సముద్రంలో తప్పిపోయిన నావికులు, తాటాకులతో ‘హెల్ప్’ అనే సందేశం, ఆ తర్వాత ఏమైందంటే..

ఫొటో సోర్స్, UNITED STATES COAST GUARD
- రచయిత, నడిన్ యూసుఫ్
- హోదా, బీబీసీ న్యూస్
తాటి ఆకులతో బీచ్ ఇసుకలో ‘‘హెల్ప్’’ అని రాసి, సహాయం కోసం ఎదురుచూసిన ముగ్గురు వ్యక్తులను అమెరికా కోస్ట్ గార్డ్ రక్షించింది. మైక్రోనేసియా ద్వీపంలో ఈ ఘటన జరిగింది.
ఒక పడవలో పికెలాట్ ద్వీపానికి బయల్దేరిన తొమ్మిది రోజుల తర్వాత వారిని గుర్తించారు.
మైక్రోనేసియాలోని గ్వామ్ భూభాగానికి 667 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనావాసాలు లేని పగడాల ప్రాంతం పికెలాట్ దీవి.
గత నాలుగేళ్లలో ఇక్కడ తప్పిపోయిన వారిని కాపాడటం ఇది రెండోసారి.
మైక్రోనేసియాలోని పోలోవాట్ అటోల్ ద్వీపం నుంచి వారు బోట్ ట్రిప్‌ను మొదలుపెట్టారు.
ఈస్టర్ ఆదివారం రోజున ముగ్గురు ఒక సంప్రదాయక తెరచాప పడవలో బయల్దేరారు. చాలా రోజులైనప్పటికీ తిరిగి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు, గ్వామ్ కోస్ట్‌గార్డ్ సాయం అడిగారు. దీంతో వారిని వెతకడం మొదలుపెట్టారు.
ఆ ముగ్గురు సెయిలర్లు (నావికులు) అనుభవజ్ఞులేనని కోస్ట్‌గార్డ్ వెల్లడించింది.
ఎలా దొరికారంటే..
సహాయక సిబ్బంది మొదట ప్రతికూల వాతారణ పరిస్థితులు ఉన్నప్పటికీ వారికోసం 78,000 చదరపు నాటికల్ మైళ్ల దూరం గాలించారు.
అయితే, గగనతలంలో వెళ్లి గాలిస్తుండగా వారి ఆచూకీ దొరికొంది. తీరంలోని ఇసుకలో ‘హెల్ప్’ అని వారు రాసిన సందేశం సహాయంతో వారి ఆచూకీని గుర్తించగలిగారు.
‘‘తమను గుర్తించాలనే ఉద్దేశంతో వారు ఇసుకలో తాటి ఆకులతో హెల్ప్ అనే అక్షరాలను రాశారు. ఇదే వారిని కనుగొనడంలో కీలకంగా మారింది’’ అని ఈ మిషన్‌కు నాయకత్వం వహించిన లెఫ్టినెంట్ చెల్సియా గార్సియా చెప్పారు.
తర్వాత, కోస్ట్ గార్డ్ సిబ్బంది వారికోసం ఒక రేడియోతో పాటు ప్రాథమిక అవసరాలను తీర్చే సామగ్రిని గాలి నుంచి జారవిడిచారు.
తాము ఆరోగ్యంగానే ఉన్నామని, ఆహారం-నీరు అందుబాటులో ఉన్నాయని రేడియో ద్వారా నావికులు తిరిగి సందేశమిచ్చారు.
ఏప్రిల్ 9న వారిని కోస్ట్‌గార్డ్ సిబ్బంది కాపాడారు.
వెస్ట్రన్ పసిఫిక్‌లోని మైక్రోనేసియా దాదాపు 600 చిన్న చిన్న ద్వీపాలతో కూడిన ప్రాంతం. ఈ ద్వీపాలు సముద్రమంతటా వెదజల్లినట్లు ఉంటాయి.
పికెలాట్ అటోల్‌లో జనావాసాలు లేనప్పటికీ వేటగాళ్లు, జాలరులు తరచుగా అక్కడికి వెళ్తుంటారు.
2020లో ముగ్గురు మైక్రోనేసియా నావికులను ఆస్ట్రేలియా సైనికులు కాపాడారు. ఈ నావికులు బీచ్‌లో ‘ఎస్‌ఓఎస్’ అనే అక్షరాలు రాయడంతో వారిని గుర్తించగలిగారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
ఇవి కూడా చదవండి:
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
- భారత్ ఉల్లిగడ్డలతో దౌత్యం నెరుపుతోందా?
- వారణాసిలో మోదీ మీద పోటీ చేస్తున్న అజయ్ రాయ్ ఎవరు... ఆర్ఎస్ఎస్-బీజేపీ చరిత్ర ఉన్న ఈ నాయకుడినే కాంగ్రెస్ ఎందుకు ఎంపిక చేసింది?
- గణిత ప్రపంచాన్ని మలుపు తిప్పిన సున్నాను భారతీయులు ఎలా కనిపెట్టారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














