అమెరికా వీసా నిబంధనలు కఠినతరం, ఇక దరఖాస్తుదారుల సోషల్ మీడియా అకౌంట్ల పరిశీలన

ఫొటో సోర్స్, Getty Images
వీసా నిబంధనలకు సంబంధించి అమెరికా రాయబార కార్యాలయం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దరఖాస్తుదారులు గత ఐదేళ్లుగా ఉపయోగించిన అన్ని సోషల్ మీడియా యూజర్‌నేమ్‌లు, హ్యాండిళ్లను పంచుకోవాలని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఇటీవల కోరింది. అలా చేయడంలో విఫలమైతే ప్రస్తుత వీసా దరఖాస్తును రద్దు చేయడమే కాకుండా భవిష్యత్తులో వీసాలు కూడా తిరస్కరించవచ్చని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో భారత పౌరుల ప్రయోజనాలను కాపాడటానికి అమెరికాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
వీసా దరఖాస్తులను వాటి యోగ్యత ఆధారంగా నిర్ణయించాలని ప్రభుత్వం చెబుతోంది.


ఫొటో సోర్స్, @USAndIndia
యూఎస్ ఎంబసీ ఏం చెప్పింది?
భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా దరఖాస్తుదారులకు సూచనలు చేస్తూ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టింది.
''వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు గత ఐదేళ్లలో ఉపయోగించిన అన్ని సోషల్ మీడియా యూజర్‌నేమ్‌లు లేదా హ్యాండిల్స్‌ను డీఎస్-160 వీసా దరఖాస్తు ఫారమ్‌లో నమోదు చేయాలి. అలాగే, వీసా దరఖాస్తులో సరైన సమాచారాన్ని అందించినట్లు ప్రకటించాలి. వీసా ప్రక్రియ విశ్వసనీయత, భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వ విధానంలో భాగంగా అమెరికా ఈ చర్య తీసుకుంది'' అని పోస్టులో తెలిపింది.
"ఎఫ్, ఎం, జే కేటగిరీ వీసాల దరఖాస్తుదారులు వారి గుర్తింపు, అమెరికాలోకి ప్రవేశించడానికి అర్హతను ధ్రువీకరించడానికి వారి సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్‌లను పబ్లిక్‌గా ఉంచాలి" అని తెలిపింది.
కొత్త విద్యార్థి, సందర్శకుల వీసాల కోసం జరుగుతున్న ఇంటర్వ్యూలను వెంటనే నిలిపివేయాలని గత నెలలో ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్‌లను ఆదేశించింది.
బైడెన్ ప్రభుత్వం ఉన్న సమయంలో వలసదారులను తనిఖీ చేసే ప్రక్రియ చాలా నెమ్మదిగా జరిగిందని, ఇది సరిగా లేదని అమెరికా అధికారులు ఆరోపించారు.
ఇప్పుడు దరఖాస్తుదారుల సోషల్ మీడియాలో ఏదైనా కంటెంట్ పౌరులు, విలువలు, సంస్థలు, దేశానికి సంబంధించిన సంస్కృతి లేదా సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే గుర్తించడానికి ఆన్‌లైన్ కార్యకలాపాలను సమీక్షించబోతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విదేశీ విద్యార్థులపై పర్యవేక్షణ
వీసా దరఖాస్తుదారు అమెరికాలోకి ప్రవేశించడానికి అర్హులో కాదో నిర్ధరించడానికి ఇక నుంచి వారి సోషల్ మీడియా కార్యకలాపాలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇందులో ఫేస్‌బుక్, ఎక్స్, లింక్డ్ఇన్, టిక్‌టాక్ వంటివి ఉన్నాయి.
ఈ చర్య ట్రంప్ ప్రభుత్వ విధానంలో భాగం. దీనిద్వారా విదేశీ విద్యార్థులపై పర్యవేక్షణ, నియంత్రణను కఠినతరం చేయనున్నారు.
ముఖ్యంగా అమెరికా విశ్వవిద్యాలయాలలో పాలస్తీనా అనుకూల నిరసనలు పెరిగిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ ఎఫ్, ఎం, జె వీసాలు?
ఎఫ్ వీసా అనేది ప్రధానంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఇతర విద్యా సంస్థలలో నమోదు చేసుకున్న విద్యార్థులకు ఉంటుంది.
టెక్నికల్ లేదా ఒకేషనల్ స్కూళ్లలో చదివే నాన్ అకడమిక్ విద్యార్థులకు ఎం వీసా ఉంటుంది.
గుర్తింపు పొందిన సాంస్కృతిక లేదా విద్యా మార్పిడి కార్యక్రమంలో పాల్గొనే సందర్శకులకు జె వీసా ఇస్తారు

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా యూజర్లు ఏమంటున్నారు?
అమెరికాలో స్టూడెంట్ వీసాల (ఎఫ్, ఎం, జే కేటగిరీలు) కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇకపై తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను 'పబ్లిక్'గా మార్చాల్సి ఉంటుందని పొలిటికల్ సైంటిస్ట్, రచయిత ఇయాన్ బ్రెమ్మర్ పేర్కొన్నారు.
అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే దరఖాస్తుదారులను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ అదనపు పరిశీలన ప్రక్రియ చేపట్టినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు.
''అమెరికాలో వీసా దరఖాస్తులు ఆమోదం పొందే ముందు అంతర్జాతీయ విద్యార్థుల సోషల్ మీడియా పోస్టులను తనిఖీ చేస్తారని, త్వరలోనే పర్యటకులు కూడా ఇవే నిబంధనలు పాటించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను తొందరగా అమెరికా వెళ్లలేననిపిస్తోంది'' అని ఓ యూజర్ రాశారు.
'' అమెరికా వీసా అప్లికేషన్ అయినా, ఏదైనా అంతర్జాతీయ అవకాశమైనా, సోషల్ మీడియా ఇప్పుడు మీ డిజిటల్ సీవీగా మారిపోయిందని కేవలం ఒక్క క్లిక్‌తో , మీరు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసే ప్రతిదీ మీ గుర్తింపులో భాగం అవుతుంది. కాబట్టి మీ ప్రొఫైల్ ను మీ భవిష్యత్తు కథను చెప్పే విధంగా తయారు చేసుకోండి'' అని మరో యూజర్ రాశారు.
''అమెరికా వీసా ప్రక్రియలో సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేయడం నిజంగా భద్రతా ప్రయోజనాల కోసమా లేక డేటా మైనింగ్‌కు ఒక సాధనమా?ఇప్పుడు మొత్తం వ్యవస్థ కేవలం డేటా సేకరణ, నిఘా ఆట మాత్రమేనా?'' అని ఇంకో యూజర్ ప్రశ్నించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














