హిందీ జాతీయ భాషా? లోకేష్ వ్యాఖ్యలపై వివాదమేంటి?

నాారా లోకేష్, హిందీ, ఇంగ్లీష్, జాతీయ భాష, ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు

ఫొటో సోర్స్, https://x.com/naralokesh/status

ఫొటో క్యాప్షన్, హిందీ జాతీయ భాష అంటూ ఏపీ విద్యాశాఖమంత్రి లోకేష్ ఇండియాటుడే పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు
    • రచయిత, పారా పద్దయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హిందీ భాషపై అటు మహారాష్ట్రతోపాటు ఇటు దక్షిణాది రాష్ట్రాలలోనూ వివాదం నడుస్తోంది.

అయితే హిందీ జాతీయ భాష అంటూ ఏపీ విద్యాశాఖమంత్రి లోకేష్ ఇండియాటుడే పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ చర్చను తెరపైకి తెచ్చాయి.

ఈ కార్యక్రమంలో ఆయన ఇండియాటుడే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రీతి చౌధురితో జాతీయ విద్యా విధానం గురించి మాట్లాడారు.

ఇందులో భాగంగా ఆమె లోకేష్‌ను జాతీయ విద్యా విధానం గురించి ప్రశ్నించారు.

ప్రీతి చౌధురి: జాతీయ విద్యా విధానంపై మీ ఆలోచనలేంటి? మీ పొరుగునే ఉన్న తెలంగాణ, తమిళనాడు దేన్నైనా తీసుకోండి దీని గురించి చాలా చర్చ జరుగుతోంది

లోకేష్: జాతీయ విద్యా విధానం బావుంది. మేం దీన్ని అమలు చేస్తున్నాం. దీన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాలని ఏమీ లేదు. రాష్ట్రాలు తమకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. మొత్తం చర్చంతా భాష గురించే జరుగుతోంది. దురదృష్టత్తువశాత్తూ భాష కారణంగా అందరి మధ్య పోటీ వస్తోంది" అని లోకేష్ అన్నారు.

స్కూళ్లలో మాతృభాషను బోధించడం గురించి తాను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో చర్చించినట్లు లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ, చంద్రబాబు కూడా పాఠశాలల్లో తమ మాతృభాషలోనే చదువుకున్నారని చెప్పినప్పుడు, మాతృభాషలో బోధన ప్రాధాన్యాన్ని ధర్మేంద్ర ప్రధాన్ అర్థం చేసుకున్నారని లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగానే ‘‘హిందీ మన జాతీయ భాష’’ అని లోకేష్ అన్నారు.

సరిగ్గా ఇక్కడే ప్రీతి చౌధురి అడ్డుకుని "హిందీ మన జాతీయ భాష కాదు" అని చెప్పడం, లోకేష్‘‘నేను హిందీ నేర్చుకున్నాను’’ అనడంతో, ప్రీతి చౌధురి మరోసారి హిందీ "మన జాతీయ భాష కాదు" అని స్పష్టం చేశారు.

దీంతో లోకేష్ "అయితే కానివ్వండి, ఇప్పుడేమైంది?" అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నాారా లోకేష్, హిందీ, ఇంగ్లీష్, జాతీయ భాష, ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు

ఫొటో సోర్స్, instagram.com/naralokesh

ఫొటో క్యాప్షన్, మాతృభాష ప్రాధాన్యాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించానని లోకేష్ ఇండియా టుడే పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.

‘హిందీని జాతీయభాషగా ఎందుకు చేయకూడదు?’

ఈ కార్యక్రమంలోనే "హిందీని జాతీయ భాషగా ఎందుకు చేయకూడదు" అని లోకేష్ ప్రశ్నించారు. "నా ప్రశ్న ఏంటంటే మనం హిందీ ఎందుకు నేర్చుకోకూడదు? అని అంటూనే "ఎందుకు మనం తమిళ్‌కు హిందీకి పోటీ పెడుతున్నాం. తెలుగుకు వ్యతిరేకంగా హిందీని పోటీ పెడుతున్నాం" అని ప్రశ్నించారు .

దీనిపై ప్రీతి చౌధురి "ఈ దేశంలో హిందీ అందరినీ కలిపే భాషగా ఉండాలా వద్దా" అని ప్రశ్నించారు.

"కచ్చితంగా" అని లోకేష్ చెప్పారు.

"ఈ విషయంలో మీతో దక్షిణాది పార్టీలు విభేదిస్తున్నాయి కదా, అందరినీ కలిపే భాష ఇంగ్లీషే అంటున్నారు కదా" అని ఆమె ప్రశ్నించారు.

"ఇంగ్లీష్ ఇప్పటికే అందరినీ కలిపే భాషగా ఉంది. అందులో మరో ఆలోచనకు తావు లేదు. అయితే అదే సమయంలో పిల్లలు హిందీ నేర్చుకోవడంలో తప్పు లేదు. హిందీని చూసి మనం ఎందుకు భయపడాలి? వాస్తవానికి మనం మరిన్ని భాషలు నేర్చుకోవచ్చు" అని లోకేష్ చెప్పారు.

ఈ సంభాషణను ప్రీతిచౌధురి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. నారా లోకేష్ ఇంగ్లీష్‌తో పాటు హిందీ కూడా లింక్ లాంగ్వేజ్‌గా ఉండాలన్నారని అందులో రాశారు.

హిందీ జాతీయ భాష అన్న లోకేష్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.

నాారా లోకేష్, హిందీ, ఇంగ్లీష్, జాతీయ భాష, ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, హిందీని దేశ భాషగా చేయాలన్నది మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్‌ల స్వప్నం అని అమిత్‌షా గతంలో అన్నారు.

భాషా వివాదం

గతంలోనూ హిందీ విషయంలో దక్షిణాది రాష్ట్రాల నాయకులు, పార్టీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020ను అమలు చేసేందుకు అంగీకరించకపోవడంతో, నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు.

ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.

కర్నాటక, మహరాష్ట్రలో మాతృభాషే మాట్లాడాలంటూ, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతున్న వారిపై దాడి చేసిన సంఘటనలు వెలుగు చూశాయి.

జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులు మూడు భాషలను నేర్చుకోవాలని సిఫార్సు చేశారు. దీనిలో ఏ భాషనూ ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, కనీసం రెండు భాషలు భారత్‌కు చెందినవై ఉండాలని తెలిపారు.

హిందీ దివస్ సందర్భంగా 2019 సెప్టెంబర్ 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ "స్వాతంత్య్ర సమరయోధులు హిందీని రాజ భాష (జాతీయ భాష)గా అమలు చేయాలని కాంక్షించారు" అన్నారు.

హిందీని దేశ భాషగా చేయాలన్నది మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్‌ స్వప్నం అంటూ.. హిందీ భాష ప్రతి ఇంటికీ, ప్రతి ఒక్కరికీ చేరాలని అమిత్ షా పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా దుమారం రేపాయి.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులు స్పందిస్తూ.. హిందీ భాషను రుద్దే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.

కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ హిందీ జాతీయ భాష అంటూ కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్‌ కూడా వివాదంగా మారింది.

నాారా లోకేష్, హిందీ, ఇంగ్లీష్, జాతీయ భాష, ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు
ఫొటో క్యాప్షన్, కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా హిందీతో పాటు ఇంగ్లిష్ కూడా కొనసాగుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 చెప్తోంది

భారత జాతీయ భాష ఏది?

'జాతీయ భాష హిందీ' అనే ప్రతిపాదన, దాని మీద వివాదం ఇప్పటిది కాదు.

స్వాతంత్య్రానికి ముందు నుంచే ఈ అంశం తరచుగా తీవ్ర వివాదాలకు కారణమవుతోంది.

రాజ్యాంగం ప్రకారం భారతదేశానికి ఒక జాతీయ భాష అనేది లేదు.

జాతీయ స్థాయిలో అధికార భాషలుగా హిందీ, ఇంగ్లిషు కొనసాగుతున్నాయి.

వీటితో పాటు.. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో చేర్చిన 22 భాషలకు కూడా అధికార భాష హోదా ఉంది.

జాతీయ భాష అంటే.. జాతీయ పతాకం, జాతీయ జంతువు తరహాలో భారతదేశానికి, సంస్కృతికి ఒక చిహ్నంగా ఉండే భాష.

అధికార భాష అంటే.. ఆ దేశ లేదా రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో, అధికార యంత్రాంగం సమాచార మార్పిడిలో మిగతా రాష్ట్రాలతో సంప్రదింపుల్లో ఉపయోగించే భాష. పార్లమెంటు, అసెంబ్లీ సహా చట్టసభల చర్చల్లో, కోర్టు విచారణల్లో ఉపయోగించే భాష.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ భాషను జాతీయ భాషగా చేయాలన్న ప్రతిపాదనల మీద చర్చ జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)