కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానన్న యువతిని మహిళా ఎస్ఐ ఎలా కాపాడారంటే..?

ఆత్మహత్య, డిప్రెషన్, హైాదరాబాద్, చెన్నై
ఫొటో క్యాప్షన్, ఎస్సై మీరా
    • రచయిత, విజయానంద అర్ముగం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"నానా స్ట్రీట్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నారు." ఈ నెల 23వ తేదీన పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్ మీరా డ్యూటీపై వెళ్తుండగా ఎవరో ఆమెకు ఈ సమాచారం చెప్పారు.

ఆ సమయంలో మీరా, ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటనకు సంబంధించిన భద్రతావిధులకు వెళ్లాల్సి ఉంది.

కానీ ఆ యువతిని కాపాడేందుకు ఆమె వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు.

ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్న యువతిని రక్షించారు.

ఆ యువతి మనసు మార్చుకునేలా మీరా ఏం చేశారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య బెదిరింపు

చెన్నై త్యాగరాయనగర్‌లోని నానా స్ట్రీట్‌లో నివసిస్తున్న దంపతులకు 27 ఏళ్ల కుమార్తె ఉంది.

ఆ యువతి బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు.

"ఆమె అక్కడ ఒకరిని ప్రేమించారు.తర్వాత వాళ్లిద్దరూ విడిపోయారు. ఈ విషయం తెలిసిన తర్వాత తల్లిదండ్రులు కుమార్తెను చెన్నైకు తీసుకువచ్చారు. అయితే ప్రేమించిన వ్యక్తితో విడిపోవడాన్ని ఆమె భరించలేకపోయారు" అని పోలీసుల దర్యాప్తులో తేలింది.

"అది మాంబళం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతం. కానీ, ఆ వీధి నేను పనిచేసే పోలీస్ స్టేషన్‌కు చాలా దగ్గరగా ఉంది. దీంతో నాకు విషయం తెలిసిన వెంటనే, నేను ఆమెను కాపాడటానికి వెళ్లాను. దీనిపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తి నన్ను తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు" అని మీరా చెప్పారు.

"నాలుగు అంతస్తులు ఉన్న ఆ అపార్ట్‌మెంట్ భవనం కిటికీలకు గ్రిల్స్ లాంటివి లేవు. ఆ యువతి కిటికీ నుంచి దూకే ప్రయత్నంలో ఉన్నారు. మేం అక్కడకి వెళ్లేసరికి ఆ యువతి తల్లి, అమ్మమ్మ తీవ్ర భయాందోళనలో ఉన్నారు. తన కూతురిని ఎలాగైనా రక్షించాలని తల్లి ప్రాధేయపడ్డారు. బెడ్‌రూమ్ తలుపును ఆ యువతి లోపలి నుంచి లాక్ చేశారు '' అని మీరా తెలిపారు.

ఆత్మహత్య, డిప్రెషన్, హైాదరాబాద్, చెన్నై
ఫొటో క్యాప్షన్, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న యువతితో మీరా 8 నిమిషాలు మాట్లాడి ఆమె ఆలోచనను మార్చేశారు.

'ఏమీ చేయలేనా అనుకున్నా'

''తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆ యువతి పెద్దపెద్దగా అరుస్తోంది. హాల్లో నుంచి నేనది విన్నా. తనను రక్షించడానికి ఎవరూ లోపలికి రావద్దని ఆమె బెదిరిస్తున్నారు. ఏమీ చేయలేక నేను గ్రౌండ్ ఫ్లోర్‌కి వచ్చాను." అని మీరా చెప్పారు.

ఈ లోగా మాంబళం, సౌందరపాండియానార్ అంగడి పోలీసు స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లకు, త్యాగరాయ నగర్‌లోని అగ్నిమాపక, రెస్క్యూ విభాగానికి ఈ విషయం తెలిపారు.

ఆ యువతి కిటికీ నుంచి దూకితే రక్షించడానికి వలలాంటివి ఏమీ లేకపోవడంతో ఇంట్లోని దుప్పట్లను కలిపి వల లాంటిది తయారుచేసే ప్రయత్నం చేశారు.

అయితే, ఆ యువతిని పట్టుకోడానికి ప్రయత్నించినా, ఆమె బరువును తాను మోయలేనని, తాను తీవ్రంగా గాయపడవచ్చని మీరా గ్రహించారు. రక్షించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేని పరిస్థితుల్లో యువతి చేతిలో సెల్‌ఫోన్ ఉందనే విషయం ఆమెకు గుర్తొచ్చింది. ఫోన్‌లో మాట్లాడటం ద్వారా ఆమెను రక్షించవచ్చని భావించినట్టు మీరా చెప్పారు. లేదంటే కిటికీ దగ్గరకు వెళ్లి ఆమెను రక్షించడం మరో మార్గమని . ఇందుకోసం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చానని మీరా తెలిపారు. తరువాత మీరా గ్రౌండ్ ఫ్లోర్‌నుంచి మరోసారి యువతి ఇంట్లోకి వెళ్లారు.

ఆత్మహత్య, డిప్రెషన్, హైాదరాబాద్, చెన్నై

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆత్మహత్య చేసుకునేవారి సమస్య విని, భరోసా కల్పిస్తే ఆ ఆలోచన పోతుందని మీరా అన్నారు.

యువతిని ఎస్సై ఎలా రక్షించారంటే...

ఇంట్లోకి తిరిగి వెళ్లిన ఎస్ఐ యువతి నెంబర్ కనుక్కుని ఆమెకు ఫోన్ చేశారు.

ఆ యువతి ఫోన్ లిఫ్ట్ చేశారు. ''ఎవరు నువ్వు?" అని అడిగారు. నన్ను బాగా తిట్టారు. నేను నిన్ను కాపాడటానికి వచ్చాను. ఏ సమస్య వచ్చినా, నేను దాన్ని పరిష్కరిస్తాను. నన్ను నమ్మి బయటకు రా అని’’ అని చెప్పానని మీరా తెలిపారు.

‘‘నేను ఎవరినీ నమ్మను అంటూ ఆ యువతి ఫోన్ కట్ చేశారు. మళ్ళీ కాల్ చేసినప్పుడు ఆమె మాట్లాడారు. దాదాపు 8 నిమిషాల పాటు ఆమె చాలా కోపంగా మాట్లాడారు. ఒక వ్యక్తి పేరు చెప్పి, ఆయన నన్ను వదిలి వెళ్లిపోయారు. ఇప్పటికే ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించాను అని ఆ యువతి తెలిపారు’’ అని మీరా చెప్పారు.

‘‘నన్ను నీ చెల్లిలా భావించు. నీ సమస్య ఏమిటో చెప్పు. కచ్చితంగా దాన్ని పరిష్కరిస్తా. నువ్వు ఇంకెవరినీ నమ్మాల్సిన పనిలేదు’’ అంటూ ఆ యువతిని అనునయించేలా మాట్లాడానన్నారు మీరా.

‘‘కాసేపు ఇలా సంభాషణ జరిగిన తరువాతఆ యువతి 'లోపలికి రండి' అన్నారు.వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళాను. కిటికీ నుం దూకడానికి సిద్ధంగా ఉన్న యువతిని ఠక్కున పట్టుకుని గదిలోకి తీసుకువచ్చాను " అని మీరా వివరించారు.

ఆత్మహత్య, డిప్రెషన్, హైాదరాబాద్, చెన్నై

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నవారిని నిత్యం గమనిస్తుండాలని వైద్యనిపుణులు అంటున్నారు.

'భరోసా కల్పిస్తే ఆత్మహత్య ఆలోచన పోతుంది'

ఆ యువతి ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

" బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ప్రేమకు సంబంధించి ఆమె కొన్ని సమస్యలు ఎదుర్కొన్నట్టు నాకు తెలిసింది. ఆ సమయంలో, నేను ఆమె ప్రాణాలను కాపాడటం గురించి మాత్రమే ఆలోచించాను" అని మీరా చెప్పారు.

"ఆమె చేతిలో సెల్ ఫోన్ ఉండటం వల్ల ఆమెకు నచ్చజెప్పవచ్చని నాకనిపించింది. ఆమె మానసిక స్థితి తెలియకుండా మనం లోపలికి వెళితే పరిస్థితులు చేయిదాటిపోతాయనే భయం కూడా ఉంది" అని మీరా అన్నారు.

"ఎవరైనా ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు వారి సమస్యను అర్థం చేసుకుని, వారికి కొంత భరోసాను కలిగిస్తే, వారి మానసిక స్థితి మారుతుందని అనుకున్నాను. వేరే పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్నప్పటికీ, ఆ మహిళను మళ్ళీ కలుసుకుని ఆమెతో మాట్లాడమని ఉన్నతాధికారులు నాకు చెప్పారు" అని మీరా వివరించారు.

మీరా ధర్మపురి జిల్లా అరూర్ తాలూకా చెల్లంపట్టి పుత్తూరు గ్రామానికి చెందినవారు. ఆమె తమిళనాడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. 2023లో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌ అయ్యారు.

ఆత్మహత్య, డిప్రెషన్, హైాదరాబాద్, చెన్నై

ఫొటో సోర్స్, Dr. Malaiyappan

ఫొటో క్యాప్షన్, డాక్టర్ మాలియప్పన్

పలు కేసుల్లో బాధితులను రక్షిస్తున్న పోలీసులు

గత కొన్ని వారాలలో ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తులను మీరా లాగే పోలీసులు రక్షించిన సంఘటనలు ఉన్నాయి.

మార్చి 30న, మెరీనా బీచ్‌లో ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు ప్రయత్నించగా, ఆ సమయంలో విధుల్లో ఉన్న మెరీనా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కుమరేసన్, కానిస్టేబుళ్లు శంకర్ కుమార్, మురుగన్ వారిని రక్షించారు.

తల్లిదండ్రులతో విభేదాల కారణంగా నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని ఆ అక్కాచెల్లెళ్లిద్దరూ చెప్పారు. పోలీసులు వారిని వారి బంధువులకు అప్పగించారు.

తిరువోత్రియూర్‌కు చెందిన ఒక మహిళ మానసిక చికిత్స కోసం కోడంబాక్కంలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఏప్రిల్ 19న ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. పోలీసు కానిస్టేబుల్ దేవరాజ్ ఆమెతో దాదాపు 15 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడి ఆమెను రక్షించారు.

ఆత్మహత్య, డిప్రెషన్, హైాదరాబాద్, చెన్నై

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఆత్మహత్యల నివారణకు 4 మార్గాలు

ఆత్మహత్య, ఆత్మహత్య ప్రయత్నాలను నివారించడానికి వ్యక్తి, సమాజం స్థాయిలో వివిధ ప్రయత్నాలు చేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దీనిని నివారించడానికి నాలుగు ప్రధాన మార్గాలను సూచించింది.

  • ఆత్మహత్య చేసుకునే అవకాశాలు లేకుండా చేయడం
  • ఆత్మహత్యల గురించి చెప్పేటప్పుడు ఎలా వ్యవహరించాలో మీడియా సంస్థలకు చెప్పడం
  • కౌమారదశలో ఉన్నవారిలో సామాజిక-భావోద్వేగ జీవన నైపుణ్యాలను పెంపొందించడం
  • ఆత్మహత్యల ప్రభావం ఉన్న వ్యక్తులను ముందుగా గుర్తించి వారిని కనిపెట్టుకునిఉంటూ నచ్చజెప్పడం.

ఆత్మహత్యలను నివారించడంలో సమాజం పాత్ర ముఖ్యమైనది.

''భారతీయ సమాజంలో ఆత్మహత్య ఆలోచనలు సర్వసాధారణం. కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగినప్పుడు, ఆత్మహత్య చేసుకుంటామనడం మామలు విషయం" అని కిల్పాక్ ప్రభుత్వ మానసిక ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మాలియప్పన్ బీబీసీతో అన్నారు.

"పరీక్షల్లో, ప్రేమలో లేదా వ్యాపారంలో విఫలమైనప్పుడు ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. మానసికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులు ఎలాంటి ప్రణాళిక లేకుండా కోపంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది" అని డాక్టర్ మాలియప్పన్ అంటున్నారు.

"డిప్రెషన్ ఉన్నవారికి ఆత్మహత్య ఆలోచనలు ఉంటాయి. వారు దానిని అమలు చేయడానికి ప్రణాళిక కూడా వేస్తారు. దీనిని గుర్తించి చికిత్స చేస్తే, సులభంగా నివారించవచ్చు" అని ఆయన అన్నారు.

"ఉత్సాహం లేకపోవడం, నెమ్మదిగా నడవడం, నెమ్మదిగా మాట్లాడటం వంటివి ఉంటాయి. వారు మునుపటిలా చురుగ్గా ఉండలేరు. తక్కువగా నిద్రపోతారు. దేనిపైనా ఆసక్తి చూపరు" అని డిప్రెషన్ లక్షణాలను మాలియప్పన్ వివరించారు.

"సమస్యలకు , మరణం పరిష్కారం కాదనే భావన ఉండాలి. గౌరవం కోల్పోతే జీవితం విలువైనది కాదనే భావన ఉంది. గౌరవం కంటే జీవితాన్ని ముఖ్యమని భావించే మార్పు సమాజంలో రావాలి" అని ఆయన అన్నారు.

"మానసికంగా బలహీనంగా ఉన్నవారికి జీవిత నైపుణ్యాలపై శిక్షణ అందించవచ్చు. సమయపాలన పాటించడం, కోపాన్ని నియంత్రించుకోవడం, మనస్తత్వంలో మార్పు తెచ్చుకోవడానికి ఉత్సాహంగా ఎలా ఉండాలో నేర్పించడం వంటివి చేయొచ్చు'' అని మాలియప్పన్ అంటున్నారు.

ఆత్మహత్య, డిప్రెషన్, హైాదరాబాద్, చెన్నై

ఫొటో సోర్స్, Getty Images

హెల్ప్‌లైన్ నంబర్లు

మీరు లేదా మీకు తెలిసిన వారు ఒత్తిడి లేదా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటే, దిగువన ఉన్న హెల్ప్‌లైన్‌ల ద్వారా మీకు అవసరమైన సహాయం పొందవచ్చు.

ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)