భారత్-పాక్ సరిహద్దుల్లోని ఎయిర్‌స్ట్రిప్‌ను మోసపూరితంగా అమ్మేసిన తల్లీ కొడుకు, ఈ మోసం ఎలా బయటకొచ్చిందంటే..?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హర్మన్‌దీప్ సింగ్, కుల్‌దీప్ కౌర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఒక వ్యక్తి తన దేశ వైమానిక దళానికి చెందిన ప్రభుత్వ ఆస్తులను అమ్మడం గురించి మీరెప్పుడైనా విన్నారా?
ఇదేమీ బాలీవుడ్, హాలీవుడ్ సినిమా కథ కాదు.
భారత్‌లో ఉన్న పంజాబ్‌లో నిజంగానే జరిగిన సంఘటన.
పంజాబ్‌లోని ఫట్టూవాలా గ్రామంలో భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్‌స్ట్రిప్‌ను అమ్మేసిన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఈ ఎయిర్‌స్ట్రిప్ భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది.
పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఈ ఎయిర్‌స్ట్రిప్‌ను ఉపయోగించుకుంది.
కోట్ల రూపాయల విలువైన 15 ఎకరాల భూమికి సంబంధించిన మోసం 1997లో జరిగింది. అయితే పోలీసులు ఇప్పుడు దర్యాప్తు మొదలుపెట్టారు.
దీనికి సంబంధించి ఓ తల్లీకుమారుడిపై కేసు నమోదు చేశారు. వీళ్లిద్దరూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన భూమిని తమదిగా చెప్పుకుని ఇతరులకు అమ్మేశారని పోలీసులు తెలిపారు. నిందితులను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ సాధ్యపడలేదు.

ప్రస్తుతం పంజాబ్ పోలీసులు నిందితులిద్దరి కోసం వెదుకుతున్నారు.
స్వాతంత్య్రానికి పూర్వం ఈ ప్రాంతంలో ఎయిర్ స్ట్రిప్ నిర్మించేందుకు రైతులనుంచి భూమిని సేకరించారని, అందుకు పరిహారం చెల్లించారని పోలీసులు చెబుతున్నారు. అయితే రెవిన్యూ రికార్డుల్లో మాత్రం భూమి ఇంకా అప్పటి రైతుల పేరు మీదనే ఉంది.
భూమికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుని, నిందితులు ఈ భూమిని అమ్మేశారు.
ఈ వ్యవహారంలో పంజాబ్, హరియాణా హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కోర్టు జోక్యం తర్వాతే పంజాబ్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.

వ్యవహారం హైకోర్టుకు చేరడంతో..
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నిషాన్ సింగ్ పంజాబ్ హరియాణా హైకోర్టులో 2023 డిసెంబర్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 2025 ఏప్రిల్30న విచారణ జరిపిన పంజాబ్ హరియాణా హైకోర్టు నాలుగు వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని పంజాబ్ విజిలెన్స్ బ్యూరోను ఆదేశించింది.
విజిలెన్స్ బ్యూరో జూన్ 20న తన నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా జూన్ 28న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పంజాబ్ పోలీసులు ఉషా అన్సల్ ఆమె కుమారుడు నవీన్ అన్సల్ మీద ఫిరోజ్‌పూర్‌లోని కుల్‌గర్హి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.నిందితులిద్దరూ ఫిరోజ్‌పూర్ జిల్లా వాసులైనప్పటికీ ప్రస్తుతం దిల్లీలో నివసిస్తున్నారు.
వాళ్లిద్దరిపై ఐపీసీ 419, 420, 465, 467, 471, 120బి సెక్షన్ల కింద పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
ఈ కేసు దర్యాప్తును డీఎస్పీ కరణ్ శర్మ పర్యవేక్షిస్తున్నారు.
"ఆ భూమి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందినదని నిందితులిద్దరికీ తెలుసు. అయినా వాళ్లు భూమిని అమ్మేశారని విజిలెన్స్ నివేదిక తేల్చింది" అని డీఎస్పీ కరణ్ శర్మ బీబీసీకి చెప్పారు.
"నిందితులు ఆ భూమి తమదే అని చెబుతున్నారు. అయితే భూమికి నిజమైన యజమాని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్" అని ఆయన చెప్పారు.
బీబీసీ ప్రతినిధి లాయర్ ప్రతీక్ గుప్తాతో మాట్లాడింది.
వేరే కేసులో ఆయన నవీన్ అన్సల్ తరపున వాదిస్తున్నారు.
భూమి అమ్మిన కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి ఆ కేసు గురించి నిందితులు ఏమీ మాట్లాడరని ఆయన చెప్పారు.

అసలేం జరిగింది?
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారత్ పాక్ సరిహద్దుల్లో ఓ ఎయిర్ స్ట్రిప్ నిర్మించేందుకు బ్రిటిషు ప్రభుత్వం ఇక్కడ 982 ఎకరాలు సేకరించింది.
అవిభాజ్య భారత దేశంలో రాయల్ ఎయిర్‌ఫోర్స్ కోసం ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ నిర్మించింది. దేశ విభజన తర్వాత ఈ ఎయిర్ స్ట్రిప్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధీనంలోకి వచ్చింది.
ఆహార కొరత కారణంగా రక్షణ శాఖకు చెందిన భూముల్లో వ్యవసాయం చేసేందుకు నాటి భారత ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి 1964లో కొత్త స్కీమ్ ప్రారంభించారు.
ఈ స్కీమ్ కింద ఎయిర్‌స్ట్రిప్ నిర్మించిన భూమిని మదన్‌మోహన్‌లాల్, ఆయన సోదరుడు టెక్‌చాంద్‌కు ఇచ్చారు.
పంటలు పండించిన తర్వాత కూడా ఈ భూమి నిర్వహణను వారికే అప్పగించారు. అయితే మదన్ మోహన్ చనిపోవడంతో ఆయన పేరున ఉన్న 'పవర్ ఆఫ్ అటార్నీ' ఆధారంగా భూమిని అమ్మేశారు.
డుమ్నీవాలా గ్రామానికి చెందిన ఓ మహిళ, ఆమె కుమారుడు 1997లో కొంతమంది రెవిన్యూ అధికారుల సాయంతో భూయాజమాన్య హక్కులను తమ పేరు మీదకు మార్పించుకుని వేరే వ్యక్తికి అమ్మేశారని విజిలెన్స్ బ్యూరో నివేదిక పేర్కొంది.
పంజాబ్, హరియాణా హైకోర్టు జోక్యంతో విజిలెన్స్ బ్యూరో ఈ వ్యవహారంపై విచారణ జరిపింది.
విజిలెన్స్ నివేదిక ఆధారంగా పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్వాతంత్య్రానికి పూర్వం ఫట్టూవాలాతోపాటు దాని చుట్టు పక్కల నాలుగు గ్రామాల్లో ఎయిర్ స్ట్రిప్ కోసం భూ సేకరణ చేశారు. తర్వాత ఇక్కడొక రన్‌వే నిర్మించారని విజిలెన్స్ విచారణలో తేలిందని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో రాశారు.
అయితే భూ సేకరణ చేసిన భూముల్లో కొన్ని భూముల యాజమాన్య హక్కులను రికార్డుల్లో ఎయిర్‌ఫోర్స్ పేరిట బదలాయించలేదు. భూ సేకరణ సమయంలో యజమానులుగా ఉన్న వారి పేర్లే తర్వాతి కాలంలోనూ కొనసాగాయి.
ఈ వ్యవహారంలో కోర్టులో కేసు వేసిన పిటిషనర్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నిషాన్ సింగ్ బీబీసీతో మాట్లాడారు.
"రెవిన్యూ డిపార్ట్‌మెంట్ చేసిన చిన్న పొరపాటును అవకాశంగా తీసుకుని, నిందితులు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ఎయిర్‌ఫోర్స్ భూమిని అమ్మేశారు" అని పిటిషనర్ నిషాన్ సింగ్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా బయట పడింది?
ఈ భూమి 1991లో చనిపోయిన మదన్‌లాల్ పేరిట ఉండేదని నిషాన్ సింగ్ చెప్పారు. ఆయన చనిపోయిన తర్వాత నిందితులు భూమిని 1997లో నకిలీ పత్రాల ద్వారా దారా సింగ్, ముక్తియార్ సింగ్, జాగిర్ సింగ్, సూర్జిత్ కౌర్, మంజీత్‌కౌర్‌కు రిజిస్ట్రేషన్ చేశారు.
హల్వారా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ కమాండెంట్ 2021లో ఈ మోసాన్ని వెలుగులోకి తెచ్చి దీనిపై దర్యాప్తు చేయాలని ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించాలని హైకోర్టుని కోరినట్లు పిటిషనర్ నిషాన్ సింగ్ చెప్పారు. అయినప్పటికీ ఎలాంటి చర్యా తీసుకోలేదు.
అందుకే 2023 డిసెంబర్‌లో తాను హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశానని నిషాన్‌సింగ్ చెప్పారు. ఈ భూమికి నిజమైన యజమని మదన్ మోహన్ లాల్ 1991లో చనిపోయారని, అయితే 1997లో నకిలీ పత్రాలతో భూమిని అమ్మేశారని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు.
2009-2010 మధ్య భూమి సూర్జిత్ కౌర్, మంజీత్ కౌర్, ముఖ్తియార్ సింగ్, జాగిర్ సింగ్, దారా సింగ్, రమేష్ కాంత్, రాకేష్ కాంత్ యజమానులుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉందని నిషాన్ సింగ్ చెప్పారు. అయితే ఎయిర్ ఫోర్స్ ఈ భూములను ఎవరికీ కేటాయించలేదు.
ఈ కేసు విషయంలో నిషాన్ సింగ్ రెండేళ్ల కిందట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ నిర్లక్ష్యంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని కోర్టు వ్యాఖ్యానించింది.
పంజాబ్ విజిలెన్స్ బ్యూరో చీఫ్ ఈ వ్యవహారంపై విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 30న ఇచ్చిన ఆదేశాల్లో నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని సూచించింది.
అంతకు ముందు, ఈ వ్యవహారంలో పంజాబ్ గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఎయిర్‌ఫోర్స్ కోరింది.
ఇదిలా ఉండగానే, ఈ భూమిని కొన్న వాళ్లు, భూమి తమ స్వాధీనంలో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని వివిధ కోర్టులను ఆశ్రయించారు.
జిల్లా కోర్టుల్లో వారికి అనుకూలంగా ఆదేశాలు వచ్చాయని పిటిషనర్ నిషాన్ సింగ్ చెప్పారు. అయితే ఈ ఆదేశాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హైకోర్టులో సవాలు చేసింది.

'మా భూమి కోసం మమ్మల్ని కోర్టుకు లాగుతున్నారు'
భూమి కొనుగోలు చేసిన వారిలో జాగీర్ సింగ్ ఒకరు. తాను భూమి యజమానుల నుంచే భూమిని కొనుగోలు చేసినట్లు ఆయన చెబుతున్నారు.
"మాకు ఎయిర్‌ఫోర్స్‌తో ఎలాంటి గొడవాలేదు. మేం ఈ భూమిని యజమానుల నుంచే కొన్నాం. మమ్మల్ని అనవసరంగా వేధిస్తున్నారు. భూమి స్వాధీనం గురించి మేం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది" అని ఆయన చెప్పారు.
"1975లో లీజుకు తీసుకుని ఈ భూమిలో వ్యవసాయం చేస్తున్నాం. 1997లో మేం సాగు చేస్తున్న భూమిని కొనుగోలు చేశాం. 2021లో ఎయిర్‌ఫోర్స్ అధికారులు వచ్చి మమ్మల్ని ఆ భూముల్లో నుంచి వెళ్లగొట్టారు. అందుకే మేం కోర్టులో కేసు వేశాం. ఈ భూముల్లో వేసిన నాలుగు బోర్లలో ఒకటి ఇప్పుడు కూడా నడుస్తోంది. మాదొక్కటే డిమాండ్. మా భూమి మాకు కావాలి" అని ఆయన చెప్పారు.
"మా నాన్న దారా సింగ్ ఈ భూమి కొన్నారు. ఇది నా పేరు, నా సోదరుడు, అమ్మ పేరిట రిజిస్టర్ అయింది" అని ముక్తియార్ సింగ్ చెప్పారు.
"మేము పాత రికార్డుల్ని పరిశీలించిన తర్వాత ఈ భూమి కొన్నాం. మాకు చదువు లేదు. అయితే రెవిన్యూ అధికారులు డిప్యూటీ కమిషనర్ చదువుకున్న వాళ్లే కదా. ఇది ప్రభుత్వ భూమి అని వాళ్లకు తెలియదా" అంటూ ముఖ్తియార్ సింగ్ ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఇది ప్రభుత్వ భూమి అయితే, అధికారులు మా పేరిట ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు? భూమి మా పేరిట రిజిస్టర్ అయిందంటే మాకు హక్కు ఉన్నట్లే. 2001 నుంచి ఈ భూమి కోసం కోర్టుల్లో పోరాడుతున్నాం. మా హక్కుల్ని సాధించుకుంటాం" అని ఆయన అన్నారు.

పిటిషనర్ అభ్యంతరం ఏంటి?
"పంజాబ్ విజిలెన్స్ విభాగం ఈ కేసును విచారించి పోలీసులకు అప్పగించింది. అయితే ఈ కేసులో పంజాబ్ విజిలెన్స్ విభాగమే చర్యలు తీసుకోవచ్చు. సీనియర్ అధికారుల ప్రమేయంతోనే ఈ మోసం అంతా జరిగింది. అంటే ఇందులో లంచాల వ్యవహారం కూడా ఉంది. అయితే ఎఫ్ఐఆర్‌లో భూమి అమ్మిన వాళ్ల మీదనే కేసు నమోదు చేశారు. అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు" అని నిషాన్ సింగ్ చెప్పారు.
"మరో విషయం ఏంటంటే, ఈ కేసులో నన్ను ఫిర్యాదుదారుడిగా పేర్కొన్నారు. నేను కేవలం అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చాను. వాస్తవానికి ఫిర్యాదుదారుడిగా ప్రభుత్వం లేదా ఎయిర్‌ఫోర్స్ ఉండాలి" అని ఆయన అన్నారు.
"ఈ కేసులో అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరి పైనా చర్యలుంటాయి. మేం దర్యాప్తు చేస్తున్నాం" అని డీఎస్పీ కరణ్ శర్మ చెప్పారు.
1962,1965,1971యుద్ధాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఈ రన్‌వేను ఉపయోగించుకుందని నిషాన్ సింగ్ చెప్పారు.
ఈ రన్‌వే 1932 నుంచి ఉపయోగంలో ఉంది. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన ఫిర్యాదులో పేర్కొంది.
ఎయిర్ స్ట్రిప్ నిర్మాణం కోసం 1932కు ముందే భూమిని సేకరించారని నిషాన్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం ఈ భూమి ఎయిర్ ఫోర్స్ స్వాధీనంలో ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














