Black Box: విమాన ప్రమాదం జరిగితే దీని కోసం ఎందుకు వెతుకుతారు, ఇందులో ఏముంటుంది?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, లూసీ క్లార్క్ బిల్లింగ్స్
- హోదా, బీబీసీ న్యూస్
అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగిన ప్రదేశంలో బ్లాక్ బాక్స్ లభ్యమైందని భారత విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం తెలిపారు.
ప్రమాదం జరిగిన 28 గంటల్లోపే ఫ్లైట్ డాటా రికార్డర్ అయిన బ్లాక్ బాక్స్‌ను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) గుర్తించిందని ఆయన ధ్రువీకరించారు.
''ఎయిరిండియా ప్రమాద ఘటనపై దర్యాప్తు, విచారణకు సంబంధించి బ్లాక్ బాక్స్ లభ్యం కావడం ఒక ముందడుగు'' అని రామ్మోహన్ నాయుడు అన్నారు.

సాధారణంగా విమానాల్లో బ్లాక్ బాక్స్‌లు రెండు ఉంటాయి. ఇవి విమానంలోని డేటాను రికార్డు చేస్తాయి.
ఇందులో ఒకటి ఆల్టిట్యూడ్, స్పీడ్ వంటి డేటాను రికార్డు చేస్తుంది. మరొకటి కాక్‌పిట్‌లో శబ్దాలను రికార్డు చేస్తుంది. కాబట్టి కాక్‌పిట్‌లో పైలట్ల సంభాషణలు, అసాధారణ ధ్వనులను ఈ బ్లాక్ బాక్స్ ద్వారా దర్యాప్తు అధికారులు వినగలుగుతారు.
విమానం క్రాష్ కావడానికి గల కారణాలను ఏఏఐబీ దర్యాప్తు చేస్తోంది. అమెరికా, యూకే బృందాలు ఈ దర్యాప్తులో ఏఏఐబీకి సహాయం అందిస్తున్నాయి.
దర్యాప్తునకు తమ కంపెనీ పూర్తిగా సహకరిస్తోందని బోయింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెల్లీ ఓర్ట్‌బెర్గ్ చెప్పారు.
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:39 గంటలకు టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ప్రమాదానికి గురైన ఈ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడా వ్యక్తి ఉన్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.
షెడ్యూల్ ప్రకారం ఏఐ171 విమానం, లండన్‌లో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:25 గంటలకు (భారత కాలమానం రాత్రి గం.10:55) ల్యాండ్ అవ్వాలి.

ఫొటో సోర్స్, AFP via Getty Images
శుక్రవారం నాటికి కూడా ప్రమాదం జరిగిన ప్రదేశంలో విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కాలిపోయిన విమానం రెక్క, భవనంలో ఇరుక్కుపోయిన విమాన భాగాలు అక్కడ కనిపిస్తున్నాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు అధికారులు, జన సమూహాలను విమాన శిథిలాల నుంచి దూరంగా పంపించారు.
కుటుంబసభ్యుల డీఎన్‌ఏ ఆధారంగా బాధితులను గుర్తిస్తున్నామని డాక్టర్ ఒకరు బీబీసీతో అన్నారు.
ముఖాలను చూసి బంధువులు గుర్తు పట్టడంతో ఆరుగురు వ్యక్తుల అవశేషాలను (మృతదేహాలను) ఆయా కుటుంబాలను అందజేశామని పోస్ట్‌మార్టం గది దగ్గర ఉండే ఒక పోలీస్ అధికారి బీబీసీకి చెప్పారు.
ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బ్రిటిష్ పౌరుడు రమేశ్ విశ్వాస్‌కుమార్, ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.
‘‘ప్రాణాలతో ఎలా బయటపడ్డానో ఇంకా నమ్మలేకపోతున్నా'' అని గురువారం డీడీ న్యూస్‌తో ఆయన అన్నారు.
''మొదట నేను చనిపోతాననే అనుకున్నా. ఎలాగోలా కళ్లు తెరిచి, సీట్ బెల్ట్‌ను తీసేశాను. తర్వాత విమానం నుంచి బయటపడేందుకు ప్రయత్నించా'' అని ఆయన వివరించారు.
విశ్వాస్‌కుమార్ వయస్సు 40 ఏళ్లు. ఆయన ఎడమ చేతికి కాలిన గాయాలయ్యాయి. తన కళ్ల ముందే విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు చనిపోయారని ఆయన చెప్పారు.
ఇప్పటికీ తమ ఆప్తులకు సంబంధించిన సమాచారం కోసం ఆయా కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి.
తన సోదరుడి మృతదేహాన్ని కళ్లతో చూసేవరకు అతను చనిపోయినట్లుగా భావించనని ఇంతియాజ్ అలీ అన్నారు. ఇంతియాజ్ అలీ సోదరుడు జావేద్, తన కుటుంబంతో కలిసి ఈ విమానంలోనే లండన్‌కు బయల్దేరారు.
''నేను ఏడ్వటం మొదలుపెడితే నన్ను నేను నియంత్రించుకోలేను. ఆ స్థితిలో నన్ను ఎవరూ ఓదార్చలేరు. నా గుండె బద్ధలైపోవచ్చు'' అని ఆయన ఉద్వేగంగా అన్నారు.

ఫొటో సోర్స్, PA Media
ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని మేఘణి నగర్ అనే నివాస ప్రాంతంలో విమానం కూలిపోయింది. అది అప్పుడే టేకాఫ్ అయినప్పటికీ, ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రెస్పాన్సివ్ టీమ్‌లు వెల్లడించిన వివరాల ప్రకారం, 200 మీటర్ల మేర విమాన శిథిలాలు పడ్డాయి.
విమానంలోని ప్రయాణికులు కాకుండా, విమాన పేలుడు కారణంగా ఇంకా ఎంత మంది చనిపోయారన్నది స్పష్టంగా తెలియదు. కానీ, 8 మందికి పైగా చనిపోయినట్లు బీబీసీకి సమాచారం అందింది.
క్యాంపస్‌లోని భవనాల్లోకి విమానం చొచ్చుకురావడంతో నలుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారని బీజే మెడికల్ కాలేజ్ అండ్ సివిల్ హాస్పిటల్ డీన్, డాక్టర్ మీనాక్షి పరీఖ్ వెల్లడించారు.
''విమానం క్రాష్ అయినప్పుడు క్యాంపస్‌లో డాక్టర్ల బంధువులు నలుగురు ఉన్నారు. వారు కూడా చనిపోయారు. బాధితుల గుర్తింపు కోసం మేం కేవలం డీఎన్‌ఏపైనే ఆధారపడుతున్నాం. ఈ పని హడావుడిగా అయ్యేది కాదు. పొరపాట్లు జరుగకుండా మేం చాలా జాగ్రత్తగా పని చేస్తున్నాం. బాధితుల బంధువులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని కాస్త ఓపికగా ఉండాలి. వీలైనంత త్వరగా మేం (మృతదేహాలను) అప్పగిస్తాం'' అని ఆమె తెలిపారు.
శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఘటనా స్థలాన్ని దాదాపు 20 నిమిషాల పాటు పరిశీలించారు.
ఆ సమయంలో విలేఖరులతో ఆయన మాట్లాడలేదు. కానీ, యూట్యూబ్‌లో పోస్టు అయిన ఒక వీడియోలో ఆయన ఘటనా స్థలంలో నడుస్తుండటం, శిథిలాలను పరిశీలిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
భవనంలో విమానం తోక భాగం ఇరుక్కున్న ప్రదేశానికి కూడా ఆయన వెళ్లారు. భవనంపై విమాన వెనక భాగం ఇరుక్కున్న ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది.

ఫొటో సోర్స్, EPA-EFE/Shutterstock
అంతకుముందు ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ కూడా విమానం క్రాష్ అయిన ప్రదేశానికి వెళ్లారు. ఆ ప్రదేశం చాలా హృదయ విదారకంగా ఉందని ఆయన అన్నారు.
క్రాష్ అయిన ఎయిరిండియా విమానం 11 ఏళ్ల నాటిది. ఇది ముంబయి, దుబయ్‌ల మధ్య ఎక్కువగా తిరుగుతుంది. అలాగే న్యూదిల్లీ నుంచి మిలన్, పారిస్, ఆమ్‌స్టర్‌డ్యామ్ వంటి యూరప్ దేశాలలోని నగరాలకు ప్రయాణిస్తుంది.
గత రెండేళ్లలో ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్‌కు 25 సార్లు తిరిగింది.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎయిరిండియా బోయింగ్ 787-8, 787-9 ఫ్లీట్‌లోని విమానాల్లో అదనపు భద్రతా తనిఖీలు నిర్వహించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














