కార్లకు ఎయిర్ కూలర్లు.. ఏసీ కంటే ఇదే బాగుందంటున్న అఫ్గానిస్తాన్ డ్రైవర్లు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెల్లీ ఎన్జీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎండ వేడిమితో సతమతమవుతున్న అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌లో ట్యాక్సీలపై వెడల్పాటి గొట్టాలు, ఎగ్జాస్ట్ ట్యూబ్‌లు కనిపిస్తున్నాయి.
వేడి నుంచి ఉపశమనం కోసం ట్యాక్సీ డ్రైవర్లు స్వయంగా చేసుకున్న ఏర్పాట్లు ఇవి.
అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పైన నమోదవుతున్నాయి.
కార్లలో ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు తరచుగా పని చేయకపోవడంతో క్యాబ్ డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు.
"కారులో ఉండే ఏసీ కంటే ఇది బాగా పని చేస్తోంది. ఏసీల వల్ల చాలా కార్లలో ముందు భాగంలో మాత్రమే చల్లగాలి వస్తుంది. కానీ కూలర్ల వల్ల కారు మొత్తం చల్లగా అవుతుంది" అని డ్రైవర్ అబ్దుల్ బారి ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.
ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వీడియోలో.. కారు మీద కూలర్ అమర్చి దానికి బిగించిన గొట్టాన్ని కారులోకి పెట్టి టేపు వేయడం కనిపిస్తోంది. బారీ సహాయకుడొకరు కారు మీదకు ఎక్కి కూలర్ కింద పడకుండా బిగించే దృశ్యాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి.
ఇందులో సమస్య ఏంటంటే కూలర్‌లో రోజూ రెండుసార్లు నీళ్లు నింపడమే అని బారీ చెప్పారు.
అయితే ఇది బాగా పని చేస్తోందని అన్నారు.

ప్రపంచంలో పేద దేశాల్లో ఒకటైన అఫ్గానిస్తాన్ వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది.
రానున్న రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని హెచ్చరికలు వస్తున్నాయి.
ఉష్ణోగ్రత తీవ్రత పెరగడంతో కొన్నేళ్ల క్రితమే తాను ఈ కూలర్లను ఉపయోగించడం మొదలుపెట్టినట్లు కాందహార్‌కు చెందిన మరో డ్రైవర్ గుల్ మొహమ్మద్ చెప్పారు.
"ఈ కార్లలో ఏసీలు సరిగ్గా పని చేయడం లేదు. వాటిని బాగు చేయించడానికి చాలా ఖర్చవుతోంది. అందుకే నేనొక టెక్నీషియన్ దగ్గరకు వెళ్లి నాకు కావల్సినట్లు కూలర్ తయారు చేయించుకున్నాను" అని ఆయన ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు. దీని కోసం ఆయన 3 వేల అఫ్గానీలు (సుమారు రూ. 3,700) ఖర్చు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సృజనాత్మక పరిష్కారాన్ని ప్రయాణికులు అభినందిస్తున్నారు.
"కూలర్ లేకపోతే చాలా కష్టంగా ఉంటోంది. నేను నాతో పాటు యాంటీ హీట్ మెడిసిన్ తెచ్చుకుంటున్నాను" అని 19 ఏళ్ల నోరుల్లా చెప్పారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు అఫ్గానిస్తాన్‌లో రికార్డు స్థాయిలో ఎండలు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరవు పరిస్థితులు గ్రామాల్లో జీవనోపాధిని దెబ్బ తీసిందని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ చెప్పింది.
వాతావరణ మార్పుల పర్యవసానాలు అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుతం ఉన్న మానవీయ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2021 ఆగస్టులో తాలిబాన్లు అధికారం చేజిక్కుంచుకున్న తర్వాత ఐక్యరాజ్య సమితి వాతావరణ చర్చల నుంచి ఆ దేశాన్ని పక్కకు పెట్టారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














