ఆంధ్రప్రదేశ్‌లో మేఘాలు ముక్కలై నేలపై రాలుతున్నాయా?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఎత్తైన పర్వత శ్రేణులను మేఘాలు తాకుతుండడం చూస్తుంటాం. కానీ ఇటీవల ‘ఆంధ్రప్రదేశ్‌లో మేఘాలు నేలపై వాలాయి’.. ‘శ్రీకాకుళంలో నేలకు దిగొచ్చిన మేఘం’ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ అయ్యాయి.
రాష్ట్రంలో చాలా చోట్ల రెండు రోజులుగా వాతావరణం మేఘావృతమై ఉంది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
సరిగ్గా ఇదే సమయంలో మేఘాలు నేలపై రాలిపడ్డాయని వైరల్ అవుతోన్న వీడియోలను చూసి కొందరు నిజమని, మరికొందరు ఫేక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియో ఎప్పటిదనేది తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌లో చెక్ చేసినప్పుడు 2024 నుంచి ఇదే వీడియో వేర్వేరు యూట్యూబ్ అకౌంట్లు, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి షేర్ అయినట్లు తేలింది.
కాబట్టి ఇది తాజా వీడియో అయితే కాదని ‘బీబీసీ’ పరిశీలనలో వెల్లడైంది.
అయితే, ఇది అసలైన వీడియోనా? ఏఐ జనరేటెడ్ వీడియోనా?, కంప్యూటర్ గ్రాఫిక్సా? అనేది బీబీసీ స్వయంగా ధ్రువీకరించలేదు.
అంతేకాదు, ఏ ప్రాంతానికి చెందినదనేది కూడా ‘బీబీసీ’ స్వయంగా ధ్రువీకరించలేదు.
అయితే.. మేఘాలు నేలపై వాలే అవకాశం ఉందా? ఇది మేఘం అయ్యుంటుందా కాదా అనేది తెలుసుకోవడానికి బీబీసీ వాతావరణ నిపుణులు, రసాయన పరీక్షలు చేసే కెమిస్టులతో మాట్లాడింది.


ఫొటో సోర్స్, facebook.com/watch/screengrab
నిజంగా ఇవి మేఘాలేనా?
ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ వీడియోలో బియ్యం బస్తా సైజులో ఒక తెల్లని మేఘంలా పాల నురగ మాదిరి కనిపిస్తోంది.
ఇది చూసేందుకు మేఘంలో నుంచి ఒక ముక్క రాలిపడినట్లుగా ఉంది.
దీనిని కొందరు వ్యక్తులు తాకుతూ ఉన్నట్లు, చూస్తున్నట్లు ఆ వీడియోలలో ఉంది.
సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోలపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు మేఘాలేనంటూ ఆశ్చర్యపోతుండగా మరికొందరు కెమికల్ ఫాగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
దీనిపై విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ కుమార్, అలాగే ఏయూ వాతావరణ విభాగం ప్రొఫెసర్ రామకృష్ణతో బీబీసీ మాట్లాడింది.
''మేఘం అనేది గాలిలో తేలే నీటి బిందువుల సమాహారం. అవి గాలిలోనే ఉండేలా తక్కువ సాంద్రతతో ఉంటాయి. కానీ వీడియోలలో కనిపిస్తున్న వాటిలో నేలపై పడ్డ తెల్లని దూది పింజలా కనిపిస్తున్నాయి. ఇవి మేఘాలు కావడానికి అవకాశమే లేదు. వాస్తవానికి ఇవి మేఘాల్లా కనిపించే రసాయన నురగలా అనిపిస్తోంది'' అని విశాఖలోని సైక్లోన్ వార్నింగ్ సెంటర్ డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ కుమార్ చెప్పారు.
"నేలపైకి ఏ మేఘం రాదు. నేలకు 200 నుంచి 300 మీటర్ల దూరానికి చేరినప్పుడు అవి నీటి బిందువులుగా మారిపోయి వర్షంలా కురుస్తాయి. లేదంటే మంచుగా మారుతాయి" అని ఆయన చెప్పారు.

మరి ఇవి మేఘాలా, పొగమంచా?
మన చుట్టూ ఉండే గాలిలో నీటి ఆవిరి ఉంటుంది.
ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఆ నీటి ఆవిరితో ఉన్న గాలి పరిమాణువుల బరువు తగ్గి అంటే తేలికై పైకి వెళుతుంది.
ఆ క్రమంలో దానిలో నిల్వ ఉన్న నీరు క్రమంగా ఘన స్థితిలోకి మారుతుంది.
అవే మనకి నీటి బిందువులు లేదా క్రిస్టల్స్ ఆకారంలో కనిపిస్తాయి.
ఇలాంటి బిందువులు అనేకం ఒకదానికొకటి కలిసి మేఘాలు ఏర్పడతాయి.
"మేఘాలు భూమి పైన ఉన్న గాలి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి. అందుకే అవి దూది పింజల్లా తేలుతూ మనకి కనిపిస్తాయి. వీడియోలలో మేఘంలా ఉన్నది నురగలా కనిపిస్తోంది. ఇవి మబ్బులుకాదు, అలాగని పొగమంచు కూడా కాదు. మేఘంలా కనిపించే నురగ ఇది. అంటే గాలిలో ఎగురుతూ ఉన్న నీటి బిందువులతో తయారైన ఒక మృదువైన పదార్థంగా చెప్పవచ్చు" అని జగన్నాథ కుమార్ చెప్పారు.
"మేఘాలు, పొగమంచు వేర్వేరు. పొగమంచు అనేది భూమి ఉపరితలంపై ఏర్పడే మేఘంలా భావిస్తారు. కానీ ఇది సాధారణంగా చలికాలంలో, ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది. విశాఖపట్నంలోని సింహాచలం కొండ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగి, సీత కొండ, వంజంగి వంటి ప్రాంతాల్లో ఏర్పడే పొగమంచు ఇదే. ఇక్కడికే టూరిస్టులు పాలసముద్రాలంటూ సీజన్‌లో పరుగులు పెడుతుంటారు." అని ఏయూ వాతావరణ విభాగం ప్రొఫెసర్ రామకృష్ణ బీబీసీతో చెప్పారు.
శీతాకాలంలో తిరుపతి, సింహాచలం వంటి కొండలపై, అలాగే ఆ కొండలపై ఉండే దట్టమైన అటవీ ప్రాంతాల మధ్య ఉండే కొండల మధ్య ఈ తరహా పొగమంచుతో కూడిన మేఘాలు ఏర్పడతాయి.
అక్కడ ఏర్పడే పొగమంచు ప్రకృతి సహజంగా ఏర్పడినదే కానీ రసాయనాల వలన కాదని ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు.

ఫొటో సోర్స్, facebook.com/watch/screengrab
మరైతే...ఇవి ఏమిటి?
వీడియోలలో కనిపిస్తున్న మేఘల్లాంటి పదార్థాలేంటనే అంశంపై పరిశ్రమల కాలుష్య నియంత్రణ పరీక్షలు, పరిశోధనలు చేసే సంస్థలో పనిచేస్తున్న బుద్దా రవి ప్రసాద్ తో బీబీసీ మాట్లాడింది.
''ఇవి పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలలో ఉన్న డిటర్జెంట్లు, కెమికల్స్ వంటివి గాలితో కలిసినప్పుడు ఏర్పడే ఇండస్ట్రియల్ ఫోమ్. అంటే రసాయనాల నురగ అని చెప్పవచ్చు. పారిశ్రామిక వాడలున్న చోట ఇలాంటివి కనిపిస్తాయి" అని రవి ప్రసాద్ అన్నారు.
ఇవి తెల్లగా మెరిసే నురగతో తయారైన బుడగల సమాహారం.
"గాలి వీచే దిశలో ప్రయాణించి పొలాల్లోనూ, సమీప గ్రామాల్లోనూ తేలితూ....కొన్ని చోట్ల నేలపై పడిపోతాయి. వాటినే ప్రజలు మేఘాలు అనుకుంటారని రవిప్రసాద్ చెప్పారు.
ఆయన 27 ఏళ్లుగా పరిశ్రమల కాలుష్య నిర్థరణ పరీక్షలు చేసే కెమిస్ట్‌గా పని చేస్తున్నారు.
"పరిశ్రమల్లో వాడే అయిల్స్, ఇతర రసాయనాలు, డిటర్జెంట్లు వివిధ దశల తర్వాత వ్యర్థాలుగా మారతాయి. ఆ వ్యర్థాలను శుధ్ది చేసేందుకు ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ ఉంటాయి. ఈ ప్లాంట్లలో శుద్ధి చేసేటప్పుడు వాటిలో ఉండే సబ్బు, డిటర్జెంట్, కెమికల్స్‌ను వేరు చేసేందుకు ఏరియేషన్ (గాలిని నీటిలోకి పంపడం) చేస్తారు. ఆ ప్రక్రియలో గాలితో కలిసి బుడగలు ఏర్పడతాయి. ఆ బుడగలు ఒకదానితో ఒకటి కలిసి పెద్ద పెద్ద మేఘాలను తలపించే విదంగా మారతాయి. ఇవి చాలా తేలికగా ఉండటంతో కాస్త గాలి వీచినప్పుడు...ఆ పరిశ్రమలు ఉండే చుట్టూ పక్కల ప్రాంతాల వైపు ఎగురుతూ ఉంటాయి.
ఇప్పుడు మనకు వీడియోలలో కనిపిస్తున్నవి అవే. శ్రీకాకుళం, విశాఖపట్నంలలో పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ ఉంటాయి. అక్కడ నుంచి ఈ నురగ పదార్థాలు ఎగిరి పడి ఉండే అవకాశం ఉంది.
కచ్చితంగా చెప్పాలంటే...ఇవి పరిశ్రమల వ్యర్థాలను శుధ్ది చేసే క్రమంలో ఏర్పడిన నురగ.

ఫొటో సోర్స్, facebook.com/watch/screengrab
ఇవి ప్రమాదకరమా? ఏమి చేయాలి?
‘ఈ నురగ ముద్దల్లో కొన్ని రసాయనాల మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది.
పరిశ్రమల వ్యర్థాల వలన ఏర్పడే నురగ గాల్లోకి ఎగిరినప్పుడు మేఘాల్లా కనిపించడం సాధారణమే.
వీటిని తాకడం, వీటి సమీపంలో ఉండటం చేయకూడదు.
ఈ నురగ మన శరీరాన్ని తాకినా లేదా మనం దాని దగ్గరకు వెళ్లినా సమస్యలు ఏర్పడవచ్చు.
ఆ నురగ వల్ల చర్మంపై అలర్జీలు రావొచ్చు.
వీటి సమీపంలో ఎక్కువ సేపు ఉంటే శ్వాసకోశ సమస్యలు వస్తాయి.
నీటిలో పడితే...ఆ నీటిలో ఆక్సిజన్ తగ్గుతుంది.
చేపల చెరువుల్లో పడితే...వాటికి హాని జరిగే అవకాశం ఉంది’ అని కెమిస్ట్ రవి ప్రసాద్ చెప్పారు.
"కచ్చితంగా ఇది వాతావరణ అద్భుతమైతే కాదు. కాలుష్యం కారణంగా ఏర్పడిన నురగ.
సోషల్ మీడియాలో మేఘాలంటూ హల్‌చల్ చేస్తున వీడియోలను చూసినప్పుడు ఇది అర్థమవుతోంది" రవి ప్రసాద్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














