మూవీ పైరసీ: తండేల్, సింగల్ సహా 40 సినిమాల పైరసీ.. ఏసీ మెకానిక్ కొత్త సినిమాలను ఎలా రికార్డు చేశాడంటే

ఫొటో సోర్స్, Hyderabad Police
తండేల్, హ్యాష్ టాగ్ సింగిల్, రాజధాని ఫైల్స్..ఇలా ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాలను రిలీజైన మొదటి రోజే హెచ్‌డీ క్వాలిటీలో పైరసీ చేశారో యువకుడు. చదివింది ఐటీఐ అయినా, సినిమాలను పైరసీ చేసి, అమ్మడమే పనిగా పెట్టుకున్న ఆయన్ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు
ఈ ఏడాది మే 9న విడుదలైన 'హ్యాష్ టాగ్ సింగిల్' సినిమా పైరసీకి గురైందని జూన్ 5న తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రతినిధి మణీంద్రబాబు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
''పైరసీ చేసిన హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్లు 1తమిళ్ బ్లస్టర్స్, 5మూవీరూల్స్, 1తమిళ్ ఎంవీ సైట్లలో అప్‌లోడ్ చేశారు'' అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఇందులో కిరణ్ కుమార్ అనే యువకుడి ప్రమేయం ఉందని తేల్చారు.


ఫొటో సోర్స్, Geetha Arts
పైరసీని ఎలా గుర్తిస్తారంటే..
పైరసీ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు 2024లో దాదాపు రూ.3700 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చెబుతోంది.
'‘థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు ప్రతి సినిమా హాలులో ప్రతి షోకు తెరపై ఒక యూనిక్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ సంఖ్యలు కావచ్చు, అక్షరాలు కావచ్చు, క్యూఆర్ కోడ్ కావచ్చు. ఇది సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కనిపించదు. కానీ సినిమాను రికార్డు చేస్తే మాత్రం ఆ కోడ్ కూడా రికార్డు అవుతుంది. ఈ కోడ్ ఆధారంగా ఏ థియేటర్‌లో, ఏ టైమ్‌కు షో పైరసీ చేశారనేది గుర్తించే వీలుంటుంది'' అని ఫిలిం చాంబర్ ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.
దీని ఆధారంగా అత్తాపూర్‌లోని ఒక థియేటర్‌లో వేసిన షోను పైరసీ చేసినట్లుగా గుర్తించి, ఫిలిం చాంబర్ తరపున పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫొటో సోర్స్, Geetha Arts
పోలీసులకు ఎలా చిక్కారంటే..
సినిమాను ఏ థియేటర్ నుంచి పైరసీ చేశారనే సమచారం టీఎఫ్‌సీసీ నుంచి వచ్చిందని హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం డీసీపీ ధారా కవిత బీబీసీతో చెప్పారు.
సినిమా మొదటి రోజు ఉదయం ప్రదర్శించిన షోకు 47 మంది వెళ్లినట్లుగా గుర్తించి విచారణ ప్రారంభించామని కవిత వివరించారు. అలాగే థియేటర్‌లో ఏ కార్నర్ నుంచి వీడియో తీశారో కూడా పైరసీ ప్రింట్ ఆధారంగా పోలీసులు కొంత సమాచారం రాబట్టగలిగారు. ఆన్‌లైన్ (బుక్ మై షో)లో టికెట్ బుక్ చేసుకున్న వివరాలు పరిశీలించి నలుగురిని అనుమానితులుగా గుర్తించారు.
''నలుగురి విషయంలో టెక్నికల్ వెరిఫికేషన్ చేశాక ఎన్జీఓ కాలనీకి చెందిన జాన కిరణ్ కుమార్ పైరసీ చేస్తున్నట్లుగా తేలింది'' అని కవిత బీబీసీతో చెప్పారు.
''మొదట మేం పిలిచి విచారణ చేసినప్పుడు తన పక్కన ఉన్న మరో అమ్మాయి రికార్డు చేసిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అతని సెల్ ఫోన్ రికవరీ చేసుకోవడంతో మరికొన్ని ఆధారాలు లభించాయి. దీంతో కిరణ్ కుమార్‌ను అరెస్టు చేశాం'' అని కవిత వివరించారు.
కిరణ్ కుమార్‌ది తూర్పు గోదావరి జిల్లా. వయసు 29 ఏళ్లు. ఐటీఐ చదివారు. ప్రస్తుతం హైదరాబాద్ వనస్థలిపురం సమీపంలోని ఎన్జీఓ కాలనీలో ఉంటూ ఏసీ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నారు.
ఆదాయం సరిపోక సినిమాపైరసీ చేసి డబ్బు సంపాదించాలని ఎత్తుగడ వేశాడని పోలీసులు చెబుతున్నారు.
సినిమాల పైరసీ ఎలా ప్రారంభించాడంటే..
దాదాపు ఏడాదిన్నర కాలంలో కిరణ్ కుమార్ సుమారు 40 సినిమాలు పైరసీ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
వాటిల్లో తండేల్, హ్యాష్ టాగ్ సింగిల్, రాజధాని ఫైల్స్, పెళ్లి కాని ప్రసాద్, 14డేస్ లవ్, గేమ్ ఆన్ వంటి సినిమాలు ఉన్నట్లు గుర్తించారు.
''ఏడాదిన్నర కిందట సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో 1తమిళ్ఎంవీ అనే పైరసీ గ్రూప్ నుంచి ఒక మీమ్ వచ్చినట్లు కిరణ్ కుమార్ చెప్పారు. పైరసీ చేసిన కంటెంట్ ఇవ్వడానికి సంప్రదించవచ్చని అందులో ఉంది. దీంతో పైరసీ చేసి కంటెంట్ ఇస్తానంటూ కిరణ్ కుమార్ ప్రొటాన్ (ఎన్‌క్రిప్టెడ్) మెయిల్ పంపాడు'' అని సైబర్ క్రైం డీసీపీ కవిత చెప్పారు.
కిరణ్ పైరసీ చేసిన విధానాన్ని ఆమె వివరించారు.
"ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుని సినిమా విడుదలైన రోజే చూసేందుకు వెళ్లేవాడు. చొక్కా జేబులో సెల్ ఫోన్ పెట్టుకుని హెచ్‌డీ క్వాలిటీలో రికార్డు చేసేవాడు. అలా రికార్డు చేసేందుకు ప్రత్యేకంగా ఒక సెల్ ఫోన్ వాడేవాడని పోలీసులు గుర్తించారు. తాను వాడిన సెల్ ఫోన్‌ను కొంత దూరం వెళ్లాక లొకేషన్ గుర్తించకుండా ఉండేందుకు వీలుగా స్విచ్ఛాఫ్ చేసేవాడు అలా రికార్డు చేసిన సినిమాలను పైరసీ గ్రూపులకు టెలిగ్రామ్‌లో లింకులు పంపించేవాడని పోలీసులు గుర్తించారు" అని కవిత తెలిపారు.
కిరణ్ ఒక సినిమా పైరసీ వీడియో పంపించాక, టెలిగ్రామ్ అకౌంట్ కూడా మార్చేవాడని కవిత చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చెల్లింపులన్నీ బిట్ కాయిన్ రూపంలో..
పైరసీ చేసినందుకు గానూ ఒక్కో సినిమాకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పైరసీ గ్రూపుల నిర్వాహకులు ఇచ్చేవారని పోలీసులు చెబుతున్నారు.
''పైరసీ గ్రూపుల నుంచి కిరణ్‌కు క్రిప్టో కరెన్సీ (బిట్ కాయిన్) ద్వారా డబ్బులు పంపించేవారు. దాన్ని జెబ్ పే, కాయిన్ డీసీఎక్స్ వంటి వాటి ద్వారా భారతీయ కరెన్సీలోకి మార్చుకుని తనకున్న వివిధ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకునేవాడు'' అని కవిత చెప్పారు.
ఫిలిం చాంబర్ చొరవ కారణంగా..
సినిమా పైరసీ వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటోందని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర ప్రసాద్ చెప్పారు.
''ఇప్పటికే యాంటీ పైరసీ సెల్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా పైరసీ కట్టడికి ప్రయత్నిస్తున్నాం. పైరసీ ప్రాంతాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందిస్తున్నాం'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పైరసీ చేస్తే పదేళ్ల వరకు జైలు
సినిమా పైరసీని తీవ్ర నేరంగా పరిగణిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.
''సినిమాటోగ్రఫీ చట్టం, కాపీ రైట్ చట్టం ప్రకారం పైరసీ చేయడం నేరం. నేరం రుజువైతే వివిధ సెక్షన్ల కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. జైలు శిక్ష, జరిమానా.. రెండూ విధించే అవకాశం కూడా ఉంటుంది. అదనంగా రూ.20వేల జరిమానా కూడా పడొచ్చు'' అని చెప్పారు.
ఇవి కాకుండా భారతీయ న్యాయ సంహిత సెక్షన్లతో కలిపితే, నేరం రుజువైన పక్షంలో పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని ఆనంద్ వివరించారు.
ఎవరైనా పైరసీకి పాల్పడుతుంటే, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














