నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత, సినీ - రాజకీయ ప్రముఖుల సంతాపం

ఫొటో సోర్స్, Vishnu Manchu/x
తెలుగు సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు చెప్పారు.
వయోభారం కారణంగా ఆయన కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు 750కి పైగా చిత్రాల్లో నటించారు.
విలక్షణ నటుడిగా పేరున్న కోట శ్రీనివాస రావు నెగటివ్ పాత్రలు, హాస్య పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు ఎందులోనైనా ఒదిగిపోయేవారని సినీ విశ్లేషకులు చెప్తారు.


ఫొటో సోర్స్, UGC
డాక్టర్ కావాలనుకుని..
చిన్నప్పుడు డాక్టర్ కావాలనుకున్న కోట.. ఆ తర్వాత నాటకాల పట్ల ఆకర్షితులై నటన వైపు అడుగులేశారు.
కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. చదువుకునే రోజుల నుంచే నటనపై మక్కువ పెంచుకున్నారు.
1978లో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన తెలుగు సినిమా రంగంలో నటుడిగా పరిచయమయ్యారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లోనూ ఆయన నటించారు.
సినిమాల్లోకి రాకముందు కొద్దికాలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు.
1985లో వచ్చిన ప్రతిఘటన సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. అహనా పెళ్లంట, గణేశ్, బొమ్మరిల్లు, మల్లీశ్వరి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు.

ఫొటో సోర్స్, Kota Srinivas Rao/FB
పల్లెటూరి విలన్ నుంచి అల్లరి తాతయ్య వరకూ తనదైన శైలితో మెప్పించారు.
కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి హీరోలతో పాటు యువ హీరోలతోనూ ఆయన నటించారు.
అహనా పెళ్లంట సినిమాలో పిసినారి లక్ష్మీపతిగా ఆయన నటనకు ప్రశంసలొచ్చాయి.
అలాగే, వెంకటేష్ హీరోగా చేసిన గణేశ్ సినిమాలో రాజకీయ నాయకుడిగా, తనదైన డైలాగులతో విలనిజానికి కొత్త రంగులు అద్దారు.
హాస్యం పండించడంలోనూ కోట శ్రీనివాసరావుకు పేరుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘విలక్షణ నటుడు’
కోట నటనలో విలక్షణతను సినీ రంగానికే చెందిన నటులు, దర్శకులు ప్రశసించిన సందర్భాలున్నాయి.
మూడు రోజుల కిందట(జులై 10న) కోట శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఉన్న ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.
‘చాలామంది నటులు నవ్వించగలరు.. చాలామంది నటులు ఏడిపించగలరు.. నవ్వించి, ఏడిపించి, భయపెట్టగలిగే నటులు బహుశా కోట ఒక్కరే’ అంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, UGC
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా..
కోట శ్రీనివాసరావు రాజకీయంగానూ రాణించారు.
1999 ఎన్నికల్లో బీజేపీ తరఫున కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
సినీ రంగానికి చేసిన విశేష సేవలకు గానూ 2015లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ విలన్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 9 నంది అవార్డులు అందుకున్నారు కోట శ్రీనివాసరావు.
ఇవేకాకుండా.. సైమా అవార్డు, రేలంగా అవార్డు, అల్లు రామలింగయ్య పురస్కారాలు అందుకున్నారు.
సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
కోట శ్రీనివాసరావు మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
కోట శ్రీనివాసరావు మరణం బాధాకరమని, ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారని ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
''తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు'' అని కోట శ్రీనివాసరావు గురించి మోదీ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారి మరణం విచారకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి'' అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కోట శ్రీనివాసరావు మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కోట శ్రీనివాసరావు మరణం సినీ రంగానికి తీరని లోటని ఆయన అన్నారు.
లెజెండరీ యాక్టర్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మృతి బాధాకరమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాం. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు శ్రీ కోట'' అంటూ ప్రముఖ నటుడు చిరంజీవి సంతాపం తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

ఫొటో సోర్స్, UGC
''తెలుగు భాష, యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్‌గా, ఓ మధ్య తరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా… ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారు. కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'' అని నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
కోట శ్రీనివాసరావు మృతిపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
''మధ్యతరగతి తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, నవ్వించే పోలీసు, మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తికట్టించారు. ఇంతటి గొప్ప నటుడు మన మధ్య లేక పోవడం అత్యంత విషాదకరం'' అని పోస్ట్ చేశారు.
సినిమా రంగంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా అన్ని రకాల పాత్రలు వేస్తూ తనదైన ముద్ర వేసిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన కోట ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండేవారని అన్నారు. 'పాదయాత్ర సందర్భంగా నాకు అనేక సూచనలిస్తూ ప్రోత్సాహించారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసినప్పుడల్లా అభినందిస్తూ మరింతగా ప్రజల్లోకి వెళ్ళాలంటూ వెన్ను తట్టి ప్రోత్సహించిన నాయకుడు కోట. కోట శ్రీనివారావు మరణం భారతీయ జనతా పార్టీకి, సినిమా రంగానికి తీరని లోటు' అన్నారు బండి సంజయ్.
''ఆయన అద్భుతమైన నటుడు, అసమాన ప్రతిభ కలిగిన వ్యక్తి, సీరియస్ పాత్ర అయినా, విలన్ అయినా, కామెడీ అయినా - ప్రతి పాత్రలోనూ ఆయన ప్రాణం పోశారు.ఆయనతో చాలా సినిమాల్లో పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి'' అని నటుడు మంచు విష్ణు రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














