వివాహేతర సంబంధం ఉందంటూ మహిళను వివస్త్ర చేసి దాడి.. హనుమకొండ జిల్లా ఘటన వీడియోలు షేర్ చేయొద్దని పోలీసుల హెచ్చరికలు

మహిళను చెట్టుకు కట్టి వివస్త్రను చేసి, హింసిస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తెలంగాణలోని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఒక మహిళను కట్టేసి దాడి చేసిన వీడియోతో పాటు, ఆమెతో సంబంధం ఉందన్న ఆరోపణలున్న పురుషుడికి గుండు చేస్తున్న వీడియో వైరల్ అయ్యాయి.
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

(గమనిక: ఈ కథనంలో కొన్ని కలచివేసే అంశాలున్నాయి.)

మహిళను కట్టేసి వివస్త్రను చేసి, హింసిస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వివాహేతర సంబంధంలో ఉన్న జంటకు గుండు గీసి, మహిళను శారీరకంగా హింసించారనే ఆరోపణలు వచ్చాయి.

తెలంగాణలోని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఈ ఘటన జూన్ 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగినట్లు తమ విచారణలో తేలిందని వరంగల్ కమిషనరేట్ పోలీసులు బీబీసీకి తెలిపారు.

ఘటనపై తొలుత సుమోటోగా విచారణ ప్రారంభించామని, ఆ తర్వాత బాధిత మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

హింసకు గురైన సదరు మహిళ, పురుషుడి ఆచూకీ ఇంతవరకూ తెలియలేదని.. వారి కోసం గాలిస్తున్నామని కాజీపేట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ప్రశాంత్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ధర్మసాగర్ పోలీస్ స్టేషన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్

అసలేం జరిగింది?

వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయలకు చెందిన ఓ మహిళకు ములుగు జిల్లా బొల్లోనిపల్లికి చెందిన వ్యక్తితో పదిహేనేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే ఆ వ్యక్తి తనకు సమీప బంధువైన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆమెకు కూడా ఇదివరకే పెళ్లయింది.

వివాహేతర సంబంధంపై దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కుల పెద్దల పంచాయితీల్లో, నల్లబెల్లి పోలీసు స్టేషన్‌లో పలుమార్లు ఫ్యామిలీ కౌన్సెలింగ్ జరిగింది.

కొన్నినెలల కిందట బొల్లోనిపల్లి నుంచి సదరు వ్యక్తి , ఆ మహిళ పారిపోయి మరోచోట కాపురం పెట్టారు.

ఈ విషయాన్ని ఆ వ్యక్తి భార్య తన పుట్టింటివారికి చెప్పారు.

దీంతో జూన్ 22న వివాహేతర సంబంధంలో ఉన్నఇద్దరినీ వెతికి తెచ్చిన కుటుంబ సభ్యులు, కులపెద్దలు కలిసి తాటికాయల గ్రామంలో నిర్బంధించారు. వారిపై దాడికి పాల్పడ్డారు. తాళ్లతో కట్టేసి దుస్తులు విప్పి, గుండు గీసి అవమానించారు.

ఈ సందర్భంలోనే ఆ మహిళను శారీరకంగా హింసించినట్టు ఆరోపణలు ఉన్నాయి. శారీరక హింస గురించిన నిజాలు విచారణ తరువాత తెలుస్తాయని ఏసీపీ చెప్పారు.

వరంగల్ పోలీసులు

ఫొటో సోర్స్, Warangal Commissionerate

ఫొటో క్యాప్షన్, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి

దాడికి గురైన ఇద్దరూ మిస్సింగ్

ఈ ఘటన జరిగినప్పటి నుంచి దాడికి గురైన ఇద్దరూ కనిపించడం లేదు. బాధిత మహిళ భర్త ఫిర్యాదు చేయడంతో ధర్మసాగర్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

"ఇది అమానవీయ ఘటన. ప్రస్తుతానికి ఇద్దరి ఆచూకీ తెలియ లేదు. వారిద్దరు కన్నారావుపేటలో ఓ ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స తీసుకున్నట్టు మా విచారణలో తేలింది. వారి కోసం గాలిస్తున్నాం. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అదుపులో తీసుకున్నాం'' అని ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

ఈ ఘటనపై దాడికి గురైన మహిళ భర్తతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే ఆయనను చేరుకోలేకపోయాం.

''వీరంతా సంచార తెగకు చెందినవారు. ఊరి బయట తాత్కాలిక నివాసం ఉంటారు. దీంతో ఆ రెండు రోజులు ఏం జరిగిందన్న విషయం ఊళ్లోవాళ్లకు కూడా తెలియదు. వారిలో కొన్ని అమానవీయ కట్టుబాట్లు ఉంటాయి. పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చాం'' అని ఏసీపీ చెప్పారు.

‘ఇద్దరినీ నిర్భంధిస్తే వద్దని చెప్పాను’

ఈ ఘటనఫై తాటికాయలకు చెందిన మాజీ ఎంపీటీసీ ఎర్ర ప్రభాకర్ బీబీసీతో మాట్లాడారు.

గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న వివాదంలో నిర్వహించిన పంచాయతీల్లో గ్రామపెద్దగా ఆయన పాల్గొన్నారు.

"జూన్ 22న గ్రామం చివరనుండే వారి నివాసాల వద్దకు వెళ్లాను. అప్పటికే ఇద్దరిపై దాడి చేసి నిర్బంధించారు. ఇలా చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాను. వారిద్దరిని పోలీసులకు అప్పగించాలని, నిర్బంధించడం సరికాదని, పోలీసు కేసు అవుతుందని హెచ్చరించాను. వారిద్ధరితో మాట్లాడి పంపించేస్తామని నాతో చెప్పారు.

ఆ తర్వాత వివస్త్రగా మార్చిన అమానవీయ ఘటన జరిగిందని ఐదు రోజుల తర్వాత తెలిసింది. జరిగిన విషయం పోలీసులకు చెప్పాం.

గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో వారి నివాసాలుంటాయి. అందుకే ఎవరికీ తెలియలేదు" అని చెప్పారు ప్రభాకర్.

కాగా ఇలాంటి ఘటనలు మనం ఇంకా అనాగరికంగానే ఉన్నామనడానికి నిదర్శనమని కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్, సోషియాలజీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత అభిప్రాయపడ్డారు.

"ఇది మానవ హక్కులు, గౌరవానికి సంబంధించిన అంశం. ఇలాంటి ఘటనలు కొన్ని కులాలకే అంటగట్టలేం. దీన్ని మానవ హక్కులపై అవగాహన లేకపోవడంగా చూడాలి. నేరాలు జరిగినప్పుడు తప్ప వీరు నివసించే ప్రాంతాల్లో పోలీసుల పర్యవేక్షణ ఉండదు. వీరిని అభివృద్ధిలో పాత్రధారులుగా చేయనంత వరకు అనాగరిక సమాజంలో ఉన్నట్టే'’ అని సుజాత బీబీసీతో చెప్పారు.

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

'వీడియోలు వైరల్ చేయద్దు'

తాటికాయలలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలను వైరల్ చేయడం చట్టప్రకారం శిక్షార్హమైన నేరమని వరంగల్ కమిషనరేట్ పోలీసులు హెచ్చరించారు.

వివస్త్ర వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, షేర్ చేయడం నేరమని, ఐటి యాక్ట్ ప్రకారం గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష,10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.

''సున్నితమైన ఇలాంటి వీడియోలను షేర్ చేయకుండా బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాలి' అని ఏసీపి ప్రశాంత్ రెడ్డి సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)