రహస్య సామూహిక సమాధి: అక్కడ వందలాదిమంది చిన్నపిల్లలను ఖననం చేశారా?

ఐర్లాండ్‌

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, క్రిస్ పేజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హెచ్చరిక: ఈ కథనంలో కలవరపరిచే విషయాలు ఉన్నాయి.

ఖననం చేసినట్టు రికార్డులు లేవు. సమాధి రాళ్ళు లేవు. స్మారక చిహ్నాలు లేవు. దీని గురించి 2014 వరకు ఎవరికీ ఏమీ తెలియలేదు. కానీ ఆ ఏడాది ఒక చరిత్రకారిణి ఐర్లాండ్‌ పశ్చిమానగల గాల్వే జిల్లా టువామ్ అనే ఊరిలో వందలాదిమంది పిల్లలను పాతిపెట్టిన రహస్య చోటు ఉందని కనుగొన్నారు. అది ఒక మురుగు కాలువ ట్యాంక్‌లో ఉండొచ్చన్న అనుమానం ఉంది.

ఇప్పుడు పరిశోధకులు టువామ్ పట్టణంలో ఒక నివాస ప్రాంతంలోని చిన్న పిల్లల ఆటస్థలం పక్కనే ఉన్న మైదానంలో తవ్వకాలు ప్రారంభించేందుకు యంత్రాలను తీసుకువచ్చారు. ఈ పనులు రెండేళ్లు సాగుతాయని అంచనా.

ఈ ప్రాంతంలో ఒకప్పుడు సెయింట్ మేరీస్ చిల్డ్రన్స్ హోం ఉండేది. ఇది ఒక చర్చికి సంబంధించిన సంస్థ. అందులో 1925 నుంచి 1961 మధ్య వేలాది మంది మహిళలు, పిల్లలు ఉండేవారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పచ్చిక మైదానం

ఫొటో సోర్స్, Getty Images/Charles McQuillan

చాలా మంది మహిళలు పెళ్లి చేసుకోకుండానే గర్భవతులయ్యారు. వారి కుటుంబాలు దీన్ని వ్యతిరేకించాయి. వారిని దూరంగా పెట్టాయి. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళను తమ బిడ్డల నుంచి వేరు చేశారు. సెయింట్ మేరీస్‌లో మరణించిన మొదటి శిశువు ప్యాట్రిక్ డెరేన్. ఆ శిశువు 1925లో ఐదు నెలల వయసులో చనిపోయాడు. అదే వయసులో మరిణించిన చివరి శిశువు మేరీ కార్టీ, 1960లో చనిపోయినట్టు డెత్ రికార్డులనుబట్టి తెలుస్తోంది.

ఈ ఇద్దరి మరణాల మధ్యకాలమైన 35 సంవత్సరాలలో, మరో 794 మంది నవజాత శిశువులు, పిల్లలు అక్కడ మరణించినట్లు తెలుస్తోంది. వారందరినీ పాతిపెట్టారని భావిస్తున్నారు. దీన్నే ఐర్లాండ్‌ మాజీ ప్రధాని ఎండా కెన్నీ‘‘భయానక చాంబర్’’గా అభివర్ణించారు.

పి.జె. హావర్టీ తన జీవితంలో మొదటి ఆరు సంవత్సరాలు తాను "జైలు"గా పిలిచే ఆ స్థలంలోనే గడిపారు. అయినప్పటికీ, తాను అదృష్టవంతుడిననే ఆయన భావిస్తారు.

"నేను అక్కడి నుంచి బయటపడ్డాను" అని ఆయన చెప్పారు.

పీజే హావెర్టీ

ఫొటో సోర్స్, Getty Images/Charles McQuillan

ఫొటో క్యాప్షన్, పరిశోధకులు తవ్వకాలు ప్రారంభించే తోట వద్ద పీజే హావెర్టీ.

ఆ పిల్లలను "హోమ్ పిల్లలు" అని పిలిచేవారు. వారిని పాఠశాలలో అంటరానివారిగా చూడడం ఆయనకు ఇంకా గుర్తుంది.

"మేం పాఠశాలకు 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లాలి. 10 నిమిషాల ముందే బయటకు రావాలి. ఎందుకంటే మమ్మల్ని ఇతర పిల్లలతో మాట్లాడనిచ్చేవారుకాదు." అని పీజే చెప్పారు.పాఠశాల విరామ సమయాల్లో కూడా మేం వాళ్లతో కలిసి ఆడుకోవడానికి అనుమతిచ్చేవారుకాదు. దూరం పెట్టేవారు."

ఓ ప్రేమాస్పద ఫాస్టర్ ఇంటికి చేరిన తరువాత కూడా ఈ బాధ పీజే జీవితంలో పెనవేసుకుపోయింది. తను పెద్దయ్యాక తనకు జన్మనిచ్చిన తల్లిని ఆయన కనిపెట్టగలిగారు. పీజేకు ఏడాది వయసున్నప్పుడు ఆయనను తల్లి నుంచి వేరు చేశారు.

హాబీగా చరిత్రను పరిశోధించే కాథరిన్ కార్లెస్ అనే మహిళ సెయింట్ మేరీస్ హోమ్ చీకటి చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే వరకు, బాన్ సెకర్స్ సిస్టర్స్ అనే నన్స్ సమూహం నడిపిన ఆ హోమ్, పీజేకే కాదు టువామ్ పట్టణంలో ఉన్న మరెంతో మందిని దశాబ్దాల పాటు కనిపించని భయంకరమైన నీడలాగా వెంటాడింది.

కాథరిన్ కార్లెస్

ఫొటో సోర్స్, Getty Images/Charles McQuillan

ఫొటో క్యాప్షన్, కాథరిన్ కార్లెస్ జరిపిన పరిశోధనలో 2014లో రహస్య సామూహిక సమాధి గురించి దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి.

సామూహిక సమాధి ఎలా బయటపడింది?

తన కుటుంబ చరిత్రను తెలుసుకోవాలన్న ఆసక్తితో కాథరిన్ 2005లో ఒక స్థానిక చరిత్ర కోర్సు చేశారు. తరువాత, ఆమె ఆసక్తి సెయింట్ మేరీస్ హోమ్‌, అక్కడ నివసించిన "హోమ్ పిల్లలు" పైకి మారింది. ఆ పిల్లలు ఆమెతోనూ, ఆమె స్నేహితులతోనూ కాకుండా పాఠశాలకు విడిగా వచ్చేవారు.

"నేను ఇది మొదలుపెట్టినప్పుడు, నేనేం కనిపెట్టబోతున్నానో నాకు తెలియదు" అని కాథరిన్ అన్నారు. మొదట్లో, కాథరిన్ పెద్దగా ప్రమాదకరం కాని ప్రశ్నలు అడిగినా కూడా ఎవ్వరూ సమాధానం ఇవ్వకపోవడం లేదా అనుమానంతో చూడడం చూసి ఆశ్చర్యపోయారామె.

"ఎవరూ సహాయం చేయలేదు, ఎవరి వద్దా ఎటువంటి రికార్డులు లేవు" అని ఆమె చెప్పారు.

దాంతో హోమ్‌లోని పిల్లల గురించి తెలుసుకోవాలన్న ఆమె సంకల్పం మరింత బలపడింది. ఒక శ్మశాన వాటిక కేర్‌టేకర్‌తో కాథరిన్ మాట్లాడినప్పుడు ఆమెకు ఈ కేసులో ఓ దారి దొరికింది. ఆయన కాథరిన్‌ను ఓ హౌసింగ్ ఎస్టేట్‌కు తీసుకువెళ్లారు. అక్కడే ఒకనాడు సెయింట్ మేరీస్ హోమ్ ఉండేది.

తోట

ఫొటో సోర్స్, Getty Images/Charles McQuillan

ఫొటో క్యాప్షన్, సామూహిక సమాధి ఉందని భావిస్తున్న ప్రదేశం పైభాగంలో ఉన్న తోటలో మేరీ మాత విగ్రహం ఉంది. అక్కడ ప్రజలు జ్ఞాపికలు, సందేశాలు, స్మారక వస్తువులను ఉంచారు.

పిల్లల ఆట స్థలం పక్కన, ఓ చతురస్రాకారపు ఫ్రేమ్ మధ్యలో మేరీ మాత విగ్రహం ఉన్న చిన్నపాటి ఆలయం లాంటిది కనిపించింది.

ఆ అనాథాశ్రమాన్నికూల్చివేసిన తర్వాత 1970ల మధ్యలో ఇద్దరు పిల్లలు ఆ ప్రదేశంలో ఆడుకుంటుండగా వారికి ఒక పగిలిన కాంక్రీటు పలక కనిపించింది. దాన్ని పైకెత్తగా, ఒక గొయ్యి బయటపడింది అని కేర్‌టేకర్ కాథరిన్‌కు చెప్పారు.

లోపల వారికి ఎముకలు కనిపించడంతో అధికారులకు సమాచారం అందించామని, దాంతో ఆ ప్రదేశాన్ని మూసేశారని ఆయన చెప్పారు.

అవి 1840లలో ఐరిష్ కరువు కాలంలో చనిపోయినవారి అవశేషాలని ప్రజలు భావించారు. మాతా-శిశు కేంద్రం ఏర్పడకముందు, ఆ సంస్థ కరువుకాలంనాటి వర్క్‌హౌస్‌గా ఉంది. అక్కడ చాలా మంది చనిపోయారు.

కానీ కాథరిన్ దాన్ని నమ్మలేదు. ఎందుకంటే కరువు సమయంలో చనిపోయిన వ్యక్తులను అర మైలు దూరంలో ఉన్న పొలంలో గౌరవప్రదంగా ఖననం చేశారని ఆమెకు తెలుసు. ఆ ప్రదేశాన్ని గుర్తించే స్మారక చిహ్నం కూడా ఉంది.

జాబితా

ఫొటో సోర్స్, Getty Images/Charles McQuillan

ఫొటో క్యాప్షన్, సెయింట్ మేరీస్ సంస్థలో మరణించిన వందలాది మంది పిల్లల వివరాలతో కూడిన జాబితాను కాథరిన్ సంపాదించగలిగారు.

పాత మ్యాపులను పోల్చి చూసినప్పుడు కాథరిన్‌కి మరింత అనుమానం కలిగింది. 1929 నాటి ఒక మ్యాప్‌లో ఆ బాలురు ఎముకలు కనుగొన్న ప్రదేశాన్ని "మురుగు కాలువ నిల్వ ట్యాంక్"అని లేబుల్ చేశారు. 1970లలో అనాథాశ్రమం కూల్చేసిన తర్వాత రూపొందించిన మరో మ్యాప్‌లో అదే ప్రాంతం పక్కన శ్మశానవాటిక అని చేతితో రాసిన నోట్ ఉంది

ఆ మ్యాప్ ప్రకారం ఆ స్థలంలో ఒక సమాధి ఉన్నట్టుగా ఉంది. కాథరిన్ చదివిన ప్రకారం, ఆ మ్యాప్‌లో "మురుగు కాలువ నిల్వ ట్యాంక్"గా ఉండేది. ఆ ట్యాంక్‌ 1937లోనే నిరుపయోగంగా మారింది. అంటే అది ఖాళీగా ఉంది. మరి అక్కడ ఎవరిని సమాధి చేశారు?

గాల్వేలోని జనన మరణాలు, వివాహాల రిజిస్ట్రేషన్ కార్యాలయానికి కేథరీన్ ఫోన్ చేసి, ఆ అనాథాశ్రమంలో మరణించిన పిల్లలందరి పేర్లు కావాలని అడిగారు.

రెండు వారాల తర్వాత, అక్కడి ఉద్యోగుల్లో ఒకరు కాథరిన్‌కి ఫోన్ చేసి, "మీకు నిజంగా అన్ని పేర్లూ కావాలా?" అని అడిగారు. ఎందుకంటే కాథరిన్‌ కేవలం ఇరవై లేదా ముప్పై పేర్లు మాత్రమే ఉంటాయని భావించారు. కానీ… అవి వందల సంఖ్యలో ఉన్నాయి. కాథరిన్‌ పూర్తి జాబితా పరిశీలించినప్పుడు, అందులో 796 మంది మరణించిన పిల్లల వివరాలు కనిపించాయి.

ఆ సంఖ్య చూసి ఆమె ఆశ్యర్యపోయారు.

ఆమె సేకరించిన ఆధారాలతో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది...సెయింట్ మేరీస్‌లోని ఆ పచ్చిక మైదానం కింద ఎవరిని సమాధి చేసుండచ్చో.

కానీ ముందుగా, ఆ వందలాది మంది పిల్లలలో ఎవరినైనా గాల్వే లేదా పొరుగున ఉన్న కౌంటీ మాయోలోని స్మశానవాటికలలో ఖననం చేశారా అని చూడటానికి ఆమె ఖనన రికార్డులను తనిఖీ చేశారు. కానీ ఏమీ కనుక్కోలేకపోయారు.

తవ్వకాలు జరపకపోతే, కాథరిన్ దీనిని పూర్తిగా నిర్ధారించలేరు. అయినప్పటికీ, సెయింట్ మేరీస్ హోమ్‌లో వందలాది మంది పిల్లలను గుర్తించలేని సామూహిక సమాధిలో, బహుశా నిరుపయోగంగా పడివున్న మురుగు కాలువ ట్యాంక్‌లో సమాధి చేశారని ఆమెకు గట్టి నమ్మకం ఉంది.

2014లో ఆమె కనిపెట్టిన అంశాలు అంతర్జాతీయ వార్తలుగా మారినప్పుడు, ఆమె స్వగ్రామంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. "ప్రజలు నన్ను నమ్మలేదు," అని ఆమె గుర్తుచేసుకున్నారు. అనేక మంది ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. ఒక చరిత్రకారిణి ఇంత పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టగలదా అని చాలామంది అవహేళన కూడా చేశారు.

కానీ అక్కడ జరిగిందంతా తన కళ్ళతో చూసిన ఒక సాక్షి ఉన్నారు.

మేరీ మోరియార్టీ

ఫొటో సోర్స్, Getty Images/Charles McQuillan

ఫొటో క్యాప్షన్, మేరీ మోరియార్టీ 1970లలో ఆ అనాథాశ్రమానికి సమీపంలోని ఇంట్లో నివసించారు

మెరీ మోరియార్టీ 1970ల మధ్యలో ఈ అనాథాశ్రమానికి సమీపంలో ఉన్న ఇళ్లలోని ఒక ఇంట్లో నివసించేవారు. ఆమె బీబీసీతో మాట్లాడిన కొద్ది కాలానికి కన్నుమూశారు. అయితే, ఆమె చెప్పిన విషయాలను ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి ఆమె కుటుంబం అంగీకరించింది.

1970ల ప్రారంభంలో ఇద్దరు మహిళలు తన వద్దకు వచ్చి "ఒక కర్రపై పుర్రెతగిలించుకుని ఆడుకుంటున్న పిల్లవాడిని చూశాం" అని చెప్పారని మేరీ గుర్తుచేసుకున్నారు.

మేరీ, ఆమె పొరుగువారు కలిసి ఆ పుర్రె ఎక్కడ దొరికిందని ఆ పిల్లవాడిని అడగ్గా.. వారికి కొన్ని పొదలను చూపించాడు.

"నేను ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా ఒక గుంతలో పడిపోయాను" అని మేరీ తెలిపారు.

ఆమె పడిపోయిన చోట నుంచి కాస్త వెలుతురు గుంతలోకి వచ్చింది. ఆ వెలుతురో బట్ట చుట్టివున్న చిన్న చిన్న మూటలు కనిపించాయి. అవి కుళ్ళిపోయి తడిగా నల్లగా మారిన బట్టలతో చుట్టి, ఒకదానిపై ఒకటిగా, పైకప్పు వరకు వరుసగా పేర్చారు" అని ఆమె తెలిపారు.

ఎన్ని ఉండొచ్చు? అని ఆమెను అడగగా కొన్ని వందలమూటలు అని ఆమె బదులిచ్చారు.

కొంతకాలం తర్వాత, టువామ్‌లోని ప్రసూతి ఆసుపత్రిలో మేరీకి రెండో కుమారుడు జన్మించినప్పుడు, అక్కడ పనిచేసే నన్‌లు బట్టలో చుట్టి ఆమెకు ఇచ్చారు. అది అచ్చం తాను గుంతలో పడినప్పడు చూసినవాటిలాగే ఉంది.

"అప్పుడే నాకు అర్థమయ్యింది. ఆ గుంతలో పడినప్పుడు నేను చూసింది పసిపిల్లలనే" అని మేరీ చెప్పారు.

అన్నా కొరిగన్

ఫొటో సోర్స్, Getty Images/Charles McQuillan

ఫొటో క్యాప్షన్, తన తల్లి తనకంటే ముందు ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చారని 50 ఏళ్ల వయసులో అన్నా కొరిగన్ తెలుసుకున్నారు

కేథరీన్ కనుగొన్న విషయాలు నిజమని 2017లో ధృవీకరించారు. ఐరిష్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఆ ప్రదేశంలో నిర్వహించిన తవ్వకంలో పెద్ద పరిమాణంలో మానవ అవశేషాలు కనుగొన్నారు.

ఆ ఎముకలు కరువు వల్ల చనిపోయినవారివి కావని నిర్ధరించారు. దాదాపు 35 వారాల నుంచి రెండు లేదా మూడు సంవత్సరాల వయసులో మరణించినవారివని తేలింది.

ఆ స్థలంపై పూర్తి దర్యాప్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు వెంటనే తవ్వకాలు మొదలుపెట్టాలని కోరుకునే వారిలో అన్నా కొరిగన్ కూడా ఉన్నారు.

50 ఏళ్ల వయసు వచ్చే వరకు అన్నా తన తల్లిదండ్రులకు తానే ఏకైక సంతానం అని అనుకున్నారు. కానీ, 2012లో తన కుటుంబ చరిత్రను పరిశోధించినప్పుడు, తన తల్లి 1946, 1950లో ఆ ఇంట్లో ఇద్దరు మగపిల్లలు జాన్, విలియంలకు జన్మనిచ్చిందని ఆమె తెలుసుకున్నారు.

విలియంకు సంబంధించిన మరణ ధృవపత్రాన్ని అన్నా కనుగొనలేకపోయారు. కానీ జాన్‌కు సంబంధించిన ఒక ధృవపత్రం ఆమెకు లభించింది. అందులో అధికారికంగా జాన్ 16 నెలల వయసులో మరణించినట్టు నమోదైంది. బుద్ధిమాంద్యం లేదా తట్టు జాన్ మరణానికి కారణమని అందులో రాసి ఉంది.

ధృవపత్రం

ఫొటో సోర్స్, Getty Images/Charles McQuillan

ఫొటో క్యాప్షన్, బుద్ధిమాంద్యం లేదా తట్టు జాన్ మరణానికి కారణమని రాసిన ధృవపత్రం

1947లో ఆ ఇంటి తనిఖీ నివేదికలో జాన్ గురించి మరికొన్ని వివరాలు ఉన్నాయి.

"జాన్ సాధారణ కాన్పుద్వారా ఆరోగ్యంగానే జన్మించాడు. దాదాపు 4 కిలోలు బరువున్నాడు" అని అన్నా చెప్పింది. "అతను 13 నెలల వయస్సు వచ్చేసరికి, శరీరం క్షీణించి కొవ్వు లేని స్థితికి చేరుకుంది. తీవ్రమైన ఆకలితో పాటు శరీర నియంత్రణపై పట్టుతప్పిన పరిస్థితి కనిపించింది."

"దాంతో మూడు నెలల తర్వాత చనిపోయాడు." అని ఆ వివరాల్లో ఉంది.

ఆ సంస్థ "డిశ్చార్జ్స్" పుస్తకంలో విలియం 1951లో మరణించినట్టుగా నమోదైంది. కానీ ఇద్దరినీ ఎక్కడ ఖననం చేశారో ఆమెకు తెలియదు.

ఇప్పుడు, టువామ్‌లోని ఆ పచ్చికమైదానం కింద ఏముందో పూర్తి స్థాయిలో తెలుసుకునే పని మొదలవుతోంది.

డేనియల్ మాక్‌స్వీని

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, తవ్వకాలకు నాయకత్వం వహిస్తున్న డేనియల్ మాక్‌స్వీనికి గతంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ యుద్ధ ప్రదేశాల్లో గల్లంతైన శరీరాల కోసం జరిగిన శోధనల్లో పాల్గొన్న అనుభవం ఉంది.

చిన్న చిన్న అవశేషాలు

ఈ తవ్వకాలకు దాదాపు రెండు సంవత్సరాలు పడుతుందని అంచనా.

"ఇది చాలా సవాల్‌తో కూడుకున్న పని. ప్రపంచంలో మొదటిసారి ఇలా జరుగుతోంది" అని అఫ్గానిస్తాన్ వంటి సంఘర్షణ ప్రాంతాలలో గల్లంతైన మృతదేహాలను కనుగొనడంలో సహాయపడిన ఈ ఆపరేషన్ హెడ్ డేనియల్ మాక్‌స్వీనీ అన్నారు.

అవశేషాలు ఒకదానికొకటి కలిసిపోయుండే అవకాశం ఉందని, శిశువు తొడ ఎముక అంటే శరీరంలోని అతిపెద్ద ఎముక అని, అది పెద్దవారి వేలి పరిమాణంలో మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు.

"అవి చాలా చిన్నవి," " అవి ఎవరివో గుర్తించాలంటే చాలా జాగ్రత్తగా సేకరించాలి." అని ఆయన తెలిపారు.

ఎంత సమయం తీసుకున్నా, అన్నా లాంటి వారు ఎదురుచూస్తూ ఉంటారు - వారు ఎప్పుడూ కలవడానికి అవకాశం లేని సోదరీమణులు, సోదరులు, మామలు, అత్తలు కజిన్స్ గురించి వినాలని ఆశతో ఉంటారు.

దీనికి ఎంతకాలమైనా పట్టినాసరే అన్నా వంటి వారు ఎదురు చూస్తూనే ఉంటారు. తాము ఎప్పటికీ కలుసుకోలేకపోయిన అక్క, అన్న, మామ, పిన్ని, మేనమామ లేదా మేనత్తల గురించి ఏదైనా సమాచారం వస్తుందన్న ఆశతో.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)