ఇరాన్‌‌తో యుద్ధం నెతన్యాహు రాజకీయ భవిష్యత్‌కు లాభం చేకూరుస్తుందా?

ఇజ్రాయెల్, ఇరాన్, నెతన్యాహు, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌పై దాడితో తనకు ఆదరణ పెరిగిందని నెతన్యాహు భావిస్తున్నారు.
    • రచయిత, వైర్ డేవిస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇరాన్‌పై మిలటరీ దాడి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు లాభం కలిగించిందా?

మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టాలన్న నెతన్యాహు ఆశలు నెరవేరే పరిస్థితి ఉందా?

సుదీర్ఘమైన గాజా యుద్ధం వల్ల కలిగిన రాజకీయ నష్టాన్ని ఇరాన్‌పై సైనిక చర్యతో నెతన్యాహూ భర్తీ చేసుకున్నారా?

దేశ ప్రయోజనాలకన్నా వ్యక్తిగత రాజకీయ లబ్ది కోసమే గాజా యుద్ధాన్ని నెతన్యాహు కొనసాగిస్తున్నారన్న మెజార్టీ ఇజ్రాయెలీల అభిప్రాయాన్ని ఇరాన్‌తో యుద్ధం మార్చివేసిందా?

మార్చిలో కాల్పుల విరమణపై వెనక్కి తగ్గి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి రాజకీయ ఆత్మహత్యకు పాల్పడ్డారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇజ్రాయెల్, ఇరాన్, నెతన్యాహు, ట్రంప్

ఫొటో సోర్స్, MAJID SAEEDI/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 12 రోజుల పాటు సంక్షోభం కొనసాగింది.

యుద్ధం ముగుస్తుందని ఆశపడితే...

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టకముందే ఆయన ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందం హమాస్‌ దగ్గర బందీలుగా ఉన్నవారిలో కొందరి విడుదలకు అవకాశం కల్పించింది.

దీనికి బదులుగా తమ జైళ్ల నుంచి వందల సంఖ్యలో పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడుదల చేసింది.

యుద్ధాన్ని ముగించడానికి సంప్రదింపులు జరిపే ముందు మరింతమంది బందీలను విడిపించడం, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను క్రమంగా ఉపసంహరించుకోవడం తర్వాతి దశలో భాగంగా జరగాల్సి ఉంది.

సంక్షోభంతో అలసిపోయిన పాలస్తీనియన్లు, ఇజ్రాయెలీలు అత్యంత వినాశకర యుద్ధం ముగింపు గురించి ఆలోచించారు.

కానీ బెంజమిన్ నెతన్యాహుకు యుద్ధం ముగించడం ఇష్టం లేదు.

గాజా అంతటా మళ్లీ దాడులకు ఆదేశాలిస్తూ హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేదాకా పోరాటం కొనసాగుతుందని నెతన్యాహు ప్రకటించారు.

ఈ పరిస్థితుల్లో మిగిలిన బందీలను గాజా నుంచి సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి ప్రాధాన్యం తగ్గిపోయింది.

దీనిపై చాలా మంది ఇజ్రాయెలీలు, ముఖ్యంగా బందీల కుటుంబాలు ఆగ్రహంతో ఉన్నాయి.

తమ వారి భద్రత, దేశానికి మంచి చేయడం కంటే, తన రాజకీయ మనుగడకు నెతన్యాహు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని బందీల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇజ్రాయెల్, ఇరాన్, నెతన్యాహు, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నెతన్యాహు

ముందస్తు ఎన్నికల ఆలోచనతో నెతన్యాహుకు మంచి జరుగుతుందా?

నెతన్యాహుకు ఆదరణ తగ్గిపోయింది. సంప్రదాయవాదులు, అందుకు భిన్నంగా ఉండేవారిని ఐక్యంగా ఉంచడం ద్వారా ప్రభుత్వాన్ని నడపడానికి ఆయన చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నారు.

కాల్పుల విరమణ నుంచి వెనక్కి వచ్చిన మూడు నెలల తర్వాత ఇరాన్‌పై సాధించిన మిలటరీ విజయంతో ఇప్పుడు ఆయన ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు, మరోసారి ప్రధానమంత్రి కావడం గురించి ఆలోచిస్తున్నారు.

తాను సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయని, ఇజ్రాయెల్ ప్రజల మద్దతు తనకున్నంతకాలం వాటిని పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తానని ఈ వారం ప్రారంభంలో నెతన్యాహు చెప్పారు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ ప్రధానిగా ఎక్కువకాలం పనిచేసిన నేత నెతన్యాహునే.

ఇరాన్ అణుకార్యక్రమాన్ని ధ్వంసం చేయగలగడం వదులుకోకూడని అవకాశమని నెతన్యాహు అన్నారు. బందీలను విడిపించి, హమాస్‌ను ఓడించడం, ప్రాంతీయ ఒప్పందాలను కుదుర్చుకోవడంపై మాత్రమే దృష్టిపెడతామని తెలిపారు.

నెతన్యాహు ఏమనుకుంటున్నప్పటికీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడమన్నది సవాళ్లతో కూడుకున్నదని తాజా సర్వేల్లో తేలుతోంది. 12రోజులపాటు ఇరాన్‌తో సాగిన సంక్షోభం ద్వారా నెతన్యాహు, ఆయన ఆశించిన స్థాయిలో గతంలో కోల్పోయిన ఆదరణను తిరిగి పొందలేకపోయారని తెలుస్తోంది.

ఇజ్రాయెల్, ఇరాన్, నెతన్యాహు, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే నెతన్యాహు గాాజా యుద్ధం కొనసాగిస్తున్నారని మెజార్టీ ఇజ్రాయెలీలు భావిస్తున్నారు.

‘ఎంతో నైపుణ్యం ఉన్న రాజకీయ నాయకుడు ’

అనేక రకాలుగా విడిపోయిన ఇజ్రాయెల్ రాజకీయ వ్యవస్థ నేపథ్యంగా సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణం చాలా క్లిష్టమైనది. 120 సీట్లున్న ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో నెతన్యాహు లికుడ్ పార్టీ మెజార్టీకి చాలా దూరంలో ఆగిపోవచ్చని, అనేక చిన్న పార్టీల నుంచి మద్దతు కూడగట్టుకోవాల్సిన సవాళ్లు ఎదుర్కోవచ్చని మారివ్ న్యూస్ పేపర్ తాజా సర్వే తెలిపింది.

59 శాతం ఇజ్రాయెలీలు బందీలను విడిపించేందుకు గాజాలో యుద్ధం ఆపాలని కోరుకుంటున్నారని కూడా ఆ సర్వేలో తేలింది.

తన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే నెతన్యాహు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని సర్వేలో పాల్గొన్న ఇజ్రాయెలీల్లో 49 శాతం అభిప్రాయపడ్డారు.

‘‘నెతన్యాహు చాలా నైపుణ్యమున్న రాజకీయ నాయకుడు’’ అని ఇజ్రాయెల్ డెమొక్రసీ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలో అయిన ప్రొఫెసర్ టామర్ హెర్మాన్ అన్నారు.

కానీ నమ్మకం అనేది నెతన్యాహుకు అతిపెద్ద సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు.

అధికార పగ్గాల కోసం అనేకమార్లు విధానాలను మార్చుకున్న రాజకీయ నాయకుడిని మెజార్టీ ఇజ్రాయెలీలు ఎంతమాత్రం నమ్మడం లేదని ఆయన విశ్లేషించారు.

ఇజ్రాయెలీలు పాక్షికంగా లేదా పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచినప్పటికీ నెతన్యాహు 50శాతం ఓట్లను మించి సాధించలేరని ఇజ్రాయెల్ డెమొక్రసీ ఇనిస్టిట్యూట్‌ సర్వేలో తేలింది.

ముందస్తు ఎన్నికలకు వెళ్లడమన్నది నెతన్యాహుకు ఇరాన్‌పై దాడి చేయడం కన్నా ఎక్కువ ప్రమాదమని, ఎందుకంటే పశ్చిమాసియాలో వచ్చే ఆరునెలల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని ప్రొఫెసర్ హర్మాన్ అభిప్రాయపడ్డారు.

ఇరాన్‌పై దాడిలో విజయం సాధిస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టాలన్న నెతన్యాహు ఆశలకు అనేక అడ్డంకులు ఉన్నట్టు భావించవచ్చు.

ఇజ్రాయెల్, ఇరాన్, నెతన్యాహు, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌లో నెతన్యాహుపై విచారణ నిలిపివేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.

ట్రంప్ మొన్న అలా...ఇప్పుడిలా

రాజకీయ అనినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కంటున్న నెతన్యాహు కీలకమైన క్రిమినల్ కేసులో వచ్చేవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది.

తీరికలేని షెడ్యూల్, ఇరాన్‌తో యుద్ధం దృష్ట్యా విధించిన అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విచారణను వాయిదా వేయించడనికి నెతన్యాహు చేసిన ప్రయత్నాలను గత వారం చివర్లో హైకోర్టు తిరస్కరించింది.

ఈ కేసును రాజకీయ కక్షపూరిత చర్యగా నెతన్యాహు, ఆయన మద్దతుదారులు పదే పదే చెబుతున్నప్పటికీ నెతన్యాహు విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆయన ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

నెతన్యాహు గొప్ప హీరో అని, పోరాటయోధుడని అభివర్ణించిన ట్రంప్ ఆయనపై విచారణ వెంటనే నిలిపివేయాలని, లేదా ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

కేవలం కొన్నిరోజుల ముందే, ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తుందన్న భావనతో నెతన్యాహును తీవ్ర పదజాలంతో బహిరంగంగా విమర్శించింది ఇదే ట్రంప్ అని మనం మర్చిపోకూడదు.

అయితే ట్రంప్ జోక్యం అనాలోచిత చర్య అని, దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఇజ్రాయెల్ ప్రజలు చాలామంది భావిస్తున్నారు.

ఓ స్వతంత్ర దేశం న్యాయవ్యవస్థలో ట్రంప్ జోక్యం చేసుకోకూడదని ప్రతిపక్షనేత యాయిర్ లాపిడ్ అన్నారు.

ఇజ్రాయెల్, ఇరాన్, నెతన్యాహు, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాజాలో కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయెలీల ప్రదర్శన

గాజా యుద్ధంతో ఇజ్రాయెల్‌కు నష్టమేనా?

గాజా యుద్ధాన్ని అనవసరంగా పొడిగించడం ద్వారా అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై దృక్పథానికి, దేశ ఆర్థిక ప్రయోజనాలకు నెతన్యాహు నష్టం కలిగించారని అనేకమంది ఇజ్రాయెలీలు అభిప్రాయపడుతున్నారు. అయితే గాజాలో సైనిక పరంగా సాధించాల్సినంత విజయం ఇజ్రాయెల్ రక్షణ బలగాలు(ఐడీఎఫ్)సాధించాయని చాలా మంది మాజీ జనరళ్లు అంటున్నారు.

హమాస్‌కు వ్యతిరేకంగా సాగుతున్న యుద్ధంలో గాజాలో 55వేలమందికి పైగా మరణించారు. యుద్ధనేరాలు, గాజాలో మానవత్వానికి వ్యతిరేకంగా వ్యహరిస్తున్నారన్న ఆరోపణలకు సంబంధించి నెతన్యాహుకు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్లు జారీ చేసిన విషయం మర్చిపోకూడదు.

ఇజ్రాయెలీలు బందీలుగా ఉన్నప్పుడు, గాజాలో యుద్ధం కొనసాగుతున్నప్పుడు ఇజ్రాయెల్‌లో ఎన్నికల నిర్వహించడం కష్టం కావొచ్చని అనేకమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే అనేక ఏళ్లగా నెతన్యాహును గమనిస్తున్న ప్రత్యర్థులు, విమర్శకులు ఆయన విషయంలో రెండో ఆలోచనకు తావివ్వడం లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)