యోగా అంటే ఆసనాలేనా, మనం చేస్తున్నది అసలు యోగాయేనా?

యోగాసనాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యోగా గురించి తెలిసిన, దాని గురించి విన్న వారిలో చాలా మందికి ఒక విషయం స్పష్టంగా తెలుసు. యోగా అంటే ఆసనాలు అని. ఇంకొందరికి ధ్యానం కూడా యోగాలో భాగం అని తెలుసు. అయితే, యోగా అంటే ఆసనాలు, ధ్యానం మాత్రమేనా, అసలైన యోగాలో ఏముంది?

యోగా ఎప్పుడు పుట్టింది అనే దానిపై స్పష్టత లేదు. కానీ ప్రాచీన భారతదేశంలో పతంజలి అనే మహర్షి యోగ సూత్రాలను క్రోడీకరించి 196 సూత్రాల్లో సంస్కృతంలో అందించారు. అంటే యోగాను కనిపెట్టింది పతంజలి అని కాదు. ఆయన దాన్ని స్థిరీకరించి, యోగ సూత్రాలు రాశారు.

ఈ గ్రంథంలో సమాధి, సాధన, విభూతి, కైవల్య అనే నాలుగు భాగాలు ఉంటాయి.

''యోగశ్చిత్తవృత్తినిరోధః'' అని పతంజలి వర్ణించారు. అంటే మనసు పరిపరివిధాల పోకుండా ఆపగలిగేది యోగా అని అర్థం చెప్పుకోవచ్చు. ఆయన కాకుండా స్వాత్మారమ ముని వంటి చాలా మంది ఈ ప్రక్రియ గురించి ఎంతో రాశారు, చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యోగాసనాలు

ఫొటో సోర్స్, Getty Images

నిజానికి యోగా అంటే శారీరక వ్యాయామం మాత్రమే కాక, శరీరం, మనసుతో పాటు చేసే ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించిన ఒక సాధనం.

ప్రాచీన భారతదేశంలో వివిధ రూపాల్లో ఇది విలసిల్లింది. హిందూ మతంతో పాటు, బౌద్ధ, జైన, సిక్కు మతాల్లో దీనికి స్థానం ఉంది. హిందూ మతంలో శివుడు, బౌద్ధ మతంలో బుద్ధుడు ధ్యాన ముద్రలో కనిపించే చిత్రాలు అనేకం కనిపిస్తాయి.

ప్రాచీన భారతదేశంలో హిందూ, బౌద్ధ, జైన రుషులతో పాటు ఆధునిక కాలంలో హిందూ, బౌద్ధ గురువులు అనేకమంది యోగాను ప్రచారం చేయడం, దానిపై వ్యాఖ్యానాలు చెప్పడం వంటివి చేస్తూనే ఉన్నారు. ఉపనిషత్తులు, భగవద్గీత, యోగ వాశిష్టం వంటి హిందూ గ్రంథాలతో పాటు బౌద్ధ గ్రంథాల్లో యోగా గురించిన ప్రస్తావనలు ఉన్నాయి.

ఇది కాక హిందూ మతంలో దైవాన్ని చేరుకునే మార్గాల్లో కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం, రాజ యోగం అనే మార్గాలు కూడా ఉన్నాయి.

వీటిలోని రాజయోగంలో ఒక భాగంగా అష్టాంగ యోగం ఉందని కొందరు చెబుతారు.

యోగాసనాలు

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు మనం మాట్లాడుతున్న యోగా, ఆసనాలు, ధ్యానం.. ఇవన్నీ అష్టాంగ యోగంలోని భాగాలే. యోగాను అర్థం చేసుకోవాలంటే అష్టాంగ యోగా గురించి తెలుసుకోవాలి అంటారు యోగా శిక్షకులు.

హైదరాబాద్ రామకృష్ణ మఠంలో యోగా శిక్షకుడిగా పనిచేస్తున్న నేతికర్ లివాంకర్, మెహదీపట్నం దగ్గరలో ప్రణవ అథ యోగ సంస్థ నిర్వాహకుడు సీహెచ్ వీరన్న చెప్పిన వివరాల ప్రకారం, అష్టాంగ యోగాలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే ఎనిమిది భాగాలు ఉంటాయి.

వాటిలో మూడు, ఆరు, ఏడో భాగాలైన ఆసన, ప్రాణాయామ, ధ్యానాలే ఇప్పుడు ఎక్కువ మంది నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

వాటిని ఈ క్రమంలో కాకుండా తమకు తోచినట్టుగానే నేర్చుకుంటున్నారు.

ముందుగా ఆ ఎనిమిది భాగాల ప్రత్యేకతలు చూద్దాం. లివాంకర్, వీరన్న చెప్పిన ప్రకారం..

యమ: ఇది మనిషి నడవడికకు సంబంధించినది. ఇందులో ఐదు రకాలు ఉంటాయి.

  • సత్య: నిజం మాట్లాడడం, అబద్ధాలాడకపోవడం
  • అహింస: హింస లేకుండా ఉండడం
  • బ్రహ్మచర్య: బ్రహ్మచర్యం పాటించడం
  • ఆస్తేయ: దొంగతనం చేయకపోవడం, పరుల సొమ్ము ఆశించకపోవడం
  • అపరిగ్రహ: దురాశ లేకుండా, అన్నీ తనవద్దే ఉండాలనే ఆశ లేకుండా ఉండడం

నియమ: ఇది కూడా జీవన విధానానికి సంబంధించినదే.

  • శౌచ: శుభ్రత (శరీరం, మనసు, మాట)
  • సంతోష: ఆనందంగా ఉండడం
  • తపస్య: నిరంతర ధ్యానం
  • స్వాధ్యాయ: నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండడం
  • ఈశ్వర ప్రణిధానం: దేవునిపై ఆసక్తి కలిగి ఉండడం.

ఆసన: ప్రస్తుతం మనం చూస్తున్న యోగాసనాలన్నీ ఈ విభాగంలోకి వస్తాయి.

ప్రాణాయామ: ఊపిరి పీల్చుతూ చేసే వ్యాయామం

ప్రత్యాహార: ప్రాపంచిక విషయాల నుంచి జ్ఞానేంద్రియాలను దూరంగా ఉండడం

ధారణ: ఒకే అంశంపై ధ్యాస పెట్టడం

ధ్యాన: ధ్యానం చేయడం

సమాధి: సమాధి అంటే మరణం కాదు. సమాధి స్థితి. దీనికి విస్తృత ఆధ్యాత్మిక అర్థం ఉంది. యోగ సాధనలో దీన్ని అత్యున్నత స్థితిగా, రుషులు మాత్రమే సాధించగలిగిన స్థితిగా చెబుతారు. ఆత్మను పరమాత్మతో కలపడం సమాధి స్థితి అని లివాంకర్ వివరించారు.

నిజానికి ఈ 8 అంశాలకీ విస్తృతమైన అర్థాలు, వ్యాఖ్యానాలు, ఒక్కో దానిపై ఒక్కో పుస్తకం రాసేంత సమాచారం ఉంది. స్థూలమైన అవగాహన కోసం, యోగా గురువులు చెప్పిన ఆయా అర్థాలను ఇక్కడ ఇచ్చాం.

యోగాసనాలు

ఫొటో సోర్స్, UGC

''చాలా మంది ఇవన్నీ చేయలేరు. వారు నేరుగా ఆసనాలు, ధ్యానం మాత్రమే చేయాలి అనుకుంటారు.'' అన్నారు నేతికర్ లివాంకర్.

''యోగా నేర్చుకునే వారు ముందుగా యమ, నియమాలు పాటించాలి. తరువాతే ఆసనాలు. కానీ ఇది చాలా పాత పద్ధతి. ఇప్పుడు ఎవరూ చేయడం లేదు.'' అని బీబీసీకి చెప్పారు వీరన్న.

''మేం మా విద్యార్థులకు ఒకటే చెబుతాం. యమ, నియమాల్లో అన్నీ కాకపోయినా, కొన్ని అయినా పాటించాలని. సత్యం, అహింస.. ఇలా ఏదో ఒక సూత్రం పాటిస్తూ ఉంటే అది కూడా మనలను సాధనలో ముందుకు తీసుకువెళ్తుంది. మొత్తంగా మీ మనసును అదుపులో ఉంచుకోగలగడానికి ముఖ్య సాధనం యోగా. ఏదో ఒక నియమంతో ఆ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.'' అని లివాంకర్ చెప్పారు.

''ప్రస్తుతం యోగా అందరూ శారీరక ఆరోగ్యం కోసం చేస్తున్నారు. కానీ దాని అసలు ఉద్దేశం మానసిక ఆరోగ్యం,భావోద్వేగాలపై అదుపు, చివరగా ఆధ్యాత్మిక సాధన. కేవలం ఫిట్‌నెస్ కోసమే అయితే ఆటలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మనో నియంత్రణ ముఖ్యం. అందుకే ప్రాచీన కాలంలో రుషులు చేశారు, ఇప్పుడు స్వామీజీలు చేస్తున్నారు.'' అన్నారు లివాంకర్.

యోగాసనాలు

ఫొటో సోర్స్, Getty Images

''ప్రాచీన కాలంలో ఉన్నంత ఓపిక ఇప్పుడు ఎవరికీ లేదు. వేగవంతమైన జీవితంలో మానసిక, శారీరక సమస్యల పరిష్కారానికి యోగాను ఒక సాధనంగా చూస్తున్నారు ఇప్పటి వారు. వాస్తవానికి ఇది ఒక మోక్ష మార్గం. జనన మరణ బంధాల నుంచి దూరం చేసే మార్గం. కానీ ఇప్పుడు శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం మాత్రమే వాడుతున్నారు.’’ అని చెప్పారు వీరన్న.

‘‘ ఇప్పటి పరిస్థితుల్లో యమ, నియమాలు ఆశించలేం. యోగా, ధ్యానం మాత్రమే ముఖ్యమయ్యాయి. ఇంగ్లీషు వైద్యులు కూడా తమ దగ్గరకు వచ్చే రోగులకు యోగా, ధ్యానాలు సూచించడంతో ఇలా వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఉదాహరణకు కొందరు ప్రాణాయామం నేర్పమని వస్తారు. వాస్తవానికి ఆసనం, ధ్యానం, ప్రాణాయామాలు వేర్వేరుగా నేర్పేవి కావు. ఒక్క మాటలో చెప్పాలంటే యోగా వలన ప్రాథమిక లాభాలు, అత్యున్నత లాభాలు.. రెండూ ఉంటాయి. ప్రస్తుత సమాజం ప్రాథమిక లాభాల కోసం చూస్తోంది. వారికి ఆరోగ్యంతోపాటు మానసిక శాంతి కావాలి.'' అన్నారు వీరన్న.

ప్రాణాయామం

ఫొటో సోర్స్, Getty Images

కొత్త కొత్త పేర్లతో 'యోగా'లేంటి?

కొందరు యోగాసనాలను నేర్పే విధానాన్ని రకరకాల అంశాలు జోడించి లేదా రకరకాల ప్రత్యేక పరిస్థితులు ఏర్పరిచి, లేదా వివిధ లక్ష్యాల కోసం యోగాసనాలను, ధ్యానాన్ని నేర్పుతున్నారు.

వాటికి కొత్త పేర్లు పెడుతున్నారు. హయర్ యోగా, లోయర్ యోగా, పవర్ యోగా, హాట్ యోగా, సన్ యోగా, రిథమిక్ యోగా.. ఇవ్వన్నీ అలాంటివే.

''ఎవరు ఎన్ని పేర్లు పెట్టినా వాటి బేస్ మాత్రం యోగ సూత్రాలే'' అన్నారు వీరన్న.

సూర్య నమస్కారాలు

ప్రస్తుతం సూర్య నమస్కారాలుగా పిలుస్తున్నవి వాస్తవానికి ప్రాచీన కాలంలో పతంజలి యోగ సూత్రాల్లో లేవు. అయితే, సూర్యుడిని ఆరాధించే 12 మంత్రాలకు, 12 యోగ భంగిమలు జతచేసి సూర్య నమస్కారాలుగా, ఒక ప్రక్రియగా తీర్చిదిద్దారు గురువులు.

''అయితే ఇది ఎప్పుడు ప్రారంభం అయిందనేది స్పష్టత లేదు. మిగిలిన యోగసూత్రాలతో పోలిస్తే ఇది ఆధునికమైనదని చెప్పవచ్చు. కానీ ఆ భంగిమలు, మంత్రాలు అన్నీ సరైనవే.'' అన్నారు వీరన్న.

యోగా లక్ష్యం ఇదే

''తక్కువ ఆహారం తీసుకోమని యోగా చెబుతోంది. కళ్ళు, చెవులు, నాలుక.. వీటికి నచ్చేవి ఎక్కువగా తీసుకోవడం కాదు. వాటిని.. అంటే ఇంద్రియాలను మనం జయించాలి. అప్పుడే మనసును జయిస్తాం. అప్పుడు ఆత్మ పరమాత్మను చేరుకుంటుంది. ఇదే యోగా లక్ష్యం. మొత్తంగా నిన్ను నీవు జయించాలి.'' అని యోగా గురించి వివరించారు వీరన్న.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)