సుశాంత్ రాజ్‌పుత్ కేసులో సీబీఐ క్లోజర్ రిపోర్ట్‌పై రియా చక్రవర్తి లాయర్ ఏమన్నారు?

ఫొటో సోర్స్, Rhea, Sushant/Facebook
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సీబీఐ రెండు క్లోజర్ రిపోర్టులను (సీల్డ్ కవర్‌లో రెండు రిపోర్టులు) దాఖలు చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
ఈ రిపోర్టులలో, సుశాంత్ మరణం వెనుక కుట్ర ఉందన్న వాదనలను సీబీఐ తోసిపుచ్చినట్లు పీటీఐ పేర్కొంది.
ముంబయిలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో 2020 జూన్ 14న సుశాంత్ విగతజీవిగా కనిపించారు, ఆ తర్వాత కొందరు ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తిపై సోషల్ మీడియాలో విద్వేష ప్రకటనలు చేశారు.
తాజాగా, సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును రియా చక్రవర్తి న్యాయవాది సతీశ్ మాన్‌శిందే ప్రశంసించారు. కేసును అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేసినందుకు సీబీఐకి ఆయన ‘కృతజ్ఞతలు’ తెలిపారు.
సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపిస్తూ ఆయన తండ్రి చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసుకు సంబంధించి మొదటి నివేదిక, సుశాంత్ సోదరీమణులపై నటి రియా చక్రవర్తి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసుకు సంబంధించి రెండో నివేదికను సీబీఐ సమర్పించినట్లు పీటీఐ తెలిపింది.
సుశాంత్ తండ్రి పెట్టిన కేసుకు సంబంధించి పట్నా ప్రత్యేక కోర్టులో నివేదికను సమర్పించామని, రెండో కేసులో ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానంలో నివేదిక సమర్పించినట్లు సీబీఐ అధికారులు చెప్పినట్లు పీటీఐ పేర్కొంది.

పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సీబీఐ సమర్పించిన నివేదికను ఆమోదించడమా, లేక మరింత లోతుగా దర్యాప్తు జరపాలని ఆదేశించడమా అనేది కోర్టు నిర్ణయిస్తుంది.
భవిష్యత్ పరిణామాలపై రియా చక్రవర్తి లాయర్ సతీశ్ మాన్‌శిందే బీబీసీ మరాఠీతో మాట్లాడుతూ, ''బాధిత కుటుంబం సదరు క్లోజర్ రిపోర్టును తిరస్కరిస్తే, దానిని వ్యతిరేకిస్తూ వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చు'' అని చెప్పారు.
''వాదనలు విన్న తర్వాత క్లోజర్ రిపోర్టును కోర్టు ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. తదుపరి దర్యాప్తుకు కూడా ఆదేశించవచ్చు'' అన్నారాయన.
పీటీఐ తెలిపిన ప్రకారం, కూపర్ ఆస్పత్రిలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. ఆయన ఊపిరాడక మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి స్పష్టమైన కారణాన్ని కనుగొనేందుకు ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా అధ్యక్షతన మెడికల్ బోర్డు ఏర్పాటైంది. ఎయిమ్స్ వైద్యులు సెప్టెంబర్‌లో తమ నివేదికను సీబీఐకి అందజేశారు.
డాక్టర్ సుధీర్ గుప్తా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ , ''సుశాంత్ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇది ఆత్మహత్య. సుశాంత్ శరీరంపై ఎలాంటి గాయాలూ లేవు'' అన్నారు.

ఫొటో సోర్స్, RHEA CHAKRABORTY/INSTAGRAM
రెండు వేర్వేరు కేసుల్లో దర్యాప్తు
రెండు వేర్వేరు కేసులను సీబీఐ దర్యాప్తు చేసింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ పట్నా పోలీసులకు చేసిన ఫిర్యాదు ఆధారంగా మొదటి కేసు దర్యాప్తు జరిగింది. ఈ కేసులో, రియా చక్రవర్తి వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్లు విత్‌డ్రా చేశారని కేకే సింగ్ ఆరోపణలు చేశారు.
సీబీఐ దర్యాప్తు చేపట్టడానికి ముందు ఈ కేసును బిహార్ పోలీసులు దర్యాప్తు చేశారు.
కేకే సింగ్ ఫిర్యాదు ఆధారంగా బిహార్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ, ఆ తర్వాత దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించారు.
రియా చక్రవర్తి ఫిర్యాదు ఆధారంగా బాంద్రాలో రెండో కేసు నమోదైంది.
ఇందులో దిల్లీకి చెందిన ఒక వైద్యుడి నకిలీ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా సుశాంత్ సోదరీమణులు ఆయనకు ఏవో మందులు ఇచ్చారని ఆరోపించారు.
ఈ నకిలీ ప్రిస్క్రిప్షన్ మందులు తీసుకున్న ఐదు రోజులకు సుశాంత్ మరణించారని రియా చక్రవర్తి ఆరోపించారు.
బాంద్రా పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. కానీ, ఆ తర్వాత ఈ కేసును సీబీఐ స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరిపింది.
దర్యాప్తులో సీబీఐ ఏం కనుగొంది?
వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. నిపుణుల అభిప్రాయాలు, నేరస్థల విశ్లేషణ, సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ నివేదికల ప్రకారం సుశాంత్ సింగ్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలకు మద్దతునిచ్చే ఆధారాలు లభించలేదని సీబీఐ నిర్ధరణకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
సుశాంత్ సింగ్ మరణం వెనక కుట్ర ఉందంటూ ఐదేళ్లుగా కొనసాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికేలా, తుది నివేదికను సమర్పించాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
సీబీఐకి ఇచ్చిన మెడికో లీగల్ ఒపీనియన్(వైద్యుల నివేదిక)లో సుశాంత్‌పై ''విషప్రయోగం, గొంతునులిమి చంపడం'' వంటి వాదనలను ఎయిమ్స్ వైద్యనిపుణులు తిరస్కరించారు.
రియా చక్రవర్తితో పాటు ఆమె సన్నిహితుల వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. సుశాంత్ సింగ్ గత వైద్య నివేదికలను కూడా సీబీఐ సేకరించింది.

ఫొటో సోర్స్, Pratham Gokhale/Hindustan Times via Getty Images
రియా చక్రవర్తి లాయర్ ఏమన్నారు?
సీబీఐ సమర్పించిన క్లోజర్ రిపోర్టును ప్రశంసిస్తూ, రియా చక్రవర్తి తరఫు న్యాయవాది సతీశ్ మాన్‌శిందే ఒక ప్రకటన విడుదల చేశారు.
''సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత సీబీఐ క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది, ఈ కేసును అన్ని కోణాల్లో క్షుణ్ణంగా విచారించి కేసుకు ముగింపు పలికినందుకు సీబీఐకి కృతజ్ఞతలు'' అని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
''సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. మీడియాలో, దర్యాప్తు అధికారుల చేతిలో అమాయకులు వేధింపులకు గురయ్యారు.''
''ఈ కేసులో ఇలాంటివి పునరావృత్తం కాకూడదు. ఏ తప్పూ చేయకపోయినా రియా చక్రవర్తి ఎన్నో బాధలు అనుభవించాల్సి వచ్చింది, 27 రోజులు జైల్లో గడపాల్సి వచ్చింది.''
తాను, తన బృందం బెదిరింపులు కూడా ఎదుర్కొన్నట్లు సతీశ్ మాన్‌శిందే తన ప్రకటనలో ప్రస్తావించారు.
''ఇంతజరిగినా మౌనం వహించినందుకు, తమతో అమానవీయంగా ప్రవర్తిస్తున్నా సహనంతో ఉన్నందుకు రియా, ఆమె కుటుంబ సభ్యులకు సెల్యూట్ చేస్తున్నా. రియా కుటుంబంతో పాటు నా బృందం కూడా వేధింపులు ఎదుర్కొంది, మా ప్రాణాలకు ముప్పు కూడా ఏర్పడింది.''
ఒక సైనిక కుటుంబం తరఫున స్వచ్ఛందంగా పోరాడడం తనకు గర్వంగా ఉందని రియా చక్రవర్తి లాయర్ అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER/SUSHANTSINGHRAJPOOT
ఐదు ఏజెన్సీల దర్యాప్తు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు మిస్టరీని ఛేదించేందుకు, ఇప్పటివరకూ ఐదు దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి.
మొదట్లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, ఆ తర్వాత రోజురోజుకీ కేసు మరింత క్లిష్టతరంగా మారింది.
ముంబయి పోలీస్, బిహార్ పోలీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో దర్యాప్తు చేశాయి. అయితే, ఇది ఆత్మహత్యా? కాదా? అనేది ఇంతవరకూ స్పష్టత రాలేదు.
సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబయి పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, ముంబయి పోలీసుల దర్యాప్తుపై ప్రశ్నలు లేవనెత్తిన సుశాంత్ కుటుంబం బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ తర్వాత, ఈ రెండు కేసుల్లోనూ దర్యాప్తు జరిపిన సీబీఐ, ఇప్పుడు తన దర్యాప్తు నివేదికలను కోర్టుకు సమర్పించింది.
ఈ కేసులో బాలీవుడ్‌లో చురుగ్గా ఉన్న డ్రగ్ సిండికేట్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేయగా, మనీలాండరింగ్ వ్యవహారాలపై ఈడీ దర్యాప్తు జరిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)














