'రోజు గడిచిపోతుంది, కానీ పని నుంచి తీరిక మాత్రం దొరకదు'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షతాలీ షెడ్మేక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''నాకు పెళ్లై ఐదేళ్లు అవుతోంది. అప్పటి నుంచి నేను ఒక్కరోజు కూడా ఖాళీగా, హాయిగా కూర్చున్నట్లు నాకు గుర్తు లేదు. అసలు పనికి విరామమే ఉండదు. పొద్దున్నుంచి, అర్ధరాత్రి వరకు పని హడావిడి ఉంటుంది. పూర్తిగా అలసిపోయినా కానీ, పని చేయడం మాత్రం తప్పదు.''
కొల్హాపూర్‌కు చెందిన శ్వేత (పేరు మార్చాం) అనుభవం ఇది.
శ్వేత ఒక ప్రభుత్వ అధికారి. ఏడేళ్ల క్రితం ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడిన శ్వేత జీవితం పెళ్లి తర్వాత పూర్తిగా మారింది.
''ప్రతీరోజు ఉదయాన్నే లేచి, ఇంట్లో పనులు చేసుకొని బ్రేక్‌ఫాస్ట్, లంచ్ తయారు చేసి, భర్తకు క్యారేజ్ సర్దడంతో పాటు నా బ్యాగు సర్దుకొని ఆఫీసుకు పరుగెత్తాలి.
మళ్లీ సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి 6:30-7:00 గంటలు అవుతుంది. మళ్లీ వంట చేసి, అందరూ తిన్న తర్వాత వంట ఇంట్లో అన్నీ సర్దేసి పనులు ముగించేసరికి రాత్రి 11 గంటలు అవుతుంది. తర్వాతి రోజు మళ్లీ యథావిధిగా ఇవే పనులు చేయాలి. ఈ తంతు పునరావృతం అవుతూనే ఉంటుంది. రెండేళ్ల క్రితం తల్లినయ్యాక ఈ బాధ్యతలు మరింత పెరిగాయి'' అని శ్వేత వివరించారు.
కానీ, ఇది ఒక శ్వేత పరిస్థితి మాత్రమే కాదు. చాలామంది మహిళలు ఇవే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
మనం ప్రతీ పనికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామనే అంశంపై ఇటీవల జరిగిన ఒక సర్వేలో పురుషులతో పోలిస్తే మహిళలే ఇంటి పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తేలింది.


ఫొటో సోర్స్, Getty Images
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నిర్వహించిన సమయ వినియోగ సర్వే(టైమ్ యూజ్ సర్వే) ప్రకారం, మహిళలు ఒక రోజులో సగటున 5 గంటలు ఇంటి పనికి వెచ్చించగా, పురుషులు 88 నిమిషాలు (సుమారుగా గంటన్నర) మాత్రమే వెచ్చిస్తున్నట్లుగా తేలింది.
వంట చేయడం, పిల్లలను తయారు చేయడం, వారిని చదివించడం, కుటుంబాన్ని, కుటుంబంలోని పెద్దల బాగోగులు చూసుకోవడం, క్లీనింగ్ చేయడం వంటి ఇంటి పనులను మహిళలు చేస్తున్నారు.
ఈ పనులు చేసినందుకు మహిళలకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం చేకూరదు. వీటిని జీతం లేని పనులుగా పిలుస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
టైమ్ యూజ్ సర్వే ఏం చెప్పింది?
కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ 2024 (జనవరి-డిసెంబర్)లో భారతీయుల సమయ వినియోగంపై ఒక సర్వేను నిర్వహించింది.
ఆరేళ్ల వయస్సున్న వారి నుంచి మొదలుకొని ఆపై వయస్సున్న మొత్తం 4,54,192 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.
టీయూఎస్ డేటా ప్రకారం, మహిళలు ప్రతీరోజూ 4 గంటల 49 నిమిషాల పాటు ఇంటి పనిలోనే గడుపుతారు. ఈ పనికి పురుషులు కేటాయించే సమయం 88 నిమిషాలు. అంటే పురుషుల కంటే ఇంటిపనిలో మహిళలు 3 గంటల 21 నిమిషాలు అదనంగా గడుపుతారు.
మహిళలు తమ కుటుంబీకుల బాగోగులు చూడటానికి ప్రతీరోజూ దాదాపు 137 నిమిషాలు కేటాయిస్తుండగా, పురుషులు 75 నిమిషాలు వెచ్చిస్తున్నారు.
ఈ రకమైన జీతం లేని ఇంటిపనుల్లో 15 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళల వాటా ఎక్కువ.
ఈ గణాంకాలు, జీతం లేని పనికి సంబంధించినవి.
పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మహిళల జీవితాలను మీరు గమనిస్తే పురుషుల కంటే మహిళల జీవితంలో మీకు చాలా ఎక్కువ మార్పులు కనిపిస్తాయి.
పెళ్లి తర్వాత కుటుంబీకుల బాగోగులు చూడటం, ఇంటి బాధ్యతల భారం వంటివి పురుషులతో పోలిస్తే మహిళలపైనే ఎక్కువ అని ఈ గణాంకాలు చూపుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
''తీరిక లేని పని''
ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసే చాలామంది మహిళల జీవితాలు శ్వేత జీవితంలానే ఉన్నాయి. ఆఫీసులో 8 నుంచి 9 గంటలు పనిచేసి ఇంటికి చేరుకున్నాక వాళ్లు మళ్లీ ఇంటి పనుల్లో నిమగ్నమవుతారు. ఈ క్రమంలో వారి అభిరుచులు, ఆరోగ్య సంరక్షణ, వారి కోసం కొంత సమయం కేటాయించుకోవడం అనేవి వెనుకబడిపోతాయి.
ఐటీ రంగంలో పనిచేసే జయంతి కూడా తన అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు.
''నాకు ఇద్దరు పిల్లలు. రోజూ ఉదయం గం. 5- 5:30 మధ్య నిద్ర లేస్తాను. తర్వాత వంటగదిలో పని మొదలవుతుంది. బ్రేక్ ఫాస్ట్, లంచ్ తయారు చేస్తాను. తర్వాత పిల్లల్ని తయారు చేసి వారిని స్కూల్ బస్ ఎక్కించి ఆఫీసుకు వెళ్లడం కోసం నేను తయారు అవుతాను. ఇదంతా అవ్వడానికి 2 నుంచి రెండున్నర గంటల సమయం పడుతుంది. తర్వాత, ఆఫీసు పని మొదలవుతుంది.
ప్రస్తుతం నేను ఇంట్లో నుంచే పని చేస్తున్నా. ఇంట్లో పనులు, ఆఫీసు మీటింగ్‌లతో రోజంతా గడిచిపోతుంది. ఆఫీసు పని అయిపోగానే సాయంత్రం వేళ మా పిల్లల చదువులు చూసుకోవాలి. తర్వాత రాత్రి భోజనం వండాలి. ఇలా పనులన్నీ అయ్యేసరికి రాత్రి 10:30 దాటుతుంది. అప్పటికి నేను చాలా అలసిపోతాను'' అని జయంతి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
గతంలో ఇంట్లో నుంచి పని చేసే వెసులుబాటు లేకపోవడం, పిల్లలిద్దరూ బాగా చిన్నవాళ్లు కావడంతో చాలా ఇబ్బందిగా ఉండేదని జయంతి చెప్పారు.
''ఇల్లు, పిల్లలు, ఆఫీసు పనులతో సతమతమై ఒక్కోసారి ఉద్యోగం వదిలేద్దామని అనిపించేది. నా ఆరోగ్యం కూడా చాలా ప్రభావితమైంది. ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దవాళ్లయ్యారు. ఇంట్లో నుంచి పని చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి పని నుంచి అప్పుడప్పుడు కాస్త విరామం దొరుకుతుంది. నాలాంటి మహిళలు చాలామంది ఉన్నారు. వారందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది'' అని జయంతి వివరించారు.
పెరుగుతున్న పని ఒత్తిడి గురించి శ్వేత మాట్లాడుతూ, ''ఇంట్లో వండటం తప్ప ఇంకేం పని ఉందంటూ ఇంట్లో వాళ్లు అన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. చేసే పనికి గుర్తింపు ఉండదు. ప్రశంసాపూర్వకంగా ఒక్క మాట కూడా అనరు.
ఇంట్లో చేసే పనికి విలువ ఉండదు. పైగా నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, నా జీతంపై నాకు పూర్తిగా నియంత్రణ ఉండదు. నా జీతాన్ని ఏం చేయాలో కూడా మా ఆయనే నిర్ణయిస్తారు'' అని ఆమె చెప్పారు.
జీవితాంతం ఈ పని భారాన్ని మహిళలే ఎందుకు మోయాలని శ్వేత ప్రశ్నిస్తున్నారు.
ఏ పనికి ఎంత సమయం?
మహిళలు ఇంటి పనులు, కుటుంబం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటే పురుషులు తమ సమయాన్ని ఏ పనులకు కేటాయిస్తున్నారు?
మహిళల కంటే పురుషులు ఉపాధి, దానికి సంబంధించిన పనుల్లో దాదాపు 132 నిమిషాలు అదనంగా కేటాయిస్తారు.
దీనర్థం మహిళలు రోజంతా ఉపాధి సంబంధిత పనులకు 341 నిమిషాలు కేటాయిస్తే, పురుషులు 473 నిమిషాలు వెచ్చిస్తున్నారు.
దీనితో పాటు పురుషులు ప్రతీరోజు దాదాపు 139 నిమిషాలు వాలంటరీ వర్క్, శిక్షణ వంటి కార్యక్రమాలకు కేటాయిస్తారు. ఈ పనులకు వారికి జీతం లేదా గౌరవ వేతనం అందుతుంది. ఈ విషయంలో మహిళలు 108 నిమిషాలు కేటాయిస్తారు.
2019 నాటి గణాంకాల ప్రకారం, మహిళలు ప్రతీరోజూ ఆఫీసు పని కోసం 333 నిమిషాలు, పురుషులు 459 నిమిషాలు కేటాయిస్తున్నారు.
అయితే, 2024లో కార్యాలయాల పనిగంటలు పెరగడం వల్ల మహిళలు 341 నిమిషాలు, పురుషులు 473 నిమిషాలు పనిలో గడుపుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గ్రామీణ, పట్టణ మహిళల మధ్య తేడా...
ఈ సర్వే గ్రామీణ మహిళలు, పట్టణ మహిళల సమయ వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించింది.
పట్టణ మహిళలు ఎక్కువగా చదువులు, శిక్షణ, సోషలైజింగ్, వినోదానికి సమయం కేటాయిస్తుండగా, గ్రామీణ మహిళలు ఏదో ఒక పని మీదే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లుగా ఈ సర్వేలో తేలింది.
పట్టణ మహిళలతో పోలిస్తే గ్రామీణ మహిళలు రోజూవారీ ఇంటిపనులకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం
మహిళలపై పని ఒత్తిడి, దాని ప్రభావాల గురించి మాట్లాడుతూ రెస్పాన్సిబుల్ నెటిజమ్ సంస్థ కౌన్సిలింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్, సైకాలజిస్ట్ డాక్టర్ స్వప్నిల్ పాంగే ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు.
''పని ఒత్తిడి వల్ల మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. మహిళలు అనారోగ్యంతో ఉన్నప్పటికీ, తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఇంట్లో పనుల్ని చక్కబెడుతుంటారు. ఎందుకంటే ఈ పనులన్నీ చేయడం తన బాధ్యత అనే భావన వారిని వెంటాడుతుంటుంది.
కానీ, తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామనే సంగతిని వారు గుర్తించరు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు తమ పనిని ప్రశంసించకపోగా ఏదైనా తప్పు ఎత్తి చూపితే వారు తీవ్ర నిరాశకు గురవుతారు.
ఇంట్లో పనులన్నీ చేయడం తమ విధి అని వారు భావిస్తుంటారు. ఇంట్లో పనులు చేయకపోతే అందరూ ఏమంటారు? కుటుంబంలోని వారు ఏమనుకుంటారు? అనే భయంతో తమపై మరింత ఎక్కువ పని భారాన్ని వేసుకుంటారు. ఇది దీర్ఘకాలంలో మానసిక ఆరోగ్యంతో పాటు హార్మోన్లను ప్రభావితం చేస్తుంది'' అని స్వప్నిల్ వివరించారు.
దీనికి పరిష్కారం ఏంటని ప్రశ్నించగా స్వప్నిల్ సమాధానం చెప్పారు.
పనిలో సమతుల్యత పాటించడం, ఇంట్లో పనిని ఇతరులతో పంచుకోవడం, అవసరమైతే సహాయకులను నియమించుకోవడం మంచిదని అన్నారు.
ఒత్తిడి, నిరాశ ఆవహిస్తే కుటుంబ సభ్యులతో మాట్లాడాలని, అవసరమైతే మానసిక వైద్యుల సహాయం తీసుకోవాలని సూచించారు. సంతోషంగా, ఆరోగ్యంగా జీవించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
ఇంటి పని బాధ్యతను భార్యభర్తలిద్దరూ పంచుకోవాలని సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త మంగళ్ ఖిన్వాసరా అభిప్రాయపడ్డారు.
కాలంతో పాటు సామాజిక మనస్తత్వం కూడా మారాలని ఆమె అన్నారు. ''స్త్రీలు కొంచెం మారాలి. పురుషులు 100 శాతం మారాలి. పురుషులు కూడా ఇంటి పనులు చేయడం అలవాటు చేసుకోవాలి'' అని ఆమె సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














