8 వసంతాలు మూవీ రివ్యూ: ఈ రచయిత్రి ప్రేమకథా చిత్రం ఎలా ఉంది?

ఫొటో సోర్స్, Facebook/Mythri Movie Makers
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ఫణీంద్ర నర్సెట్టి.. పదేళ్ల కిందట 'మధురం' అనే షార్ట్ ఫిలింతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. ఆ తర్వాత 'మను' అనే సినిమా తీశారు. ఇపుడు '8 వసంతాలు' అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఫణీంద్ర.
అనంతిక, హనురెడ్డి, రవి దుగ్గిరాల ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది?


ఫొటో సోర్స్, Facebook/Mythri Movie Makers
ప్రేమ.. బ్రేకప్.. ప్రేమ
కొన్ని పరిచయాలు స్నేహాలవుతాయి. కొన్ని ప్రేమగా మారతాయి. ప్రతి ప్రేమకూ ముగింపు పెళ్లి కావాల్సిన పని లేదు. విరహాలు, వియోగాలు తారసపడొచ్చు. కానీ, మళ్లీ ఎక్కడో ఓ చోట ప్రేమ చిగురిస్తుంది. మరో కథకు నాంది పలుకుతుంది. 8 వసంతాలు కూడా అలాంటి కథే.
ఓ అమ్మాయి ప్రేమ, బ్రేకప్... మళ్లీ ప్రేమ.. ఇదీ కథ. అందుకు పట్టిన సమయం 8 వసంతాలు. 12 నెలలు..
శుద్ది అయోధ్య (అనంతిక) అనే ఓ అమ్మాయి కథ ఇది. తన జీవితంలో ఎదురైన ఇద్దరు అబ్బాయిలు, వాళ్లు ఇచ్చిన అనుభూతులు, జ్ఞాపకాలు, కన్నీళ్లు, సంతోషాల కదంబం ఈ సినిమా.
శుద్ది ఓ మంచి రచయిత. మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యం ఉంటుంది. వరుణ్ (హనురెడ్డి) శుద్ది రచనల్ని, ఆమె వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడతాడు. ప్రేమిస్తున్నా అంటూ వెంట పడతాడు.
ప్రేమ అనేది శుద్దికి ఎమోషనల్ కనెక్ట్. తన ప్రేమని వరుణ్ దగ్గర వ్యక్తపరిచే సమయానికి అతని మనసు మారిపోతుంది. దానికి కారణం ఏమిటి?
ఈ ఎడబాటుని ఆమె ఎలా స్వీకరించింది. ఆ తర్వాత శుద్దికి ఎదురైన మరో అబ్బాయి సంజయ్ (రవి దుగ్గిరాల) కథేమిటి?.

ఫొటో సోర్స్, X/@MythriOfficial
కొత్త తరహాలో..
తొలి భాగంలో శుద్ది - వరుణ్‌ల మధ్య ప్రేమకథని చాలా సున్నితంగా ఆవిష్కరించాడు దర్శకుడు. కనీసం ముట్టుకోకుండా ప్రేమించుకొన్న జంట ఇది.
ఈ కాలంలో ఇలాంటి లవ్ స్టోరీ తెరకెక్కించాలంటే... చాలా ధైర్యం కావాలి. విలువలపై నమ్మకం ఉండాలి.
వరుణ్ బ్రేకప్ చెప్పడానికి కూడా బలమైన కారణాన్నే అందించాడు.
ఇంటర్వెల్ బ్యాంగ్‌లో కథానాయికతో చెప్పించిన డైలాగులు అమ్మాయిలకు నచ్చుతాయి.
వాళ్ల ఆత్మస్థైర్యం ఎలాంటిదో, ఓ బ్రేకప్‌ని ఎంత మొండిగా స్వీకరిస్తారో చెప్పే సన్నివేశం అది.

ఫొటో సోర్స్, Facebook/Mythri Movie Makers
దారి తప్పిన ద్వితీయార్థం
ద్వితీయార్థాన్ని సైతం బాగానే మొదలు పెట్టిన దర్శకుడు, కాశీ ఎపిసోడ్ తర్వాత ట్రాక్ తప్పేశాడు. కథలోకి కొత్త పాత్ర ప్రవేశిస్తుంది. ఆ పాత్ర బలమైనదే కావొచ్చు. కానీ, ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయలేకపోయింది. ఆ ప్రేమ కథ రియాలిటీకి దూరంగా కనిపించింది. పతాక సన్నివేశాలు మరీ సుదీర్ఘంగా, నిదానంగా సాగాయి. ఫ్లాష్ బ్యాక్ సీన్లు వస్తున్నప్పుడు మరింత లాగ్ అనిపిస్తుంది.
శ్మశాన వాటిక సన్నివేశం మనసుకు హత్తుకొంటుంది. కాశీలో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశంలో అనంతిక ఆకట్టుకుంది. ఆమెలోని మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యం ఆ సన్నివేశంలో బయటకు వచ్చింది.

ఫొటో సోర్స్, Facebook/Mythri Movie Makers
ఎవరెలా నటించారు?
కథానాయిక పాత్రకు అనంతిక నూటికి నూరు పాళ్లు న్యాయం చేసింది.
కానీ, మిగిలిన నటుల సపోర్టు లేకపోవడంతో బరువంతా ఆమెపైనే పడింది. అనంతిక నటన, హావభావాలు పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. ఫైట్ సీన్‌లో తన కష్టం కనిపిస్తుంది.
అయితే వరుణ్ తప్ప.. మిగిలిన నటులు తేలిపోయారు.

ఫొటో సోర్స్, Facebook/Mythri Movie Makers
టెక్నికల్‌గా ఎలా ఉంది?
మ్యూజిక్ విషయానికొస్తే.. హేషమ్ అబ్దుల్ వాహబ్ గుర్తుండిపోయే పాటలు ఇవ్వలేకపోయాడు.
కెమెరా పనితనం బాగుంది. కశ్మీర్ అందాల్ని ఒడిసి పట్టుకొన్న విధానం ఆకట్టుకుంది. ఊటీ మరింత అందంగా కనిపించింది.

ఫొటో సోర్స్, Facebook/Mythri Movie Makers
చివరగా..
ఫణీంద్రకు కవిత్వంతో పరిచయం ఉంది. సాహిత్యంతో అనుబంధం ఉంది. తెరపై ఓ కథ చెప్పాలనుకొన్నప్పుడు కూడా భావుకతనే నమ్ముకొన్నాడు. స్లో నేరేషన్ మరింత ఇబ్బంది పెట్టే వ్యవహారం.
కథానాయిక పాత్రని తీర్చిదిద్దిన విధానానికి మాత్రం దర్శకుడికి పూర్తి మార్కులు వేయొచ్చు. ఈమధ్య కాలంలో ఇంత అందంగా, బలంగా రాసుకొన్న పాత్ర అరుదు. అయితే, శుద్ది పాత్ర మినహాయిస్తే మిగిలిన పాత్రలు తేలిపోయాయి.
పాత్రలు కొన్నిచోట్ల మరీ కృత్రిమంగా మాట్లాడుతున్నాయేమో అనిపిస్తుంది. అందరూ బరువైన పదాల్ని చాలా తేలిగ్గా వాడేస్తుంటారు. కథానాయిక ఓ రచయిత్రి కాబట్టి తాను అలా మాట్లాడుతోందంటే కాస్త అర్థం చేసుకోవచ్చు. మిగిలిన పాత్రలూ అలానే ప్రవర్తిస్తుంటాయి.
దర్శకుడు కథని మొదలెట్టిన తీరు - ముగించిన పద్ధతి బాగుంటాయి. కాకపోతే మధ్యలో నడిపిన సన్నివేశాలు మాత్రం నిదానంగా, భారంగా ముందుకు సాగుతుంటాయి. అక్కడే 8 వసంతాలు పట్టు తప్పింది.
మొత్తంగా చూస్తే భావుకత మాయలో పడిన దర్శకుడు భావోద్వేగాల్ని మర్చిపోయాడనిపిస్తుంది. ద్వితీయార్థం పూర్తిగా గాడి తప్పడం, ప్రేమకథలో బలం లేకపోవడంతో 8 వసంతాలు ఇవ్వాల్సిన అనుభూతిని ఇవ్వడంలో వెనుకబడింది.
(గమనిక: రచయిత అభిప్రాయాలు వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














