అమెజాన్ అడవుల్లో ఫ్రాన్స్ హై-సెక్యూరిటీ జైలును ఎందుకు నిర్మించాలనుకుంటోంది?

ఫ్రెంచ్ గయానా

ఫొటో సోర్స్, Architecture Studio

    • రచయిత, నోర్బెర్టో పరేడేస్
    • హోదా, బీబీసీ న్యూస్

ఫ్రెంచ్ గయానా.. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఒక ఫ్రెంచ్ భూభాగం, అక్కడ 1852 నుంచి 1950 తొలినాళ్ల వరకు పీనల్ కాలనీ (బాగ్నే) ఉండేది. పీనల్ కాలనీ అంటే ఖైదీల నివాస స్థలం(జైలు). ఫ్రాన్స్ తరచుగా ఈ జైళ్లను పేద, కొత్తగా వలసరాజ్యాలు ఏర్పడిన ప్రాంతాలలో ఏర్పాటు చేసింది. వారు వద్దనుకున్న ఖైదీలను అక్కడికి పంపించి, వారితో బలవంతంగా పని చేయించేవారు.

'పాపిలాన్' నవల ఆధారంగా అదే పేరుతో 1973లో వచ్చిన సినిమాతో ఈ జైలు ఎక్కువగా ప్రాచుర్యం పొందింది.

ఫ్రాన్స్‌తో పాటు నాటి ఫ్రెంచ్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి పంపించిన 70 వేల మందికి పైగా దోషులకు ఫ్రెంచ్ గయానా ఆవాసంగా ఉండేది.

ఆనాటి చీకటి కాలం ముగిసి దాదాపు 70 ఏళ్లు అవుతుండగా, ఇటీవల ఫ్రెంచ్ ప్రభుత్వం చేసిన ఒక ప్రకటన, ఫ్రెంచ్ గయానా పౌరులకు బాధాకరమైన గతాన్ని మళ్లీ గుర్తుచేసినట్లు అయింది.

అమెజాన్ అటవీ ప్రాంతంలో కొత్తగా ఒక హై-సెక్యూరిటీ జైలును నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఫ్రెంచ్ న్యాయశాఖ మంత్రి గెరాల్డ్ డెర్మానియన్ మే నెలలో ప్రకటించారు.

500 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యంతో ఈ కొత్త జైలు నిర్మిస్తున్నట్లు ఫ్రెంచ్ గయానా రాజధాని కేయెన్‌ పర్యటనలో గెరాల్డ్ వ్యాఖ్యానించారు. ఇందులో మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులలో అత్యంత ప్రమాదరకరమైన వారి కోసం 60 గదులు, రాడికల్ ఇస్లామిస్టుల కోసం ప్రత్యేక విభాగం ఉంటాయని చెప్పారు.

అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ బాస్‌లకు బయటి ప్రపంచంతో సంబంధాల విషయంలో కఠిన నియమాలను అమలు చేయడం ద్వారా వారిని నిలువరించడం లక్ష్యమని వారపత్రిక జర్నల్ డు డిమాంచే (జేడీడీ)తో గెరాల్డ్ చెప్పారు.

ఫ్రెంచ్ గయానాతో పాటు దక్షిణ అమెరికాలోని ఇతర ఫ్రెంచ్ భూభాగాలైన గ్వాడె‌లూప్, మార్టినిక్‌లలో అత్యంత ప్రమాదకరమైన 49 మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలను ఉద్దేశించి.. స్థానిక నేరస్తులను ఖైదు చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తామని గెరాల్డ్ చెప్పినట్లు మీడియా రిపోర్టులు తెలిపాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫ్రెంచ్ గయానా

ఫొటో సోర్స్, AFP/Getty Images

వలసవాదం వైపు మళ్లీ అడుగులు...

మంత్రి గెరాల్డ్ డెర్మానియన్ ప్రకటనతో ఫ్రెంచ్ గయానాలో నిరసనలు మొదలయ్యాయి.

వామపక్ష పార్టీ 'లా ఫ్రాన్స్ ఇసోమిజ్‌'కు చెందిన ఫ్రాంకో-గయానన్ ఎంపీ డేవీ రిమానే

జైలు ఏర్పాటు నిర్ణయాన్ని వామపక్ష పార్టీ 'లా ఫ్రాన్స్ ఇసోమిజ్‌'కు చెందిన ఫ్రాంకో-గయానన్ ఎంపీ డేవీ రిమానే ఖండించారు, ఇది పూర్తి ఏకపక్ష నిర్ణయమని అన్నారు.

''కొత్త జైలు విషయంలో మంత్రి మరెవ్వరినీ, కనీసం ఫ్రాంకో-గయానన్ పార్లమెంట్ సభ్యులను కూడా సంప్రదించలేదు. అందుకే గయానా రాజకీయ నాయకులు, సాధారణ ప్రజానీకం తీవ్ర నిరసన గళం వినిపిస్తున్నారు'' అని డేవీ రిమానే బీబీసీతో చెప్పారు.

''ఫ్రాన్స్ వద్దనుకునే కరడుగట్టిన నేరగాళ్లను ఫ్రెంచ్ గయానాకు పంపించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఇలా చేయడమంటే ఒక భయానకమైన, బాధాకరమైన గతాన్ని మాకు గుర్తుచేయడమే'' అని ఆయన అన్నారు.

''మేం ఫ్రాన్స్ దేశపు చెత్తబుట్ట కాదు'' అంటూ రిమానే తీవ్రంగా వ్యతిరేకించారు.

జైలు

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఖైదీల కాలనీగా పోలిక సరికాదు: గెరాల్డ్

''ప్రతిపాదిత జైలును అప్పటి ఖైదీల కాలనీతో పోల్చడం.. దేశాన్ని, జైళ్ల అడ్మినిస్ట్రేషన్‌ను అవమానించడమే'' అని మంత్రి గెరాల్డ్ అన్నారు.

కాగా, ఫ్రెంచ్ గయానా ప్రజాప్రతినిధులను సంప్రదించిన తర్వాతే జైలు నిర్మిస్తామని ఫ్రెంచ్ ప్రధాన మంత్రి ఫ్రాంకోయిస్ బేరో బుధవారం బీఎఫ్ఎంటీవీతో చెప్పారు.

రూ.3,900 కోట్ల ప్రాజెక్టు

మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఫ్రెంచ్ గయానా ఒక ముఖ్యమైన మార్గంగా ఉందని భావిస్తుంటారు, ఎందుకంటే ఇది కొలంబియా, పెరూ వంటి దేశాలకు దగ్గరగా ఉంది, ఇక్కడ చాలా మాదకద్రవ్యాలు తయారవుతుంటాయి.

ఫ్రెంచ్ ప్రభుత్వం, మీడియా కథనాల ప్రకారం, ఫ్రాన్స్ ప్రధాన భూభాగంలో వాడే కొకైన్‌లో దాదాపు 20 శాతం ఫ్రెంచ్ గయానా నుంచే వస్తోంది.

ఫ్రెంచ్ గయానా వాయవ్య ప్రాంతంలో, సెయింట్ లారెంట్ డు మారోని పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో అమెజాన్ అడవుల్లోని ఒక మారుమూల నిర్జన ప్రాంతంలో ప్రతిపాదించిన ఈ జైలు ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.3,900 కోట్లు (400 మిలియన్ యూరోలు). 2028 నాటికల్లా ఈ జైలును ప్రారంభించాలనుకుంటన్నారు.

ఈ కొత్త ప్రాజెక్టు జైలు క్రూరత్వ రూపాన్ని సూచిస్తోందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌కు చెందిన క్రిమినాలజీ నిపుణులు మారియన్ వానియర్ అన్నారు. ఫ్రాన్స్ నుంచి వేల మైళ్ల దూరంలోని అత్యంత మారుమూల ప్రాంతంలో ఖైదీలు ఉండబోతున్నారని ఆమె చెప్పారు.

''ఫ్రెంచ్ గయానాలో ఉన్న ఏకైన జైలు ఎదుర్కొంటున్న ఖైదీల తాకిడి సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా ఒక జైలు నిర్మించాలనేది తొలుత ఆలోచన. కానీ, ఇప్పుడు ప్రభుత్వం కరుడుగట్టిన నేరగాళ్లను, డ్రగ్ అక్రమ రవాణాదారులను ఫ్రాన్స్ నుంచి ఫ్రెంచ్ గయానాకు పంపాలనుకుంటుంది'' అని ఆమె బీబీసీతో అన్నారు.

పోలీసులు

ఫొటో సోర్స్, API/Gamma-Rapho/Getty Images

'పాపిలాన్'తో వెలుగులోకి..

ఫ్రెంచ్ రచయిత హెన్రీ చారియేర్ ప్రసిద్ధ నవల 'పాపిలాన్'లో పేర్కొన్న పీనల్ కాలనీ ఉండే డెవిల్స్ ఐలాండ్‌లోకి రావడానికి పోర్టుగా సెయింట్ లారెంట్ డు మారోని పేరొందింది.

డెవిల్స్ ఐలాండ్ జైలులో అత్యంత భయానకమైన పరిస్థితులే కాకుండా వ్యాధులు, తప్పించుకునే ప్రయత్నాలలో మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉండేది.

చేయని నేరానికి (హత్య కేసులో) జీవిత ఖైదుపడిన వ్యక్తి డెవిల్స్ ఐలాండ్ జైలులో ఎదురైన అనుభవాల జ్ఞాపకమే 'పాపిలాన్'.

దట్టమైన అడవిలో సంక్లిష్ట పరిస్థితులు, కఠిన నిబంధనలను దాటుకొని పీనల్ కాలనీ నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసిన ఖైదీ, చివరకు సఫలమవుతారు.

'పాపిలాన్' నవల ఆధారంగా రెండు సినిమాలు వచ్చాయి. వాటిలో మొదటిది స్టీవ్ మెక్‌క్వీన్, డస్టిన్ హాఫ్‌మాన్ ప్రధాన పాత్రలతో 1973లో వచ్చింది.

మానవహక్కుల ఉల్లంఘన

ఫ్రెంచ్ గయానా చీకటి చరిత్ర తాలూకు చేదు జ్ఞాపకాలతో పాటు మానవ హక్కుల కోణంలోనూ ఈ జైలు ప్రాజెక్ట్ వివాదాస్పదమైంది.

ఖైదీలను అలాంటి మారుమూల ప్రాంతాలకు తరలించడం వివాదాలకు తావిస్తుందని మారియన్ వానియర్ అన్నారు.

''వ్యక్తిగత, కుటుంబ జీవితానికి సంబంధించిన గౌరవానికి యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్‌లోని సెక్షన్ 8 రక్షణ కల్పిస్తుంది. సమ్మతి లేకుండా ఖైదీలను తమ కుటుంబాలకు దూరంగా తరలించడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని యూరోపియన్ కోర్టు ఆఫ్ జస్టిస్ ఇప్పటికే ఆదేశాలిచ్చింది'' అని ఆమె చెప్పారు.

''గయానాలో తరచుగా డెంగీ, చికున్‌ గన్యా వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఆసుపత్రుల్లో తగిన వైద్య పరికరాలకు కొరతే'' అన్నారు.

తగిన వైద్య సౌకర్యాలు లేకుండా బంధించడం సహా అమానవీయత, చిన్నచూపు చూడటాన్ని కన్వెన్షన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ (ఈసీహెచ్‌ఆర్) ఆర్టికల్ 3 నిషేధిస్తోందని వానియర్ ప్రస్తావించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)