తిరువనంతపురంలో బ్రిటిష్ యుద్ధవిమానం ఎందుకు దిగింది, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్రిటిష్ ఫైటర్ జెట్ ఒకటి 13 రోజులుగా కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోనే చిక్కుకుపోయింది.
విమానాశ్రయంలో నిలిపి ఉంచిన ఎఫ్-35బీ ఫైటర్ జెట్‌ను మరమ్మతుల కోసం వైమానిక స్థావరానికి తరలిస్తామని బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిటిషు ఇంజనీర్ల బృందం తిరువనంతపురం చేరుకున్న తర్వాత మరమ్మతులు ప్రారంభమవుతాయని తెలిపింది.
హెచ్‌ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యుద్ధనౌకకు చెందిన ఈ ఫైటర్ జెట్ జూన్ 14న తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ఫైటర్ జెట్ రాయల్ నేవీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌కు తిరిగి వెళ్లలేకపోయింది.

అధికారులు ఏమన్నారు?
"విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన తరువాత అందులో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి టేకాఫ్ తీసుకునే పరిస్థితి లేకపోయింది " అని బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి బీబీసీతో చెప్పారు.
"హెచ్‌ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యుద్ధనౌకకు చెందిన ఇంజనీర్లు విమానాన్ని పరిశీలించారు. యూకేలోని ఇంజనీరింగ్ బృందం సహాయం అవసరమని వారు నిర్ణయించారు. విమానం మరమ్మతుకు ఎంత సమయం పడుతుందో ప్రస్తుతానికి చెప్పలేం" అని అన్నారు.
"బ్రిటిష్ ఇంజనీరింగ్ బృందం, ప్రత్యేక పరికరాలు వచ్చాక, విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం లేకుండా జెట్‌ను వైమానిక స్థావరానికి తీసుకెళ్తాం" అని బ్రిటిష్ ప్రతినిధి తెలిపారు.

ఫొటో సోర్స్, PA Media
‘‘నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’’
ఒకవేళ ఫైటర్ జెట్‌ను మరమ్మతుల కోసం హ్యాంగర్‌కు తీసుకెళ్లాలని బ్రిటిష్ ఇంజనీరింగ్ బృందం నిర్ణయించుకుంటే, విమానాశ్రయంలోనే ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ స్థావరానికి తీసుకువెళతారు .
"మరమ్మతుల కోసం ఒక స్థలాన్ని అన్వేషిస్తున్నారు. బ్రిటన్ ఇంజనీరింగ్ బృందానికి విమానాశ్రయంలోనే వసతి కల్పిస్తారు" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక విమానాశ్రయ అధికారి బీబీసీకి తెలిపారు.
"ఈ ఫైటర్ జెట్ విషయంపై భారత ఎయిర్‌ఫోర్స్, నేవీ, తిరువనంతపురం విమానాశ్రయం సహా పలు సంస్థల భారత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. వారి సహకారానికి మేం కృతజ్ఞులం" అని బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
" ఫైటర్ జెట్ సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి భారత్ సాయపడటం, రక్షణ కల్పించడంతో పాటు ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో అందించిన సహకారం బ్రిటిష్, భారత సాయుధ దళాల మధ్య లోతైన సంబంధాన్ని చూపుతున్నాయి" అని పేర్కొంది.
ఫీజు చెల్లించాల్సిందే..
విమానాశ్రయంలో విమానాన్ని పార్క్ చేసినా లేదా మరమ్మతుల కోసం హ్యాంగర్‌కు తీసుకువచ్చినా యూకే రక్షణ మంత్రిత్వ శాఖ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
విమాన పార్కింగ్, వైమానిక స్థావర వినియోగ ఫీజులు సాధారణంగా విమానం పరిమాణం, ఏ ప్రాంతంలో విమానాశ్రయం ఉందనే అంశాల ఆధారంగా ఉంటాయి.
ఉదాహరణకు, ముంబయి లేదా బెంగళూరులోని హ్యాంగర్‌లో విమానాన్ని పార్క్ చేయడానికి లేదా మరమ్మతు చేయడానికి విధించే ఛార్జీలు తిరువనంతపురం వంటి విమానాశ్రయంలో కంటే ఎక్కువగా ఉంటాయి.
ల్యాండింగ్, పార్కింగ్ నియమాలను భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
సైనిక శిక్షణ కోసం బయలుదేరి..
రూ. 35 వేల కోట్లకు పైగా విలువైన రాయల్ నేవీకి చెందిన హెచ్‌ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యుద్ధ నౌక 2025 ఏప్రిల్ చివరి వారంలో సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. పలు దేశాలలో సైనిక శిక్షణలో పాల్గొనడానికి ఇది యూకేలోని పోర్ట్స్‌మౌత్ నుంచి బయలుదేరింది.
ఈ విమాన వాహక నౌక జపాన్, ఆస్ట్రేలియా, మధ్యధరా సముద్రం, మిడిల్ ఈస్ట్, ఆగ్నేయాసియాలోని 40కి పైగా దేశాలలో ప్రయాణిస్తుంది. ఈ యుద్ధనౌకలో 24 ఆధునిక ఎఫ్-35బీ స్టెల్త్ జెట్‌లు ఉన్నాయి.
సుమారు 65,000 టన్నుల బరువున్న ఈ విమాన వాహక నౌకలో 1,600 మంది సైనికులు ఉండవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ ఎఫ్-35బీ జెట్?
రాయల్ ఎయిర్ ఫోర్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఎఫ్-35బీ అనేది బహుళ పాత్ర పోషించే జెట్. ఇది గగనతలంలో, నేలపై కూడా పోరాడగలదు.
ఈ జెట్ నిఘా సమాచారాన్ని సేకరించగలదు. గగనతలం నుంచి భూమికి, గగనతలం నుంచి గగనతలానికి పోరాడగలదు. ఒకే సమయంలో వేర్వేరు మిషన్లను నిర్వహించగలదు.
క్లిష్ట పరిస్థితుల్లో కూడా పనిచేయడానికి సహాయపడే అధునాతన సెన్సార్లను ఎఫ్-35బీ కలిగి ఉంది. పైలట్ సేకరించిన సమాచారాన్ని సురక్షితమైన డేటా లింక్‌ని ఉపయోగించి ఇతర బృందాలతో కూడా పంచుకోవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














