ఛావా, ఔరంగజేబు, నాగ్‌పూర్ హింస: చారిత్రక సినిమాలు మత సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నాయా?

ఛావా, ఔరంగజేబు సమాధి, నాగ్‌పూర్‌ హింస

ఫొటో సోర్స్, Facebook/Laxman Utekar

    • రచయిత, వినాయక్ హోగడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక సినిమా రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారడం అరుదు. దైనందిన సామాజిక జీవితంపై ప్రభావం చూపడం కూడా చాలా తక్కువ. చారిత్రక చిత్రం 'ఛావా' మహారాష్ట్ర రాజకీయాలు, ప్రజల జీవితాలపై అలాంటి ప్రభావం చూపిస్తోందా? అనే చర్చ మొదలైంది.

"ఔరంగజేబు సమాధిని ధ్వంసం చెయ్యాలి" అనే డిమాండ్, నాగ్‌పూర్ హింస లాంటి కొన్ని అంశాల వెనుక నేపథ్యం ఏమిటి?

ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఇలాంటి ప్రశ్నలు ఉదయించడం సహజమే అనిపించవచ్చు.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మత సామరస్యాన్ని కాపాడటం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత.

అయితే రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా నాగ్‌పూర్ హింస గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ "నేను ఏ సినిమాను నిందించడం లేదు. ఛావా, ఛత్రపతి శంభాజీ మహరాజ్ గురించి వాస్తవ గాధను మన ముందుకు తెచ్చింది. అది భారీ స్థాయిలో ప్రజల్లో భావోద్వేగాలను రగిలించింది. ఔరంగ జేబు మీద ఆగ్రహం బయటకు వస్తోంది" అన్నారు.

ప్రధాని మోదీ నుంచి మహారాష్ట్రలో గల్లీ నాయకుల వరకు అధికార పార్టీకి చెందిన నేతలంతా ఛావా సినిమాను ప్రస్తుతించడమే కాకుండా, ఆ చిత్రాన్ని చూడాలని ప్రజలకు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా టిక్కెట్లను ఉచితంగా పంపిణీ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం కోసం ఇలాంటి చిత్రాలను నిర్మిస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. కొన్ని సినిమా కథల్లో వాస్తవిక కోణం, వాటిని తెర మీద చూపడం వెనుక ఉద్దేశాల గురించి చర్చ మొదలైంది.

ఇలాంటి చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు బాగా వస్తున్నాయి.

"కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, ది సబర్మతి ఎక్స్‌ప్రెస్" చిత్రాలు ఈ కోవకు చెందినవే.

ఇటీవలి కాలంలో ఇలాంటి చిత్రాలు పరంపరగా వస్తున్నాయి.

నాగ్‌పూర్‌లో హింసకు ముందే 'ఔరంగజేబు సమాధి' వార్తల్లో ఉంది.

ఛావా చిత్రంతోనే ఇది మొదలైంది. సినిమా విడుదల తర్వాత దాని తీవ్రత పెరిగింది.

ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాలు మత సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నాయా?

సినిమాల ద్వారా చరిత్రను తెలుసుకోగలమా?

అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా, వాస్తవాలకు దూరంగా సినిమాలు నిర్మిస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలు ఎంత వరకు నిజం?

ఛావా, ఔరంగజేబు సమాధి, నాగ్‌పూర్‌ హింస

ఫొటో సోర్స్, instagram/vickykaushal

ఫొటో క్యాప్షన్, ఛావా చిత్రాన్ని చూడాలని కొంతమంది అధికార పార్టీ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు.

సినిమాల ద్వారా చరిత్ర తెలుసుకోవచ్చా?

చారిత్రక చిత్రాలను ఎలా అర్థం చేసుకోవాలనే అంశం గురించి నటుడు కులకర్ణితో బీబీసీ చర్చించింది.

"చారిత్రక చిత్రాలను అభినందించే స్థాయికి మన సమాజం ఇంకా ఎదగలేదు.ఏదైనా కళ కారణంగా హింస, విధ్వంసం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. అలా జరిగితే అది కళ కాదు. మరేదైనా కావచ్చు" అని కులకర్ణి బీబీసీతో చెప్పారు.

సినిమా, చరిత్రకున్న సరిహద్దుల గురించి దర్శకుడు వరుణ్ సుఖ్‌రాజ్ మాట్లాడుతూ

"చరిత్ర చాలా క్లిష్టమైన సబ్జెక్ట్. అది సినిమాల ద్వారా అర్థం చేసుకునేది కాదు" అన్నారు.

"మీరొక కాలాన్ని అర్థం చేసుకోవాలంటే అది సినిమా ద్వారా సాధ్యం కాదు. ఫలానా మహారాజు కాలంలో జరిగిందంతా ఒక నిముషంలో అనే తరహా హైడ్‌లైన్లకు మనం అలవాటు పడిపోతున్నాం" అని చరిత్ర కారుడు జయసింగరావు పవార్ బీబీసీతో చెప్పారు.

"మేము ఇంకా చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. అలాంటిది ఒక సినిమా చూసి అదే చరిత్ర అని ఎలా చెబుతాం? చరిత్రలో ఇదే జరిగింది అని కచ్చితంగా ఎలా చెప్పగలం. చరిత్రను అనేక కోణాల్లో చూడాల్సి ఉంటుంది. అలాంటి దాన్ని ఒక్క సినిమా ద్వారా అర్థం చేసుకోలేం" అని చరిత్ర మీద అధ్యయనం చేసిన ఏ.హెచ్ సలుంఖే చెప్పారు.

"మనం చరిత్రను 'చరిత్ర' లానే చూస్తున్నామా?" అని ప్రశ్నించారు సీనియర్ ఫిల్మ్ స్కాలర్ శ్యామల వనరసే . ఆమె 'ఛత్రపతి అభ్యాస్' అనే పుస్తకం రాశారు.

"చరిత్రలో ప్రతి వ్యక్తికి అనేక కోణాలు ఉంటాయి. ఆ వ్యక్తి ఇమేజ్‌ను మీరు ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నారనే దాన్ని బట్టే మీకు కావల్సిన కోణాన్ని ఎంచుకుంటారు. చారిత్రక చిత్రాలలో వ్యక్తులను చరిత్ర ప్రకారం సృష్టించడం లేదు. మీరు ఆ వ్యక్తిగురించి ఎలా ఆలోచిస్తున్నారో అలాగే సృష్టిస్తున్నారు. ప్రస్తుతం విడుదలవుతున్న చారిత్రక చిత్రాలు వాటిని నిర్మిస్తున్న వారి బుర్రలో ఎలాంటి చరిత్ర ఉందో తెలుపుతున్నాయే తప్ప నిజమైన చరిత్ర తెలియడంలేదు"అని శ్యామల చెప్పారు.

ఛావా, ఔరంగజేబు సమాధి, నాగ్‌పూర్‌ హింస

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చరిత్రను సినిమాల ద్వారా అవగాహన చేసుకోవడం అసాధ్యమని చరిత్రకారుడు జయసింగరావు పవార్ అన్నారు.

సినిమాల్లో చరిత్రను వక్రీకరిస్తున్నారా?

ఇటీవల మధ్య యుగం నాటి చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాల సంఖ్య పెరిగిందని నటుడు కిరణ్ మానే అన్నారు. వాటిని కూడా అధికారంలో ఉన్న వారుకోరుకుంటున్నట్లుగా, కథను తమకు అనుకూలంగా మార్చుకుని నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు.

ఇలాంటి సినిమాల్లో ఒకటి రెండు వాస్తవ అంశాలు ఉంటే, పది, పదిహేను అంశాలను వక్రీకరిస్తున్నారని కిరణ్ మానే అభిప్రాయపడ్డారు.

"ప్రేక్షకులు రాజుల మీద ప్రేమతో ఈ చిత్రాలను ఆదరిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తున్నారు. నటుడు రణదీప్ హూడా సావర్కర్ గురించి సినిమా తీశారు. ఆ చిత్రాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అలాగే కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' అనే సినిమా తీశారు. అది ఫ్లాప్ అయింది. మోదీ మీద తీసిన సినిమా కూడా ఫ్లాప్ అయింది. ప్రేక్షకులు రాజుల మీద సినిమాలు మాత్రమే చూస్తారు. రాజుల సినిమాల్లో కూడా వారి పూర్తి వ్యక్తిత్వాన్ని కాకుండా, యుద్ధాలను, ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అంశాలను మాత్రమే ఎంచుకుంటున్నారు" అని కిరణ్ మానే చెప్పారు.

"శివాజీ స్వరాజ్య స్థాపన కోసం కత్తి పట్టారు. ఆయన హిందూ రాజులతోనూ పోరాడారు. కార్మికులు, రైతుల కోసం ఆయన స్వరాజ్యాన్ని స్థాపించాలని భావించారు. అయితే అదంతా పక్కన పెట్టి ఆయన కేవలం ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడినట్లు మాత్రమే చూపించారు" అని కిరణ్ మానే బీబీసీతో అన్నారు.

చారిత్రక సినిమాలు తమశక్తినే తప్ప చరిత్రను ప్రదర్శించడం లేదని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరీష్ వాంఖడే చెప్పారు.

ఛావా, ఔరంగజేబు సమాధి, నాగ్‌పూర్‌ హింస

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సినిమా కథలను రాజకీయాలు శాసించడం లేదని, మార్కెట్ ఆధారంగానే సినిమాలు వస్తున్నాయని నటుడు కిరణ్ మానే అభిప్రాయ పడ్డారు.

సినిమాల వల్ల మత సామరస్యం దెబ్బ తింటుందా?

ఈ చర్చ ఇప్పుడు ఛావా చిత్రం లేదా మధ్య యుగపు చరిత్ర ఆధారంగా నిర్మించిన చిత్రాలకు పరిమితం కాలేదు.

'ఛావా'తో పాటు 'ది కేరళ స్టోరీ' 'ది సబర్మతి ఎక్స్‌ప్రెస్' 'హమ్ దో హమారే బారా' సినిమాలు ప్రభుత్వానికి అనుకూలంగా ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని విస్తరింప జేశాయని ప్రొఫెసర్ హరీష్ వాంఖడే ఆరోపిస్తున్నారు.

సినిమాల్లో హిందూత్వను ప్రమోట్ చేయడం కొత్త ట్రెండ్ కాదు. అయితే బోర్డర్, గదర్ ఏక్ ప్రేమ్ కథ లాంటి చిత్రాలు హిట్ అయిన తర్వాత ఆ జానర్ పాపులర్ అయింది. 90ల తర్వాత ఈ ట్రెండ్‌కు ఆదరణ పెరిగిందని ఆయన చెప్పారు.

"ఈ జానర్‌లో వచ్చిన సినిమాల్లో ముస్లిం వ్యతిరేకత అనేది సెంటిమెంట్‌గా మారింది. ఈ కోవలో వచ్చిన సినిమాల్లో ముస్లింల పాలనలో హిందువులు అణచివేతను ఎదుర్కొన్నారని చెబుతూ ముస్లింలను హిందువులకు శత్రువులుగా చూపిస్తున్నారు. ప్రజలను మతపరంగా విడదీయడానికి సినిమా సాధనంగా మారింది. ఇది హిందూత్వ రాజకీయ భావనను ప్రచారం చేస్తోంది" అని ఆయన అన్నారు.

అయితే దీన్ని యోగేష్ సోమన్ వ్యతిరేకిస్తున్నారు.

"కశ్మీర్ ఫైల్స్‌ లాంటివి ప్రచార చిత్రాలు అయితే, 20ఏళ్ల క్రితం వచ్చిన ఫనా, మిషన్ కశ్మీర్ సంగతేంటి? ఈ సినిమాల్లో సైన్యం టెర్రరిస్టులకు సాయం చేస్తున్నట్లు చూపించారు. ఆ సమయంలో ప్రేక్షకుల ఆలోచనలు, వారు ఏం కోరుకుంటున్నారు అనే దాన్ని బట్టే కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి" అని సోమన్ తెలిపారు.

మీడియా వ్యవహార శైలి, పదే పదే ఒక అంశం గురించి చెప్పడం లాంటివి ప్రస్తుత పరిస్థితికి కారణం కావచ్చని గిరీష్ కులకర్ణి భావిస్తున్నారు.

అయితే సినీ పరిశ్రమలో అధికార పార్టీ సానుభూతి పరులు, అధికార పార్టీకి చెందిన సంపన్నుల జోక్యం పెరగడం కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చని వరుణ్ సుఖ్‌రాజ్‌ చెప్పారు.

అయితే శ్యామల వనరసే కొత్త అంశం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాల వల్ల మతాల మధ్య విభేదాలు ఏర్పడటం లేదని, ఇప్పటికే ఉన్న విభేదాలను అవి మరింత పెంచి పోషిస్తున్నాయని ఆమె అభిప్రాయ పడ్డారు.

ఛావా, ఔరంగజేబు సమాధి, నాగ్‌పూర్‌ హింస

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, "ఔరంగజేబుపై ప్రజల్లో ఆగ్రహం బయటకు వస్తోంది. ఛావా ప్రజల్లో భావోద్వేగాలను రగిలించింది" అని ముఖ్యమంత్రి ఫడణవీస్ అసెంబ్లీలో చెప్పారు.

సినిమా-రాజకీయాలు

"ఈ సినిమాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయని అనుకోవడం లేదు. సినిమాను వాణిజ్య కోణంలోనే తీస్తారు. వాటికి ప్రభుత్వాలతో పార్టీలతో ఏం అవసరం ఉంటుంది?" అని యోగేష్ సోమన్ ప్రశ్నించారు.

అయితే దర్శకుడు వరుణ్‌ సుఖ్‌రాజ్ మాత్రం సినిమాలకు, రాజకీయాలకు సంబంధం ఉందని, అందులోనూ అధికారంలో ఉన్నవారికి ఎక్కువగా ఉందన్నారు.

"గత పాలకులు సినిమాను ఇలా ఉపయోగించుకోలేదు. నెహ్రూ సిద్ధాంతాల ఆధారంగా గతంలో చాలా సినిమాలు వచ్చాయి. 1947 తర్వాత సినిమా, కళలు కలిసిపోయాయి. అంతకు ముందు అవి వేర్వేరుగా ఉండేవి. ఆ రోజుల్లో నేతలు సామాజిక పునరుజ్జీవం గురించి ఆలోచించేవారు. ప్రస్తుత పాలకుల ఆలోచనలు ఏమిటి? ప్రస్తుత నాయకులు భయపడుతున్నారు. అదే సమస్య" అని ఆయన చెప్పారు.

తమిళ్ సినిమాను దీనికి ఉదాహరణగా చూపించారు ప్రొఫెసర్ హరీష్ వాంఖడే.

"దక్షిణాది సినిమా, ముఖ్యంగా తమిళనాడు ద్రవిడ రాజకీయ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు సినిమాను వాడుకుంది. హిందీ సినిమాల్లో ఇలా జరగలేదు. హిందూత్వ అతివాదాన్ని ప్రచారం చేసేందుకు సినిమాను ఇలా ఉపయోగించుకోవడం కొత్త విధానంగా కనిపిస్తోంది" అని హరీష్ వాంఖడే చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)