కుబేర రివ్యూ: ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబో మెప్పించిందా?

ఫొటో సోర్స్, facebook/Akkineni Nagarjuna
- రచయిత, జీ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక నటించిన కుబేర సినిమా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందో లేదో చూద్దాం.
శేఖర్ కమ్ముల అంటే సెన్సిటివ్, ఎమోషనల్ లవ్ స్టోరీలు గుర్తొస్తాయి. ఫిదా, ఆనంద్, హ్యాపీడేస్‌ని మరిచిపోవడం కష్టం.
ఈసారి పొలిటికల్ క్రైమ్ స్టోరీని తీసుకున్నారు శేఖర్.


ఫొటో సోర్స్, facebook/Akkineni Nagarjuna
కథేంటి?
నీరజ్ (జిమ్‌సెర్బ్) శక్తిమంతుడైన వ్యాపారవేత్త. తన బిజినెస్ కోసం ప్రభుత్వ పెద్దలతో లక్ష కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకుంటాడు. ఆ డబ్బుని అక్రమ పద్ధతుల్లో తరలించడానికి దీపక్ (నాగార్జున) సాయం కోరుతాడు.
దీపక్ నిజాయితీ ఉన్న సీబీఐ అధికారి, చేయని నేరానికి జైల్లో వుంటాడు. తాను చెప్పిన పని చేస్తే జైలు నుంచి విడిపిస్తానని నీరజ్ చెబుతాడు. మొదట తిరస్కరించిన దీపక్ తర్వాత ఒప్పుకుంటాడు.
ఇదే క్రమంలో దేవా(ధనుష్) అనే భిక్షగాడి పాత్ర ఎంటరవుతుంది. ఈ ముగ్గురి మధ్య సంబంధమేంటి? వారేం చేశారనేదే మిగతా కథ.
ఈ సినిమాకు ప్రధాన లోపం నిడివి. మూడు గంటల సినిమా సహనాన్ని పరీక్షిస్తుంది.
స్క్రీన్‌ప్లే బిగువుగా ఉంటే రన్‌టైం సమస్య కాదు కానీ, నాగార్జున, ధనుష్ మధ్య ఛేజింగ్ సీన్లు రిపీటెడ్‌గా సాగుతాయి.

ఫొటో సోర్స్, facebook/Akkineni Nagarjuna
తడబడిన శేఖర్ కమ్ముల
నిజానికి థ్రిల్లర్ జానర్ ఇప్పటివరకు శేఖర్ కమ్ములకు హిట్ ఇవ్వలేదు. గతంలో కూడా నయనతారతో రీమేక్ ప్రయత్నించి దెబ్బతిన్నారు.
కుబేర కథ రాసుకున్నపుడు ఇది కొత్త తరహాగా అనిపించి ఉండొచ్చు. అయితే, స్క్రీన్ మీద మూడు గంటల సమయంలో కూడా శేఖర్ కమ్ముల చెప్పదలుచుకున్నది చూపించలేకపోయారు. అందుకే క్లైమాక్స్‌లో సీన్స్ జంప్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
రష్మిక కథ వేరే. అది దర్శకుడు పూర్తిగా చెప్పడు. చూడాలని వుందిలో సౌందర్య లాంటి కేరెక్టర్. ఒకర్ని నమ్మి బొంబాయి వచ్చి ఇరుక్కుంటుంది. అనుకోకుండా దేవా (ధనుష్) తారసపడతాడు.
డబ్బుకి సంబంధించి లక్కీ భాస్కర్‌లో మాదిరిగా ఇంటెలిజెన్స్ ఏమీ దీపక్(నాగార్జున) పాత్రలో ఉండదు. ఇక భిక్షగాడి పాత్రను వాడుకున్న విధానం మరీ సినిమా లిబర్టీగా ఉంది.

ఫొటో సోర్స్, facebook/Dhanush
ఎవరెలా చేశారంటే..
నటన విషయానికి వస్తే భిక్షగాడి పాత్రలో ధనుష్ ఒదిగిపోయాడు. అయితే ఆ పాత్రలో ఎక్కడా హీరోయిజం కనపడదు. ఏ దశలోనూ తిరగబడకుండా పారిపోయే దేవా, చివర్లో భిన్నంగా వ్యవహరించడం విచిత్రం.
నాగార్జున స్టైలిష్‌గా నటించాడు. దీపక్ పాత్రని సరిగ్గా రిజిస్టర్ చేయకపోవడం, రకరకాలుగా ట్రాన్స్‌ఫార్మ్ అవడం ప్రేక్షకుడిని గందరగోళపరుస్తుంది.
రష్మిక కేవలం సహాయ నటిగా మిగిలిపోయారు.
దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కుదిరింది. ఒక పాట బాగుంది. 'కుక్కల బండిలో వెళ్లాల్సిన శవం, డబ్బులుంటే ఎంత దర్జాగా వెళ్తుందో' చిత్రీకరణ చాలా బాగుంది.

ఫొటో సోర్స్, facebook/Akkineni Nagarjuna
చివరగా..
ప్లస్ పాయింట్స్
1.ధనుష్ నటన
2.ఫొటోగ్రఫీ
3.తోట తరణి ప్రొడక్షన్ డిజైనింగ్
4.డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
1.నిడివి
2. స్క్రీన్ ప్లే
3. పాత్ర చిత్రణలో లోపాలు
(గమనిక: రచయిత అభిప్రాయాలు వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














