ప్రతి 3 నిమిషాలకు ఒక మరణం, దేశంలో రోడ్లు ఎందుకింత ప్రమాదకరంగా ఉన్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పేపర్ చూస్తే చాలు..ఏదో ఒక రోడ్డు ప్రమాద వార్త. ప్రయాణికుల బస్సు లోయలోకి పడిపోయింది, తాగిన మైకంలో డ్రైవర్ పాదాచారులపైకి వాహనంతో దూసుకెళ్లాడు, కారును ట్రక్కు ఢీకొట్టింది, భారీ వాహనం కింద పడి టూవీలర్ నలిగిపోయింది..ఇలా ఇవే దర్శనమిస్తుంటాయి.
నిత్యం రోడ్లపై జరిగే ప్రమాదాలు నిశ్శబ్ద సంక్షోభంగా మారుతున్నాయి. కేవలం 2023లోనే భారతీయ రోడ్లపై 1,72,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
సగటున ప్రతిరోజూ 474 మంది మరణించారు. అంటే ప్రతి 3 నిమిషాలకు ఒకరు మరణించారు.
2023లో రోడ్డు ప్రమాదాల అధికారిక రిపోర్టు ఇంకా విడుదల కావాల్సి ఉంది. అయితే, డిసెంబర్‌లో జరిగిన రహదారి భద్రతా కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
రోడ్డు ప్రమాదాల్లో ఆ ఏడాది 10 వేల మంది చిన్నారులు మృతి చెందారు. స్కూళ్లకు, కాలేజీలకు దగ్గర్లో జరిగిన ప్రమాదాల్లో మరో 10 వేల మంది చనిపోయారు.
35 వేల మంది పాదాచారులు ప్రాణాలు కోల్పోయారు. టూవీలర్ వాహనదారులు ఈ ప్రమాదాల్లో ఎక్కువగా మరణిస్తున్నారు. అతివేగం అతిపెద్ద కారణంగా నిలుస్తోంది.

ప్రాథమిక భద్రతా జాగ్రత్తలు లోపించడం ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్నట్లు అర్ధమవుతోంది.
కేవలం హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్లనే సుమారు 54 వేల మంది మరణించగా.. సీటుబెల్టులు లేకపోవడంతో 16 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
అతిపెద్ద కారణాల్లో మరొకటి ఓవర్‌లోడింగ్. దీనివల్ల 12 వేల మంది మరణించారు.
వ్యాలీడ్ లైసెన్సు లేకుండా వాహనాన్ని నడపడంతో, 34 వేల ప్రమాదాలు జరిగాయి. తప్పుడు మార్గంలో వాహనాన్ని నడపడం కూడా మరణాలకు కారణమవుతోంది.
2021లో జరిగిన వాటిలో 13 శాతం ప్రమాదాలు డ్రైవర్ల దగ్గర సరైన లైసెన్స్ లేకపోవడం వల్లనో లేదా లెర్నర్ పర్మిట్‌తో వాహనాన్ని బయటికి తీయడం వల్లనో జరిగినట్లు తేలింది.
దేశంలో రోడ్లపై తిరిగే చాలా వాహనాల్లో పాతవి ఉంటున్నాయి. వాటిల్లో సీటు బెల్టు వంటి బేసిక్ సేఫ్టీ ఫీచర్లే ఉండవు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో అస్తవ్యస్థంగా ఉండే ట్రాఫిక్ కూడా ప్రమాదకరమైన రోడ్డు వాతావరణాన్ని సృష్టిస్తోంది.
దేశంలో రోడ్లపైకి ఎన్నో వాహనాలు వస్తుంటాయి. బైకులు, రిక్షాలు, ఎడ్ల బండులు, తోపుడు బండ్లు, పాదాచారులు, వీధి జంతువులతో పాటు కార్లు, బస్సులు, బైకులు, పెద్ద వాహనాలు సైతం రోడ్లపై స్థలం కోసం పోటీపడుతూ ఉంటాయి.
వ్యాపారం చేసే వారు ఫుట్‌పాత్‌లను, రోడ్లను ఆక్రమించుకుంటున్నారు. దీంతో, రద్దీగా ఉండే రోడ్లపైకి పాదాచారులు వస్తున్నారు. ట్రాఫిక్ మరింత సంక్లిష్టంగా మారుతుంది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినా.. ప్రపంచంలో అత్యంత అసురక్షితమైన రోడ్లల్లో భారత్‌వి కూడా ఉంటున్నాయి.
ఈ సంక్షోభం కేవలం సదుపాయాల వల్ల కాదని, మనుషుల ప్రవర్తన, నిబంధనల అమల్లో అంతరాలు, వ్యవస్థాగత లోపం కారణంగా కూడా జరుగుతున్నట్లు తెలిసింది.
రోడ్డు ప్రమాదాలతో గణనీయమైన ఆర్థిక భారం కూడా పెరుగుతోంది. దేశీయ వార్షిక జీడీపీలో 3 శాతం వరకు నష్టాన్ని కలిగిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద రోడ్డు నెట్‌వర్క్‌గా భారత్ ఉంది.
66 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంతో రోడ్లు విస్తరించి ఉన్నాయి. ఈ మొత్తం రోడ్ల నెట్‌వర్క్‌లో 5 శాతం జాతీయ, రాష్ట్ర రహదారులు ఉన్నాయి. మొత్తంగా 35 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నట్లు అంచనా.
ప్రజలకు చట్టమంటే సరైన గౌరవం, భయం లేకపోవడంతో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు రోడ్డు భద్రతా సమావేశంలో గడ్కరీ అన్నారు.
''ప్రమాదాలకు చాలా కారణాలున్నాయి. కానీ, అతిపెద్ద కారణం మనుషుల ప్రవర్తనే'' అని ఆయన చెప్పారు.
సరైన సివిల్ ఇంజనీరింగ్ విధానాలు లేకపోవడాన్ని కూడా నితిన్ గడ్కరీ ప్రస్తావించారు.
రోడ్డు డిజైన్‌లో లోపాలు, నాసిరకం నిర్మాణాలు, సరైన నిర్వహణ లేకపోవడం, తగిన సిగ్నల్ వ్యవస్థ, సంకేతాలు లోపించడం వంటివి రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరిగేందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నట్లు గడ్కరీ చెప్పారు.
''అయితే, దీనిలో ప్రధాన దోషులు సివిల్ ఇంజనీర్లు. రోడ్డు పక్కన ఉండే గుర్తులు, సూచికలు, సంకేత వ్యవస్థల వంటి చిన్నచిన్న విషయాలు కూడా దేశంలో చాలా పేలవంగా ఉన్నాయి'' అని అన్నారు.
పైపెచ్చులు ఊడిపోవడం, రోడ్లపై గుంతలు ఏర్పడటం వంటి వాటితో కలిపి 2019 నుంచి జాతీయ రహదారులపై 59 ప్రధాన లోపాలు వెలుగులోకి వచ్చినట్లు తన శాఖ నివేదించినట్లు గడ్కరీ గత నెలలో పార్లమెంట్‌లో తెలిపారు. 13,975 స్థలాలను ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) దిల్లీలోని ట్రాన్స్‌పోర్టేషన్ రీసెర్చ్ అండ్ ఇంజ్యూరీ ప్రివెన్షన్ సెంటర్ (టీఆర్‌ఐపీపీ) గత కొన్నేళ్లుగా చేపడుతున్న రోడ్డు సేఫ్టీ ఆడిట్లలో... భారతీయ రోడ్లపై ఉన్న తీవ్రమైన లోపాలు వెలుగులోకి వచ్చాయి.

ఫొటో సోర్స్, Reuters
ఉదాహరణకు క్రాష్ బారికేడ్లను తీసుకోండి. చాలా వరకు వాటిని రోడ్లపై వచ్చే వాహనాలను సురక్షితంగా ఆపేందుకు పెడుతుంటారు. కానీ, చాలా ప్రాంతాల్లో దానికి విరుద్ధంగా వాడుతున్నారు.
ఎత్తు, స్పేస్, ఇన్‌స్టాలేషన్ వంటి విషయాల్లో స్పష్టమైన ప్రమాణాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి పరిశీలనలో మాత్రం తరచూ భిన్నమైన కథ కనబడుతుంది.
మెటల్ బారికేడ్లు కూడా సరైన ఎత్తులో ఉండటం లేదు. కాంక్రీటు బేస్‌లపై ఉండే దిమ్మెలను తప్పుడు ప్రాంతంలో ఉంచుతున్నారు.
ఈ లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ట్రక్కు లేదా బస్సులు సురక్షితంగా ఆగడానికి బదులు అవి పల్టీలు కొట్టి ప్రమాదానికి గురవుతున్నాయి.
''క్రాష్ బారికేడ్లను నిర్దేశించిన మాదిరి ఇన్‌స్టాల్ చేయకపోతే, అవి మంచికన్నా చెడే ఎక్కువగా చేస్తాయి'' అని ఐఐటీ దిల్లీలో సివిల్ ఇంజనీరింగ్‌గా పనిచేస్తోన్న ప్రొఫెసర్ గీతమ్ తివారి బీబీసీతో చెప్పారు.
వేగంగా వెళ్లే రోడ్లపై ఉండే డివైడర్లు లేదా మీడియన్లు.. నిర్దేశించిన ఎత్తు కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇవి 10 సెంటీమీటర్లు (3.9 అంగుళాలు) కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ, ఆడిట్ లెక్కల్లో మాత్రం నిర్దేశించిన ఎత్తును మించినవి చాలానే ఉన్నట్లు తేలింది.
వేగంగా నడిచే వాహనపు టైర్ వెర్టికల్ మీడియన్‌ను తగిలినప్పుడు, అది వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల, టైర్ పేలిపోయే ప్రమాదం లేదా వాహనమే ఎగిరిపడే ప్రమాదం ఉంటుంది.
భారత్‌లో చాలా మీడియన్లను ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయడం లేదని తేలింది.
భారతీయ రోడ్ల రూపకల్పన ప్రమాణాలు పేపర్‌పై చాలా పకడ్బందీగా ఉంటున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడం లేదు.
''భద్రతా ప్రమాణాలను సరిగా నెరవేర్చని కాంట్రాక్టర్లకు జరిమానాలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా నిర్మాణ ఒప్పందాల్లో సేఫ్టీ స్టాండర్డ్ గురించి స్పష్టంగా ఉండదు. వీళ్లకు చెల్లింపులు కిలోమీటరుకు ఇంత అని ఉంటుంది తప్ప, భద్రతా ప్రమాణాల ప్రకారం నిర్మించారా లేదా అన్నదాని ప్రకారం ఉండదు'' అన్నారు ప్రొఫెసర్ తివారీ.
25 వేల కి.మీ రెండు వరుసల జాతీయ రహదారులను నాలుగు వరుసలుగా అప్‌గ్రేడ్ చేసే ప్రణాళికలో ఉన్నట్లు మంత్రి గడ్కరీ ఇటీవలే ప్రకటించారు. దీనివల్ల, రోడ్లపై జరిగే ప్రమాదాలు తగ్గుతాయన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ రోడ్లను తరచూ వెస్ట్రన్ మోడల్స్‌కు అనుగుణంగా నిర్మిస్తున్నారని, దేశీయంగా ఉండే ప్రత్యేక ట్రాఫిక్, అవసరాలను వదిలేస్తున్నారని షికాగో యూనివర్సిటీకి చెందిన కవి భల్లా అన్నారు. తక్కువ, మధ్య ఆదాయ దేశాల రోడ్డు భద్రతా వ్యవస్థలపై కవి భల్లా పనిచేశారు.
''రోడ్డు వెడల్పు పెంచడం ద్వారా ట్రాఫిక్ మరణాలను తగ్గించవచ్చనడంలో ఎలాంటి అర్ధం లేదు. భారత్‌లో రోడ్లను అప్‌గ్రేడ్ చేసినప్పుడు ట్రాఫిక్ వేగాలు పెరుగుతున్నట్లు సాక్ష్యాలున్నాయి. ఇవి పాదాచారులకు, మోటార్ సైకిళ్లపై వెళ్లే వారికి ప్రాణాంతకం'' అని కవి భల్లా అన్నారు.
''అమెరికా స్టైల్‌లో ఉండాదలనుకుంటున్నారు. కానీ, అమెరికాలాగా హైవే సేఫ్టీ ఇంజనీరింగ్ రీసెర్చ్, క్రాష్ డేటా సిస్టమ్స్‌పై సరైన పెట్టుబడులు పెట్టడం లేదు'' అని భల్లా అన్నారు.
‘‘రోడ్డు భద్రతా సంక్షోభాన్ని అధిగమించేందుకు, కేంద్ర ప్రభుత్వం 5E వ్యూహాన్ని అమలు చేస్తోంది. అవి రోడ్స్ ఇంజనీరింగ్, వెహికిల్స్ ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎమర్జెన్సీ కేర్’’ అని ఇంటర్నేషనల్ రోడ్డు ఫెడరేషన్ కేకే కపిలా చెప్పారు.
రోడ్డు భద్రతా ప్రణాళికలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి కపిలా సాయం చేస్తున్నారు.
సమయానికి తక్షణ వైద్య సాయం అందినప్పుడు రోడ్డు ప్రమాద మరణాల్లో 50 శాతం మందిని రక్షించవచ్చని ఇండియా లా కమిషన్ కూడా పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














