వీర్యం అలర్జీ: స్పెర్మ్ తగిలితే కొందరు మహిళలు ఎందుకు ఇబ్బంది పడతారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్రిస్టిన్ రోయ్
హెచ్చరిక: ఈ కథనంలో లైంగిక భాష, అంశాలు ఉన్నాయి.
కొందరి శరీర ద్రవాలు ఇతరులకు అలర్జీ కలిగిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందనే రహస్యాన్ని ఇప్పుడిప్పుడే శాస్త్రవేత్తలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
మౌరా (గోప్యత కారణంగా పేరు మార్చాం) ప్రస్తుతం 43 ఏళ్ల మహిళ. అమెరికాలోని ఓహియోలో నివసిస్తున్నారు.
ఈ అలర్జీల బారి నుంచి తనను కండోమ్‌లు కాపాడాయని మౌరా భావిస్తున్నారు.
ఆమెకు ఈ సమస్య 20 ఏళ్ల వయసున్నప్పటి నుంచే మొదలైంది.
'' అసురక్షిత (కండోమ్ లేకుండా) శృంగారం తర్వాత జననేంద్రియాల్లో మంట రావడాన్ని నేను గమనించా'' అని మౌరా గుర్తు చేసుకున్నారు.
కానీ ఈ అసౌకర్యం గురించి మౌరా తన పార్ట్‌నర్‌కు చెప్పాలనుకోలేదు. భాగస్వామి వెళ్లేదాక ఆగి, వెంటనే శుభ్రంగా స్నానం చేసేవారు. తాను వాడే సోప్‌ల నుంచి లూబ్రికెంట్ల వరకు ప్రతి వ్యక్తిగత వస్తువును మార్చేందుకు ప్రయత్నించారు మౌరా.
కానీ, సమస్య తగ్గకపోగా మరింత తీవ్రమైంది. సెక్స్ తర్వాత జననేంద్రియాల వాపు, మంట , ఎర్రగా మారడంలాంటివి జరిగేవి. వీర్యం తగిలిన తరువాతే ఆమెకు ఇలాంటి సమస్య ఎదురయ్యేది.

ఫొటో సోర్స్, Getty Images
సెమెన్ అలర్జీ అంటే ఏమిటి?
మౌరా తన భాగస్వామితో విడిపోయారు. కండోమ్స్ కచ్చితంగా వాడే భాగస్వామిని కలవడం ప్రారంభించారు.
‘‘ కొన్నాళ్ల వరకు మాకు ఎటువంటి సమస్యా ఎదురు కాలేదు. కానీ, ఒకరోజు రాత్రి సెక్స్ తర్వాత అకస్మాత్తుగా నా నాలుక వాచింది'' అని మౌరా గుర్తు చేసుకున్నారు.
''నా పార్ట్‌నర్ దాన్ని చూసి, భయంతో గట్టిగా అరిచారు. ఊపిరి ఆడటంలేదా అంటూ నా ఇన్‌హేలర్ ఎక్కడుందో చూసి, నోటి దగ్గర పెట్టి దాన్ని ఆన్ చేశారు. అదృష్టవశాత్తు, ఆ మెడిసిన్ నా ఊపిరితిత్తులోకి వెళ్లగలిగేలా గాలి పీల్చుకోగలిగాను'' అని తెలిపారు.
ఆస్తమాతో పాటు ఇతర అలర్జీలు ఉన్న మౌరా, కండోమ్ లీక్ కావడంతోనే ఇలా జరిగిందని భావించారు.
కండోమ్ వాడకంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు మౌరా, ఆమె జీవిత భాగస్వామి.
ఇది జరిగేంత వరకు తనకు సెమెన్ అలర్జీ ఉందన్న విషయం తెలియదని మౌరా చెప్పారు.

ఈ రియాక్షన్లు ఎందుకు వస్తుంటాయి? వాటికి కారణమేంటి? అనేవి చాలా వరకు అంతుపట్టని విషయమే. అవి నిజంగా అలర్జీలేనా? లేక మరేదైనా సమస్యా?
శాస్త్రవేత్తలు కొంతకొంతగా మన శరీరంలో ఏం జరుగుతుందో, మన రోగ నిరోధక శక్తిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటనేవి అర్థం చేసుకుంటున్నారు.
ఒక వ్యక్తి శరీరంపై ఉన్న రసాయన పదార్థాలు మరో వ్యక్తి శరీరానికి తరచూ సెన్సిటివ్‌గా మారుతుంటాయి. ఉదాహరణకు డియోడ్రెంట్లు, లేదా ఆఫ్టర్‌షేవ్‌లలో ఉండే కృత్రిమ సుగంధాలు చర్మానికి అంటుకుంటాయి.
ఈ రకమైన వాసనల్లో 150 కంటే ఎక్కువ వాటితో చర్మానికి అలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
ప్రతిసారి అలర్జీని కలిగించే కారణం స్పష్టంగా తెలియదు. అమెరికాలోని ఓ మహిళకు తీవ్రమైన మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి వల్ల రోగాలతో పోరాడే మాస్ట్ సెల్స్ అనే కణాలు సరిగా పనిచేయకుండా పోతాయి.
దీనివల్ల ఆమె తన భర్త శరీరం నుంచి వచ్చే వాసనల కారణంగా తీవ్రమైన అలర్జీలకు గురయ్యేవారు. ఇది ఆమె రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసేంత తీవ్రమైన సమస్యగా ఉండేది.
‘‘మాస్ట్ సెల్ డిజార్డర్లు ఉన్న కొంతమంది వ్యక్తులు, ఇతర వ్యక్తుల శరీరం నుంచి విడుదలయ్యే రసాయనాలు, శరీరపు సహజ వాసనలను భరించలేరనే అభిప్రాయం ఉంది. అయితే, వీటి మధ్యనున్న సంబంధం ఇంకా నిరూపితం కాలేదు'' అని ఆస్ట్రియాలోని కెప్లర్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో పనిచేసే డాక్టర్ సబైన్ ఆల్ట్రిక్టర్ అన్నారు.
శరీర వాసనలకు కారణమయ్యే ఎన్నో రసాయనాలను మన చర్మం విడుదల చేస్తుంటుంది.
ఈ చర్మ వాయువులలో టోల్యూన్ లాంటి పదార్థాలు కూడా ఉండొచ్చు. ఇది క్రూడ్ ఆయిల్‌లో ఉంటుంది. పెయింట్లు, ప్లాస్టిక్ వస్తువులను తయారీలో దీనిని ఉపయోగిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
'పీపుల్ అలర్జిక్ టు మీ'
కొంతమందికి, ఇతరుల పక్కన నుంచోగానే దగ్గు, పొలమారడం లాంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. దీనికి కారణాలు ఏంటో తెలియకపోవడం వల్ల ఇదొక మిస్టీరియస్ లక్షణంగానే ఉండిపోతోంది.
దీనినే పీపుల్ అలర్జిక్ టు మీ(పీఏటీఎం) అంటారు. దీనివల్ల మనుషులను కలవడానికి ఇబ్బంది పడి ఒంటరిగా ఉండిపోతుంటారు.
ఈ పీఏటీఎం సమస్య ఉన్నవారు మనుషుల మధ్యకు వస్తే దగ్గు, పొలమారడం వంటి శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారని వారి అనుభవాలు చెబుతున్నాయి.
జపాన్‌లోని టోకాయ్ యూనివర్సిటీకి చెందిన రసాయన శాస్త్ర ప్రొఫెసర్ యోషికా సెకినె ఆయన బృందం ఈ పీఏటిఎం లక్షణాలు ఉన్నవారి చర్మం నుంచి వెలువడే వాయువులను పరిశీలించారు.
75 రకాల చర్మ వాయువులలో, టోల్యూన్ అనే రసాయనం పీఏటీఎం ఉన్నవారిలో ఎక్కువగా కనిపించింది. ఈ గ్రూప్‌లోని వారు, సాధారణ వ్యక్తులతో పోలిస్తే, టోల్యూన్‌ను సగటున 39 రెట్లు ఎక్కువగా విడుదల చేస్తారని వారు గుర్తించారు.
"టోల్యూన్ మన శరీరంలోకి శ్వాస ద్వారా చేరుతుంది. ఇది హానికరమైన పదార్థం. సాధారణంగా శరీరం దీన్ని కాలేయం ద్వారా పిండుకుని, మూత్రం రూపంలో బయటకు పంపుతుంది. అయితే పీఏటీఎం ఉన్నవారి శరీరంలో దాన్ని విచ్ఛిన్నం చేసేంతటి సామర్థ్యం అంతగా ఉండదు. అందుకే అది రక్తంలో పేరుకుపోతూ, చర్మం ద్వారా బయటకు వస్తుంది’’ అని సెకిన్ చెప్పారు.
ఈ పీఏటీఎంను ఇంకా విస్తృతంగా గుర్తించడం లేదని, దీనిని నిర్థరించేందుకు డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా లేవని సెకిన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
శరీర ద్రవాల నుంచి అలర్జీలు
శరీర ద్రవాల వల్ల కూడా కొన్ని అలర్జిక్ రియాక్షన్లు వస్తుంటాయి.
బ్రిటన్‌లోని ఒక మహిళకు బ్రెజిల్ నట్స్ (ప్రజలు తినే బాదం పప్పు లాంటి విత్తనాలు లేదా గింజలు) అంటే అలర్జీ. శృంగారానికి ముందు తన భాగస్వామి బ్రెజిల్ నట్స్ తిన్నట్లు ఆ మహిళ చెప్పారు. ఆయన పళ్లను, గోర్లను, చేతులను శుభ్రంగా కడిగేసుకున్నారు. కానీ, ఆయనతో సెక్స్‌లో పాల్గొన్న తర్వాత ఆ మహిళ చర్మంపై దురద వచ్చింది. ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది.
బాదం, వేరుశెనగలు వంటి పప్పులు తిన్న తర్వాత ముద్దు పెట్టుకుంటే ఇలాంటి అలర్జీలు వస్తుంటాయి. పండ్లు, కూరగాయాలు, చేపలు, పాలు వంటివి తిన్న తర్వాత కూడా వాటి లాలాజలం వల్ల ఈ అలర్జిక్ రియాక్షన్లకు గురవుతుంటారు.
శృంగారం తర్వాత ఈ యాంటిబయాటిక్ అలర్జీలు ఉన్న మహిళలకు ప్రతికూల ప్రభావాలు కనిపిస్తుంటాయి. కానీ, ఈ బాహ్య అలర్జీ కారకాలకు మించి, శరీరద్రవాల్లోని కొన్ని ప్రొటీన్లు ఈ రియాక్షన్లకు కారణమవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఉదాహరణ సెమెన్. కొంతమంది డాక్టర్లకు దీనిపై అవగాహన ఉంది. ఈ అంశంపై మరింత సమాచారం తెలుసుకోవాల్సి ఉంది.
శరీరంపై దురద నుంచి అనాఫిలాక్సిస్ (ప్రమాదకరమైన అలర్జిక్ రియాక్షన్) వరకు సెమెన్ అలర్జీ లక్షణాలు ఉంటాయి. ఈ అలర్జీనే సెమినల్ ప్లాస్మా హైపర్ సెన్సిటివిటీ అంటారు. మనిషి వయసు 20, 30ల్లో ఉన్నప్పుడు ఇది సర్వసాధారణం.
సెమెన్‌తో తయారయ్యే ద్రవం సెమినల్ ప్లాస్మా. స్పెర్మ్‌లో కాకుండా సెమెన్‌లో ఉండే ప్రొటీన్ వల్ల ఈ అలర్జీ వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
‘గర్భం దాల్చాలనుకున్నప్పుడు ఈ సమస్య వస్తుంటుంది’
అమెరికాలోని సిన్సినాటి యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ అలర్జీ, ఇమ్యునాలజీలోని క్లినికల్ మెడిసిన్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జోనాథన్ బెర్న్‌స్టెయిన్ దీని గురించి వివరించారు.
సెమినల్ ప్లాస్మా హైపర్‌సెన్సిటివిటీ ఉన్నవారి శరీరాల్లో ఏం జరుగుతుందో కచ్చితంగా తెలియదని అన్నారు. సెమెన్ అలర్జీ అనేది ఒక నిర్దిష్ట లేదా సాధారణ స్థితి కావొచ్చు. ఇది యోనిలో లేదా దాని చుట్టూ ఏర్పడుతుంది.
కానీ, స్పెయిన్‌లో వెజైనల్ సెక్స్ తర్వాత ఒక మహిళకు ఎలాంటి అలర్జిక్ రియాక్షన్లు రాలేదు. కానీ, ఆనల్ సెక్స్ తర్వాత ఆమె స్పృహ కోల్పోయారు. అనాఫిలాక్సిస్ వంటి ఇతర లక్షణాలను ఆమె ఎదుర్కొన్నారు. సెమెన్‌కు ఆమె హైపర్‌సెన్సిటివ్ అని నిర్ధరణ అయింది.
అమెరికాలో ఒక మహిళకు ఆమె శరీరానికి సెమెన్ తగిలిన తర్వాత, వాపు, చర్మంపై దురదలు వచ్చాయి. సంభోగం తర్వాత తీవ్రమైన నొప్పి, మంటలాంటివి నిర్దిష్ట లక్షణాలుగా ఉంటాయని బెర్న్‌స్టెయిన్ చెప్పారు.
ఈ నొప్పివల్ల యోనీ చుట్టూ వేల సూదులతో గుచ్చినట్లు ఉంటుందని రోగులలో ఒకరు చెప్పారు.
గర్భం దాల్చాలని ప్రయత్నిస్తున్నవేళ మహిళలు తరచూ ఇది ఎదుర్కొంటుంటారు.
సెమెన్ అలర్జీలకు చికిత్స చేసేందుకు వైద్య నిపుణులు ఎక్కువగా దొరకరు. కొంతమంది ప్రజలు బెర్న్‌స్టెయిన్‌ను సంప్రదించేందుకు చాలాదూరం నుంచి వస్తుంటారు.
‘‘వీరికి ఎలా చికిత్స చేయాలో చాలామంది వైద్యులకు తెలియడం లేదు. కొందరికి చికిత్స చేయకుండా వదిలేస్తున్నారు. మరికొందరికి తీవ్రమైన స్టెరాయిడ్ చికిత్సలు ఇస్తున్నారు'' అని బెర్న్‌స్టెయిన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్స ఏంటి?
బెర్న్‌స్టెయిన్ అంతకుముందు పరీక్షించిన చికిత్సల్లో సెన్సిటివిటీని తగ్గించేందుకు రోగుల శరీరంలోకి వారి భాగస్వాముల సెమెన్‌ను ఎక్కించడం ఒకటి. ఇది అచ్చం పోస్ట్-ఆర్గాజ్మిక్ ఇల్‌నెస్ సిండ్రోమ్‌కు ఇచ్చే చికిత్స లాంటిదే.
పోస్ట్-ఆర్గాజ్మిక్ ఇల్‌నెస్ సిండ్రోమ్ అంటే పురుషులు తమ సొంత స్పెర్మ్‌కే హైపర్ సెన్సిటివ్‌గా ఉంటారు. ఇది చాలా అరుదైన పరిస్థితి.
కానీ, ఈ పరీక్ష విధానం చాలా ఖరీదైనది. ‘‘ఎందుకంటే, శాంపిళ్లను తయారు చేసేందుకు చాలా ల్యాబ్ వర్క్ ఉంటుంది. దీనికి రోగులు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది'' అని బెర్న్‌స్టెయిన్ అన్నారు.
రెండు గంటల సెషన్‌లోనే దీనికి చికిత్స చేసే అత్యంత సురక్షితమైన, సమర్థవంతమైన విధానాన్ని బెర్న్‌స్టెయిన్, ఆయన టీమ్ కనుగొంది.
తొలుత వారు వీర్యం నుంచి సెమినల్ ఫ్లూయిడ్‌ను వేరు చేస్తారు. ఆ తర్వాత, రోగి ఎంత సెన్సిటివ్‌గా ఉన్నారో చూసి, ఈ ద్రవాన్ని చాలా పలుచన చేస్తారు.
ప్రతి 15 నిమిషాలకు ఒకసారి పలుచన చేసిన ద్రవాన్ని రోగి యోనిలోకి చొప్పిస్తారు. ఇలా రోగి తట్టుకునే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ ప్రక్రియలో రోగిని చాలా నిశితంగా పరిశీలిస్తారు.
ఫలితంగా, ఈ ప్రక్రియ తర్వాత చాలా మంది రోగులకు అలర్జిక్ రియాక్షన్లు తగ్గాయని బెర్న్‌స్టెయిన్ అన్నారు.
అప్పుడు వారు తమ భాగస్వామితో (స్పెర్మ్ శాంపిల్ అందించిన వ్యక్తితో) ఎటువంటి సమస్యలు లేకుండా, కండోమ్ వాడకుండానే సెక్స్ లో పాల్గొనవచ్చని బెర్న్‌స్టెయిన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సంభోగం తర్వాత పురుషుడి జననేంద్రియాలు ఎర్రగా మారిపోవడం
హైపర్‌సెన్సిటివిటీ నుంచి సెమినల్ ప్లాస్మా, సెమెన్ వరకు ప్రతి దాన్ని తరచూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు లేదంటే వాటినొక నిర్దిష్ట సమస్యగా చూస్తున్నారు.
సెక్స్ సమయంలో ఒకరినుంచి ఒకరికి సంక్రమించే ఇతర కొన్ని ద్రవాలు గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది.
గర్భాశయం, యోని కణాల ద్వారా స్రవించే ద్రవం సర్వికోవెజైనల్ ఫ్లూయిడ్‌కు (గర్భాశయ ద్రవానికి) అలర్జీ వచ్చే అవకాశంపై పెద్దగా ఎలాంటి పరిశోధనలు జరగలేదు.
ఈ ద్రవం యోని పొడిబారడాన్ని తగ్గించి, పలు పాథోజెన్ల నుంచి రక్షణను అందిస్తుంది.
కానీ, పోలాండ్‌లో ఒక డెర్మటాలజిస్ట్ మారెక్ జాన్‌కోవ్‌స్కీ గర్భాశయ ద్రవ అలర్జీతో బాధపడుతున్న ఒక రోగిని చూశారు. పలువురు వైద్యులను సంప్రదించిన తర్వాత, తన దగ్గరకు ఆ రోగి వచ్చినట్లు మారెక్ చెప్పారు.
మహిళతో సెక్స్ చేసిన 30 నిమిషాల తర్వాత, ఆ రోగి జననేంద్రియాల ప్రాంతమంతా ఎర్రగా మారి, దురద వచ్చినట్లు తెలిపారు. ఓరల్ సెక్స్ తర్వాత ముఖంపై దురద వచ్చినట్లు తెలిపారు. అలర్జీ వల్ల అలా అయిందని రోగి భావించారు. కానీ, వైద్యులు ఆయన చెప్పిన దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదని మారెక్ తెలిపారు.
అయితే, లైంగిక ప్రక్రియలో పాల్గొనే సమయంలో మహిళ స్రవించే గర్భాశయ ద్రవం వల్ల అలర్జీ వచ్చిన ఇతర కేసులను మారెక్ చూశారు. యాంటిహిస్టామైన్స్ (antihistamines) తీసుకున్న తర్వాత తన దగ్గరకు వచ్చిన రోగి కోలుకున్నారని మారెక్ చెప్పారు.
ఇది మారెక్ జాన్‌కోవ్‌స్కీ, ఆయన బృందం కలిసి 2017లో ఒక అధ్యయనం చేపట్టేందుకు దారితీసింది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న కొందరిపై వీరు సర్వే చేశారు.
తమ రోగుల్లో ఇలాంటి కేసులను చూసినట్లు ఐదుగురు చర్మవ్యాధి నిపుణుల్లో ఒకరు చెప్పారు. అయితే, చాలామంది డాక్టర్లు మాత్రం ఈ అలర్జీ నిజమైనదా కాదా అనే దానిపై కచ్చితమైన అభిప్రాయాన్ని చెప్పలేదు.
సెక్స్‌లో పాల్గొనే సమయాల్లో భాగస్వామిలో ఎవరికైనా అలర్జీ ఉంటే, దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.
పిల్లలు వద్దని తాను, తన పార్ట్‌నర్ నిర్ణయించుకోవడంలో స్పెర్మ్ అలర్జీ కీలకంగా మారిందని మౌరా అంటారు.
ఎందుకంటే, స్పెర్మ్, దాని సంబంధిత అలర్జీలను నివారించేందుకు వారు ఖరీదైన చికిత్సలను చేయించుకోవాలి.
''సెమెన్‌తో నాకు అలర్జీ ఉండటం తనను ఎంతో బాధిస్తుందని నా పార్ట్‌నర్ చెప్పారు'' అని మౌరా తెలిపారు.
కానీ, తమ సంబంధానికి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని, కండోమ్‌లు వాడటంలో తన భాగస్వామికి ఎలాంటి సమస్య లేదని మౌరా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














