భైరవం: మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్‌ల కాంబినేషన్ కలిసొచ్చిందా?

ఫొటో సోర్స్, FB/Sri sathya sai Arts
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
భైరవం సినిమా తమిళ్ గరుడన్‌కి రీమేక్. చాలా కాలం తర్వాత నారా రోహిత్, మంచు మనోజ్ తెరమీద కనిపించారు. హిట్స్‌లేని బెల్లంకొండ శ్రీనివాస్ ఇంకో హీరో. ముగ్గురూ కలిసి మ్యాజిక్ చేశారా లేదా చూద్దాం.
కథ ఏంటంటే, దేవిపట్నం గ్రామంలో వారాహి అమ్మవారి ఆలయానికి వెయ్యికోట్ల విలువ చేసే మాన్యం ఉంటుంది. ఆ భూమి మీద ఒక మంత్రి కన్ను వేస్తాడు.
ఆ గుడి గజపతి (మంచు మనోజ్) కుటుంబీకుల ఆధీనంలో వుంటుంది. అతని నాయనమ్మ (జయసుధ) చేతిలో తాళాలుంటాయి.
గజపతికి ప్రాణ స్నేహితుడు వరద (నారా రోహిత్). వీళ్లిద్దరికీ శీను అండ. అతను స్నేహితుడు, పనివాడు కూడా. అనాథగా ఉన్న శీనుని చిన్నప్పుడు వీళ్లిద్దరు ఆదరిస్తారు.
ఈ స్నేహితుల్ని విడగొట్టి ఆలయ భూముల్ని కొట్టేయాలని మంత్రి ఎత్తుగడ.
మరి విడిపోయారా? ఎవరు ద్రోహిగా మారారు? ఇదే మిగతా కథ.


ఫొటో సోర్స్, FB/Sri sathya sai Arts
ఫ్లాష్ బ్యాక్..
ఇదో రూరల్ రస్టిక్ డ్రామా. పోలీస్ అధికారి సంపత్ నంది రాజీనామా చేసి, ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ప్లాష్‌బ్యాక్‌గా చెబుతాడు.
పాత్రల్ని పరిచయం చేయడానికే చాలా టైం తీసుకున్నారు. తర్వాత ఆలయం నగలు, ధర్మకర్త ఎన్నిక, పోలీస్ కేసులు, స్నేహితుల ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయి.
నిజానికి ఇది 1980 నాటి కథ. ఆలయ భూములు, అమ్మవారి కిరీటం, నగలు మెయిన్ థ్రెడ్‌గా చాలా సినిమాలు చూశాం. పాత కథని కొత్తగా చెప్పే చిన్న ప్రయత్నం జరిగింది.
హీరోల క్యారెక్టరైజేషన్ గందరగోళంగా ఉంటుంది. రైటింగ్‌లో లోపం ఇది. బలమైన సన్నివేశాలు లేకపోవడంతో సెకెండాఫ్‌లో మంచు మనోజ్ ప్రవర్తన ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు.
డబ్బుతో స్నేహం విడిపోతుందనే మాట నిజమే కానీ, ఆ లక్షణాలు ముందు నుంచే పాత్రలో కనిపించాలి.
ఒకరి కోసం ఒకరు బలంగా నిలబడిన వాళ్లు, దానికి విరుద్ధంగా కనిపిస్తే ఆడియన్స్ కన్వీన్స్ అవ్వరు.
ఇంటర్వెల్, క్లైమాక్స్‌ల్లో కాంతారా పూనకం యథాతథంగా ఉండటం ఒక మైనస్.
మ్యాజిక్ పదేపదే రిపీట్ కాదు. నటన విషయానికి వస్తే నారా రోహిత్, మంచు మనోజ్ కమ్‌బ్యాక్ అనిపించింది.
మంచు మనోజ్ లౌడ్‌గా అనిపించినా ఆ పాత్ర స్వభావం అలాంటిది. రోహిత్ చాలా గంభీరంగా నిబ్బరంగా నటించాడు. రోహిత్‌కి బదులు వరద క్యారెక్టరే కనిపిస్తుంది. మనోజ్, మోహన్‌బాబుని గుర్తు తెస్తుంటాడు.

ఫొటో సోర్స్, FB/Sri sathya sai Arts
లవ్ ట్రాక్ ఎలా ఉందంటే?
సెకండాఫ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ సీన్స్ బావుంటాయి. అయితే అతని మీద కామెడీ వర్కౌట్ కాదు.
తమిళంలో ఆ పాత్ర కామెడీ నటుడు సూరీ వేయడం వల్ల అక్కడ పండింది. అదే కామెడీ ఇక్కడ విసుగు తెప్పిస్తుంది. దీనికి తోడు శ్రీనివాస్‌కి లవ్ ట్రాక్ పాటలు పెట్టారు. సీరియస్ సినిమాకి ఇవి అనవసర అడ్డంకి.
దర్శకుడు శంకర్ కూతురు అదితీ శంకర్ జోడిగా నటించింది. ఆమెతో పాటు ఉన్న ఆనంది, దివ్య పిళ్లైలకి కూడా నటించడానికి స్కోప్ లేదు. జయసుధ ఉన్నా ఆమెకి బలమైన సీన్స్ లేవు.
వెన్నెల కిషోర్ ప్రాస కామెడీ ఏమీ అర్థం కాదు, నవ్వురాదు.
అతను లేకపోయినా సినిమాకి ఏమీ నష్టం లేదు. చాలా కీలకంగా ప్రారంభమయ్యే సంపత్ నంది పాత్ర, చివరికి తుస్సుమంటుంది. అతను నిజాయితీపరుడో, అవినీతిపరుడో కూడా అర్థంకాదు. ఉద్యోగంలో ఏం వైఫల్యం చెందాడని రాజీనామా చేస్తాడో తెలియదు.

ఫొటో సోర్స్, FB/Sri sathya sai Arts
కేవలం ముగ్గురు హీరోల ఎలివేషన్స్ కాకుండా, కథలో డ్రామాపై శ్రద్ధ పెట్టి, మంచి సీన్స్ రాసుకుంటే, నెక్ట్స్ లెవెల్ ఉండేది.
డైలాగులు మొదట్లో బావున్నాయి అనిపించినా , తర్వాత రొటీన్ అయిపోతాయి.
యాక్షన్ సీన్స్ , ఫైట్స్ ఇష్టపడేవారికి నచ్చే అవకాశం ఉంది.
నిజానికి డైరెక్టర్ విజయ్ కనకమేడల కంటే, కెమెరామన్, స్టంట్ మాస్టర్లే ఎక్కువ సినిమాను తీశారు.
నిర్మాత ఖర్చు భారీగా పెట్టారు. ఎడిటర్ అరగంట సినిమాని కత్తిరించి ఉంటే ప్రేక్షకుడు కొంచెం సంతృప్తిగా బయటికి వచ్చేవాడు.
సినిమా ఊహాజనితం, అతుకుల బొంతలా అనిపించినా ఒకసారి చూడొచ్చు, కొంచెం కష్టం మీద.
ప్లస్ పాయింట్
1. ముగ్గురు హీరోల నటన
2. కెమెరా
3. బీజీఎం
మైనస్ పాయింట్
1. కథలో ఎమోషన్ మిస్సవడం
2. అరిగిపోయిన సబ్జెక్ట్
3. కాంతారా పూనకం
4. లవ్‌ట్రాక్, పాటలు
(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














