అమెరికా: ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను రెట్టింపు చేసిన ట్రంప్

డోనల్ట్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బ్రాండన్ డ్రెనాన్, నటాలీ షెర్మాన్
    • హోదా, బీబీసీ న్యూస్

స్టీల్, అల్యూమినియం దిగుమతులపై ప్రస్తుతం ఉన్నసుంకాలను రెండింతలు చేస్తున్నట్టు, 25 శాతం టారిఫ్‌లను 50 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఈ చర్య చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక ఉక్కు పరిశ్రమకు ఊతమిస్తుందని పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ చెప్పారు.

అమెరికా స్టీల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ భాగస్వామ్యంతో ఈ ప్రాంత ఉక్కు ఉత్పత్తిలో 14 బిలియన్ డాలర్లు(సుమారు రూ. లక్ష కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. కానీ తుది ఒప్పందాన్నితానింక ఆమోదించలేదని ఆ తరువాత విలేఖరులకు చెప్పారు.

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడై జనవరిలో అధికార పగ్గాలు అందుకున్నప్పటి నుంచి సుంకాల విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరిలో ఇది తాజా పరిణామం.

ఉక్కు కార్మికులతో నిండిన సభలో ట్రంప్ ప్రసంగిస్తూ ఉద్యోగుల తొలగింపులు, అవుట్‌సోర్సింగ్ ఉండవని, త్వరలోనే ప్రతి అమెరికా ఉక్కు కార్మికుడికి 5 వేల డాలర్ల (సుమారు రూ. 42 లక్షలు) బోనస్ అందుతుందన్నారు.

అమెరికా, జపాన్ వాణిజ్య ఒప్పందం గురించి ఉక్కు కార్మికుల ప్రధాన ఆందోళనలలో .. వేతన, నియామకాలను నియంత్రించే వర్కర్స్ యూనియన్ ఒప్పందాన్ని జపాన్ ఎలా గౌరవిస్తుందనేది ఒకటి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా స్టీల్ మనుగడకే సుంకాలు

2018లో తన తొలి పరిపాలన కాలంలో అమలుచేసిన 25 శాతం సుంకాల ద్వారా పిట్స్‌బర్గ్‌లోని అమెరికా అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ యూఎస్ స్టీల్‌ను కాపాడానంటూ ట్రంప్ తన ప్రసంగం ప్రారంభించారు.

యూఎస్ స్టీల్‌ మనుగడకు సుంకాలను 50 శాతానికి పెంచడం ఓ మార్గమని చెప్పారు.

50 శాతం సుంకాల కారణంగా వారు తమ దేశ సరిహద్దులు దాటి రాలేరని, ఎన్నడూలేనట్లుగా పెన్సిల్వేనియా స్టీల్‌ను అమెరికాకు వెన్నెముకగా నిలుపుతామని అన్నారు.

ఇటీవల కాలంలో అమెరికాలో ఉక్కు తయారీ క్షీణ దశకు చేరుకుంది. మరోవైపు చైనా, భారత్, జపాన్ ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానానికి చేరాయి.

అమెరికా వినియోగించే మొత్తం ఉక్కులో నాలుగో వంతు దిగుమతి చేసుకోవడం, మెక్సికో, కెనడా ఉక్కుపై అమెరికా ఆధారపడటం ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది.

ట్రంప్ గ్లోబల్ టారిఫ్‌ల చట్టబద్ధతపై న్యాయపోరాటం జరుగుతున్న నేపథ్యంలో, సుంకాలను నిలిపివేయాలని అంతర్జాతీయ ట్రేడ్ కోర్టు ఆదేశించిన తరువాత అప్పీల్ కోర్టు వీటి కొనసాగింపునకు అనుమతించింది.

ఈ దావాలో ఉక్కు, అల్యూమినియంపై ట్రంప్ విధించిన సుంకాల సంగతి లేదు.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఉక్కు కార్మికులకు మంచిరోజు’’

''ఉక్కు కార్మికులకు ఇది మంచి రోజు'' అని ట్రంప్ ర్యాలీలో పాల్గొన్న స్థానిక యునైటెడ్ స్టీల్‌ వర్కర్స్ సంఘ సభ్యుడు జోజో బర్గెస్ బీబీసీతో అన్నారు.

నిప్పన్ స్టీల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న వివరాలను వెల్లడించిన తర్వాత జోజో బర్గెస్ ఈ ఒప్పందంపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన పెన్సిల్వేనియా నగర మేయర్‌గా ఉన్నారు.

ఈ ప్రాంతంలో కొత్త తరం ఉక్కు కార్మికుల సృష్టికి ఈ ఒప్పందం సాయపడుతుందని తెలిపారు.

ట్రంప్ తన తొలి పాలనా కాలంలో విధించిన స్టీల్ టారిఫ్‌ల కారణంగా తరువాతి సంవత్సరాల్లో "సంపాదన పెరిగింది" అని ఆయన గుర్తు చేశారు.

ట్రంప్ మద్దతుదారుగా ఆయన తనపై ముద్ర వేసుకోనప్పటికీ, గత రెండు దశాబ్దాలుగా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థికే తాను ఓటేస్తున్నట్లు తెలిపారు.

50 శాతం ఉక్కు ఉత్పత్తి చైనాదే

ట్రంప్ సుంకాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఆందోళనలకు దారితీసింది.

అమెరికా, దాని సన్నిహిత భాగస్వాములతో పాటు ఇతర దేశాల మధ్య సంబంధాలలో గందరగోళం కారణంగా ప్రపంచమార్కెట్లు తలకిందులయ్యాయి.

ఈ సుంకాలు ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా సంబంధాలను ఇబ్బందికి గురి చేశాయి. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి సుంకాల యుద్ధాన్ని మొదలు పెట్టాయి.

గత నెలలో జెనీవాలో జరిగిన చర్చల సందర్భంగా సుంకాల విషయంలో కుదుర్చుకున్న సంధిని చైనా ఉల్లంఘించిందంటూ ఎటువంటి వివరాలు అందించకుండా ట్రంప్ ఆరోపించారు.

ఈ ఒప్పందం కింద అంగీకరించిన నాన్ టారిఫ్ బారియర్స్‌ను చైనా తొలగించడం లేదని ఆ తరువాత అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ తెలిపారు.

అమెరికా కూడా తప్పులు చేస్తుందంటూ చైనా ప్రత్యారోపణలు చేసింది.

చైనా ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ తయారీదారు.వరల్డ్ స్టీల్ అసోసియేషన్ 2022 గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తిలో సగానికి పైగా చైనాదే.

''స్టీల్ లేకపోతే, మీకు దేశం లేనట్లే. మీకు దేశం లేకపోతే, మీరు సైన్యాన్ని తయారు చేసుకోలేరు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ఆర్మీ ట్యాంకుల నుంచి స్టీల్‌ను తీసుకొచ్చేందుకు చైనా వెళ్దాం పదండి'' అని పిట్స్‌బర్గ్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్ వ్యంగ్యంగా మాట్లాడారు.

సుమారు గంట పాటు ప్రసంగించిన ట్రంప్, జపాన్ నిప్పన్ స్టీల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

కానీ, మరిన్ని వివరాలను తెలియజేయలేదు. ఒప్పందం పూర్తయినట్లు ఇరు దేశాల కంపెనీలు కూడా ధ్రువీకరించలేదు.

అమెరికాలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు డోనల్డ్ ట్రంప్ జపాన్ నిప్పన్ స్టీల్‌ను ఒప్పించినట్లు వైట్ హౌస్ అధికారులు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)