ఈ నగరానికి ఏమైంది?: అవార్డులు రాని ఈ సినిమాను 'కల్ట్ మూవీ’ అని ఎందుకు అంటున్నారు?

ఫొటో సోర్స్, https://www.instagram.com/sureshproductions/
- రచయిత, భాను ప్రకాశ్ కర్నాటి
- హోదా, బీబీసీ ప్రతినిధి
"అప్పులోళ్ల లెక్క ఎక్కడికి పోయినా ఒకటే ప్రశ్న ఈ నగరానికి ఏమైంది 2 ఎప్పుడు అని?" అంటూ ఈ నగరానికి ఏమైంది చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
29 జూన్ 2018లో ఈ మూవీ రిలీజైంది. ఇవాళ్టితో ఏడేళ్లు.
ఆ మూవీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నట్లుగా సీక్వెల్‌కు సంబంధించి 'ఈఎన్‌ఈ రిపీట్' టైటిల్‌తో అనౌన్స్‌మెంట్ వచ్చింది.
ఈ నగరానికి ఏమైంది? మూవీని యూత్ 'కల్ట్ మూవీ'గా చెబుతుంటారు. వారి సోషల్ భాషలో మీమ్స్, జిఫ్‌ల సహా ఆ మూవీలోని చాలా సీన్స్, డైలాగ్‌లతో మాట్లాడుకుంటూనే ఉంటారు.
"నేను చూసిన వాటిల్లో బాగా ఓన్ చేసుకున్న సినిమా ఈ నగరానికి ఏమైంది? కల్ట్ సినిమా అనే చెబుతాను. కౌశిక్ పాత్రలో నన్ను నేను చూసుకుంటున్నట్లు అనిపిస్తుంది. కామెడీగానే కనిపించినా లైఫ్‌కి సంబంధిచిన మెసేజ్ ఉంది అందులో" అని బీబీసీతో చెప్పారు బెంగళూరులో ఉంటున్న జయప్రకాశ్.
"బీ టెక్ ఫైనల్ ఇయర్‌లో గ్యాంగ్‌తో కలిసి చూశాం. అప్పటి నుంచి సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నా, ఎప్పుడెప్పుడా అని. రీరిలీజ్‌తోనే సరిపెట్టుకున్నాం" అని విజయవాడకు చెందిన ఉమా మహేశ్ చెప్పారు.
అటు సోషల్ మీడియాలోనూ 'కల్ట్ మూవీ' అంటూ ఈ సినిమాకు సంబంధించి పోస్టులు కనిపిస్తూనే ఉంటాయి.
నిజానికి, ఈ చిత్రానికి అవార్డులేమీ రాలేదు. అయినా 'కల్ట్ మూవీ’ అని ఎందుకు అంటున్నారు?


ఫొటో సోర్స్, https://www.instagram.com/sureshproductions/
బడ్డీ కామెడీ జానర్‌గా..
దర్శకుడిగా తన తొలి చిత్రం 'పెళ్లిచూపులు'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్. 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ‘పెళ్లి చూపులు’ సినిమా జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. స్క్రీన్ ప్లే (డైలాగ్స్)కు ఆయనకు మరో అవార్డు వచ్చింది.
తన రెండో సినిమాకు బడ్డీ కామెడీ జానర్‌ను ఎంచుకుని ఈ నగరానికి ఏమైంది? కథను రాసుకున్నారు.
రెండు కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 12 కోట్ల వసూళ్లు సాధించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్‌ల మేనియా మొదలైప్పుడు 2023లో ఈ సినిమాను కూడా రీ రిలీజ్ చేశారు. తొలిరోజే 1.8 కోట్ల కలెక్షన్లు సాధించింది అని సురేష్ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. దీన్ని బట్టే మూవీకి ఉన్న క్రేజ్ కూడా అర్థమవుతోంది.

ఫొటో సోర్స్, https://www.instagram.com/p/CuECeIhRL_-/
సినిమా కథేంటి?
సింపుల్‌గా చెప్పాలంటే ఇది వివేక్, కార్తీక్, కౌశిక్, ఉప్పి అనే నలుగురు స్నేహితుల కథ. కాలేజీ రోజుల్లో షార్ట్ ఫిల్మ్‌ల వైపు ఆసక్తి చూపించి ప్రయత్నాలు మొదలు పెడతారు. ఆ తరువాతి పరిస్థితులు వారిని ఎలా మార్చాయి? మళ్లీ కార్తీక్ ఎంగేజ్‌మెంట్ పార్టీకి కలిసిన ఆ నలుగురూ గోవాకు ఎందుకు వెళతారు? వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? అనేదే కథ. ప్రేమ, బ్రేకప్, ఫ్రెండ్‌షిప్, కెరీర్‌ల వెంట సాగే జీవితాల గురించి చెప్పే కథ. అలాగని సీరియస్‌గా కూడా ఏముండదు. నాటకీయత కనిపించదు. సంభాషణలు కూడా ఆర్టిఫీషియల్‌గా అనిపించవు.
విశ్వక్‌సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకమాను, సిమ్రన్ చౌదరి లీడ్‌రోల్స్‌లో కనిపిస్తారు.
డి.సురేశ్ బాబు ఈ సినిమాకు నిర్మాత. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

ఫొటో సోర్స్, https://www.instagram.com/p/CuBngbfxxkv/
సినిమాను 'కల్ట్ మూవీ’ అనడం సరైనదేనా?
కల్ట్ మూవీగా చాలామంది ఈ మూవీని చెబుతుండటంపై బీబీసీ సినీ విశ్లేషకులతో మాట్లాడింది.
"ఈ సినిమాను కల్ట్ అని చెప్పడం సరికాదు. అలా అనలేం'' అన్నారు సినీ విశ్లేషకులు అన్వర్.
"నిజానికి, రిలీజ్ రోజున మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుందంటే, కొందరు బాలేదన్నారు. కానీ, ఆ తర్వాత అందరూ కనెక్ట్ అయ్యారు. డైరెక్టర్ నలుగురు స్నేహితుల మధ్య కెమెరా పెట్టి వదిలేసినట్టు ఉంటుందే తప్ప, డ్రమటిక్‌గా అనిపించదు'' అని అన్వర్ అన్నారు.
యూత్ అందులోని క్యారెక్టర్లను రిలేట్ చేసుకోవడం వల్లే సినిమా వాళ్లకు బాగా చేరువైందన్నారు.
అయితే, కల్ట్ అనే పదానికి నిర్వచనాలు మారుతున్నాయనిసినీ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ జీఆర్ మహర్షి పేర్కొన్నారు.
"ప్రతి పది, పదిహేనేళ్లకి యూత్‌కి అర్థం మారుతుంది. వారి అభిరుచులు మారుతుంటాయి. ఈ సినిమా వాళ్లకి కనెక్టయ్యేది. అందుకే వాళ్లు అంతలా ఓన్ చేసుకున్నారు. అందుకే కల్ట్ మూవీగా చెబుతున్నారు'' అన్నారు.
"సాధారణంగా కల్ట్ ఫాలోయింగ్ వచ్చే సినిమాలు రిలీజయినప్పుడు బాక్సాఫీసు ఫెయిల్యూర్లుగా ఉంటుంటాయి. కానీ, ఈ నగరానికి ఏమైంది? ఫెయిల్యూరేమీ కాదు, ఆ విధంగా దానికి ముందున్న పాపులారిటీ కొనసాగిందని చెప్పచ్చు'' అని రచయిత, సినీ దర్శకులు రాజ్ మాదిరాజు బీబీసీతో అన్నారు.
అయితే, సోషల్ మీడియా పుణ్యమా అని మీం, రీల్ వాడకం ద్వారా వైరల్ అవడంవల్ల అనూహ్యమైన కల్ట్ స్టేటస్ వచ్చిందని చెప్పారు.
"అసలు సినిమా రిలీజయిన అయిదేళ్ళకు మళ్ళీ రీరిలీజ్ చేద్దామనే ఐడియా రావడమే వింత అంటే సెకండ్ రిలీజుకి మొదటిరోజు దాదాపు రెండూకోట్లు రూపాయలు కలెక్ట్ చేయడం నిజంగా అర్ధం కాని విషయం" అని రాజ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, https://www.instagram.com/p/DB_tnzLSISv/
1700 పైగా మీమ్‌లు.. 99.7k ఫాలోవర్లు
ఈ సినిమాలో కౌశిక్ పాత్ర పలికే సంభాషణలు, హావభావాలు చాలా వైరల్ అయ్యాయి.
ఎక్కువ మంది యువకులు ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. ములుగుకు చెందిన అఖిల్ ఈఎన్ఈ ప్రాజెక్ట్ పేరుతో ఇన్‌స్టా పేజీ నిర్వహిస్తున్నారు.
ఆ ప్రాజెక్టులో 1700కి పైగా మీమ్స్ ఉంటే అందులోనివన్ని ఈ నగరానికి ఏమైంది? మూవీని బేస్ చేసుకున్నవే. ఆ పేజీకి లక్షకు చేరువలో ఫాలోవర్లు ఉన్నారు. ట్రెండ్‌కు తగ్గట్లుగా సందర్భానుసారంగా తన మీమ్‌ను పోస్ట్ చేస్తున్నారు.
"సినిమాలపై నాకున్న ఆసక్తిని కెరీర్‌గా మలచుకోవడంలో ఈ సినిమా స్ఫూర్తినిచ్చింది. ఆర్థిక పరిస్థితుల రీత్యా చిన్న ఉద్యోగం చేసుకుంటున్న నేను, మీమర్‌గా మొదలై, డీవోపీలో డిప్లొమా పూర్తి చేసి ప్రస్తుతం సినిమాలకు అసిస్టెంట్ డీవోపీగా పనిచేస్తున్నాను" అఖిల్ అని చెప్పారు.

ఫొటో సోర్స్, https://www.instagram.com/p/DLRVW2HJWxq/
‘అవార్డులు ఎందుకు రాలేదంటే...’
"అవార్డు కేటగిరీకి వెళ్లాలంటే ఆ సినిమా సందేశాత్మకంగా ఉండాలి, ఫలానాగా ఉండాలి అనే రూల్ పెట్టుకోవడం వల్ల బహుశా ఈ సినిమాకు అవార్డులేమీ రాలేదు. కానీ పుష్పకు వచ్చిన అవార్డుతో ఆ పరిస్థితి కూడా మారినట్టని అనుకోవచ్చు'' అని జీఆర్ మహర్షి అన్నారు.
''ఈ నగరానికి ఏమైంది ఒక సాదా సీదా ఎంటర్‌టెయినర్.. జనరల్‌గా కథలో అయినా, కథనంలో అయినా సామాజిక దృక్పథంతో చూసే అంశాలు ఈ సినిమాలో తక్కువే. అవార్డు రాకపోవడానికి అదీ ఓ కారణం అయ్యుండొచ్చు" అని రాజ్ మాదిరాజు చెప్పారు.
"ఈరోజుల్లో ప్రేక్షకులు, ముఖ్యంగా యూత్‌కు లార్జర్ దాన్ లైఫ్ అనుభవాన్ని ప్రభాస్, బన్నీలాంటి హీరోల సినిమాలెలాగూ ఇస్తూనే ఉన్నాయి. మనసుపై లేదా మెదడుపై పెద్దగా భారం మోపని పాప్‌కార్న్ సినిమాలు చూడడానికి యువత మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాల్లో అది కోరుకుంటున్నారు. అల్లరిగా, సరదాగా సాగే సినిమాలవైపు చూస్తున్నారు. బహుశా ఈ మూవీ అక్కడే స్కోర్ చేసి ఉంటుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














