అమెరికా: ఆ 12 దేశాలపై ‘ప్రయాణ నిషేధం’, మరో 7 దేశాలపై పాక్షికంగా..

జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందంటూ 12 దేశాలకు చెందిన ప్రయాణికులు అమెరికాకు రాకపోకలు సాగించకుండా నిషేధం విధిస్తున్నట్టు శ్వేతసౌధం తెలిపింది. ఈ నిషేధ ఉత్తర్వులపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారని చెప్పింది.
అమెరికా నిషేధించిన జాబితాలో అఫ్గానిస్తాన్, మియన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాలు ఉన్నాయి.
మరో ఏడు దేశాలపై కూడా పాక్షికంగా నిషేధం విధించారు. బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్‌మెనిస్తాన్, వెనిజ్వెలా దేశాలకు చెందిన పౌరుల అమెరికా రాకపోకలపై పాక్షిక నిషేధం విధించింది.
జూన్ 9వ తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది.


ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదకరమైన విదేశీ వ్యక్తుల నుంచి అమెరికన్లను కాపాడతానంటూ మాట ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్ తన మాటను నిలబెట్టుకుంటున్నారని వైట్ హౌస్ అధికార ప్రతినిధి అబిగైల్ జాక్సన్ అన్నారు.
సరైన భద్రతా తనిఖీలు లేని, ఓవర్ స్టే వీసా రేటు (వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉండటం) ముఖ్యమైన గుర్తింపు భద్రతా సమాచారాన్ని పంచుకోని నిర్దిష్ట దేశాలకోసమే ఈ ఆంక్షలు అని ఆమె బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్‌తో చెప్పారు. అమెరికా ప్రజా ప్రయోజనాలు, వారి భద్రతకు అధ్యక్షుడు ఎప్పడూ అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇదే మొదటిసారి కాదు
కొత్త ప్రయాణ నిషేధం గురించి వైట్‌హౌస్ చేసిన ప్రకటన ట్రంప్ 2017లో తన మొదటి పాలనా కాలంలో అమలు చేసిన నిషేధం గురించి కూడా మాట్లాడింది. దీనిని తరచుగా 'ముస్లిం నిషేధం' అని పిలుస్తుంటారు.
కొన్ని దేశాలకు చెందిన వారు అమెరికాలోకి రావడాన్ని నిషేధించాలనే ట్రంప్ ప్రణాళిక అనేక చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంది. అనేకసార్లు సవరణకు గురైంది. కాని చివరికు ఇది పూర్తిగా అమల్లోకి వచ్చేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియాలపై వైట్‌హౌస్ తొలుత ప్రయాణ ఆంక్షలు విధించింది. ఆ తర్వాత ఉత్తరకొరియా, వెనిజులా, చాద్ దేశాలవారినీ ఇందులో చేర్చారు.
జాతీయ భద్రతా బెదిరింపులు అమెరికా సరిహద్దులకు చేరకుండా ఈ నిషేధం విజయవంతంగా అడ్డుకుందని ట్రంప్ తెలిపారు.
అధ్యక్షుడిగా ట్రంప్ తన తొలి పదవీకాలంలో ఏడు ముస్లిం మెజార్టీ దేశాలకు చెందిన ప్రయాణికులు అమెరికాలోకి ప్రవేశించకుండా ప్రయాణ నిషేధాన్ని విధిస్తున్నట్టు ప్రకటించారు.
''ఏం జరుగుతోందో మన దేశ ప్రతినిధులు గుర్తించేవరకూ అమెరికాలోకి ముస్లింల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేస్తాం'' అంటూ 2015లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిషేధం విధించారు.
దీంతో అప్పట్లో వేలాది మంది పర్యాటకులు, వలసదారులు, యుఎస్ గ్రీన్ కార్డు హోల్డర్లు ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు,
చాలా మందిని అమెరికా వెళ్లే విమానాలు ఎక్కకుండా మధ్యలోనే తిప్పి పంపారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ వంటి నగరాల్లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు.
నిషేధానికి అనుకూలంగా, వ్యతిరేకంగా నిరసనకారులు విమానాశ్రయాల వద్ద గుమికూడి నిరసనలు తెలిపారు.
కోర్టు తీర్పులు ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి, పరిపాలన ఉత్తర్వులను అనేకసార్లు సవరించారు. దాని పరిధిని వివిధ రకాలుగా కుదించడం, లేదంటే విస్తరించడంలాంటివి చేశారు . 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన 5-4 తీర్పు కింది కోర్టుల తీర్పులు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేస్తూ నిషేధాన్ని కొనసాగించడానికి అనుమతించింది. ఈ విషయంలో ట్రంప్ ఘనవిజయం సాధించడంతో నిషేధం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చింది.
ఇప్పుడు ట్రంప్ తాజాగా చేసిన ప్రయాణ నిషేధ ప్రకటనపై ప్రతిపక్ష డెమొక్రాట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అమెరికాను ఏకాకిని చేస్తుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Protester holds a sign in an airport
హార్వర్డ్‌ని లక్ష్యంగా చేసుకున్న ట్రంప్
కొన్నిదేశాలపై ప్రయాణ నిషేధం విధించడంతో పాటు హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులకు వీసాలు నియంత్రించే ఉత్తర్వుపై కూడా తాను సంతకం చేసినట్టు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో అతి పురాతన విశ్వవిద్యలయం అయిన హార్వర్డ్‌కు, ట్రంప్‌కు మధ్య నెలకొన్న వివాదం అంతకంతకూ పెరుగుతోన్న తరుణంలో అమెరికా అధ్యక్షుని నిర్ణయం చర్చనీయాంశమయింది.
''మన సంస్థల్లో విదేశీ విద్యార్థులు ఉండాలని అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నారు. అయితే ఆ విద్యార్థులు అమెరికాను ప్రేమించే వారై ఉండాలని ట్రంప్ భావిస్తున్నారు'' అని ఒక ఫ్యాక్ట్ షీట్‌లో వైట్ హౌస్ తెలిపింది.
చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారులకు విదేశాల్లో అత్యున్నత విద్యాసంస్థగా హార్వర్డ్ ఉందని ఫ్యాక్ట్ షీట్‌లో ఆరోపణలున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూతురు కూడా 2010లో అక్కడ చదివారని తెలిపింది.
ట్రంప్ నిర్ణయాన్ని ప్రతీకార చర్యగా హార్వర్డ్ అభివర్ణించింది.

ఫొటో సోర్స్, Getty Images
ముప్పు తీవ్రతను బట్టి ప్రయాణ నిషేధం -ట్రంప్
''ఒక ఉగ్రదాడి తర్వాత మరో ఉగ్రదాడి జరుగుతోంది. ప్రమాదకర ప్రాంతాల నుంచి వచ్చి విదేశీ వీసాలపై ఉంటున్నవారు ఈ దాడులు చేస్తున్నారు'' అని ప్రయాణ నిషేధం గురించి వివరిస్తూ చేసిన ప్రకటనలో ట్రంప్ అన్నారు.
''ఓపెన్-డోర్ పాలసీస్''గా పిలిచే బైడన్ ప్రభుత్వ విధానాల వల్ల అమెరికాలో లక్షలాదిమంది అక్రమంగా నివసిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.
''అమెరికాలోకి ప్రవేశించాలనుకునేవారిని స్వేచ్ఛగా, నమ్మకంగా తనిఖీలు చేసే వీలు లేని ఏ దేశం నుంచి వలసదారులను అనుమతించబోము'' అని ట్రంప్ అన్నారు.
ముప్పు తీవ్రతను బట్టి ప్రయాణ నిషేధం అమలు ఉంటుందని, జాబితాలో ఉన్న నిషేధిత దేశాల్లో పరిస్థితులు మెరుగుపడితే సవరణలు ఉంటాయని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కొలరాడో దాడిని ప్రస్తావించిన ట్రంప్
సరైన తనిఖీలు లేకుండా అమెరికాలో ప్రవేశించే విదేశీ పౌరుల నుంచి ఎదురయ్యే తీవ్ర ప్రమాదాలకు కొలరాడో దాడి నిదర్శనమని ట్రంప్ అన్నారు.
వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో ఉంటున్న తాత్కాలిక సందర్శకుల గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు.
''వారు మాకు వద్దు'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Reuters
మినహాయింపులు ఎవరికంటే...
ప్రయాణ నిషేధం విధించినప్పటికీ ఆయా దేశాల్లో కొందరికి దీని నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రధాన క్రీడాపోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు, ప్రత్యేక ఇమ్మిగ్రెంట్ వీసాలు ఉన్న అఫ్గాన్ పౌరులకు, రెండు దేశాల్లో పౌరసత్వం ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














