స్టీటోహెపటైటిస్: కాలేయం మొత్తం బరువులో ఎంత శాతం కొవ్వు ఉంటే ఫ్యాటీ లివర్ అంటారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కాలేయ కణాలలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయినప్పుడు ఫ్యాటీ లివర్ అనే అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది.
కాలేయంలో కొద్దిగానే కొవ్వు ఉంటుంది. కానీ ఈ కొవ్వు, కాలేయం మొత్తం బరువులో పది శాతానికి మించి ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్‌గా పరిగణిస్తారు. ఇది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.
ఫ్యాటీ లివర్ ఎల్లప్పుడూ హాని కలిగించదు. కానీ, కొన్ని సందర్భాల్లో ఈ అదనపు కొవ్వు, కాలేయంలో వాపుకు కారణం అవుతుంది. ఈ పరిస్థితిని స్టీటోహెపటైటిస్ అంటారు. దీంతో కాలేయం దెబ్బతింటుంది.
ఎక్కువగా మద్యం తీసుకోవడం వల్ల కూడా కొన్నిసార్లు కాలేయంలో ఈ వాపు వస్తుంది. అప్పుడు దీన్ని ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అంటారు. ఆల్కహాల్ వల్ల కాకుండా కాలేయానికి వాపు వస్తే, దాన్ని నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్‌గా పరిగణిస్తారు.
కాలేయంలో వాపు ఎక్కువ కాలం పాటు అలాగే ఉంటే అది గట్టిపడి, పుండ్లుగా మారుతుంది.
ఈ తీవ్రమైన పరిస్థితిని సిర్రోసిస్ అంటారు. ఈ స్థితిలో కాలేయం పని చేయడం మానేస్తుంది.


ఫొటో సోర్స్, Getty Images
ఫ్యాటీ లివర్ స్థాయిలు
గ్రేడ్ 1, అంటే తేలికపాటి ఫ్యాటీ లివర్
ఈ స్థాయిలో కాలేయంలోని దాదాపు 33 శాతం కణాల్లో కొవ్వు పేరుకుపోతుంది. సాధారణంగా ఈ స్థితిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. జీవనశైలి మార్పులు, వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా దీన్ని నయం చేయవచ్చు. దీన్ని ఫ్యాటీ లివర్ ప్రారంభంగా పరిగణించవచ్చు.
గ్రేడ్ 2, అంటే తేలికపాటి నొప్పి కలగొచ్చు...
ఈ దశలో కాలేయంలోని దాదాపు 34 నుంచి 66 శాతం కణాల్లో కొవ్వు పేరుకుపోతుంది. అలసట, కడుపులో భారంగా అనిపించడం, తేలికపాటి నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీవనశైలిలో మార్పులు చేయకపోతే తీవ్రమైన కాలేయ వ్యాధిగా ఇది పరిణామం చెందొచ్చు.
గ్రేడ్ 3, తీవ్ర స్థితి
ఈ దశలో వ్యాధి ముదిరినట్లుగా పరిగణించవచ్చు. ఇది ఫ్యాటీ లివర్ తీవ్రమైన దశ. 66 శాతం కంటే ఎక్కువ కాలేయ కణాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఈ స్థితిలో వాపు (స్టీటోహెపటైటిస్), పుండ్లు (ఫైబ్రోసిస్), సిర్రోసిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ప్రమాదాన్ని ఎలా గుర్తించాలి?
కాలేయ కణాల్లోని కొవ్వు మామూలు స్థితి నుంచి సిర్రోసిస్‌గా మారడానికి చాలా సమయం పడుతుందని దిల్లీలోని గంగారాం ఆసుపత్రికి చెందిన డాక్టర్ రంజన్ తెలిపారు. దాదాపు అయిదు నుంచి పది ఏళ్లు పట్టొచ్చని ఆయన చెప్పారు.
లివర్ సిర్రోసిస్ ప్రమాదాన్ని 'సిగ్నిఫికెంట్ ఫైబ్రోసిస్' అని పిలుస్తారు. దీన్ని ఫైబ్రోస్కాన్ ద్వారా గుర్తిస్తారు. దీని నిర్ధరణకు ఎలెస్టోగ్రఫీ పద్ధతిని కూడా వాడతారు. ఒకవేళ కాలేయంలో దృఢత్వం (స్టిఫ్‌నెస్) ఎక్కువగా ఉంటే మందులతో చికిత్స చేయాలి. జీవనశైలిని మెరుగు పరుచుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా దీన్ని నియంత్రించుకోవచ్చు.
మందులతో పాటు, ఊబకాయం, డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా ఫ్యాటీ లివర్‌ను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఊబకాయ నిరోధక మందులు కొవ్వును తగ్గిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఏమేం తినకూడదు?
ఆరోగ్యంగా ఉండటానికి ఏం తినాలి? ఏవి తినకూడదు? అనే అంశాలపై అందరూ శ్రద్ధ వహించాలని నిపుణులు అంటున్నారు.
ఆహారంలో అదనంగా చక్కెరను తీసుకోవడం మానేయాలి.
కుకీలు, బిస్కెట్లు, క్యాండీ, సోడా, స్పోర్ట్స్ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, స్వీట్లు, చాక్లెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
వేపుడు, ప్రాసెస్డ్ ఆహారాలను తీసుకోకూడదు.
చేపలు, కొవ్వు తక్కువగా ఉండే మాంసం పదార్థాలను డీప్ ఫ్రై చేయడానికి బదులుగా ఉడికించి తినాలి.
ప్రాసెస్డ్ మాంసం జోలికి వెళ్లొద్దు.
ఫ్రైడ్ చికెన్, డోనట్స్, చిప్స్, బర్గర్లు వంటి వాటికి దూరంగా ఉండాలి.
ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఫ్రక్టోజ్ లేదా అధిక ఫ్రక్టోజ్ ఉండే కార్న్ సిరప్‌ను జోడిస్తారు. ఇవి ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ఉప్పు అధికంగా తీసుకోకూడదు. ఉప్పు స్థాయిలు ఎక్కువగా ఉండే ప్యాకేజ్డ్ ఆహారాలకు దూరంగా ఉండాలి. రోజుకు 2,300 మిల్లీగ్రాముల సోడియాన్ని మాత్రమే తీసుకోవాలి.
వైట్ బ్రెడ్, పాస్తా మానేయండి: ఇవి చక్కెర స్థాయిలను పెంచుతాయి. తృణధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి.
అతిగా తినకూడదు: అతిగా తినడం వల్ల మీ శరీరంలో అదనపు కేలరీలు చేరుతాయి. ఇవి సులభంగా కొవ్వుగా మారతాయి. ఈ కొవ్వు, ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏం తినాలి?
ఉదయమే ఆరోగ్యకర అల్పాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం మోస్తరుగా ఆహారం తీసుకోవాలి. రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. రాత్రి ఏడు గంటలకల్లా భోజనం చేయాలి.
బ్లాక్ కాఫీ తాగొచ్చు. బ్లాక్ కాఫీ వల్ల ఫ్యాటీ లివర్, అసాధారణ లివర్ ఎంజైమ్‌ల ప్రమాదం తగ్గుతుందని అనేక అధ్యయనాలు చూపించాయి.
ఆకు కూరలు పుష్కలంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరల్లోని నైట్రేట్లు, పాలీఫెనాల్స్ వంటివి ఫ్యాటీ లివర్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.
మీ భోజన పళ్లెంలో సగం భాగం ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి.
తినే ఆహారంలో పప్పులు, సెనగలు, సోయాబీన్, బఠానీలు వంటి పప్పుధాన్యాలను చేర్చుకోండి.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తాయి.
వ్యాయామం తప్పనిసరి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ముఖ్యంగా ఏరోబిక్ వ్యాయామాలు ఫ్యాటీ లివర్ వ్యాధిని నియంత్రించడంలో సహాయపడతాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వారానికి కనీసం 150 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామాలు చేయడం అవసరం. ఇందులో వేగంగా నడవడం, సైక్లింగ్, ఈత వంటివి భాగమే.
వెయిట్ లిఫ్టింగ్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వారానికి కనీసం రెండు రోజులు బరువులెత్తడం మంచిది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














