క్రూయిజ్ షిప్ నుంచి పడిపోయిన కూతురి కోసం సముద్రంలోకి దూకిన తండ్రి.. ఇద్దరినీ ఎలా రక్షించారంటే

డిస్నీ డ్రీమ్, క్రూయిజ్, ఫ్లోరిడా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షిప్ నాలుగో అంతస్తు(డెక్)నుంచి పాప నీళ్లల్లో పడిపోయింది.
    • రచయిత, మాక్స్ మట్జా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సముద్రంలో క్రూయిజ్ షిప్ ప్రయాణం.. నాలుగు వేలమంది ప్రయాణికులలో ఓ తండ్రి, కూతురు కూడా ఉన్నారు.

షిప్ రెయిలింగ్‌ దగ్గర తన చిన్నారి కూతురిని తండ్రి ఫోటో తీస్తున్నారు.

ఆ క్షణంలో ఊహించనిది జరిగింది. చిన్నారి నీళ్లల్లో పడిపోయింది.

మరుక్షణం కూతురి కోసం తండ్రి నీళ్లల్లో దూకారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డిస్నీ డ్రీమ్, క్రూయిజ్, ఫ్లోరిడా
ఫొటో క్యాప్షన్, తండ్రీకూతుళ్లను రక్షిస్తున్న సహాయ బృందాలు

ఎలా రక్షించారు?

ఆదివారం(జూన్ 29) మధ్యాహ్న సమయం.. 14 అంతస్తుల(డెక్) డిస్నీ డ్రీమ్ క్రూయిజ్ షిప్ ఫ్లోరిడాకు వస్తోంది.

అంతలో అకస్మాత్తుగా షిప్ నాలుగో అంతస్తు నుంచి ఒక అమ్మాయి సముద్రంలో పడిపోయింది.

వెంటనే ఆమెను రక్షించేందుకు తండ్రి నీళ్లల్లోకి దూకారు. అక్కడున్నవారంతా చూస్తుండగానే ఇది జరిగింది.

ప్రమాదవశాత్తూ నీళ్లల్లో పడిపోయిన కూతురు, ఆమె కోసం నీళ్లలోకి దూకిన తండ్రిని పదినిమిషాల తర్వాత రక్షించినట్టు ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

రెయిలింగ్ దగ్గర కుమార్తెను తండ్రి ఫోటోలు తీస్తుండగా ఆమె నీళ్లల్లో పడిపోవడం చూశామన్నారు.

షిప్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సమాచారమందించడంతో వారిని రక్షించేందుకు సహాయ సిబ్బంది రంగంలోకిదిగారు.

''షిప్ వేగంగా ప్రయాణిస్తోంది. నీళ్లల్లో పడిపోయినవాళ్లు చిన్న చిన్న చుక్కల్లా కనిపిస్తున్నారు. తర్వాత వాళ్లసలు కనిపించనేలేదు'' అని లారా అమడార్ అనే ప్రయాణికురాలు చెప్పారు.

''కెప్టెన్ షిప్‌ వేగం తగ్గించారు. వెనక్కి తిప్పారు. సముద్రంలో పడిపోయిన తండ్రీకూతుళ్లను రక్షించేందుకు సహాయ సిబ్బందిని తీసుకుని ఓ చిన్న బోటు వెళ్లింది. తర్వాత ఆ సిబ్బంది వారిద్దరినీ సురక్షితంగా పైకి తీసుకొచ్చారు'' అని బీబీసీ అమెరికా పార్టనర్ సీబీఎస్ న్యూస్‌తో ఆమె తెలిపారు.

డిస్నీ డ్రీమ్, క్రూయిజ్, ఫ్లోరిడా
ఫొటో క్యాప్షన్, చిన్నారి, ఆమె తండ్రి సముద్రంలో పడిపోయిన తర్వాత 15నిమిషాల్లోపు క్రూయిజ్ సిబ్బంది వారిని రక్షించారు.

ప్రమాదం ఎప్పుడు జరిగింది?

బహమాస్ సమీపంలో నాలుగు రోజుల పర్యటన తర్వాత ‘డిస్నీ డ్రీమ్’ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్‌కు తిరిగివస్తోంది. షిప్ నాలుగు వేలమందితో ప్రయాణిస్తోంది.

''నీళ్లల్లో పడ్డ ఇద్దరు ప్రయాణికులను డిస్నీ డ్రీమ్ సిబ్బంది రక్షించారు'' అని డిస్నీ క్రూయిజ్ లైన్ ప్రతినిధి చెప్పారు.

''సరైన విధంగా స్పందించిన తీరుకు మా క్రూ మెంబర్లను అభినందిస్తున్నాం. దీనివల్ల మా ఇద్దరు అతిథులు నిమిషాల వ్యవధిలోనే షిప్‌లోకి సురక్షితంగా రాగలిగారు'' అని ఆయన చెప్పారు.

చూస్తుండగానే వాళ్లు కనిపించకుండాపోయారని మరో ప్రయాణికుడు గార్ ఫ్రాంట్జ్ ఎన్‌బీసీ న్యూస్‌తో చెప్పారు. సముద్రంలో ఇద్దరిని అలా చూడడం చాలా భయం కలిగించిందన్నారు.

క్రూయిజ్ పర్యటన ఆఖరి రోజు ఫ్లోరిడాలోని పోర్టుకు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

క్రూయిజ్ షిప్‌ల నుంచి పడిపోయిన ప్రయాణికులను సురక్షితంగా రక్షించడం అన్నిసార్లూ సాధ్యం కాలేదు.

క్రూయిజ్ లైన్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ 2019లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆ ఏడాది క్రూయిజ్ షిప్‌ల నుంచి 25 మంది పడిపోతే తొమ్మిదిమందిని మాత్రమే రక్షించగలిగారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)