ఎన్టీఆర్, ఏఎన్నార్, మధుబాల నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో అక్కడ ఎందుకు ఉన్నారు?

నాగార్జున సాగర్, సినిమాల నిర్మాణం

ఫొటో సోర్స్, Suresh Productions

ఫొటో క్యాప్షన్, ‘దేశమ్ము మారిందోయ్’ పాటలో ఎన్టీ రామారావు, ఎల్.విజయలక్ష్మి, బ్యాక్‌గ్రౌండ్‌లో నిర్మాణ దశలో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నాగార్జున సాగర్ అనగానే మనకు సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టుగానే గుర్తుకు వస్తుంది. ఈ డ్యామ్ నిర్మాణానికి సుదీర్ఘకాలం పట్టింది. దాంతో ఆ సమయంలో నాగార్జున సాగర్ నిర్మాణ ప్రాంతం అప్పట్లో సినిమా షూటింగులకు కేంద్రంగా మారింది.

అప్పట్లో డ్యాం పరిసర ప్రాంతంలో అనేక సినిమాలు చిత్రీకరణ జరుపుకొన్నాయి.

ఇందులో తెలుగు, హిందీ సినిమాలు కూడా ఉన్నాయి.

ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, మధుబాల వంటి వారు సాగర్ నిర్మాణ ప్రాంతంలోనే ఉంటూ తమ సినిమాల చిత్రీకరణ పూర్తి చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నాగార్జున సాగర్

ఫొటో సోర్స్, Suresh Productions

ఫొటో క్యాప్షన్, 'దేశమ్ము మారిందోయ్' పాటలోని దృశ్యాలను చూస్తే నాగార్జున సాగర్ నిర్మాణం, వెనుక కూలీలు రాళ్లు మోసుకెళ్తున్నట్లుగా కనిపిస్తుంది.

రాముడు-భీముడు సినిమాలో

ఎన్టీ రామారావు నటించిన రాముడు-భీముడు సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో డి.రామానాయుడు నిర్మించారు. ఇందులో 'దేశమ్ము మారిందోయ్.. కాలమ్ము మారిందోయ్' పాట చిత్రీకరణ పూర్తిగా నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణం జరిగిన ప్రాంతంలోనే తీశారు.

పాటను చూస్తే డ్యాం నిర్మాణం, వెనుక కూలీలు రాళ్లు మోసుకెళ్తున్నట్లుగా, వాహనాల రాకపోకల హడావుడి కనిపిస్తుంది.

సినిమా కథలో భాగంగా.. వేసవి కాలం కావడంతో ఊళ్లో పనులు లేకపోవడంతో రెండు నెలలపాటు నందికొండకు వెళ్లి పనులు చేసుకుని ఎంతో కొంత సంపాదించుకొని వద్దామని ఊరి జనాలు హీరో వద్ద ప్రతిపాదన చేస్తారు. అందుకు అంగీకరించి నందికొండలో పనులకు బయల్దేరి వెళతారు.

అక్కడే పాట మొదలవుతుంది. పాటలో ఎన్టీ రామారావు, నటి ఎల్.విజయలక్ష్మి కనిపిస్తారు.

నాగార్జున సాగర్, సినిమాలు

ఫొటో సోర్స్, Suresh Productions

ఫొటో క్యాప్షన్, రాముడు-భీముడు సినిమాలో ఎన్టీ రామారావు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం నందికొండ వద్ద జరిగింది.

1964లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వచ్చిన తొలి సినిమా 'రాముడు, భీముడు' అని నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చెప్పారు.

సినిమా కథలో భాగంగా.. పనుల కోసం హీరో అక్కడికి వెళ్లిన సందర్భంలో పాట వస్తుంది.

''సినిమా నిర్మాణ సమయంలో నేను చిన్న పిల్లాడిని. నాన్న(రామానాయుడు)తో కలిసి నాగార్జున సాగర్ మీదుగా ఊరు వెళ్లేవాళ్లం. ఆ సమయంలో నాగార్జున సాగర్‌లో ఆగినప్పుడు అక్కడ జరిగిన షూటింగ్ విశేషాలు నాతో ఆయన పంచుకునేవారు. రామారావు ఏ గెస్ట్ హౌస్‌లో ఉండేవారు? మిగిలిన నటులు ఎక్కడ ఉండేవారు? అవన్నీ నాకు చూపించారు'' అని బీబీసీతో చెప్పారు సురేష్ బాబు.

నాగార్జున సాగర్, సినిమాల నిర్మాణం, టాలీవుడ్

ఫొటో సోర్స్, Suresh Productions

ఫొటో క్యాప్షన్, ఎల్.విజయలక్ష్మి

దేశంలో మార్పులకు ప్రతీక: సురేష్ బాబు

పాట లిరిక్స్ పరంగా చూస్తే 'దేశమ్ము మారిందోయ్.. ' అని మొదలవుతుంది. పాటను ప్రతిబింబించేలా దేశంలో నాగార్జున సాగర్ వంటి పెద్ద ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయని చూపించేందుకు వీలుగా ఆ ప్రదేశాన్ని షూటింగ్ కోసం ఎంచుకున్నారని నిర్మాత సురేష్ బాబు బీబీసీతో చెప్పారు.

''నాగార్జున సాగర్ వద్ద ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలియజేయాలని నాన్న భావించారు. అదే అభిప్రాయం రామారావు కూడా వ్యక్తం చేశారని తర్వాత మాతో చెప్పారు. స్వాతంత్య్రం తర్వాత వచ్చిన మార్పులలో భాగంగా అతిపెద్ద డ్యాం నిర్మాణం ఎలా జరుగుతోంది? వారు ఎంత కష్టపడుతున్నారో చెప్పేలా అక్కడ షూట్ చేసి ప్రపంచానికి తెలియజేశారు. షూటింగ్ వల్ల ఎవరికి ఇబ్బంది కూడా కలగలేదని నాన్న చెప్పారు'' అని సురేష్ బాబు వివరించారు.

రాముడు భీముడు సినిమాతోపాటు 1964లో విడుదలైన 'డాక్టర్ చక్రవర్తి' కూడా నాగార్జున సాగర్ వద్దే చిత్రీకరణ జరుపుకొంది. ఈ సినిమాలో సాగర్ నిర్మాణ పనులు నేరుగా చూపించకపోయినా, అక్కడ గెస్ట్ హౌస్ వద్ద పార్కులో చిత్రీకరించారు.

సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య నటించగా, 'మనసున మనసై..' పాటను ఇక్కడే చిత్రీకరించారు. ఆ సమయంలోనూ డ్యాం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1955 డిసెంబరు 10న శంకుస్థాపన చేశారు.

ఫొటో సోర్స్, Nagarjuna Sagar project engineers

ఫొటో క్యాప్షన్, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1955 డిసెంబరు 10న శంకుస్థాపన చేశారు.

కూలీగా మధుబాల, సైట్ ఇంజినీర్‌గా సునీల్ దత్

నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణ పనులకు 1955 డిసెంబరు 10న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు.

రాముడు-భీముడు, డాక్టర్ చక్రవరి వంటి సినిమాలే కాదు, హిందీ సినిమా ఒకటి అంతకుముందే అక్కడ నిర్మాణం జరుపుకొంది.

బాలీవుడ్ నటీనటులు మధుబాల, సునీల్ దత్ నటించిన 'ఇన్సాన్ జాగ్ ఉఠా' అనే సినిమా 1959లో విడుదలైంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణ ప్రాంతంలోనే జరిగింది. అక్కడ ప్రాజెక్టు పనుల్లో పనిచేసే కూలీ పాత్రలో మధుబాల నటించగా, సైట్ ఇంజినీర్‌ పాత్రలో సునీల్ దత్ నటించారు.

సినిమాలో కూడా ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్లుగా ఉంటుంది. ఎక్కడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు స్వరూపం వచ్చినట్లుగా ఉండదు. కొన్నిచోట్ల రాళ్ల మధ్య మధుబాల తదితర నటీనటులు చెప్పుల్లేకుండా పనిచేసినట్లుగా సినిమాలో దృశ్యాలను బట్టి తెలుస్తుంది.

బాలీవుడ్‌లో రూపొందించిన సినిమా కోసం నటీనటులు, సిబ్బంది సహా అందరూ నాగార్జునసాగర్‌కు వచ్చి, అక్కడే ఉంటూ చిత్రీకరణ పూర్తి చేశారు.

నాగార్జున సాగర్, సినిమాల నిర్మాణం

ఫొటో సోర్స్, Nagarjuna Sagar project engineers

ఫొటో క్యాప్షన్, నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణ పనులు (ఫైల్ ఫోటో)

''మీరు నాగార్జున సాగర్‌కు వెళితే, కేవలం ఒక చారిత్రక కట్టడాన్ని మాత్రమే చూడరు. అదే ప్రాంతంలో ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య, సావిత్రి, మధుబాల, సునీల్ దత్ వంటి నటులు గడిపారు. అక్కడ సినిమా కోసం పనిచేశారు'' అని నాగార్జున సాగర్‌లో పనిచేసి రిటైర్ అయిన ఉపాధ్యాయుడు శ్యాంసుందర్ వివరించారు.

వేలాది మంది కార్మికుల కష్టంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు.. నిర్మాణ సమయంలో సినిమాల చిత్రీకరణకు ఈ విధంగా వేదికగా మారింది.

నాగార్జున సాగర్, సినిమాల నిర్మాణం

ఫొటో సోర్స్, Nagarjuna Sagar project engineers

ఫొటో క్యాప్షన్, శంకుస్థాపన జరిగిన దాదాపు 12 ఏళ్లకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ విశేషాలు..

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జరిగిన దాదాపు 12 ఏళ్లకు అందుబాటులోకి వచ్చింది.

1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా కుడి కాల్వకు నీటిని విడిచిపెట్టి ప్రాజెక్టును జాతికి అంకితం ఇస్తున్నట్లుగా ప్రకటించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటు ఆంధ్ర ప్రాంతానికి, ఇటు తెలంగాణ ప్రాంతానికి వేర్వేరుగా కాల్వలు తవ్వారు.

ఆంధ్ర ప్రాంతానికి కుడి కాల్వ, తెలంగాణ ప్రాంతానికి ఎడమ కాల్వ ద్వారా నీళ్లందుతుంటాయి.

నాగార్జున సాగర్, ఇందిరాగాంధీ, సినిమాల నిర్మాణం

ఫొటో సోర్స్, Nagarjuna Sagar project engineers

ఫొటో క్యాప్షన్, 1967 ఆగస్టు నాలుగో తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా కుడి కాల్వకు నీటిని విడిచిపెట్టి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లుగా ప్రకటించారు.

సుమారు 22 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిందించే ఉద్దేశంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టును నిర్మించారు.

సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, 408 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది.

క్రమంగా పూడిక పేరుకుపోయి 312 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది.

నాగార్జున సాగర్

ఫొటో సోర్స్, Nagarjuna Sagar project engineers

ప్రాజెక్టుకు 26 క్రస్టు గేట్లు కనిపిస్తుంటాయి.

నందికొండ వద్ద డ్యాం నిర్మించడంతో తొలుత దీన్ని నందికొండ ప్రాజెక్టుగా పిలిచేవారు.

తర్వాత కాలంలో దీనికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుగా పేరు వచ్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)