సినిమాల్లో హీరోల వయసు ఎప్పటికీ పెరగదా, ‘థగ్ లైఫ్’ లేవదీసిన చర్చ ఏంటి?

ఫొటో సోర్స్, kamal,Tirhsa,chiranjeevi,Sharukh,Rashmika,Salman/FB
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ కోసం
ఎంతకీ వయసు తరగని హీరోలు, 30లకే వయసు పైబడినట్టు.. హీరోయిన్లు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఇదే ధోరణి. వేళ్లపై లెక్కించగలిగే ఏవో కొన్ని సినిమాల్లో తప్ప వయసు మీరిన హీరోయిన్లు కనిపించడం అరుదే. దీనికి కారణం పితృస్వామ్య సమాజమా? సినీ పరిశ్రమా? ప్రేక్షకుల ఆలోచనా తీరా?
మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్లో నిర్మించిన "థగ్ లైఫ్" టీజర్ విడుదల కాగానే సినిమాలో పాత్రల మధ్య వయసు తేడాపై ఆన్‌లైన్‌లో వ్యతిరేకత వ్యక్తమైంది.
70 ఏళ్ల కమల్ హాసన్ తన కంటే దాదాపు 30 ఏళ్లు చిన్న వాళ్లైన త్రిష, అభిరామిలతో రొమాంటిక్ సీన్‌లలో నటించడంపై నెటిజన్లు కామెంట్లు చేశారు.
"కమల్ కూతురు శృతి హాసన్ కన్నా త్రిష మూడేళ్లు మాత్రమే పెద్దది" అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు.
ఈ సినిమా టీజర్ విడుదల కాగానే హీరో, హీరోయిన్ మధ్య ఉన్న రొమాంటిక్ సన్నివేశాల గురించి ఆన్‌లైన్‌లో చర్చ మొదలైంది. ఈ చర్చను చూస్తుంటే... 60 ఏళ్ల హీరో, 30 ఏళ్ల హీరోయిన్ - ఈ ధోరణి ఇవాల్టి విషయం కాదు కదా అనిపించింది.
సినిమాల్లో హీరోల వయసు రోజు రోజుకీ తగ్గిపోతూ ఉంటుందా? హీరోయిన్‌లు మాత్రం 30 దాటితే అక్క, వదిన లేదా అమ్మ పాత్రలకు పరిమితమవుతూ ఉండాల్సిందేనా?


ఫొటో సోర్స్, https://x.com/iamRashmika
‘హీరోలు ముసలివాళ్లు కారా?’
మన సినిమాల్లో హీరోలు ఎప్పటికీ ముసలివాళ్లు కారు. వారి వయసు పెరిగినా కూడా వాళ్లను ఇంకా 20-30 ఏళ్ల వారి మాదిరిగా చూడటానికి ప్రేక్షకులకు ఎలాంటి అభ్యంతరం ఉండదు.
ఈ ధోరణి తెలుగు సినిమాలకే పరిమితం కాదు. హాలీవుడ్, బాలీవుడ్‌లలోను ఇదే ధోరణి.
ఈ మధ్య హిందీ సినిమా సికందర్ ట్రైలర్ రిలీజ్ సమయంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న మధ్య ఉన్న 31 ఏళ్ల వయసు తేడా గురించి సోనా మహాపాత్ర అనే జర్నలిస్ట్ ప్రశ్నించినప్పుడు సల్మాన్ తీవ్రంగా స్పందించారు.
"నటించే హీరోయిన్‌కు, ఆమె తండ్రికే సమస్య లేనప్పుడు మీకెందుకు" అని ప్రశ్నించారు.
అయితే దీనికి ఆమె "ఇదొక పనికిమాలిన సమాధానం, భారత్ చాలా మారిందని ఈయనకు ఇంకా అర్థమైనట్లు లేదు" అని ట్వీట్ చేశారు.
ఇలాంటి ప్రశ్న అడిగినందుకు యూజర్లు కూడా ఆమెను ట్రోల్ చేశారు. "మీ పని మీరు చూసుకోండి" అని సలహాలిచ్చారు.
కానీ, ఇలాంటి తారతమ్యాలను ప్రశ్నించకపోతే ఎలా? అని సోనా అంటారు.
ఈ ధోరణి గురించి సినీ రచయత, దర్శకుడు డీఎస్ కన్నన్ నాతో మాట్లాడారు.
"అబ్బాయి పెద్దవాడు, అమ్మాయి చిన్నదిగా ఉండాలి అనేది భారతీయ సంస్కృతిలో నాటుకుపోయింది. సమాజంలో ఉన్నదే సినిమాలో ఉంటుంది. పూర్వం పెళ్లిళ్లలో కూడా అమ్మాయికి, అబ్బాయికి మధ్య వయసు తేడా ఎక్కువగానే ఉండేది. ఒకప్పుడు అమ్మాయిలు సినిమాల్లో నటించడానికి వచ్చేవారు కాదు. చాలా వరకు దేవదాసీ కుటుంబాలకు చెందిన అమ్మాయిలే సినిమాల్లోకి వచ్చేవారు. దీంతో చిన్న పిల్లల్ని ఎంపిక చేసుకోవడం అప్పటి నుంచే కొనసాగుతోంది" అని అన్నారు.
"ప్రేక్షకులు కూడా అమ్మాయికి కాస్త వయసు కనిపిస్తే ఆమోదించరు. కోట్లు పెట్టుబడి పెట్టే దర్శక, నిర్మాతలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
‘అన్ని భాషల్లోనూ ఇదే పరిస్థితి’
దిలీప్ కుమార్ 50లలో ఉన్నప్పుడు తన కన్నా 20 ఏళ్లు చిన్నదైన వైజయంతిమాలతో కలిసి నటించారు.
తెలుగులో ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ లాంటి నటులు కూడా తమ కన్నా చిన్న వాళ్లైన హీరోయిన్‌లతో నటించారు.
తమిళ సినీ పరిశ్రమలో ఎమ్‌జీఆర్, జయలలితల మధ్య వయసు తేడా 30 ఏళ్లు.
చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉదాహరణలు ఎన్నో.
సినిమాల వరకు ఎందుకు? భార్యాభర్తలైన దిలీప్ కుమార్, సైరా భానుల మధ్య 22 ఏళ్లు తేడా ఉంది. అంటే, ఈ తేడాను సమాజం ఆమోదిస్తోందనే అనుకోవాలి అంటారు ప్రముఖ రచయిత సత్యానంద్.
90ల్లో ఈ పంథా ఏమైనా మారిందా అంటే లేదనే అనాలి.

ఫొటో సోర్స్, AK Entertainments
‘ప్రేక్షకుల ఆదరణ ఉంది కాబట్టే’
తెలుగులో చిరంజీవి కూడా సిమ్రన్, సౌందర్యలతో కలిసి నటించారు. వీరి మధ్య 20 ఏళ్లకు పైగా వయసు తేడా ఉంది. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ కూడా ఇదే ధోరణి కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. మహేష్ బాబు కూడా సర్కారు వారి పాటలో తన కన్నా దాదాపు 20 ఏళ్ల చిన్నదైన హీరోయిన్‌తో కలిసి నటించారు. పవన్ కల్యాణ్ కూడా ఇదే కోవలోకి వస్తారు.
58 ఏళ్ల సల్మాన్ ఖాన్ 32 ఏళ్ల పూజ హెగ్డే తో కలిసి 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' అనే సినిమాలో నటించారు. షారుఖ్ ఖాన్, అనుష్క శర్మతో కలిసి 'జబ్ హ్యారీ మెట్ సెజల్'లో నటించారు. లాల్ బాద్‌షాలో అప్పటికి 52 ఏళ్ల అమితాబ్ బచ్చన్ 25 ఏళ్ల మనీషా కొయిరాలాతో నటించారు.
ఇది ఒక్క టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లకే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ఉందని సత్యానంద్ అంటారు.
"ఇందులో ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏమీ లేదు. ప్రేక్షకులు ఏది ఆదరిస్తారో నిర్మాతలు అదే తీస్తారు. ప్రేక్షకులు తిప్పి కొట్టిన రోజున మానేస్తారు" అని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘పాతకాలపు హీరోయిన్లు ఎవరున్నారు?’
"ఇది కొత్తగా వినిపిస్తున్న విమర్శ కాదు. నిజానికి అభిమానులు, సదరు హీరోలు తమకు తాము సర్దిచెప్పుకోవడం లాంటిది. యంగ్ హీరోయిన్‌లతో యూత్‌ని అట్రాక్ట్ చేసే విధంగా నన్ను నేను స్క్రీన్‌పై ప్రెజంట్ చేసుకోకపోతే నా ఫ్యాన్స్ ఒప్పుకోరు అని హీరోలు.. మా హీరోలు చేస్తున్నారు కాబట్టి మేం చూస్తున్నాం అని ఫ్యాన్స్ చెప్పుకోవడం అలవాటుగా మారిపోయింది" అని రచయిత, దర్శకుడు ప్రభాకర్ ఆరిపాక అంటారు.
ఈయన బీబీసీతో ఈ అంశంపై మాట్లాడారు.
"తనతో మనవరాలుగా నటించిన శ్రీదేవితో ఎన్టీఆర్ కొన్నేళ్ల తర్వాత డ్యూయెట్స్ పాడినప్పుడు కూడా విమర్శలు ఎదురయ్యాయి. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక నిర్మించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి శేషాద్రిని తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి మాటలే వినిపించాయి. సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి బాలకృష్ణ.. ఎవరూ దీనికి మినహాయింపు కాదు.
సీనియర్ హీరోల పక్కన హీరోయిన్‌గా వారికి సరిపోయే వారే చేయాలంటే అది కత్తి మీద సామే. ఎందుకంటే ఆ వయసున్న హీరోయిన్లు ఇప్పుడు తల్లి పాత్రలకో వదిన పాత్రలకో వచ్చేశారు. కొంతమంది రిటైర్ అయిపోయారు" అని ఆయనన్నారు.
"సీనియర్ నటి త్రిషానే వయసులో చిన్నదని అనుకుంటే కమలహాసన్ పక్కన చేయడానికి పాత కాలపు నటీమణులు ఎవరున్నారు?" అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
"ఇక్కడ మారాల్సింది హీరోల మైండ్‌సెట్. తమ వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకోవాల్సింది వారే. కానీ అది అత్యాశే. హీరో అంటే కలకలం ఉండిపోయే వ్యక్తిగా చూస్తారు. అతనికి వయసు పెరగదు. అమ్మాయిలను మాత్రం వాళ్ల రూపురేఖలు, వయసును దృష్టిలో పెట్టుకుని చూస్తారు. ఆడియెన్స్ కూడా దీనికి కండీషనింగ్ అయిపోయారు" అని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఎప్పటికైనా మారుతుందా?
గంగుభాయ్, ఇంగ్లిష్ వింగ్లిష్, తప్పడ్ లాంటివి హీరోయిన్ ప్రధాన చిత్రాలు. వీటిని ప్రధాన స్రవంతిలో చేర్చి చూడలేం.
సినిమా కథలో ఆ వయసుకు తగ్గ పాత్రలు ఉంటే తప్ప 50 ఏళ్ల హీరో, 40 ఏళ్ల హీరోయిన్ పక్కన నటించడం అరుదుగా కనిపించే విషయం.
థగ్ లైఫ్ లేవదీసిన ఈ చర్చ కొనసాగాల్సిందే.
హృదయపూర్వం అనే సినిమాలో మోహన్ లాల్ పక్కన నటించిన మాళవిక మోహనన్ మధ్య 33 ఏళ్ల తేడా ఉందని ఒక నెటిజెన్ కామెంట్ చేశారు.
ఈ కామెంట్‌కి మాళవిక స్పందిస్తూ, "ఈ పాత్రల్లో ప్రేమ దాగి ఉందని ఎవరు చెప్పారు? సగం సగం తెలిసిన, ఆధారాలు లేని ఊహలతో మీరు మనుషులను జడ్జ్ చేయడం ఆపండి" అని సమాధానమిచ్చారు.
"ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండి, నటించగలం అనే నమ్మకం ఉన్నప్పుడు వయసు ఒక ఆటంకమే కాదు" అని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ లాల్ అన్నారు.
వయసు పైబడితే మహిళలను ఎలా సిగ్గు పడేలా చేస్తారో మనీషా కొయిరాలా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వయసు కారణంగా ఆమెను చాలా చర్చలకు దూరంగా పెట్టిన అనుభవాలను షేర్ చేసుకున్నారు.

ఫొటో సోర్స్, NAYANTHARA/Instagram
‘హీరోయిన్లకూ ఆదరణ పెరుగుతోంది’
"ఆయే దిల్ హాయ్ ముష్కిల్"లో ఐశ్వర్య రాయ్ పక్కన రణబీర్ కపూర్ నటించడంపై పెద్ద చర్చ నడిచింది.
ఈ ధోరణి మారుతోంది అంటున్నారు సినీ గేయ రచయిత చల్లా భాగ్యలక్ష్మి. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున పక్కన రమ్య కృష్ణ నటించడాన్ని ఆమె గుర్తు చేశారు.
"అనుష్క, నయనతార లాంటి హీరోయిన్లు తమ ఉనికిని ఇప్పటికీ చాటుకుంటున్నారు. ఓటీటీల రాకతో సినిమా కథల పరిధి పెరిగింది. గ్లామర్‌ను మాత్రమే నమ్ముకున్న తారలు మరుగున పడిపోతున్నారు. కానీ తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నవారిని సినీ పరిశ్రమ వయసుతో నిమిత్తం లేకుండా ఆదరిస్తూనే ఉంటుంది" అని భాగ్యలక్ష్మి అన్నారు.
కాలా సినిమాలో ఈశ్వరీ రావు పక్కన రజనీకాంత్ నటించారు కదా అని ఆమె ప్రశ్నించారు.
ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ... ఇది ఒక్క హీరో, హీరోయిన్‌లకు మాత్రమే కాదు, సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని సత్యానంద్ అంటారు. నైపుణ్యం, ప్రేక్షకుల ఆదరణ ఉన్నంతవరకు వయసుతో నిమిత్తం లేకుండా పరిశ్రమలో కొనసాగవచ్చన్నారు.
హీరోయిన్ త్రిష కూడా నెటిజెన్ల కామెంట్లకు స్పందించారు.
"ఇలాంటి వ్యతిరేకతను ముందే ఊహించాను" అంటూ, కమల్‌తో నటించడం అద్భుతంగా ఉంటుందని ముందే భావించానని అన్నట్లు పత్రికలు ప్రచురించాయి.
"ఈ సినిమాలో నటించడానికి అంగీకరించకముందే, ఇదొక మ్యాజిక్‌లా అనిపించింది. అప్పటికి నేను ఈ సినిమాలో నటిస్తానని కూడా తెలియదు. ఈ సినిమా కోసం పని చేస్తున్నప్పుడు కమల్, మణిరత్నంలను చూస్తూ, ఇక్కడ మనం వాళ్లను తదేకంగా చూస్తూ మైమరిస్తే కుదరదు, పని చేయాలి, నటించాలి అని అనుకునేవాళ్లం" అని ఆమె అన్నారు.
మణిరత్నం కూడా ఈ ట్రోల్స్‌కు స్పందించారు.
"ఇక్కడ చూడాల్సింది రెండు పాత్రలను... కానీ కమల్, త్రిషలను కాదు. సినిమా చూసి వీళ్ల బంధం ఎలా ఏర్పడిందో అర్థం చేసుకుని మీ తీర్పు ఇవ్వండి" అని అన్నట్లు, జార్జ్ వ్యూస్ అనే ఫిల్మ్ రైటర్ ట్వీట్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














