మటన్ లెగ్ సూప్ తాగితే విరిగిన ఎముకలు అతుక్కుంటాయా?

సూప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కె.శుభగుణం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎవరికైనా ఎముకలు విరిగితే ఇంట్లో పెద్దవారు మేక లేదా పొట్టేలు కాళ్లతో చేసిన సూప్ తాగమని చెబుతుంటారు. దీన్ని పాయా అని, వాడుకలో మటన్ బోన్ సూప్, మటన్ లెగ్ సూప్ అని అంటుంటారు.

జ్వరం, జలుబు వంటి వాటితో బాధపడుతున్నప్పుడు కూడా కొందరు ఈ సూప్ తాగాలని సూచిస్తారు.

ఆరోగ్యపరంగా ఎదురయ్యే చాలా ఇబ్బందులకు మేక/పొట్టేలు కాళ్లతో చేసిన సూప్ తాగమని ఎందుకు చెబుతుంటారు?

నిజంగా ఈ సూప్ మనకు బలాన్ని ఇస్తుందా? ఎముకలకు, కీళ్లకు ఇది ఉపయోగపడుతుందా?

ఇదంతా తెలుసుకునేందుకు మేం పోషకాహార నిపుణులతో మాట్లాడాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మటన్ లెగ్ సూప్ తాగడం వల్ల ప్రయోజనాలేంటి?

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌ విడుదల చేసిన ఓ నివేదిక.. పొట్టేళ్లు, మేకల కాళ్లలో కాల్షియం, మెగ్నేషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి పోషకాలు ఉంటాయని పేర్కొంది.

ఇవి మన ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు, రోగ నిరోధకతకు చాలా అవసరం.

గొర్రె మాంసంలో ముఖ్యంగా వాటి కాళ్ల ఎముకల్లో ఉండే పోషకాలు చాలా రకాలుగా పనిచేస్తాయని పోషకాహార నిపుణురాలు దివ్య సత్యరాజ్ చెప్పారు.

ఇవి మన ఎముకలకు, కీళ్లకు, జుట్టుకు, చర్మానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి పనిచేస్తాయన్నారు.

గొర్రె కాళ్లలో కొలాజెన్, జెలటిన్ పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణురాలు రమ్య అశోక్ చెప్పారు.

ఇవి మన కీళ్ల ఆరోగ్యానికి సాయపడతాయని, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు.

చర్మ సౌందర్యానికి కూడా కొలాజెన్ సాయపడుతుందని రమ్య తెలిపారు.

‘మేక/గొర్రె కాళ్లల్లో ఉండే కొలాజెన్ కీళ్లకు లూబ్రికెంట్‌లాగా పనిచేస్తుంది. చర్మంపై వచ్చే ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలను ఇది తగ్గిస్తుంది. మటన్ లెగ్ సూప్ రోజూ తాగితే, చర్మం యవ్వనంగా మారుతుంది’ అని దివ్య సత్యరాజ్ చెప్పారు.

ఈ సూప్ రోజూ తాగడం వల్ల కేవలం ఎముకలు, చర్మానికే కాదు, శరీరంలోని ఇతర కొన్ని అవయవాల మెరుగైన పనితీరుకు కూడా దోహదపడుతుందని రమ్య వివరించారు.

ఇందులో ఉండే గ్లైసిన్, ప్రొలైన్ వంటి అమైనో ఆమ్లాలు పేగుల పనితీరును నియంత్రించేందుకు సాయపడతాయని, అలాగే, కాలేయ పనితీరును నియంత్రించడం ద్వారా శరీరంలోని డీటాక్సిఫికేషన్ ప్రాసెస్‌ను సరిగ్గా నిర్వర్తిస్తాయని ఆమె పేర్కొన్నారు.

‘తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో పాత కాలం నుంచి జ్వరం, ఎముకలు విరిగినప్పుడు మటన్ బోన్ సూప్ తాగమని చెబుతుంటారు. త్వరగా కోలుకునేందుకు అది అందించే పోషకాలు, బలం, శక్తినే దీనికి కారణం'' అని రమ్య తెలిపారు.

మటన్ లెగ్ సూప్

ఫొటో సోర్స్, Getty Images

ఈ సూప్ ఎవరు తాగకూడదు?

ఈ సూప్‌తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గుండె సంబంధిత జబ్బులు, ఊబకాయం, ఇతర అనారోగ్యాలు ఉన్న వారు దీన్ని తీసుకోకపోవడం మంచిది.

ఇందులో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది.

అలాగే, ఈ సూప్‌ను వండే విధానం కూడా ముఖ్యమే.

‘మాంసాన్ని శుభ్రంగా కడగకపోతే సాల్మనెల్లా, ఈ.కోలి వంటి బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే వీటిని శుభ్రపర్చడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని రమ్య చెప్పారు.

సరిగ్గా ఉడకని కాళ్ల సూప్‌ వల్ల కూడా ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

శరీరంలో యూరిక్ యాసిడ్ అత్యధికంగా ఉన్నవారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారు, కిడ్నీ సమస్యలు అప్పటికే ఉన్న వారు వైద్యుల సలహా తీసుకున్నాకే ఈ సూప్ తాగడం మంచిదని పోషకాహార నిపుణురాలు రమ్య అశోక్ సూచించారు.

మేక/గొర్రె కాళ్లలో చాలా పోషకాలు ఉన్నప్పటికీ, వాటిని తక్కువ మంటపై 10 నుంచి 12 గంటల పాటు ఉడకపెట్టాకే తినాలని ఆమె చెప్పారు.

‘కానీ, ప్రస్తుత వంట పద్ధతుల్లో అంత సేపు ఉడకపెట్టడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సాధారణంగా వంట చేసే పద్ధతిలోనూ ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉడికించి వీటి పోషకాల్లో కొన్నింటిన్ని పొందవచ్చు. వారంలో ఒకసారి లేదా నెలలో రెండుసార్లు తాగే వారికి ఈ ప్రయోజనాలు ఉంటాయి’ అని రమ్య వివరించారు.

'' సాధారణ మంటపై 10 గంటల పాటు ఉడికించడం వల్ల వీటిల్లో ఉండే 95 శాతం పోషకాలను మనం పొందవచ్చు'' అని చెప్పారు.

‘‘మటన్‌ లెగ్స్‌ను సరిగ్గా వండి తింటే దానిలో ఉండే 50 శాతం నుంచి 75 శాతం పోషకాలను మన శరీరం గ్రహిస్తుంది. అందుకే, సరిగ్గా వండాలి. తరచూ తీసుకుంటే మంచిది'' అని దివ్య వివరించారు.

మటన్ సూప్

ఫొటో సోర్స్, Getty Images

ఎవరికి అవసరం?

మేకలు, గొర్రెల కాళ్లలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని, అప్పటికే శరీరంలో ఎక్కువ కొవ్వుతో ఇబ్బందిపడుతున్నవారు ఇలాంటి కాళ్ల సూప్ తాగకపోవడం మంచిదని దివ్య సత్యరాజ్ చెప్పారు.

మటన్ లెగ్‌ల సూప్ కేవలం ఎముకలకు మాత్రమే కాదు, మొత్తం శరీర ఆరోగ్యానికి సాయపడుతుందని తెలిపారు.

క్యాన్సర్, కీమోథెరపీ తీసుకుంటోన్న ప్రజల ఆహారంలో మటన్ బోన్ సూప్‌ను చేరుస్తుంటారని చెప్పారు.

''సాధారణంగా కీమోథెరపీ వల్ల చాలా దుష్ఫ్రభావాలు ఉంటాయి. ఈ చికిత్స తీసుకునే వారు సరిగ్గా తినలేరు. కానీ, వారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. మటన్ బోన్ సూప్‌ క్రమం తప్పకుండా తీసుకోవడం వారికి మంచిది'' అని దివ్య సత్యరాజ్ వివరించారు.

కీమోథెరపీ రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుందని, మటన్ బోన్ సూప్ వల్ల తిరిగి పెంచుకోవచ్చని చెప్పారు.

జిమ్‌కు వెళ్లే వారు తమ శరీరాన్ని బలంగా మార్చుకునేందుకు ఇది సాయపడుతుందని, ప్రొటీన్ పౌడర్లను తీసుకోవడం కంటే ఇది మంచిదని దివ్య చెప్పారు.

పోషకాహార లేమితో, తక్కువ బరువుతో, సైనస్ సమస్యలతో, బలహీనమైన ఎముకలతో బాధపడుతున్న వారు దీన్ని తాగడం వల్ల పోషకాలు అందుతాయని దివ్య వివరించారు.

జట్టు రాలిపోవడం వంటి సమస్యలను కూడా మటన్ బోన్ సూప్ తగ్గిస్తుంది. మటన్ లెగ్‌లలో ఉన్న కొలాజెన్‌ వంటివి శరీరానికి ప్రయోజనాలు అందిస్తాయని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)