కాలిఫోర్నియా: పెట్రోలుతో మాత్రమే నడిచే వాహనాలపై 2035 నాటికి పూర్తి నిషేధం

ఫొటో సోర్స్, Getty Images
పెట్రోలుతో మాత్రమే నడిచే వాహనాలను 2035 నాటికి నిషేధించే దిశగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అడుగులు వేస్తోంది.
వాతావరణ మార్పులను నియంత్రించేందుకు కాలిఫోర్నియా రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలలో ఇది చరిత్రాత్మకమైన అడుగుగా చెబుతున్నారు.
కాలుష్య రహిత శుద్ధ ఇంధనాలతో నడిచే వాహనాలను మార్కెట్లోకి మరింతగా తీసుకొచ్చేలా కార్ల తయారీ కంపెనీలను ఒత్తిడి చేసే దిశగా కాలిఫోర్నియా రాష్ట్రం ఈ కొత్త నిబంధనలను తీసుకొస్తోంది.
శిలాజ ఇంధనాలను వీడి శుద్ధ ఇంధనాల వైపు మళ్లేందుకు 2020లో కాలిఫోర్నియా గవర్నరు గవిన్ న్యూసమ్ లక్ష్యాలు నిర్దేశించిన తరువాత తాజా నిబంధనలు రూపొందిస్తున్నారు.
కాలిఫోర్నియా అమెరికాలో అత్యధిక జనాభా గల రాష్ట్రం.. ఇది ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి.
కాలిఫోర్నియా ఎయిర్ రిసోర్సెస్ బోర్డ్(సీఏఆర్‌బీ) జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం.. 2026 నాటికి ఆ రాష్ట్రంలో విక్రయించే కొత్త వాహనాలలో 35 శాతం ఎలక్ట్రిక్, హైబ్రిడ్, హైడ్రోజన్ వాహనాలు అయ్యుండాలి.
2030 నాటికి 68 శాతం కొత్త వాహనాలు ఈ విభాగాలకు చెందినవే అయ్యుండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2035 నాటికి 100 శాతం కొత్త వాహనాలు ఎలక్ట్రిక్, హైబ్రిడ్, హైడ్రోజన్ వాహనాలే అయ్యుండాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్గారాల నియంత్రణకు అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాల కంటే కాలిఫోర్నియా రాష్ట్రం మరిన్ని త్వరిత నిర్ణయాలు తీసుకుంటోందని, ఈ చరిత్రాత్మక నిర్ణయం కాలిఫోర్నియాకే కాకుండా అమెరికాకు మేలు చేస్తుందని సీఏఆర్‌బీ చైర్‌పర్సన్ లియానీ రాండల్ఫ్ అన్నారు.
అమెరికాలో అతిపెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియా జనాభా 3.9 కోట్లు. ఒకవేళ కాలిఫోర్నియా అమెరికాలో రాష్ట్రం కాకుండా వేరే దేశంగా ఉండుంటే జీడీపీ పరంగా ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది.
ఎలక్ట్రిక్ కార్లు తయారుచేసే టెస్లాలో సీనియర్ కౌన్సెల్‌గా పనిచేస్తున్న జోసెఫ్ మెండెల్సన్ దీనిపై మాట్లాడుతూ.. కాలిఫోర్నియా రాష్ట్రం నిర్దేశించుకున్న లక్ష్యం సాధ్యవుతుందని అన్నారు.
అయితే, జనరల్ మోటార్స్, ఫోక్స్‌వాగన్, టొయోటా వంటి కంపెనీలు ప్రాతినిధ్యం వహిస్తున్న 'అలయన్స్ ఫర్ ఆటోమోటివ్ ఇన్నోవేషన్'.. ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ పెంచడానికి చేయాల్సింది ఇంకా చాలా ఉందని పేర్కొంది.
అయితే, కాలిఫోర్నియా రాష్ట్రం తీసుకొస్తున్న కొత్త నిబంధనలను ఇంకా అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఆఫ్రికా చీతాలను తెచ్చి భారత్‌లో సింహాల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారా
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- కాఫీ, రెడ్ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











