ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ మిసైల్ దాడులు.. ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు?

ఫొటో సోర్స్, USAF
- రచయిత, సాన్ సెడన్, గబ్రియేలా పామెరాయ్
- హోదా, బీబీసీ న్యూస్
ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది.
తమ దేశంలోని అణు స్థావరాలపై అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
ఖతార్ రాజధాని దోహాలో ఆకాశం నుంచి భారీ శబ్దాలు విన్నామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఖతార్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకునే ప్రయత్నాలతో ఆకాశంలో భారీ వెలుగులు కనిపించాయి.
దీనికి సంబంధించిన దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణలో అమెరికా ప్రత్యక్ష జోక్యం తరువాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.


ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ లక్ష్యం ఏమిటి?
పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన అతి పెద్ద సైనిక స్థావరమైన 'అల్ ఉదేద్' లక్ష్యంగా ఇరాన్ మిసైళ్లను ప్రయోగించింది.
శనివారం తమ దేశంలోని మూడు అణు స్థావరాలపై అమెరికా జరిపిన బాంబు దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొంది.
పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా వైమానిక చర్యలన్నిటినీ అల్ ఉదేద్ సైనిక స్థావరం నుంచి పర్యవేక్షిస్తారు. ఇది ఈ ప్రాంతంలో అమెరికా మిలటరీ హెడ్‌క్వార్టర్.
ఈ దాడులను తొలుత ఇరాన్ ప్రభుత్వ మీడియా ధ్రువీకరించగా.. అనంతరం సైన్యం కూడా ధ్రువీకరించింది.
ఇరాన్ సైన్యంలో అత్యంత శక్తిమంతమైన విభాగమైన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది.
'ఇరాన్ సార్వభౌమత్వంపై జరిగిన ఏ దాడికీ సమాధానం చెప్పకుండా వదలం. ఈ ప్రాంతంలో అమెరికా స్థావరాలు ఆ దేశానికి బలాలు కావు, బలహీనతలు.' అని ఆ ప్రకటనలో పేర్కొంది.
6.. 14..19.. ఇంతకీ ఎన్ని క్షిపణులు?
కాగా ఇరాన్ దాడుల్లో ఎన్ని మిసైళ్లు ప్రయోగించారనే విషయంలో భిన్న ప్రకటనలు కనిపిస్తున్నాయి.
ఆరు మిసైళ్లు ప్రయోగించినట్లు ఇరాన్ చెప్తుండగా 14 మిసైళ్లని అమెరికా అంటోంది.
మరోవైపు 19 మిసైళ్లు ప్రయోగించారని ఖతార్ 'రాయిటర్స్' న్యూస్ ఏజెన్సీకి చెప్పింది.
అన్ని క్షిపణులను అడ్డుకున్నట్లు ఖతార్ చెప్పింది.
ఈ దాడుల్లో ఎవరూ మరణించినట్లు కానీ, గాయపడినట్లు కానీ ఇంతవరకు సమాచారం లేదు.
ఈ దాడులకు కొద్దిసమయం ముందు అమెరికా, బ్రిటన్‌లు ఖతార్‌లోని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి.
సురక్షిత స్థానాల్లో ఉండాలని సూచించాయి.
ఖతార్‌లో సుమారు 8 వేల మంది అమెరికా పౌరులు నివసిస్తున్నారు.

ఫొటో సోర్స్, The White House
దాడుల తర్వాత ట్రంప్ ఏమన్నారు?
మిసైళ్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఇరాన్ హెచ్చరికలు చేసిన వెంటనే, ఆ దాడులు జరిగాయి. ప్రమాద నష్టాన్ని తగ్గించేందుకే ముందస్తుగానే దోహాకు ఈ దాడుల గురించి తెహ్రాన్ తెలియజేసిందని ముగ్గురు ఇరాన్ అధికారులు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
ఈ దాడుల తర్వాత స్పందించిన అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. ముందస్తుగా దాడుల గురించి తెలియజేసినందుకు ఇరాన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
దీనివల్ల తాము అప్రమత్తం అయ్యామని, ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, గాయాలు కాలేదని అన్నారు.
ఆ దాడులు చాలా బలహీనమైనవిగా వర్ణించారు ట్రంప్. అమెరికన్లు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. నష్టం స్వల్పంగానే ఉందని అన్నారు. ఇక ఇప్పుడు శాంతికి అవకాశం ఉందని చెప్పారు.
ఈ దాడులపై స్పందించిన ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఈ మిసైల్ దాడులు ఆశ్చర్యకరమని, తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించాయని చెప్పారు.
ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ ఘర్షణల ముప్పు గురించి తొలుత హెచ్చరించిన దేశాల్లో ఖతార్ ఒకటని అన్నారు.
మిసైల్ దాడుల్లో ఇరాన్ ఎవరికీ హానీ చేయలేదని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ చెప్పారు. కానీ, తమ దేశం ఎవరికీ తలొగ్గదని స్పష్టం చేశారు.
దాడులకు ముందు
ఖతార్‌పైకి మిసైళ్లను లాంచ్ చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతుందని అమెరికా అనుమానించింది. దీనికి సంబంధించిన సంకేతాలు సోమవారమే వచ్చాయి.
దీంతో, ఈ దాడులు జరగడానికి కొన్ని గంటల ముందు, ఖతార్ తమ ఎయిర్‌స్పేస్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఖతార్‌లోని తమ పౌరులు సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని అమెరికా, బ్రిటన్‌లు కోరాయి.
అయితే, ఆ హెచ్చరికలు దాడి జరగబోతుందా? అన్న దానికి స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు.
అత్యంత అప్రమత్తతతో ఉండేందుకు తాము ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా చెప్పగా.. అమెరికన్లను తాము అనుసరించినట్లు బ్రిటన్ పేర్కొంది.
అయితే, దాడి జరగడానికి సుమారు గంట ముందు సైనిక స్థావరానికి ముప్పు పొంచి ఉన్నట్లు బీబీసీకి సమాచారం అందింది.

ఫొటో సోర్స్, Getty Images
విమానాల దారి మళ్లింపు
ఖతార్ వైపు మిసైళ్లతో దాడి చేయాలనే ఉద్దేశంతో ఇరాన్ మిసైల్ లాంచర్లను సిద్ధంగా ఉంచిందని పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు అమెరికా అధికారులు చెప్పినట్లు కొన్ని అమెరికా మీడియా అవుట్‌లెట్లకు తెలిపాయి.
దాడులకు ముందు చాలా విమానాలు ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లిస్తున్నట్లు ఫ్లయిట్ ట్రాకింగ్ వెబ్‌సైట్లలో కనిపించింది. ఫ్లయిట్‌రాడార్ 24 ప్రకారం.. క్షిపణి దాడులను గుర్తించడానికి కాస్త ముందు దోహాకు 100 విమానాలు వెళ్లాయి.
ఈ ప్రాంతంలోని బహ్రెయిన్, కువైట్ వంటి ఇతర దేశాలు కూడా కొద్దిసేపు తమ గగనతలాలను మూసివేశాయి.
ఆ తర్వాత కువైట్, బహ్రెయిన్‌లు తమ గగనతలాలను తిరిగి ప్రారంభించాయి.
తమ విమానాశ్రయాలను పూర్తి కార్యకలాపాలతో పునరుద్ధరించినట్లు దుబాయి, యూఏఈలు కూడా తెలిపాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














