‘నెల రోజులుగా ఉడకబెట్టిన బంగాళదుంపలే తిని బతుకుతున్నాం’.. అబుదాబీలో చిక్కుకున్న భారతీయ కార్మికులు

సుఖ్‌దేవ్ సింగ్ కాలుకు ఫ్రాక్చర్ అయింది

ఫొటో సోర్స్, MD. SARTAJ ALAM

ఫొటో క్యాప్షన్, సుఖ్‌దేవ్ సింగ్ కాలు ఫ్రాక్చర్ అయింది. డబ్బుల్లేకపోవడంతో చికిత్స తీసుకోలేని స్థితిలో రోజంతా కదలకుండా పడుకొని ఉంటున్నారు
    • రచయిత, మొహమ్మద్ సర్తాజ్ ఆలమ్
    • హోదా, బీబీసీ కోసం

''మా దగ్గర తినడానికి డబ్బుల్లేవు. ఇంటి అద్దె కట్టడానికి కూడా లేవు. గత మూడు నెలలుగా మాకు జీతాలు ఇవ్వలేదు. చేతిలో డబ్బుల్లేకుండా మేమంతా అబుదాబీలో బతకాల్సి వస్తోంది.''

45 ఏళ్ల చురామన్ మహతో చెప్పిన మాటలివి. ఆయన గత 18 నెలలుగా అబుదాబీలోని మసాయి కాంట్రాక్టింగ్ ఎల్‌ఎల్‌సీ కంపెనీకి చెందిన ట్రాన్స్‌మిషన్ లైన్ టవర్‌ ఏర్పాటు చేసే ప్రాజెక్టులో పని చేశారు.

నెల రోజుల కిందట ఈ ప్రాజెక్టు పూర్తి అయింది. ఇప్పుడు ఆయన నిరుద్యోగి. అబుదాబీలోని మారుమూల ప్రాంతం హమీమ్‌లో నివసిస్తున్నారు.

ఇది చురామన్ మహతో పరిస్థితి మాత్రమే కాదు. ఆయనతో పాటు మరో 14 మంది కార్మికులు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఝార్ఖండ్‌కు చెందిన కొందరు కార్మికులు అబుదాబీలో చిక్కుకుపోయారు

ఫొటో సోర్స్, MD. SARTAJ ALAM

ఫొటో క్యాప్షన్, ఝార్ఖండ్‌కు చెందిన కొందరు కార్మికులు అబుదాబీలో చిక్కుకుపోయారు

తిండికి, అద్దెకు, వైద్యానికి డబ్బుల్లేక...

కంపెనీ ఈ 15 మంది కార్మికులు ఉండటానికి మూడు గదులున్న డార్మిటరీని అద్దెకు ఇచ్చింది. దీని అద్దెను కూడా గతంలో కంపెనీ చెల్లించేది. ఇప్పుడు అద్దె ఇవ్వడం ఆపేసింది.

''ఇక్కడ ఉండాలంటే అద్దె కట్టండి లేదంటే డార్మిటరీ నుంచి వెళ్లిపోమని బుధవారం దీని యజమాని కరాఖండీగా చెప్పారు. ఇప్పుడు మా కడుపు నిండటమే కష్టంగా ఉందటే ఇక అద్దె ఎలా కడతాం. గత నెల రోజులుగా మేమంతా ఉప్పుడు బియ్యం, ఉడికించిన ఆలుగడ్డలు(బంగాళదుంపలు) తింటూ కాలం గడుపుతున్నాం'' అని చురామన్ తమ పరిస్థితిని వెల్లడించారు.

గతంలో తమకు నెలకు 600 దిర్హామ్‌లు(సుమారు రూ. 14 వేలు) ఇచ్చేవారని, ఇప్పుడు గత మూడు నెలలకు కలిపి మొత్తంగా 850 దిర్హామ్‌లే(సుమారు రూ. 20 వేలు) చెల్లించారని లఖన్ సింగ్ స్నేహితుడు సుఖ్‌దేవ్ సింగ్ చెప్పారు.

''మీరే చెప్పండి, అబుదాబీ వంటి చోట 850 దిర్హామ్‌లతో ఎవరైనా మూడు నెలల పాటు ఎలా జీవిస్తారు?'' అని సుఖ్‌దేవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

దాదాపు రెండు వారాల క్రితం సుఖ్‌దేవ్ కాలుజారి కిందపడ్డారు. కుడికాలు ఫ్రాక్చర్ అయింది.

''రోజంతా మంచంపైనే కదలకుండా పడుకుంటాను. డబ్బుల్లేకపోవడం వల్ల ఇలా పడుకొని ఉండటమే ఇప్పుడు నాకు చికిత్స. ఫ్రాక్చర్ అయిన సంగతిని మా సూపర్‌వైజర్ మనీరాజ్‌కు చెప్పాను. అయినప్పటికీ, నాకు ఎలాంటి సహాయం అందలేదు'' అని సుఖ్‌దేవ్ వివరించారు.

జీతం అందకపోవడంతో తన కుటుంబం చాలా ఇబ్బంది పడుతోందని లఖన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు

ఫొటో సోర్స్, MD. SARTAJ ALAM

ఫొటో క్యాప్షన్, జీతం అందకపోవడంతో తన కుటుంబం చాలా ఇబ్బంది పడుతోందని లఖన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు

కష్టాల్లో కుటుంబాలు

''అందుకే మా దుస్థితిని తెలియజేయడం కోసం సోషల్ మీడియాలో ఒక వీడియోను పెట్టాను. మా జిల్లా గిరిడీహ్‌కు చెందిన వలస కార్మికుల కార్యకర్త సికిందర్ అలీ సహాయంతో ఈ పని చేశాను. ఇలా చేయడం ద్వారా మాకేదైనా సహాయం అందుతుందని ఆశించాను'' అని లఖన్ సింగ్ చెప్పారు.

''ఇది కేవలం మా 15 మందికి సంబంధించిన వ్యవహారమే కాదు. మా కుటుంబాలకు చెందినది కూడా. మాకు జీతాలు రాకపోవడంతో మా కుటుంబాలన్నీ ఝార్ఖండ్‌లో గత మూడు నెలలుగా పేదరికంలో మగ్గుతున్నాయి'' అని ఆయన వివరించారు.

వీరికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదనే విషయాన్ని కంపెనీ జనరల్ మేనేజర్(జీఎం) ఎన్‌టీ రెడ్డి అంగీకరించారు.

''ఇది తాత్కాలిక సమస్య. స్థానిక ప్రాజెక్టు మేనేజర్ నుంచి నివేదిక అందడంలో ఆలస్యం అయింది. అందుకే ఇన్వాయిస్ క్లియర్ కాలేదు. దీంతో జీతాలను ఆపేశారు'' అని ఆయన చెప్పారు.

మొదటి నుంచి జీతాల విషయంలో కంపెనీ ఇలాగే వ్యవహరిస్తోందని, ఫలితంగా తమ కుటుంబాలు వేదన అనుభవిస్తున్నాయని లఖన్ సింగ్ అన్నారు.

నెలకు 1100 దిర్హామ్‌(సుమారు రూ. 25 వేలు) వేతనం చెల్లిస్తామంటూ వారిని అబుదాబీకి తీసుకొచ్చారు. గత మూడు నెలల జీతం కలిపితే 3300 దిర్హామ్(సుమారు రూ. 77 వేలు) అవుతుంది.

ఇది సంపాదించడానికి సముద్రాలు దాటి ఇంతదూరం అబుదాబీకి వచ్చామని లఖన్ సింగ్ అన్నారు.

సైకీ దేవి

ఫొటో సోర్స్, MD. SARTAJ ALAM

ఫొటో క్యాప్షన్, జీతం రాకపోవడంతో అప్పులు పెరిగిపోతున్నాయని సైకీ దేవి చెప్పారు

కొడుకు చికిత్స కోసం అప్పు చేసి...

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా గోవింద్‌పూర్ గ్రామంలో లఖన్ సింగ్ భార్య సైకీ దేవి తమ ఇద్దరు కుమారులతో ఒక అద్దె ఇంట్లో నివసిస్తుంటారు.

తన భర్తకు జీతం అందకపోవడం వల్ల గత మూడు నెలలుగా తమ ఇంటి అద్దె కట్టలేకపోయానని సైకీ దేవి చెప్పారు. ఇటీవల తమ చిన్న కుమారుడు దీపక్ రెండు చేతులు విరిగిపోయాయని, చికిత్స కోసం అప్పు చేసినట్లు ఆమె తెలిపారు.

ఒక ప్రైవేటు ఆసుపత్రిలో దీపక్‌కు చికిత్స జరుగుతోంది. చికిత్స కోసం రూ. 19 వేలు ఖర్చు అయ్యాయని సైకీ దేవి తెలిపారు.

తమ కుమారుడి పరిస్థితి తెలిపేలా ఉన్న ఫోటోను కంపెనీ జీఎంకు పంపించినప్పటికీ వారు ఏమాత్రం కనికరం చూపలేదని, చికిత్స కోసం తన భర్తకు జీతం ఇవ్వలేదని ఆమె చెప్పారు.

ఈ విషయం గురించి కంపెనీ జనరల్ మేనేజర్ ఎన్‌టీ రెడ్డితో బీబీసీ మాట్లాడింది. ''లఖన్ సింగ్ కుమారుడి పరిస్థితి గురించి మాకు తెలిసింది. ఆయనకు వీలైనంత త్వరగా జీతం ఇచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం'' అని రెడ్డి చెప్పారు.

కంపెనీ వాళ్లు ఈరోజు, రేపు అంటూ ఆలస్యం చేస్తున్నారని లఖన్ సింగ్ తెలిపారు. డబ్బుల్లేకపోవడం వల్ల తన కుమారుడికి సరైన చికిత్స అందట్లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అబుదాబీలో చిక్కుకున్న కార్మికులు

ఫొటో సోర్స్, MD. SARTAJ ALAM

ఫొటో క్యాప్షన్, అబుదాబీలో చిక్కుకున్న కార్మికుడు

లఖన్ సింగ్ తరహాలోనే మరో కార్మికుడి కుటుంబం కూడా జీతం అందక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

అబుదాబీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికుల్లో గిరిడీహ్ జిల్లాకు చెందిన బైజ్‌నాథ్ మహతో, మహేంద్ర మహతో, సీతారామ్ మహతో, మూరత్ మహతోతో పాటు హజారీబాగ్ జిల్లాకు చెందిన చంద్రికా మహతో, కైలాష్ మహతో, బిషున్ మహతో, జగన్నాథ్ సింగ్, సుఖ్‌దేవ్ సింగ్, అర్జున్ మహతో, త్రిలోకి మహతో, బాలేశ్వర్ మహతో, ధన్‌బాద్ జిల్లాకు చెందిన కుమార్ మహతో ఉన్నారు.

చురామన్ మహతో కుటుంబం గిరిడీహ్ జిల్లాలోని అల్ఖరీ గ్రామంలో నివసిస్తుంది.

చురామన్ భార్య జశోదా దేవి మాట్లాడుతూ, ''గత మూడు నెలలుగా పొరుగున ఉన్న కిరాణం నుంచి ఉద్దెరకు(అరువు) ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తీసుకుంటున్నా. తిరిగి డబ్బులు ఇవ్వలేకపోవడంతో దుకాణాదారుడు ఇప్పుడు వస్తువులు ఇవ్వట్లేదు'' అని చెప్పారు.

ఈ అయిదుగురి వద్ద లేబర్ కార్డు లేదు

ఫొటో సోర్స్, MD. SARTAJ ALAM

ఫొటో క్యాప్షన్, కొందరు కార్మికులకు లేబర్ కార్డులు లేవు

జీతం లేకుండా కార్మికుల్ని పంపించారు

మసాయి కాంట్రాక్టింగ్ ఎల్‌ఎల్‌సీ కంపెనీలో పనిచేసిన 8 మంది కార్మికులకు జీతం ఇవ్వకుండానే వారిని భారత్‌కు తిరిగి పంపించేశారు. వారందరూ ఈ 15 మందితోనే కలిసి పనిచేశారు.

దీని గురించి కంపెనీ జీఎం రెడ్డి మాట్లాడారు.

''జీతాల చెల్లింపులు ఆలస్యం జరుగుతోంది అంతే. ప్రాజెక్టు మేనేజర్ ఇన్వాయిస్ క్లియర్ చేయగానే వెంటనే వారి జీతాలు చెల్లిస్తాం'' అని రెడ్డి అన్నారు.

అబుదాబీలో చిక్కుకుపోయిన 15 మంది కార్మికుల్లో కొందరికి లేబర్ కార్డులు లేవు. చంద్రిక మహతో, మహేంద్ర మహతో, సీతారామ్ మహతో, మూరత్ మహతో, సుఖ్‌దేవ్ వద్ద ఈ కార్డులు లేవు.

''లేబర్ కార్డులు లేకపోవడం వల్ల మేం ఎక్కడికీ వెళ్లలేం. అలా వెళితే యూఏఈ అధికారులు మమ్మల్ని పట్టుకొని అక్రమ వలసదారులుగా ప్రకటిస్తే, మా పరిస్థితి ఏంటి?'' అని చంద్రిక మహతో చాలా ఆందోళనగా చెప్పారు.

దీని గురించి కంపెనీ జీఎం ఎలాంటి సమాధానం చెప్పలేదు.

జగన్నాథ్ సింగ్

ఫొటో సోర్స్, MD. SARTAJ ALAM

ఫొటో క్యాప్షన్, జగన్నాథ్ సింగ్

''నా పాస్‌పోర్ట్ గడువు ముగియనుంది''

జగన్నాథ్ సింగ్ అనే కార్మికుడు తన పాస్‌పోర్ట్ గురించి ఆందోళన చెందుతున్నారు.

''నా పాస్‌పోర్ట్ గడువు 30 జులై 2025న ముగుస్తుంది. ఈ విషయం నేను జీఎంకు చెప్పినప్పుడల్లా, ఇంకా సమయం ఉంది. రెన్యూవల్ చేస్తామంటూ దాటవేస్తారు. గడువు తేదీ దగ్గర పడుతున్నకొద్దీ చాలా భయంగా ఉంటుంది. ఏదైనా పెద్ద ఇబ్బందిలో ఇరుక్కుంటానేమో అని భయమేస్తుంటుంది'' అని ఆయన అన్నారు.

లేబర్ కార్డ్, పాస్‌పోర్ట్ తదితర విషయాల గురించి ఝార్ఖండ్ జాయింట్ లేబర్ కమిషనర్ ప్రదీప్ లక్రాతో బీబీసీ మాట్లాడింది.

ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, సంబంధిత విభాగపు అధికారులతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కరిస్తామని ఆయన అన్నారు.

జాయింట్ లేబర్ కమిషనర్ ప్రదీప్ లక్రా

ఫొటో సోర్స్, MD. SARTAJ ALAM

ఫొటో క్యాప్షన్, జాయింట్ లేబర్ కమిషనర్ ప్రదీప్ లక్రా

అధికారులు ఏమంటున్నారు?

అబుదాబీలో చిక్కుకున్న కార్మికుల సమస్య గురించి హజారీబాగ్, గిరిడీహ్ జిల్లాల డిప్యూటీ కమిషనర్లు మాట్లాడుతూ, ఈ విషయం తమకు తెలియదని అన్నారు.

ఝార్ఖండ్ జాయింట్ లేబర్ కమిషనర్ మాట్లాడుతూ, '' ఈ విషయం గురించి ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, యూఏఈలోని ఇండియన్ ఎంబసీ, దుబయిలోని కాన్సులేట్ లేబర్ వింగ్‌కు సమాచారం అందిస్తూ, ఆయా కార్మికుల పాస్‌పోర్ట్ వివరాలు కూడా అందించాం. ఈ వ్యవహారంలో ఒకట్రెండు రోజుల్లో చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం'' అని అన్నారు.

ఇలాంటి కేసుల్లో మొదట కార్మికులను విదేశాలకు పంపించిన ఏజెంట్లను సంప్రదిస్తామని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్‌కు చెందిన అధికారి సుశీల్ కుమార్ చెప్పారు.

''ఏజెంట్ల ద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం. ఈ కేసులో కూడా అదే ప్రక్రియ జరుగుతోంది'' అని ఆయన వివరించారు.

''చాలామంది రిజిస్ట్రేషన్ లేకుండా విదేశాలకు వెళ్తుంటారు. దీనివల్లే వారు అక్కడ బాధితులుగా మారతారు'' అని జాయింట్ లేబర్ కమిషనర్ ప్రదీప్ లక్రా అన్నారు.

కార్మికులు భవిష్యత్‌లో మోసపోకుండా పంచాయతీ స్థాయిలో రిజిస్ట్రేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఝార్ఖండ్ అడిషనల్ లేబర్ సెక్రటరీ సునీల్ కుమార్ సింగ్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)