ఫాస్టాగ్ యాన్యువల్ పాస్: ఇది ఉంటే టోల్ ట్యాక్స్ రూ. 15 మాత్రమే.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఎలా తీసుకోవాలి

ఫొటో సోర్స్, Getty Images
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల మీద ఫాస్టాగ్ ఉపయోగించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక ప్రకటన చేసింది.
దీంతో వాహనదారులకు ఉపశమనం లభించనుంది.
ప్రైవేటు డ్రైవర్లు కావాలనుకుంటే ఫాస్టాగ్ కోసం ప్రత్యేక పాస్ తీసుకోవచ్చు. ఒకసారి ఈ పాస్ తీసుకుంటే ఇది ఏడాదంతా పనికొస్తుంది.
ఈ స్కీమ్ వల్ల జాతీయ రహదారుల మీద ప్రయాణం మరింత తేలికగా, లాభదాయకంగా మారుతుందని చెబుతున్నారు.
వార్షిక పాస్ విలువను రూ.3వేలుగా నిర్ణయించారు. ఈ పాస్‌ను ఏడాదిలో 200 ట్రిప్పులకు ఉపయోగించుకోవచ్చు.
దేశంలోని అన్ని జాతీయ రహదారులపైనా ఉపయోగించొచ్చు.
ఈ పాస్ కేవలం ప్రైవేటు, వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే పనికొస్తుంది.
టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడం, రద్దీని తగ్గించడం, ప్రయాణాల్ని మరింత లాభసాటిగా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.


ఫొటో సోర్స్, Getty Images
ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
ఇయర్లీ పాస్ ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది.
దీన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ వెబ్‌సైట్, హైవే ట్రావెల్ యాప్ ద్వారా యాక్టివేట్‌చేసుకోవడంతో పాటు రెన్యువల్ చేసుకోవచ్చు.
దీనికి సంబంధించిన లింక్ త్వరలో అందుబాటులో రానుంది.
ఫాస్టాగ్ వార్షిక పాస్‌తో ఒక ట్రిప్ అంటే ఒక టోల్ ప్లాజాను దాటడం అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక ప్రకటనలో చెప్పారు.
అంటే దీనర్థం వార్షిక పాస్ సాయంతో ఏడాదిలో 200 టోల్‌ప్లాజాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా దాటవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత లాభం?
ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద రకరకాల ఫీజులు వసూలు చేస్తున్నారు.
కొన్ని చోట్ల రూ. 50, మరి కొన్ని చోట్ల రూ. 80, ఇంకొన్ని చోట్ల రూ. 100 టోల్ చార్జ్ తీసుకుంటున్నారు.
అయితే వార్షిక టోల్ పాస్‌తో ఒక టోల్ ప్లాజా దగ్గర ప్రైవేటు వాహనానికి రూ.15 మాత్రమే ఉంటుంది.
ఉదాహరణకు ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద వాహనానికి రూ. 50 చెల్లిస్తుంటే 200 ట్రిప్పులకు అది రూ.10వేలు అవుతుంది.
అయితే వార్షిక పాస్ ఉంటే అదే 200 ట్రిప్పులకు రూ.3 వేలు మాత్రమే ఖర్చవుతుంది.
ఈ పాస్ కేవలం జాతీయ రహదారుల మీద మాత్రమే పనికొస్తుంది. రాష్ట్ర రహదారులు, స్థానిక టోల్ ప్లాజాల వద్ద పని చేయదు.
ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద అమలు చేస్తున్న రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో వార్షిక పాస్‌లను అనుసంధానం చేస్తారు
దీన్ని ఉపయోగించడానికి ముందు ఫాస్టాగ్‌లో యాక్టివేట్ చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
60 కిలోమీటర్ల వివాదం ఏంటి?
జాతీయ రహదారుల మీద రెండు టోల్ ప్లాజాల మధ్య దూరం 60 కిలోమీటర్లు ఉండాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 2022లో చెప్పారు. అంటే మీరు ఒక టోల్ ప్లాజా నుంచి బయల్దేరిన తర్వాత రెండో టోల్ ప్లాజా 60 కిలోమీటర్లు లేదా ఆ తర్వాత రావాలి.
వాహనదారులు పదే పదే టోల్ ఫీజులు చెల్లించకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది.
అయితే అనేక మంది కేంద్రమంత్రి వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు.
ఇంట్లో వాహనం మీద బయల్దేరిన తర్వాత 60 కిలోమీటర్ల వరకు ఎలాంటి టోల్ ఫీజు ఉండదని అనుకున్నారు. అయితే ఈ నిబంధన రెండు టోల్ ప్లాజాల మధ్య మాత్రమే వర్తిస్తుంది.
అంతకు ముందు, టోల్ ప్లాజాల సమీపంలో ఉన్న వారికి నెలవారీ పాస్ సౌకర్యం కల్పించారు. దీంతో వారు రోజూ టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే ఇప్పుడు వార్షికపాస్‌తో మంత్లీ పాస్ అవసరం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇయర్లీ పాస్ అమలు ఉద్దేశం ఏంటి?
వార్షిక పాస్ ప్రధాన ఉద్దేశం టోల్ ప్లాజాల వద్ద రద్దీని, ఫాస్టాగ్‌కు సంబంధించిన వివాదాలను తగ్గించడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంతో పాటు జాతీయ రహదారుల మీద ప్రయాణాన్ని సులభతరంగా మార్చడం.
ఇయర్లీ పాస్‌తో జాతీయ రహదారుల మీద హాయిగా, లాభదాయకంగా ప్రయాణం చేయవచ్చు.
ఆటంకాలు లేకుండా టోల్ చార్జీల వసూలు కోసం ప్రభుత్వం అనేక మార్గాలు అన్వేషిస్తోంది. ఈ విధానంలో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్, ఫాస్టాగ్‌ను ఉపయోగిస్తారు.
దీనికి సంబంధించి కొన్ని ఎంపిక చేసిన జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల మీద ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ఈ విధానంలో టోల్ ప్లాజ వద్ద వాహనం నెంబర్ ప్లేట్‌ను గుర్తించి టోల్ ఫీజును వసూలు చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
టోల్ టాక్స్ అంటే ఏంటి?
రహదారులు, భారీ వంతెనలు, సొరంగ మార్గాలు, ఎక్స్‌ప్రెస్ రహదారుల్ని ఉపయోగించుకుంటున్నందుకు ప్రభుత్వం లేదా ప్రభుత్వం ఆమోదించిన సంస్థ వసూలు చేసే పన్నును టోల్ టాక్స్ అంటున్నారు.
కొన్నిసార్లు రాష్ట్ర రహదారుల మీద కూడా టోల్ టాక్స్ విధిస్తారు. ఇలా వచ్చిన నిధులను ప్రభుత్వం రహదారుల నిర్మాణం, నిర్వహణ, మరిన్ని సౌకర్యాల కల్పనకు ఖర్చు చేస్తుంది.
టోల్ టాక్స్ చెల్లించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నగదు రూపంలో, డిజిటల్ అంటే ఫాస్టాగ్ ద్వారా కూడా చెల్లించవచ్చు. జాతీయ రహదారుల మీద వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేశారు.
జాతీయ రహదారుల మీద టోల్ ఫీజును ఎలక్ట్రానిక్ విధానంలో వసూలు చేసుకోవడానికి ఫాస్టాగ్ ఉపకరిస్తుంది. దీని సాయంతో రహదారులపై టోల్ ప్లాజా వద్ద ఆగకుండా, నగదుతో పని లేకుండా టోల్ ఫీజు చెల్లించవచ్చు.
ఫాస్టాగ్ ఒక చిన్న స్టిక్కర్ రూపంలో ఉంటుంది. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్ టెక్నాలజీ అమర్చి ఉంటుంది. దీన్ని అంటించుకున్న వాహనం టోల్ ప్లాజా గుండా వెళుతున్నప్పడు, స్టిక్కర్‌ను స్కాన్ చేస్తే స్టిక్కర్‌తో అనుసంధానించిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్ రుసుము ఆటోమేటిక్‌గా టోల్ ప్లాజా ఖాతాలోకి వెళ్లిపోతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














