెన్నై నగరంలోని 52 శాతం సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లలో 'లో సోడియం సాల్ట్స్' అందుబాటులో ఉన్నాయని, స్థానిక కిరాణా దుకాణాల్లో వీటి లభ్యత కేవలం 4 శాతమేనని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ ట్వీట్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆహారంలో ఉప్పును తగ్గించాలని ఎన్నో ఏళ్లుగా సూచిస్తున్న వారిలో ఎంఐఓటీ హాస్పిటల్స్‌కు చెందిన నెఫ్రాలజిస్టు రాజన్ రవిచంద్రన్ ఒకరు.
''50 శాతం సూపర్ మార్కెట్లు, 'లో సోడియం ఉప్పు'ను అమ్ముతాయి. బ్లాక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్, సైంధవ లవణం, రాక్ సాల్ట్, ఇందుప్పు అనే ఉప్పు రకాల్లో నిజానికి 90 నుంచి 95 శాతం సోడియం ఉంటుంది. అదనంగా మెగ్నీషియం, కాల్షియం కూడా ఉంటాయి. లో సోడియం సాల్ట్ సబ్‌స్టిట్యూట్స్‌లో 20 నుంచి 40 శాతం పొటాషియం క్లోరైడ్ ఉంటుంది. ఒకవేళ పొటాషియం ఎక్కువైతే రుచిలో తేడా వస్తుంది'' అని రాజన్ రవిచంద్రన్‌ను ఉటంకిస్తూ వార్తా పత్రిక 'ది హిందూ' పేర్కొంది.
హిమాచల్ ప్రదేశ్‌లో ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ చేసిన అధ్యయనంలోనూ ఇలాంటి ఫలితాలే వెల్లడయ్యాయి.
రోజూ మనం తీసుకునే ఉప్పు కంటే రాక్‌సాల్ట్‌తో అధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిరూపించే శాస్త్రీయ ఆధారాలేవీ లేవని అధ్యయనం తేల్చింది.
అయోడిన్ ఉప్పు, రాక్ సాల్ట్ ఈ రెండింటిలోనూ దాదాపు 98 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుందని తేల్చారు. రాక్‌సాల్ట్‌లో మిగతా 2 శాతంలో ఇతర ఖనిజాలు ఉంటాయని నిరూపితమైంది. బీపీ నియంత్రణలో రాక్ సాల్ట్ పాత్రేమీ ఉండదని అధ్యయన ఫలితాలు సూచించాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













