నిద్రలో స్కలనం అయ్యేవారికి పిల్లలు పుట్టరు అన్నది నిజమా, అపోహా? నిపుణులు ఏం చెబుతున్నారు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ. నందకుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొంతమంది మగవారికి నిద్రలో స్కలనం అవుతుంది. దీన్ని స్వప్న స్కలనం అంటారు. ఇలా నిద్రలో స్కలనం అయ్యే మగవారికి దీనిపై అనేక సందేహాలు కలుగుతుంటాయి.
దీనివల్ల వీర్యకణాల సంఖ్య తగ్గుతుందనో, వంధ్యత్వానికి (పిల్లల్ని కనే శక్తి లేకపోవడం) ఇది ఆరంభమవుతుందనో భావిస్తుంటారు.
అయితే నిద్రలో స్కలనం కావడం సాధారణమైన విషయమేనని వైద్యులు అంటున్నారు.
అబ్బాయిలు యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు, వారి టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయని, దీని వల్ల నిద్రలో స్కలనమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
మరి దీని గురించి ఇంకా సైన్స్, పరిశోధనలు ఏం చెబుతున్నాయి?


ఫొటో సోర్స్, Getty Images
లైంగికపరమైన కలలు
హాంకాంగ్‌లోని షు యెన్ యూనివర్సిటీ పరిశోధకులు ‘సెక్స్ డ్రీమ్స్, వెట్ డ్రీమ్స్, నాక్టర్నల్ డ్రీమ్స్ ’ పేరుతో నిర్వహించిన అధ్యయనంలో నిద్రలో స్కలనానికి కారణాలను పరిశీలించారు.
ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో 80% మంది నిద్రలో స్కలనానికి లైంగికపరమైన కలలు కారణమని చెప్పారు.
స్కూలు, కాలేజీలో చదువుతున్న యువకులకు తరచుగా లైంగికపరమైన కలలు వస్తుంటాయని భావిస్తుంటారు. యువకులకు సగటున ఏడాదికి 9 సార్లు లైంగికపరమైన కలలు వస్తాయని ఈ అధ్యయనం తెలిపింది.
కలలు మన దైనందిన ఆలోచనలు, కోరికలకు సంబంధించినవనే సాధారణ నమ్మకంపై ఈ అధ్యయనంతో సందేహాలు వ్యక్తమవుతాయి.
జీవితంలో సెక్స్ ఒక ముఖ్యమైన భాగం అయినప్పటికీ, అది తరచుగా కలల్లో వచ్చే అంశం కాదని అధ్యయనం చెబుతోంది.
"పురుషుల శరీరం సహజంగానే నిరంతరాయంగా స్పెర్మ్‌ను ఉత్పత్తి చేస్తుంటుంది. లైంగిక కలయిక లేదా హస్తప్రయోగం ద్వారా స్కలనం కానప్పుడు, వీర్యం నిద్రలో దానంతటదే విడుదల అవుతుంది. ఇది చాలా మామూలు విషయం" అని సెక్సాలజిస్ట్ డాక్టర్ కామరాజ్ చెప్పారు.
"స్త్రీలకు రుతుస్రావంలాగే పురుషులకు స్కలనం. కానీ పురుషుడి శారీరక బలానికి, వీర్యానికి సంబంధం ఉందంటూ కాలక్రమంలో వ్యాపించిన అనేక అపోహలే ఇలాంటి అనుమానాలకు కారణం" అని డాక్టర్ భూపతి జాన్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పురుషుల వంధ్యత్వానికి, నిద్రలో స్కలనానికి సంబంధముందా?
స్కలన లోపం ఉన్న పురుషుల వీర్యం శాంపిళ్లను, ఆరోగ్యకరమైన పురుషుల వీర్యం శాంపిళ్లతో పోల్చుతూ చైనాలోని టోంగ్జీ మెడికల్ కాలేజీ పరిశోధకులు ఓ అధ్యయనం జరిపారు. ఈ నివేదిక యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వెబ్‌సైట్‌లో ప్రచురితమైంది.
స్కలన లోపం సమస్య ఉండేవారిలో, వేగంగా స్కలనం జరిగినప్పటికీ, స్కలనం చేయడంలో ఇబ్బంది ఉంటుంది.
పురుషుల వంధ్యత్వానికి ఈ పరిస్థితి 72శాతం కారణమని, స్కలన లోపం సమస్య ఉన్న పురుషులు లైంగిక కలయిక సమయంలో స్కలనం చేయడంలో ఇబ్బంది పడుతున్నారని, కానీ వారికి నిద్రలో స్కలనం అవుతుందని అధ్యయనం పేర్కొంది.
స్కలన లోపం ఉన్న 91 మంది నుంచి నిద్రలో, ఇతర మార్గాల ద్వారా (పీవీఎస్ ఈఈజే వైబ్రేటరీ పరికరాలు) స్కలించిన వీర్యాన్ని సేకరించి అధ్యయనంలో పరిశీలించారు.
స్కలన లోపం ఉన్న పురుషులలో ఆరోగ్యకరమైన వీర్యం ఉంటుందని, అది నిద్రలో సహజంగా విడుదలవుతుందని ఈ అధ్యయనం తేల్చింది.

ఫొటో సోర్స్, Getty Images
‘నిద్రలో స్కలనానికి వయసుతో సంబంధం లేదు’
ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్టుల అమెరికన్ కాలేజ్ ఆన్‌లైన్‌లో ఒక అధ్యయనం ప్రచురించింది. అంగస్తంభన సమస్య ఉందని మానసికంగా భావించే పురుషులు నిద్రలో స్ఖలనం చేసిన వీర్యంలో వారి భాగస్వామి గర్భందాల్చేలా చేసే సామర్థ్యాన్ని ఈ అధ్యయనం పరిశీలించింది.
నిద్రలో విడుదలయ్యే వీర్యం నాణ్యత అంత బాగా ఉండకపోవచ్చు. అయితే కృత్రిమ గర్భధారణ చికిత్సలలో ఎలక్ట్రోస్ఖలనం లేదా వృషణాల నుంచి నేరుగా స్పెర్మ్ సేకరించడం వంటి బాధాకరమైన విధానాలకు బదులుగా దీనిని ఉపయోగించవచ్చని అధ్యయనం సూచించింది.
"12 ఏళ్ల అబ్బాయిల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా నిద్రలో స్కలనం చేయవచ్చు. నిద్రలో స్కలనం వల్ల వంధ్యత్వం వస్తుందని, తక్కువ స్పెర్మ్ కౌంట్ కలిగి ఉంటారని చెప్పడం అశాస్త్రీయం. స్కలనం తర్వాత, శరీరం కొత్త స్పెర్మ్‌ను ఉత్పత్తి చేస్తుంది. నిద్రలో స్కలనం చేయడం లేదా హస్తప్రయోగం వల్ల గర్భధారణపై ప్రభావం ఉండదు" అని కామరాజ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నిద్రలో ఎందుకు స్కలనం చేస్తారు?
"ఒక వ్యక్తి నుంచి విడుదలయ్యే వీర్యకణాలు వీర్య కోశం అనే ప్రాంతంలో నిల్వ ఉంటాయి. వీర్యకణాల ఉత్పత్తి రేటు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. నీటి తొట్టి నిండిన తర్వాత నీళ్లు బయటకు ప్రవహించినట్టే, వీర్యం కూడా స్కలనమవుతుంది" అని భూపతి జాన్ చెప్పారు.
నిద్రలో స్కలనం అయ్యే వ్యక్తికి ఆరోగ్య సమస్య ఉందని భావించకూడదని కామరాజ్ చెప్పారు.
"ఎన్ని అధ్యయనాలు జరిగినప్పటికీ, నిద్రలో స్ఖలనానికి కారణాలు పూర్తిగా అర్థం కాలేదు. ఒక వ్యక్తి సెక్స్ గురించి కలలు కన్నప్పుడు లేదా మంచం, దుప్పటి వల్ల అనుకోకుండా శారీరక ప్రేరణ అనుభవించినప్పుడు అది జరగొచ్చు. ఇది శారీరక బలాన్ని తగ్గిస్తుందని లేదా లైంగిక సంపర్కంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. హస్తప్రయోగం లేదా నిద్రపోవడం వల్ల కూడా ఏదో ఒకవిధంగా వీర్యం బయటకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇది శరీరం ఆరోగ్యంగా ఉందని చెప్పడానికి నిదర్శనం" అని కామరాజ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














