మిమ్మల్ని రహస్యంగా చిత్రీకరించే కెమెరాలను గుర్తించడం ఎలా, ఆ సీక్రెట్ వీడియోలను ఏం చేస్తున్నారో తెలుసా?

 రహస్య కెమెరాలు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, హోటల్ రూమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాష్ రూమ్‌లు వినియోగించే ముందు పరిసరాలను గమనించడం ముఖ్యం

వాష్‌రూమ్‌లో ఉన్న మహిళను రహస్యంగా వీడియో తీసిన ఘటన బెంగళూరులో వెలుగులోకొచ్చింది. ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఆ మహిళ వయసు 35ఏళ్లు.

తన కొలీగ్స్‌లో ఒకరు, వాష్ రూమ్ పక్కనే ఉన్న క్యూబికల్‌లో నిలబడి మొబైల్ ఫోన్‌తో వాష్‌రూమ్‌లో వీడియో చిత్రీకరించారని ఆమె ఆరోపించారు.

తలుపు వెనకాల నీడను ఆమె గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఆమె కమోడ్ పైకెక్కి నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఘటన తర్వాత ఐటీ కంపెనీ ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించింది.

బాత్‌రూమ్‌లు, దుస్తులు మార్చుకునే గదులు, హోటల్ రూమ్‌ల వంటి వాటిల్లో రహస్య కెమెరాలను అమర్చుతున్న ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి.

2015లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇలాంటి ఫిర్యాదే చేశారు. ఓ స్టోర్‌లో సీసీటీవీ కెమెరా డ్రెస్ మార్చుకునే గది వైపు ఉందని ఫిర్యాదులో తెలిపారు.

పబ్లిక్ టాయిలెట్లు, చేంజింగ్ రూమ్స్, హోటళ్లు వంటివాటికి వెళ్లినప్పుడు అలాంటి భయాలుంటాయి. అయితే అప్రమత్తంగా ఉండడం ద్వారా రహస్య కెమెరాల బారిన పడకుండా ఉండొచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 రహస్య కెమెరాలు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, హోటల్ రూమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాలా చిన్నగా ఉండే రహస్య కెమెరాలు మన ప్రతి చర్యనూ రికార్డు చేస్తాయి.

రహస్య కెమెరాను ఎలా గుర్తించవచ్చు?

రహస్య కెమెరాలు ఎక్కడ ఉంచగలరో ముందుగా తెలుసుకోవాలి.

హిడెన్ కెమెరాలు చాలా చిన్నగా ఉంటాయి. కానీ అవి మనం చేసే ప్రతిదానినీ రికార్డు చేయగలవు. మీరు బాత్‌రూమ్‌లో ఉన్నా, స్టోర్‌లలో ఉండే డ్రెస్ చేంజింగ్ రూమ్‌లో ఉన్నా, మీ భాగస్వామితో హోటల్ రూమ్‌లో ఉన్నా, ఈ కెమెరాలు మిమ్మిల్ని చిత్రీకరించగలవు.

ఈ రకం కెమెరాలను ఎక్కడైనా తేలిగ్గా దాచిపెట్టవచ్చు.

ఉదాహరణకు...

  • అద్దం వెనక
  • తలుపు దగ్గర
  • గోడ మూలవైపు
  • పై కప్పు లేదా సీలింగ్ పైన
  • బల్బులో
  • ఫోటో ఫ్రేమ్‌లో
  • టిష్యూ పేపర్ బాక్స్‌లో
  • ఫ్లవర్ వాజ్‌లో
  • స్మోక్ డిటెక్టర్‌లో
 రహస్య కెమెరాలు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, హోటల్ రూమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రహస్య కెమెరాలు ఎక్కడున్నాయో పరిశీలించడం ద్వారా వాటి బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

కెమెరా ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా?

ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండడం మొట్టమొదట మీరు చేయాల్సిన పనని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

మీరు పబ్లిక్ టాయిలెట్, చేంజింగ్ రూమ్, లేదా హోటల్ గదిలోకి ఎప్పుడు వెళ్లినా చుట్టూ జాగ్రత్తగా గమనించాలి.

మీ దగ్గర్లో ఉన్న వస్తువులను చెక్ చేయాలి, పైకప్పు మూలల్లో కూడా చూడాలి.

ఏమన్నా రంధ్రాలున్నాయోమో చూడాలి:

ఎక్కడైనా రంధ్రం, పగుళ్లు లాంటివి కనిపిస్తుంటే.. అందులో ఏమైనా ఉందేమో గమనించాలి.

సాధారణంగా కెమెరాలు అద్దాలు, ఫోటో ఫ్రేమ్‌లు, తలుపులు వెనకాల పెడుతుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే వాటిని గుర్తించవచ్చు.

ఏదైనా వైర్ కనిపిస్తే: ఎక్కడైనా ఎక్స్‌ట్రా వైర్లు ఉన్నాయేయో చూడాలి. అలా కనిపిస్తే ఆ వైర్ ఎక్కడి నుంచిఎక్కడిదాకా ఉందో గమనించాలి. ఆ వైరును గమనిస్తూ పోతే మీరు కెమెరా వరకు వెళ్లొచ్చేమో.

చాలా కెమెరాలకు ఎలాంటి వైర్లూ ఉండవు. బ్యాటరీలతో నడిచే ఆ కెమెరాలను మాగ్నెట్‌లా ఎక్కడైనా అతికించేయచ్చు.

లైట్లు ఆఫ్ చేసి చెక్ చేయాలి:

డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్‌లో లేదా హోటల్ గదిలో ఉన్నప్పుడు... ఒకసారి లైట్ ఆఫ్ చేసి చుట్టూ గమనించాలి..ఎక్కడైనా మీకు ఎల్ఈడీ వెలుగు కనిపిస్తే అది కెమెరా కావచ్చు.

కొన్నిచోట్ల నైట్ విజన్ కెమెరాలుంటాయి. అవి చీకట్లో కూడా ప్రతి కదలికనూ రికార్డ్ చేయగలవు. ఆ కెమెరాలకు ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. వాటిని చీకట్లో గుర్తించవచ్చు.

 రహస్య కెమెరాలు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, హోటల్ రూమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెమెరా ఎక్కడుందో తెలుసుకోవడానికి అనేక మార్గాలున్నా..అప్రమత్తంగా ఉండడం అన్నింటికన్నా ముఖ్యమని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

అద్దాల వెనక ఉండొచ్చు...

దుస్తులు మార్చుకునే గదులు, బాత్‌రూమ్, రూముల్లో చాలా చోట్ల అద్దాలుంటాయి. అ అద్దాల ముందు నిల్చుని డ్రెస్ మార్చుకోవచ్చు. టాయ్‌లెట్‌కు వెళ్లొచ్చు. హోటల్ గదుల్లో కూడా భారీ అద్దాలుంటాయి.

ఆ అద్దం అవతలివైపు నుంచి మిమ్మల్ని ఎవరైనా చూస్తుండవచ్చు. దాని వెనుక అంతా రికార్డ్ చేసే కెమెరా ఏదైనా బిగించి ఉండచ్చు. అందుకే అద్దాలను చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి.

ఆ అద్దంపై మీ వేలు పెట్టి చూడాలి. మీ వేలుకు, అద్దంలో వేలు ప్రతిబింబానికి మధ్య కాస్త గ్యాప్ కనిపించినా ఆ అద్దం మంచిదే. ఆ గ్యాప్ కనిపించకపోతే అక్కడ ఏదో తేడా ఉందని అర్ధం.

మొబైల్ ఫ్లాష్ ఆన్ చేయండి:

అప్పుడు లైట్ ఆఫ్ చేసి మీ మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసి, అన్ని వైపుల నుంచి పరిశీలించండి.

ఎక్కడి నుంచయినా రిఫ్లెక్షన్ కనిపిస్తోందంటే అది కెమెరా లెన్స్ అయ్యుండొచ్చు. ఆ రిఫ్లెక్షన్ వచ్చే వైపు వెళ్లి అక్కడ హిడెన్ కెమెరా ఉందేమో జాగ్రత్తగా చెక్ చేయాలి.

 రహస్య కెమెరాలు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, హోటల్ రూమ్స్

ఫొటో సోర్స్, AVON AND SOMERSET POLICE

ఫొటో క్యాప్షన్, పబ్లిక్ ప్లేసుల్లో చిత్రీకరించిన వీడియోలకు భారీ మార్కెట్ ఉందని సైబర్ నిపుణులు తెలిపారు.

యాప్‌లు, డిటెక్టర్లు

హిడెన్ కెమెరాలను గుర్తించే అనేక యాప్‌లున్నాయి. అయితే వాటిలో చాలా యాప్‌లు, ఫేక్ అని, మోసపూరితమైనవని సైబర్ నిపుణులు అంటున్నారు. ఈ నకిలీ యాప్‌లు మీకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా, మీ ఫోన్‌లో వైరస్‌ను చేరుస్తాయి.

కొన్ని డిటెక్టర్ పరికరాలు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా ఖరీదైనవి, అందరూ వాటిని కొనలేరు. అలాంటి పరికరాలు పోలీసుల దగ్గర ఉంటాయి.

 రహస్య కెమెరాలు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, హోటల్ రూమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రహస్య కెమెరాను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారమందించాలి.

కెమెరా కనిపిస్తే, లేదా దొరికితే ఏం చేయాలి?

మీకు రహస్య కెమెరా కనిపిస్తే భయాందోళన చెందకండి. వెంటనే పోలీసులను సంప్రదించండి.

ఆ కెమెరాను అసలు టచ్ చేయొద్దు. ఎందుకంటే దాని మీద నిందితుల ఫింగర్ ప్రింట్స్ ఉండొచ్చు.

పోలీసులు వచ్చేవరకూ అక్కడే ఉండండి.

ఈ కెమెరాలతో తీసిన వీడియోలను వారేం చేస్తారు?

''కొందరు తాము చూడడానికే వీటిని రికార్డు చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే...వీటికి చాలా పెద్ద మార్కెట్ ఉంది'' అని సైబర్ నిపుణులు వినీత్ కుమార్ చెప్పారు.

''ఆ వీడియోలను అమ్ముతారు. తర్వాత వాటిని వెబ్‌సైట్లలో పోస్టు చేస్తారు. అలాంటి వీడియోలను చాలా మంది చూస్తారు. చాలాసార్లు అమ్మాయిలు, మహిళలు దీని గురించి ఎవరికీ చెప్పరు. ఎవరికైనా దీని గురించి చెబితే తమ పరువుపోతుందనుకుంటారు. కానీ ఇలా భయపడకూడదు. పోలీసులకు చెప్పి, వారి సాయం తీసుకోవాలి'' అని ఆయన సూచించారు.

కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ cybercrime.gov.in ‌లో కూడా ఈ ఫిర్యాదులు స్వీకరిస్తారు. మహిళా కమిషన్ సైబర్ సెల్, మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సైబర్ సెల్‌లో కూడా ఈ ఫిర్యాదులు నమోదుచేస్తారు.

రహస్య కెమెరాలను గుర్తించడానికి నిపుణులు ఎన్నో ట్రిక్స్ చెబుతుంటారు. అయితే అప్రమత్తంగా ఉండడమే అత్యంత ముఖ్యమన్నది వారి అభిప్రాయం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)